Share News

పిల్లలను సీరియ్‌సగా తీసుకోవాలి!

ABN , Publish Date - May 02 , 2024 | 05:35 AM

‘‘జ్ఞాపకాలు లేకుండా మనుషులు ఉండరు. వారి అస్థిత్వం ఉండదు. కానీ ఆ జ్ఞాపకాలను ఎంత పదిలంగా దాచుకుంటున్నామనే విషయం కూడా చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి నాకు రకరకాల వస్తువులు, పుస్తకాలు దాచటమంటే ఇష్టం.

పిల్లలను  సీరియ్‌సగా తీసుకోవాలి!

‘జ్ఞాపకాలు... మన జీవితాలను ఆనందమయం చేస్తాయి. జ్ఞాపకాలు...మన జీవితాన్ని విషాదంలోకీ నెడతాయి. ఈ రెండింటిలో

ఏ మార్గాన్ని ఎంచుకుంటామనే విషయంపైనే వర్తమానంలో సుఖశాంతులు ఉంటాయి.

ఈ విషయాన్ని పిల్లలతో పాటు తల్లితండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే మన సమాజంలో ఆనందకరమైన పరిస్థితులు ఏర్పడతాయి’’ అంటారు హ్యాపీ ఇవల్యూషన్‌ వ్యవస్థాపకురాలు పల్లవి జావర్‌.

ఆమె రాసిన ‘మూమెంట్స్‌’, ‘మెమరీస్‌’ అనే రెండు పుస్తకాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె ‘నవ్య’తో మాట్లాడారు.

ఆ విశేషాలలోకి వెళ్తే...

‘‘జ్ఞాపకాలు లేకుండా మనుషులు ఉండరు. వారి అస్థిత్వం ఉండదు. కానీ ఆ జ్ఞాపకాలను ఎంత పదిలంగా దాచుకుంటున్నామనే విషయం కూడా చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచి నాకు రకరకాల వస్తువులు, పుస్తకాలు దాచటమంటే ఇష్టం.

వాటిని ఎప్పుడైనా బయటకు తీసి చూస్తే- నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చేవి. అప్పటి ఆలోచనలు, సంతోషకరమైన క్షణాలు, ఇబ్బందికర పరిస్థితులు... అన్నీ ఒక్కసారి చుట్టుముట్టేవి. ఆ ఆలోచనలతో పాటుగానే - కొత్త కోణాలు కూడా ఆవిష్కృతమయ్యేవి.

బహుశా అందరికీ ఇలాంటి అనుభవాలే ఉంటాయనుకుంటా! కొద్దిగా పెద్దయిన తర్వాత అమ్మ, నాన్న.. అత్తయ్య, మామయ్య- ఇలా అందరికీ రకరకాల వీడియోలు తీసేదాన్ని.

వాటిని భద్రపరిచేదాన్ని. ఇలా దాచుకున్న జ్ఞాపకాలన్నింటినీ - ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ అయినా, బర్త్‌డే అయినా బయటకు తీసేదాన్ని. దీని వల్ల అందరూ ఆనందంగా ఉండేవారు. కొవిడ్‌ తర్వాత నాన్న, మామయ్య కొన్ని నెలల వ్యవధిలోనే మరణించారు.

అది నా జీవితంలో చాలా పెద్ద దెబ్బ. ప్రపంచమంతా ఆగిపోయినట్లు అనిపించింది. ఆ సంఘటనల నుంచి నేను బయటకు రావటానికి చాలా కష్టపడ్డా! యోగా, భగవద్గీత ప్రవచనాలు- ఇలా అనేక మార్గాలు అనుసరించా.

ఆ సమయంలో నాకు ఈ పుస్తకాలు రాయాలనే ఆలోచన వచ్చింది. ‘ప్రిజర్వింగ్‌ ద జర్నీ ఆఫ్‌ పేరెంట్‌హుడ్‌’, ‘ప్రీజర్వింగ్‌ ద ఫుట్‌ప్రింట్స్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనే ఈ రెండు పుస్తకాలు అందరికీ ఉపకరిస్తాయి.

ఈ తరం వేరు...

చాలా మందికి పేరెంటింగ్‌ ఒక అందమైన అనుభవం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఉద్యోగంలో చేరేవరకు రకరకాలుగా మారిపోతూ ఉంటారు. చిన్నప్పుడు ఒకలా ఉంటారు.

టీనేజ్‌లో మరోలా ఉంటారు. చదువు పూర్తయిన తర్వాత వారి అభిప్రాయాలు వేరుగా ఉంటాయి. వీటన్నిటినీ తల్లితండ్రులు గమనించాలి. పిల్లల ఆలోచనలను గౌరవించాలి.

