Raj Bhavan Vs Bus Bhavan : ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు.. రాజ్‌భవన్ కోరిందేంటి..!?

ABN , First Publish Date - 2023-08-05T09:43:08+05:30 IST

తెలంగాణ ఆర్టీసీనీ (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ క్యాబినెట్‌ (KCR Cabinet) ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ బిల్లును గవర్నర్ తమిళిసైకు ( Governor Tamilisai) ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపడం జరిగింది..

Raj Bhavan Vs Bus Bhavan : ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ ఎందుకు ఆమోదించలేదు.. రాజ్‌భవన్ కోరిందేంటి..!?

తెలంగాణ ఆర్టీసీనీ (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ క్యాబినెట్‌ (KCR Cabinet) ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ బిల్లును గవర్నర్ తమిళిసైకు ( Governor Tamilisai) ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు (Raj Bhavan) పంపడం జరిగింది. అయితే.. గవర్నర్ ఆమోదించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇవాళ ఉదయం నుంచి ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయాయి. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పరిణామాలతో రాజ్‌భవన్ వర్సెస్ బస్ భవన్‌గా (Bus Bhavan) పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇదంతా బీఆర్ఎస్ డైరెక్షన్‌లోనే జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ఆర్టీసీ బిల్లు క్లియరెన్స్‌పై కార్మికులతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందని విశ్లేషకులు మండిపడుతున్నారు. మరోవైపు.. గవర్నర్ రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. డిపోల ముందు రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు బస్సుల బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్మికులు నెక్లెస్‌ రోడ్డుకు రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. అనంతరం.. 11 గంటలకు పీవీ మార్గ్ నుంచి రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరి వెళ్లనున్నారు.


RTC-Vil.jpg

ముట్టడిస్తాం!

కాగా.. బిల్లును గవర్నర్ ఆమోదించకుండా కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మజ్దూర్ సంఘ్ కార్మిక నాయకుడు థామస్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ వైఖరికి నిరసనగా నగరంలో ఉన్న 29 డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదన్నారు. ముషీరాబాద్ డిపో ముందు కార్మికులు కండక్టర్లు, డ్రైవర్లతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ఎక్కడున్నా వెంటనే ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో కార్మికులంతా రాజ్ భవన్‌ను ముట్టడిస్తారని మరోసారి థామస్ హెచ్చరించారు. న్యాయ సందేహాలుంటే ఇవాళే నివృత్తి చేసుకోవాలని ఆర్టీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 43వేల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని వివాదం చేయొద్దని సంఘాల నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్‌ హనుమంతు ముదిరాజ్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

Gov-Vs-KCR.jpg

ఎందుకు స్పందనలేదు..?

ఇదిలా ఉంటే.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవడానికి సంబంధించి ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని.. ఇందుకు కొంత సమయం కావాలని గవర్నర్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం 3.30కు బిల్లు తమ వద్దకు వచ్చిందని.. ముఖ్యంగా న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఆ తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని చెప్పింది. ఈ మేరకు గవర్నర్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వివరణ కోరామని రాజ్‌భవన్‌ తెలిపింది. బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకునేలా తక్షణమే సమాధానం ఇవ్వాలని రాజ్‌భవన్‌ స్పష్టం చేసింది. అయితే ఇంతవరకూ బిల్లుపై ప్రభుత్వం నుంచి వివరణ రాకపోవడం గమనార్హం. మొత్తానికి చూస్తే.. ప్రభుత్వం నుంచి గవర్నర్ కోరిన వివరణ రాకపోవడం కూడా పెద్ద డ్రామాగానే రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒకవేళ ఇవాళే గవర్నర్‌ ఆర్టీసీ బిల్లును ఆమోదిస్తే.. శనివారం నాడే అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆదివారం అనుమతించినా అదే రోజు ప్రవేశపెట్టి, ఆమోదించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ.. గవర్నర్‌ ఆదివారం సాయంత్రం తర్వాత నిర్ణయం తెలిపితే సర్కారు ఏం చేస్తుందనే సందిగ్ధత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలను పొడిగించి, బిల్లును ఆమోదిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

RTC-Employees.jpg

ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్..

1. 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.

2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితి ని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.

3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా..? వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి..?

4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా..? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వండి.

5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై గవర్నర్ మరిన్ని స్పష్టమైన హామీలు కోరారు.

Updated Date - 2023-08-05T10:30:02+05:30 IST