Sunrisers captain Markram: సన్ రైజర్స్‌ కొత్త కెప్టెన్ గట్టోడే.. కానీ గట్టెక్కించగలడా?

ABN , First Publish Date - 2023-02-24T16:23:48+05:30 IST

కుర్రాళ్లను నమ్ముకున్న సన్ రైజర్స్ యాజమాన్యం.. వారితోనే ముందుకెళ్లాలని నిర్ణయించింది. విలియమ్సన్ వంటి ఆటగాడినీ వదులుకుంది. వచ్చే సీజన్‌కు కెప్టెన్ ఎవరో గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్క్ క్రమ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది.

Sunrisers captain Markram: సన్ రైజర్స్‌ కొత్త కెప్టెన్ గట్టోడే.. కానీ గట్టెక్కించగలడా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16 సీజన్ (season 16) సమయం దగ్గర పడుతోంది. దాదాపు అన్ని జట్లకూ కెప్టెన్ ఎవరో తెలుసు.. ఆఖరికి ఏనాడు కప్ గెలవని పంజాబ్‌కూ (Punjab Kings) సారథ్యం వహించబోయేది ఫలానా ఆటగాడు అన్ని చెప్పగలిగే పరిస్థితి. కానీ, తెలుగువారి జట్టుగా మనందరం గుండె మీద చేయివేసుకుని చెప్పే సన్ రైజర్స్ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) కెప్టెన్ ఎవరో తెలియని పరిస్థితి. రెండుసార్లు లీగ్ విజేత.. బ్యాట్స్‌మెన్ హవా సాగే టీ20ల్లో బౌలర్ల ప్రతిభతోనూ గెలవొచ్చని నిరూపించిన సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఏమిటీ గతి అని అందరూ బాధపడే పరిస్థితి.

ఆటగాళ్లు లేరు.. బండి లాగేదెలా?

నిలకడగా ఆడే విలియమ్సన్‌ను (Kane Williamson) వదులుకుని.. దూకుడైన డేవిడ్ వార్నర్‌ను (David warner) కాదని.. టీమిండియా సీనియర్ భువనేశ్వర్‌పై (Bhuvaneswar Kumar) నమ్మకం లేక.. అసలు రాబోయే సీజన్‌కు జట్టు ఎంపికే సరిగా లేదని విమర్శలు ఎదుర్కొంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) ఈ సీజన్ గట్టెక్కడం చాలా కీలకం. కొన్ని నెలల కిందట జరిగిన ఆటగాళ్ల వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యహరించిన తీరు విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో 2023 సీజన్‌లో జట్టును ముందుండి నడిపించే వాడు కావాలి. క్షణాల్లో ఫలితం తారుమారు అయ్యే టీ20ల్లో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా ఉన్న ఆటగాడు కావాలి.

ప్రదర్శన నానాటికీ తీసికట్టు

తొలి సీజన్ (2008)లో అట్టడుగున నిలిచి.. అద్భుతంగా పైకి ఎగసి.. టైటిల్ కొట్టిన చరిత్ర హైదరాబాద్ జట్టుది. ఆడమ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్‌గా.. దక్కన్ చార్జర్స్‌గా ఉన్న సమయంలో రెండో సీజన్ (2009)లోనే విజేతగా ఆవిర్భవించింది. అయితే, ఆ తర్వాత ప్రదర్శన దిగజారింది. ఇక 2012లో కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనకు గాను జట్టుపై వేటు పడింది. 2013 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్‌గా మారింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ సారథ్యంలో 2016లో ఏకంగా విజేతగా నిలిచింది. 2018లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ, 2019, 2020లో ప్లే ఆఫ్స్ చేరినా, 2021, 2022లో లీగ్ దశకే పరిమితమైంది.

కెప్టెన్ వచ్చాడు..కప్ కొట్టేస్తారా?