వారికి ఆరోగ్యకరమైన సూచనలు ఇవ్వాలి. కానీ ఇది అంత సులభం కాదు. ఉదాహరణకు ఒక పిల్ల తన ఫ్రెండ్స్‌ను తరచూ మార్చేస్తూ ఉంటుందనుకుందాం. తనకు సాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పదనుకుందాం.

ఇలాంటి ధోరణిని సరిచేయాల్సింది తల్లితండ్రులే కదా! ఇతరులకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలనే విషయాన్ని పిల్లలకు జాగ్రత్తగా తెలియజెప్పాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావిస్తా. 1970లలో, 80లలో పుట్టిన వారిలో ఎక్కువ మంది తమ తల్లితండ్రుల మాట వినేవారు. ఈ తరం వారు తల్లితండ్రుల మాట వినటం లేదు.

ఎందుకంటే వారి ఆలోచనలు చాలా వేగంగా ఉంటున్నాయి. క్షణాల్లో సమాచారం అందుతోంది. అలాంటప్పుడు వారితో ఎలా మాట్లాడాలనేది చాలా మందికి ఎదురయ్యే ఒక పెద్ద సమస్య.

దీనికి పరిష్కారం- మనం ఉదాహరణగా నిలవటమే! డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని కాల్స్‌ మాట్లాడే తల్లితండ్రులు... భోజనం చేసేటప్పుడు సెల్‌ఫోన్‌ చూడద్దని పిల్లలకు ఎలా చెప్పగలుగుతారు? ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు వాటిని పరిష్కరించుకోవటానికి కొన్ని సూచనలు నా పుస్తకంలో ఉన్నాయి.

తల్లితండ్రులు ప్రతి రోజూ తమ పిల్లలతో ఒక అరగంట మనసు విప్పి మాట్లాడగలిగితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. తల్లితండ్రుల జీవితంలో ఏం జరుగుతోందో పిల్లలకు తెలుస్తుంది. పిల్లల జీవితంలో ఏం జరుగుతోందో తల్లితండ్రులకు తెలుస్తుంది.


చిన్నవే అయినా...

ఆనందకరమైన చిన్న చిన్న జ్ఞాపకాలే- మనకున్న పెద్ద ఆస్తులని నేను నమ్ముతాను. అలాంటి ఆనందకర జ్ఞాపకాల పరిణామక్రమమే - ‘హ్యాపీ ఇవల్యూషన్‌’. మన వర్తమానాన్ని ఆనందంగా గడిపితే- ఆ జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి. అవి భవిష్యత్తులో మళ్లీ ఎదురయినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది.

కానీ ఇది చెప్పుకున్నంత సులభం కాదు. ఎందుకంటే మన జీవితంలో మంచి, చెడు- రెండూ ఉంటాయి. సవాళ్లు, ఎదురుదెబ్బలు ఉంటాయి. వీటన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్తేనే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఆనందం, దుఖం- రెండూ కలుగుతాయి.

కొందరు ఆనందకరమైన క్షణాలు గుర్తుపెట్టుకొంటారు. మరి కొందరు దుఖంతో జీవిస్తూ ఉంటారు. ఆనందకరమైన జ్ఞాపకాలను గుర్తుపెట్టుకోగలిగితే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది.

అలా జ్ఞాపకాలను ఎలా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని నా పుస్తకంలో వివరించా. ఒక చిన్న ఉదాహరణ చెబుతా! చిన్నప్పుడు ఒకరు నా దగ్గరకు వచ్చి- ‘‘నీ నవ్వు చాలా బావుంటుంది’’ అని కాంప్లిమెంట్‌ ఇచ్చారు.

అది నాకు ఎప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, సంతోషాన్ని కలుగజేసేది. అలాంటి విషయాలను రికార్డు చేసి, పెద్దయిన తర్వాత పిల్లలకు అందచేస్తే- వాళ్లకు ఆనందకరమైన క్షణాలు గుర్తుకొస్తాయి.

ఈ తరం వాళ్లకు అన్నీ త్వరగా కావాలి. సమాచారం, ఆహారం.. ఇతరులతో స్నేహం... ఏ విషయానికైనా వేచి చూసే ఓపిక ఉండటం లేదు. అదే సమయంలో వాళ్లకు చాలా స్పష్టత ఉంది. వాళ్లతో కూర్చుని రోజుకు అరగంట మాట్లాడితే - వాళ్లకు ఏం కావాలో మనకు అర్థమవుతుంది. అందువల్లే- నేను పిల్లలను సీరియస్‌గా తీసుకోవాలనితల్లితండ్రులకు చెబుతూ ఉంటా! ‘చిన్న పిల్లలు... వాళ్లకేం తెలుస్తుంది’ అనే ఆలోచనే తప్పు.

Updated Date - May 02 , 2024 | 05:35 AM