Share News

AP Election 2024: అడ్డొచిన వారిని తొక్కుకుంటూ వెళ్దాం: నారా భువనేశ్వరి

ABN , Publish Date - Apr 13 , 2024 | 08:45 PM

కృష్ణా జిల్లా తిరువూరు టౌన్‌లో జరిగిన ‘నిజం గెలవాలి’ ముగింపు సభలో అధికార వైసీపీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ సైకిల్ తొక్కుతూ ముందుకు వెళదాం.. అడ్డొచిన వారిని తొక్కుకొంటు వెళ్దాం’’ అని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు పని చేశారని, ఆయన ఎప్పుడూ ప్రజలు ప్రజలు... అని తపన పడేవారని, ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతోమంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకుందని నారా భువనేశ్వరి అన్నారు.

AP Election 2024: అడ్డొచిన వారిని తొక్కుకుంటూ వెళ్దాం: నారా భువనేశ్వరి

తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు టౌన్‌లో జరిగిన ‘నిజం గెలవాలి’ ముగింపు సభలో అధికార వైసీపీపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ సైకిల్ తొక్కుతూ ముందుకు వెళదాం.. అడ్డొచిన వారిని తొక్కుకొంటు వెళ్దాం’’ అని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు పని చేశారని, ఆయన ఎప్పుడూ ప్రజలు ప్రజలు... అని తపన పడేవారని, ఈ వైసీపీ ప్రభుత్వం ఎంతోమంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకుందని నారా భువనేశ్వరి అన్నారు. వైజాగ్‌ను గంజాయి రాజధానిగా మార్చారని ఆమె ధ్వజమెత్తారు. కల్తీ మద్యానికి ప్రజలను అలవాటు చేసి కుటుంబ వ్యవస్థను నాశనం చేశారని వైసీపీ నాయకులపై మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు మా కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం. ప్రజా ప్రభుత్యం రావాలి.. అరాచక జగన్ ప్రభుత్యాన్ని దించి వేయాలి. ప్రతి కుటుంబానికి తండ్రి ఎంత అవసరమో రాష్టానికి చంద్రబాబు అంతే అవసరం.’’ అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.


‘‘ సెప్టెంబర్ 9, 2023 తేదీని నేను మర్చిపోలేను. ఆ రోజు మా పెళ్లి రోజు. ఆయణ్ణి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు’’ అని భువనేశ్వరి అన్నారు. పేద ప్రజల కోసం నందమూరి తారక రామారావు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని నారా భువనేశ్వరి గుర్తు చేసుకున్నారు. అదే స్పూర్తితో చంద్రబాబు పనిచేశారని, పేద ప్రజలకు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారని ప్రస్తావించారు. పేద ప్రజల పొట్ట కొట్టింది ఈ రాక్షస ప్రభుత్వమని ఆమె మండిపడ్డారు. ‘‘ దాతల సహకారంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళారు. పథకాల పేరిట ఇచ్చే సొమ్ముతో వైసీపీ వాళ్లు జేబులు నింపుకున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ చంద్రబాబు విజన్ ఐటీ రంగం. అందుకే ఎంతో మంది యువత ఐటీ రంగంలో స్థిరపడి డబ్బులు సంపాదిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలపై అరాచకాలకు పాల్పడ్డారు. ఆడబిడ్డ కడుపుతో ఉంటే ఒక పోలీస్ కాలితో తన్నడంతో ఆ శిశువు చనిపోయింది. స్త్రీ నీ గౌరవించనిది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం. ప్రజా వేదిక ద్వారా ప్రజల సమస్యల్ని విని పరిష్కరించేందుకు నిర్మిస్తే దాన్ని ధ్వంసం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తి అయ్యేది. రాష్ట్రానికి ఈ కరువు పరిస్థితి ఉండేది కాదు. మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఎంత కష్టపడ్డారో అయన పడిన కష్టం నాకు తెలుసు’’ అని నారా భువనేశ్వరి అన్నారు.


కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను ఓదార్చేందుకు ‘నిజం గెలవాలి’ పేరిట అక్టోబర్ 25న నారా భువనేశ్వరి ప్రారంభించిన యాత్ర నేటితో (శనివారం) తిరువూరులో ముగిసింది. సుమారు 95 నియోజకవర్గాల్లో పర్యటించిన ఆమె 203 కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందించి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ఆమె హామీ ఇస్తూ యాత్రను కొనసాగించారు. నేడు జరిగిన ముగింపు సభలో పెద్ద సంఖ్యలో మహిళలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముగింపు సభకు నారా భువనేశ్వరి పాల్గొనగా కేశినేని చిన్ని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు నాయకులు హాజరయ్యారు.

Updated Date - Apr 13 , 2024 | 08:59 PM