ప్రపంచ అత్యుత్తమ టీ20 స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan). ఈ అఫ్గాన్ బౌలర్‌ను ఏ జట్టూ వదులుకోదు. కానీ, నిరుడు సన్ రైజర్స్ చేజార్చకుంది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, నికొలస్ పూరన్ తప్ప పేరున్న ఆటగాళ్లు లేరు. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ మంత్రం పనిచేయలేదు. దీంతో ఐపీఎల్ 15 సీజన్‌లో హైదరాబాద్ ప్రదర్శన పేలవంగా ఉంది. 14 కోట్ల ధరకు కొనుగోలు చేసిన విలియమ్సన్ కూడా న్యాయం చేయలేదు. ఈ నేపథ్యంలో 2023 సీజన్ కు జట్టులో సమూల మార్పులు అవసరం అయ్యాయి. ఈ దిశగా కుర్రాళ్లను నమ్ముకున్న సన్ రైజర్స్ యాజమాన్యం.. వారితోనే ముందుకెళ్లాలని నిర్ణయించింది. విలియమ్సన్ వంటి ఆటగాడినీ వదులుకుంది. వచ్చే సీజన్‌కు కెప్టెన్ ఎవరో గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్క్ క్రమ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది. ఆల్ రౌండర్‌గా పేరున్నప్పటికీ.. మార్క్ క్రమ్ ప్రధానంగా బ్యాట్స్‌మన్. కాగా, మార్‌క్రమ్‌కు దక్షిణాఫ్రికా జట్టులో ఇప్పటికైతే శాశ్వత స్థానం లేదు.

అరుదైన రికార్డు అతడి సొంతం

దక్షిణాఫ్రికా అంటే పెద్ద టోర్నీల్లో బ్యాడ్ లక్ కు పెద్దన్న. వాన, ఒత్తిడి, అనూహ్య వైఫల్యం ఇలా ఎన్నో శాపాలతో ఆ జట్టు ఇప్పటికీ ప్రపంచ కప్ గెలవలేదు. అలాంటి జట్టుకు తొలిసారిగా ప్రపంచ కప్ అందించిన ఘనత మార్క్ రమ్ ది. అయితే, అది అండర్ 19 స్థాయిలో. 2014 దక్షిణాఫ్రికా అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు అతడే కెప్టెన్. 2017లో టెస్టు, వన్డే, 2019లో టి20 అరంగేట్రం చేశాడు. కానీ, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్ స్థాయిలో మ్యాచ్ విన్నర్ గా ఎదగలేకపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆరేడేళ్ల నుంచి ఆడుతున్నప్పటికీ అతడి గణాంకాలు ఏమీ మెరుగ్గా లేవు.

దీంతోనే బవుమాలాంటి వాడికి దక్షిణాఫ్రికా కెప్టెన్ బాధ్యతలు ఇస్తున్నారు. కాకుంటే.. మార్క్ రమ్.. ఫిట్ నెస్ బాగుంటుంది. క్లాస్ ప్లేయర్. ఓపెనింగ్ నుంచి మిడిలార్డర్ వరకు ఎక్కడైనా ఆడగలడు. అయితే, ఆ ప్రతిభకు ఇంతవరకు న్యాయం చేయలేదు. మరి సన్ రైజర్స్ కెప్టెన్ గా అయినా ఆ లోటును పూడుస్తాడేమో చూడాలి.

ఆ ప్రదర్శన చూసి..

దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది నుంచి టి20 లీగ్ (ఎస్‌ఏ20 -దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ టోర్నీ) మొదలైంది. సన్ రైజర్స్ కు అక్కడా ఒక జట్టుంది. దాని పేరు ఈస్ట్రన్‌ కేప్‌. దీని కెప్టెన్ గా మార్క్ రమ్ వ్యవహరించాడు. టైటిల్ సాధించిపెట్టాడు. దీంతో సన్‌రైజర్స్‌ జట్టుకు కూడా మార్‌క్రమ్‌ ను కెప్టెన్ చేశారు. కాగా, సన్ రైజర్స్ కు కొన్నేళ్ల పాటు డేవిడ్‌ వార్నర్‌, ఆపై కేన్‌ విలియమ్సన్‌ ను కెప్టెన్ నియమించారు. కొన్నిసార్లు భువనేశ్వర్‌ కుమార్‌కు బాధ్యతలు అప్పగించినా అది తాత్కాలికమే. వార్నర్‌ గత సీజన్లోనే సన్‌రైజర్స్‌ను వీడగా.. ఈ సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్‌ విడిచిపెట్టింది. దీంతో జట్టు కెప్టెన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మార్‌క్రమ్‌ లేదా టీమ్‌ఇండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చివరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం మార్‌క్రమ్‌కు అవకాశమిచ్చింది.

ఇవీ మార్క్ రమ్ అంతర్జాతీయ గణాంకాలు

Mat Inns NoRuns HS Ave

టెస్టులు 33 2009 152 34.05

వన్డేలు 47 1189 96 29.00

టీ20లు 31 879 70 38.21

Updated Date - 2023-02-24T16:30:46+05:30 IST