Mens Relay Team: రికార్డు సృష్టించిన భారత అథ్లెట్లు.. ఆ ముగ్గురి గురించే సర్వత్రా చర్చ

ABN , First Publish Date - 2023-08-28T13:04:56+05:30 IST

మెన్స్ రిలే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు ముస్లిం అథ్లెట్లు ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. వాళ్ల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ముగ్గురిలో మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్‌ను ప్రత్యేకంగా అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Mens Relay Team: రికార్డు సృష్టించిన భారత అథ్లెట్లు..  ఆ ముగ్గురి గురించే సర్వత్రా చర్చ

ప్రపంచ అథ్లెటిక్స్ 4×400 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్లు అదరగొట్టారు. బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో మన ఆటగాళ్లు ఆసియా రికార్డును తిరగరాశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో తమ ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరడమే కాకుండా గతంలో జపాన్ పేరిట ఉన్న ఆసియా రికార్డును బద్దలుకొట్టి కొత్త చరిత్ర సృష్టించారు. శనివారం జరిగిన పురుషుల 4X400 మీటర్ల హీట్స్‌లో ఇండియా టీమ్‌లోని మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్, రాజేష్ రమేష్ చిరుత పులుల మాదిరిగా పరిగెత్తారు. దీంతో వాళ్లు 2 నిమిషాల 59.05 సెకన్లలోనే రేసు ముగించి క్వాలిఫై రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఫైనల్‌కు అర్హత సాధించారు. గతంలో జపాన్ బృందం 2 నిమిషాల 59.51 సెకన్‌లలో రేసు ముగించగా ఇప్పుడు వాళ్లను మనవాళ్లు దాటి ఫాస్టెస్ట్ టీమ్ రికార్డును సాధించారు.

అయితే ముఖ్యంగా మెన్స్ రిలే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన నలుగురు ఆటగాళ్లలో ముగ్గురు ముస్లిం అథ్లెట్లు ఉండటం ప్రత్యేకంగా నిలుస్తోంది. వాళ్ల గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన ముగ్గురిలో మహ్మద్ అనాస్, అమోజ్ జాకబ్, మహ్మద్ అజ్మల్‌ను ప్రత్యేకంగా అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని వీళ్లు చాటిచెప్పారని కొనియాడుతున్నారు. ఈ ముగ్గురు దేశానికి గూస్‌బంప్స్ మూమెంట్స్ ఇచ్చారని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మనందరం భారతీయులం అని.. మనకు కులాలు,.. కమ్యూనిటీ ముఖ్యం కాదని.. భారతీయులుగా ఇది గర్వించదగ్గ క్షణాలు అని అభిప్రాయపడుతున్నారు. మతం ముఖ్యం కాదని.. దేశమే ముఖ్యమని చాటిచెప్పారని అంటున్నారు. అన్ని రంగాల్లో కులాలు, మతాలు అంటూ ఆధిపత్యం జరుగుతున్న రోజుల్లో క్రీడారంగంలో మాత్రం సమష్టితత్వంతో భారతీయులు ముందుకు సాగిపోతున్నారని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. సెక్యులర్ దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆటగాళ్లు సమష్టిగా రాణించి భారతీయులు గర్వపడేలా చేస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే నిజమైన భారత్ అని చాటిచెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ముస్లింలు అంటే ఇతరులకు చిన్నచూపు వద్దని.. వాళ్లపై దుష్ప్రచారం చేయడం ఆపాలని హితవు పలుకుతున్నారు.


కాగా ఫైనల్లో మాత్రం భారత అథ్లెట్లు నిరాశపరిచే ప్రదర్శన చేశారు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల 4x400 మీటర్ల రిలేలో భారత బృందం ఐదో స్థానానికి పరిమితమైంది. అజ్మల్, రాజేష్, అమోజ్, అనాస్‌ 2 నిమిషాల 59.34 సెకన్లలో పరుగును పూర్తి చేశారు. అమెరికా అథ్లెట్ల బృందం.. 2 నిమిషాల 57.31 సెకన్లలోనే పూర్తిచేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఫ్రాన్స్ (2 నిమిషాల 58.45 సెకన్లు), గ్రేట్ బ్రిటన్ (2 నిమిషాల 58.71 సెకన్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జమైకా అథ్లెట్ల బృందం.. 2 నిమిషాల 59.34 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది.

Updated Date - 2023-08-28T13:04:56+05:30 IST