'OHRK'Surekha-Murali: కాంగ్రెస్‌లో చిక్కంతా.. నల్లగొండ నేతలతోనే

ABN , First Publish Date - 2023-06-12T03:17:56+05:30 IST

పాత కొండా మురళి బయటికొస్తాడని హెచ్చరికలు జారీ చేస్తున్నారు..? వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ వాళ్లు అన్యాయాలు, అక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. గతంలో మేం ఉన్నప్పుడు రౌడీయిజం తక్కువగా ఉండేది. కొవిడ్‌ కాలంలో రెండేళ్లు నేను సైలెంట్‌గా ఉండేసరికి రెచ్చిపోయారు. కాబట్టి వాళ్లను నియంత్రించే క్రమంలో నేను రోజూ అక్కడ తిరుగుతున్నా. ఇలాంటి పరిస్థితి వరంగల్‌లో ఎప్పుడూ రాలేదు. ప్రజలకు అండగా ఉండేందుకే ఆ నిర్ణయానికి వచ్చా.

 'OHRK'Surekha-Murali:  కాంగ్రెస్‌లో చిక్కంతా..  నల్లగొండ నేతలతోనే

ఆ జిల్లాలో అందరూ సీఎం అభ్యర్థులే

అజాంజాహీ మిల్లు స్థలాన్ని సర్కారే అమ్మింది

మాకూ కేటీఆర్‌కు వివాదం అక్కడే వచ్చింది

వరంగల్‌ జైలుకు వాస్తు లేదని కేసీఆర్‌ కూల్చాడు

ఎర్రబెల్లి మాపై తప్పుడు కేసులు పెట్టించాడు

టీఆర్‌ఎస్‌లో చేరాక హరీశ్‌ కాస్త సాయం చేశారు

మాలాంటి లీడర్‌ కావాలని చంద్రబాబు అడిగారు

వరంగల్‌లో మురళిదే హవా అని వైఎస్‌ అన్నారు

ఆ మరుసటి రోజే ఆయన చనిపోవడం దురదృష్టం

జగన్‌ వెంట నడిచినందుకు చాలా బాధపడ్డాం

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో కొండా సురేఖ-మురళి

ఆర్కే: పాత కొండా మురళి బయటికొస్తాడని హెచ్చరికలు జారీ చేస్తున్నారు..?

మురళి: వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ వాళ్లు అన్యాయాలు, అక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. గతంలో మేం ఉన్నప్పుడు రౌడీయిజం తక్కువగా ఉండేది. కొవిడ్‌ కాలంలో రెండేళ్లు నేను సైలెంట్‌గా ఉండేసరికి రెచ్చిపోయారు. కాబట్టి వాళ్లను నియంత్రించే క్రమంలో నేను రోజూ అక్కడ తిరుగుతున్నా. ఇలాంటి పరిస్థితి వరంగల్‌లో ఎప్పుడూ రాలేదు. ప్రజలకు అండగా ఉండేందుకే ఆ నిర్ణయానికి వచ్చా.

ఆర్కే: పాత మురళి బయటికొస్తాడంటే..ఇంకా మీలో ఉన్నట్టేనా?

మురళి: పాత మురళి లోపల ఇంకా అలానే ఉన్నాడు.

సురేఖ: మా ఓపికను అసమర్థత అనుకుంటే తప్పే. మూడున్నరేళ్లు చాలా ఓపికగా ఉన్నాం. మేం సైలెంట్‌గా ఉన్నామని బీఆర్‌ఎస్‌ వాళ్లు రెచ్చిపోతున్నారు. ఆజంజాహీ మిల్లు భూమితో సహా ప్రభుత్వ, ప్రైవేటు భూములన్నీ కబ్జా పెడుతున్నారు.

మురళి: మాకూ, కేటీఆర్‌కు వివాదం వచ్చిందే ఆజంజాహీ మిల్లు భూమితో. వరంగల్‌లో ప్రజలు మీటింగ్‌ పెట్టుకునేందుకు ఒక గ్రౌండ్‌ లేదు. దాన్ని ఉంచాలని చెప్పాం. కానీ, ప్రభుత్వం ఆ భూమిని ప్లాట్లు చేసి అమ్ముకుని లాభపడింది. ఇంక ఎందుకు ఓపిక ఉంటుంది. మా ఊరిలో మా కళ్లముందే ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే.

