Share News

Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.. మళ్లీ షాకిచ్చిన ప్రభుత్వం

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:44 PM

ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామని.. పీఆర్‌సీని వీలైనంత త్వరగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని.. దానిపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు.

Botsa Satyanarayana: ఉద్యోగ సంఘాల నేతలతో ముగిసిన సమావేశం.. మళ్లీ షాకిచ్చిన ప్రభుత్వం

ఉద్యోగ సంఘాలతో పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చలు జరిపామని.. పీఆర్‌సీని వీలైనంత త్వరగా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ కమిషన్ వేశామన్నారు. ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి కోరాయని.. దానిపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన అనంతరం మంత్రి బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు. రూ.5,600 కోట్ల బకాయిల విడుదలపై చర్చించామని.. ఉద్యోగుల పెండింగ్ అంశాలను త్వరగా పరిష్కరించాలని సీఎస్, ఆర్థిక శాఖ అధికారుల్ని ఆదేశించామని చెప్పారు.


ఈ సందర్భంగా ఏపీ సెక్రటేరీయేట్ అసోసియేషన్ (అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరిపినందుకు ధన్యవాదాలని తెలిపారు. డీఏ బకాయిలు, మధ్యంతర భృతి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని.. రూ.5,600 కోట్ల మేర బకాయిలను మార్చి 31వ తేదీ నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. ఏపీజీఎల్ఐ బకాయిలు సైతం త్వరలోనే ఇస్తామన్నారన్నారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉందని.. దీన్ని కూడా మార్చి 31వ తేదీ నాటికి జమ చేస్తామని చెప్పారని చెప్పారు. రూ. 2,250 కోట్ల మేర సరెండర్ లీవ్‌లు బకాయిలు ఉన్నాయన్న ఆయన.. మధ్యంతర భృతిపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ స్పష్టం చేసిందన్నారు.

ఇదిలావుండగా.. ఉద్యోగుల బకాయిల్ని గతేడాది సెప్టెంబర్ 23లోగా చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ.. ఇప్పుడు మార్చి 31న ఇస్తామంటూ మాట మార్చింది. ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందంటూ.. వాయిదా వేస్తూ వస్తోంది. పోలీసుల టీఏ, డీఏలు ఎప్పుడిస్తామన్న విషయంపై 4 రోజుల్లో మీటింగ్ పెట్టి చెప్తామని మంత్రివర్గ ఉప సంఘం దాటవేసింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై కూడా అదే మాట చెప్పింది. అధికారులు ఉపయోగిస్తున్న కార్లకు సంబంధించి ఏజెన్సీలకు నిధులు చెల్లించలేకపోతున్నామంటూ చేతులెత్తేసింది. ఉద్యోగులకు ఈసారి 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరితే.. మంత్రివర్గ ఉపసంఘం స్పందించలేదు.

Updated Date - Feb 12 , 2024 | 10:44 PM