Share News

Election Results : తెల్లారింది లెగండోయ్ !

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:21 AM

ఓటు సునామీతో చరిత్ర సృష్టించిన రాష్ట్రం, పోలింగ్‌ ఫలితాల వెల్లువకు సిద్ధమైంది. 23 రోజులుగా ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడే సమయం వచ్చేసింది.

Election Results : తెల్లారింది లెగండోయ్ !

నేడే విడుదల

కౌంటింగ్‌కు వేళాయె.. హైటెన్షన్‌కు నేటితో తెర

తెల్లారింది! ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది! అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల వైసీపీ పాలనకు జనం పాతరేస్తారా? లేక... ‘వన్స్‌ మోర్‌’ అని గెలిపిస్తారా? ‘మీ అరాచకాలు భరించలేం’ అని వైసీపీకి తేల్చిచెప్పి... సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా సాగిస్తామనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే పట్టం కడతారా? ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? అత్యధిక సర్వేలు స్పష్టం చేసినట్లుగా కూటమినే విజయం వరిస్తుందా? లేక... ఈ అంచనా తిరగబడుతుందా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం లభించే సమయం ఆసన్నమైంది! మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ‘తుది ఫలితం’పై ఒక స్పష్టత వచ్చేస్తుంది. అప్పటిదాకా హైటెన్షన్‌ తప్పదు మరి!

కొద్ది గంటల్లోనే తేలనున్న పార్టీల భవితవ్యం

గెలుపు మాదంటే మాదంటూ నేతల ధీమా.. 3 వారాలుగా శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు కూటమివైపే.. కాదంటే కాదంటున్న పాలకపక్ష పెద్దలు

హోరాహోరీ పోరులో భారీ పోలింగ్‌.. దేశ విదేశాల నుంచి భారీగా వచ్చి ఓటేసిన జనం

పార్టీల గెలుపు అవకాశాలపై పది వేల కోట్ల దాకా బెట్టింగులు

ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాక మరింత ప్రవాహం.. గత రెండ్రోజుల్లోనే వెయ్యి కోట్లు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఓటు సునామీతో చరిత్ర సృష్టించిన రాష్ట్రం, పోలింగ్‌ ఫలితాల వెల్లువకు సిద్ధమైంది. 23 రోజులుగా ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడే సమయం వచ్చేసింది. దాదాపు 50 రోజులకుపైగా ప్రచారంలో గడిపిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఫలితాల టెన్షన్‌తో గడుపుతున్న పార్టీల్లో, ఎగ్జిట్‌పోల్స్‌ తీరుతో ఒక్కసారిగా హైటెన్షన్‌ మొదలైంది. ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటు పడటం ఈ టెన్షన్‌ను తారస్థాయికి చేర్చింది. మహిళా ఓటు అత్యధికంగా నమోదైన ఎన్నికలు కూడా ఇవే. దీంతో వారిచ్చే తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. పోస్టల్‌ బ్యాలెట్‌తో ఉద్యోగులు పోటెత్తారు. వారి అభిమతం ఏమిటనేదే అంతటా ఆసక్తి రేపుతోంది! మంగళవారం జరిగే కౌంటింగ్‌ కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖే్‌షకుమార్‌ మీనా వెల్లడించారు.

ఈవీఎం ఓట్లు 3.33 కోట్లు...

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,33,702 మంది. వారిలో 3,33,40,560 మంది ఓటర్లు ఈవీఎంల్లో తమ తీర్పును భద్రపరిచారు. వీరిలో అత్యధికంగా మహిళలు 1,69,08684 మంది ఓటు వేయడం విశేషం. పురుషులు 1,64,30,359 మంది, థర్డ్‌జెండర్లు 1517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్...


పోస్టల్‌ బ్యాలెట్‌ 5.15 లక్షలు

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌తో ఓటెత్తారు. బ్యాలెట్‌ ద్వారా 5.15 లక్షలమంది (1.2 శాతం) ఓటు హక్కు వినియోగించుకోగా, ఇందులో 92 నుంచి 93 శాతం మంది ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఉద్యోగులు, అత్యసవర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు అత్యధికంగా 461,945 లక్షల మంది ఉన్నారు. ఇక..85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 26,473 మంది (85శాతం), సర్వీసు ఓటర్లు 26,721 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కౌంటింగ్‌ కేంద్రాలివే...

రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాలు...401 హాళ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 2,446 టేబుళ్లు, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపునకు 557 టేబుళ్లు సిద్ధం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్‌ బ్యాలెల్‌ టేబుళ్లు ఏర్పాటుచేశారు. 25,209 మంది ఉద్యోగులు కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొననున్నారు. 119 మంది అబ్జర్వర్లు, ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్‌, ఉంటారు.

కౌంటింగ్‌ ప్రక్రియ ఇలా...

మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ ప్రక్రియ ఎనిమిది గంటలకు మొదలై అరగంట కొనసాగుతుంది. ఆ తర్వాత నుంచి ఈవీఎల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్‌ బ్యాలెట్లకు, ఈవీఎంలకు హాళ్లు వేరుగా ఉండవు. కానీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో వేర్వేరు హాళ్లు ఉండటంతో.. ఉదయం ఎనిమిది గంటల నుంచి అటు ఈవీఎంలు, ఇటు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఒకేసారి మొదలు పెడతారు.

ఒక్కో రౌండ్‌ 20, 25 నిమిషాలు..

మొదటి రౌండ్‌ ఫలితం వెల్లడికి 30,35 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి 20,25 నిమిషాలకు ఒక రౌండ్‌ ఫలితం వెలువడుతుంది. ఇక.. పోస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఒక రౌండ్‌ ఫలితం వెలువడానికి 2 గంటల నుంచి రెండున్న గంటల సమయం కూడా పట్టవచ్చు.

ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్...

111 నియోజకవర్గాల్లో 5 గంటల్లో ఫలితాలు..

కౌంటింగ్‌ మొదలైన ఐదుగంటల్లోనే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం తేలిపోతుంది. 20 రౌండ్ల లోపే తీర్పు తెలిసిపోతుంది. ఇక.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకుపైగానే కౌంటింగ్‌ సాగనుంది. అదేవిధంగా పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో 102 నియోజకవర్గాల్లో 1 నుంచి 2 రౌండ్లు, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్ల కౌంటింగ్‌ ఉండనుంది.

తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం

111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుది ఫలితాలు వెలువడతాయి. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తొలి విజేతల ప్రకటన ఉంటుంది. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే ఫలితం తెలిసిపోతుంది. ఇక...అత్యధికంగా భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉండడంతో ఫలితాలు వెలువడడానికి 9 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాల వెల్లడికి ఐదు గంటల సమయం పడుతుంది. అదే విధంగా అమలాపురం పార్లమెంటులో లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది., ఫలితాలు వచ్చేందుకు 9 గంటల సమయం పడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఫలితం తేలుతుంది.

అసెంబ్లీ స్థానాలు 175

పార్లమెంటు నియోజకవర్గాలు 25

లెక్కించాల్సిన ఓట్లు 3,33,40,560

మహిళలు 1,69,08,684

పురుషులు 1,64,30,359

థర్డ్‌ జెండర్లు 1,517

ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్...

Updated Date - Jun 04 , 2024 | 05:33 AM