Hockey World Cup : ఉత్కంఠ పోరులో.. నిరాశే

ABN , First Publish Date - 2023-01-23T02:35:41+05:30 IST

ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో భారత హాకీ జట్టుకు మరోసారి భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై చాంపియన్‌గా నిలవాలనుకున్న ఆశలకు న్యూజిలాండ్‌ అడ్డుకట్ట వేసింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌

Hockey World Cup : ఉత్కంఠ పోరులో.. నిరాశే

సడన్‌ డెత్‌లో భారత్‌ పరాజయం

క్వార్టర్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌

హాకీ ప్రపంచకప్‌

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో భారత హాకీ జట్టుకు మరోసారి భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై చాంపియన్‌గా నిలవాలనుకున్న ఆశలకు న్యూజిలాండ్‌ అడ్డుకట్ట వేసింది. ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన ఆఖరి నిమిషం వరకు పోరాడినా.. సడన్‌ డెత్‌లో అదృష్టం వెక్కిరించింది. నిర్ణీత సమయంలో మొదట లలిత్‌, వరుణ్‌, సుఖ్‌జీత్‌ అద్భుత ప్రదర్శనతో భారత్‌ మూడు గోల్స్‌ సాధించగా, అటు కివీస్‌ కూడా అన్నే గోల్స్‌తో పోటీ ఇచ్చింది. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులోనూ ఇరుజట్లు 3-3తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో విజేతను తేల్చేందుకు సడెన్‌ డెత్‌ను ఆడించారు. ఇందులో మొదట ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారిదే మ్యాచ్‌. దీనికి తగ్గట్టుగానే 5-4 తేడాతో ముందంజ వేసిన కివీస్‌ క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అటు నాలుగున్నర దశాబ్దాల తర్వాత మరోసారి విజేతగా నిలవాలనుకున్న భారత జట్టు ఓటమి భారంతో మైదానం వీడింది. ఇక 26న జపాన్‌తో 9 నుంచి 16వ స్థానం కోసం భారత్‌ పోటీపడుతుంది.

ఆధిక్యంతో సాగి..: మ్యాచ్‌లో మొదట 3-1తో భారత్‌ తిరుగులేని ఆధిక్యంతో కొనసాగింది.కానీ కివీస్‌ మాత్రం అంత సులువుగా లొంగ లేదు. ప్రత్యర్థి బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ మెరుపువేగంతో గోల్స్‌ సాధించింది. తొలి క్వార్టర్‌లో ఇరు జట్లకు అవకాశాలు వచ్చి నా సద్వినియోగం చేసుకోలేదు. 13వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ డ్రాగ్‌ఫ్లిక్‌ను కివీస్‌ డిఫెండర్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో క్వార్టర్స్‌లో ఇరుజట్ల నుంచి దూకుడు కనిపించింది. 17వ నిమిషంలో లలిత్‌ తొలి గోల్‌తో భారత్‌ ఎదురు చూపులకు తెరదించాడు. ఆ వెంటనే 24వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ పీసీని గోల్‌కీపర్‌ అడ్డుకోగా.. గాల్లోకి లేచిన బంతిని వేగంగా సుఖ్‌జీత్‌ నెట్‌లోకి పంపాడు. కానీ 28వ నిమిషంలో కివీస్‌ తొలి గోల్‌తో ఆధిక్యం 2-1కి తగ్గింది.

సెకండాఫ్‌లో పోటాపోటీ: ద్వితీయార్ధం ఆరంభంలోనే మెరుపుదాడి చేసిన భారత్‌కు చకచకా గోల్‌ అవకాశాలు లభించాయి. 40వ నిమిషంలో దక్కిన పీసీని వరుణ్‌ తక్కువ ఎత్తులో బాటమ్‌ లెఫ్ట్‌ కార్నర్‌ నుంచి గోల్‌గా మలవడంతో ఆధిక్యం 3-1కి చేరింది. అయితే ఆఖరి క్వార్టర్‌ మొదట్లోనే కివీస్‌ తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను రస్సెల్‌, షాన్‌ ఫిండ్లే గోల్స్‌ చేయడంతో 3-3తో స్కోరు సమమైంది. అయితే చివరి క్వార్టర్‌ 55వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ గోల్‌ ప్రయత్నం విఫలం కావడంతో భారత్‌ గెలిచే చాన్స్‌ చేజారి మ్యాచ్‌ షూటౌట్‌కు వెళ్లింది.

క్వార్టర్స్‌కు స్పెయిన్‌: మరో క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో.. స్పెయిన్‌ పెనాల్టీ షూటౌట్‌లో 4-3తో నెగ్గి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. మంగళవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో గ్రూప్‌-ఎ టాపర్‌ ఆస్ట్రేలియాతో స్పెయిన్‌ తలపడుతుంది. షూటౌట్‌లో స్పెయిన్‌, మలేసియా 3-3తో సమవుజ్జీలుగా నిలిచాయి. దాంతో సడన్‌ డెత్‌ అనివార్యమైంది.

Updated Date - 2023-01-23T08:03:54+05:30 IST