Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు మూడు ఛాన్సులు.. మూడో సెంచరీ కొట్టేశాడు.. ఫీల్డర్లపై రోహిత్ అసహనం!

ABN , First Publish Date - 2023-05-27T10:14:07+05:30 IST

గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

Shubman Gill: శుభ్‌మన్ గిల్‌కు మూడు ఛాన్సులు.. మూడో సెంచరీ కొట్టేశాడు.. ఫీల్డర్లపై రోహిత్ అసహనం!

గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తన అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ (GTvsMI) జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెలరేగిన గిల్ 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు. గిల్ ఇన్నింగ్స్‌లో 111 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

నిజానికి ఈ ఇన్నింగ్స్‌లో గిల్ మూడు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముంబై జట్టు పేలవ ఫీల్డింగ్ కూడా గిల్‌కు కలిసి వచ్చింది. ఆరో ఓవర్‌లో 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్‌ డేవిడ్‌ (Tim David) వదిలేశాడు. చేతిలో పడిన బంతిని జారవిడిచాడు. మరో 2 ఓవర్ల తర్వాత గిల్ 37 రన్స్ వద్ద ఉన్నప్పుడు మరో కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో ఛాన్స్ వచ్చింది. అయితే కీపర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) బంతిని ఆలస్యంగా పట్టుకోవడంతో స్టంపౌట్ ఛాన్స్ మిస్ అయింది. ఆ తర్వాత బంతికే మిడ్-వికెట్ దగ్గర కాస్త కష్టమైన క్యాచ్‌ను తిలక్ వర్మ వదిలేశాడు.

Tilak Varma: తిలక్ వర్మ కళ్లు చెదిరే ఇన్నింగ్స్.. షమీ వేసిన ఒకే ఓవర్లో 24 పరుగులు.. మరికొద్ది సేపు ఉండుంటే..

ఫీల్డర్ల వైఫల్యంపై ముంబై టీమ్ కెప్టెన్ రోహత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. మూడు అవకాశాలు రావడంతో గిల్ వెనుదిరిగి చూసుకోలేదు. బంతిని బలంగా బాదేస్తూ సిక్సర్ల వర్షం కురిపించాడు. పేస్‌, స్పిన్‌ ఏదైనా అతడి బ్యాట్‌కు బలైంది. సాయి సుదర్శన్‌తో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగులు జత చేశాడు. కేవలం 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో గుజరాత్‌ను గెలిపించి ఫైనల్‌కు చేర్చాడు. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో (IPL 2023 Final) చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో గుజరాత్ (GTvsCSK)తలపడనుంది.

Updated Date - 2023-05-27T10:14:07+05:30 IST