సురేఖ: వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు వాస్తు లేదని కేసీఆర్‌ కూల్చేశాడు. ఎంజీఎంను అభివృద్ధి చేయొచ్చు కదా. జైలును కూల్చి ఆస్పత్రి కట్టడమేంటి.

ఆర్కే: మీరిద్దరూ ఒకే మాటపై ఉంటారు. ఏంటి ఇంత సాఫీగా ఉండటానికి కారణమేంటి?

సురేఖ: ఏ విషయంలోనైనా మాది సమష్టి నిర్ణయం. మురళి, వాళ్ల బ్రదర్‌, నేను, మా పాప.. కూర్చుని మాట్లాడుకుంటాం. అందువల్ల మా మధ్య గొడవ రాదు. ఉదాహరణకు.. ఓసారి చంద్రబాబు మమ్మల్ని పిలిచారు. మనం ఆ పార్టీలో చేరనప్పుడు కలవడం అవసరమా అని మురళి అన్నారు. ‘‘మనం జాయిన్‌ అవడం, కాకపోవడం అన్నది తర్వాత. అంత సీనియర్‌ మనల్ని పిలిచినపుడు వెళ్లాలి. మాట్లాడాలి. పార్టీలో చేరడం, చేరకపోవడం మన ఇష్టం’’ అని నేను చెప్పా. దీంతో మురళి వెళ్లారు. మీలాంటోళ్లు ఉండాలి మురళి. మీలాంటి లీడర్‌ కావాలని చంద్రబాబు అన్నారు.

మురళి: దయాకర్‌ ఉన్నాక నేనెలా వస్తానన్నా. ఇక్కడ 23 ఆత్మలు ఉన్నాయి. అవి ఏడుస్తాయి. నేను రాలేనని చెప్పా. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతాడు, టీఆర్‌ఎ్‌సతో మాట్లాడుకున్నాడని చంద్రబాబు చెప్పారు. నేను రాలేనని చెప్పా.

1oprkABN07301.jpg

ఆర్కే: నక్సలైట్లతో కలిసి ఉంటే పోలీసులతో పంచాయితీ రాలేదా?

సురేఖ: ఓసారి పోలీసులు కూంబింగ్‌కు వెళ్లినపుడు.. అన్నలను మురళి కలిసి వస్తున్న విషయాన్ని టీం లీడర్‌గా ఉన్న ఓ పోలీసు అధికారి గమనించాడు.నక్సల్స్‌ ఎదురైతే వాళ్లతో పాటు మురళిని కూడా చంపేయాలని వారికి ఆదేశాలున్నాయి. అయితే, మురళితో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆ అధికారి ఆయనను కాపాడాడు.

మురళి: రాత్రి నేను ఇంటికి రాగానే ఒంటి గంటకు ఆ అధికారి మా ఇంటికి వచ్చాడు. మందు బాటిల్‌ ఉందారా..? అని అడిగాడు. ఇద్దరం మందు తాగుతూ కూర్చున్నాం. నీకేమైనా బుద్ధి ఉందా..? నేను గంట తండ్లాడితే నువ్‌ బయటికి వచ్చావు అని తిట్టాడు. నేను పైకి ఎదిగానంటే 50శాతం పోలీసులు, 50 శాతం నక్సలైట్ల వల్లే.

ఆర్కే: దయాకర్‌కు మీకు వైరం ఎందుకొచ్చింది?

మురళి: ఓ సారి పోలీసులు టాడా కేసు పెట్టి రిమాండ్‌ చేశారు. ఏడు రోజులు జైలులో ఉన్నా. బెయిల్‌పై వచ్చి నేరుగా ఎస్పీని కలిశా. నేనేం తప్పు చేశానని అడిగా. ‘మీ దయాకరే చేయమన్నాడు.. నీకు కొంచెం ఫాలోయింగ్‌ ఎక్కువవుతోందని’అని ఆయన చెప్పారు. వెంటనే కాంగ్రె్‌సలోకి వెళ్లా. అమాయకుడిలా ఉంటాడు కానీ, మేకవన్నె పులి.

ఆర్కే: ఇప్పటికీ మీ మధ్య వైరం పోలేదా..?

మురళి: అవును. నాకు 300 ఎకరాల్లో ఫిషరీస్‌ ఉంది. నాలుగేళ్లుగా వేయనీయట్లేదు. వచ్చిన టెండర్లు క్యాన్సిల్‌ చేయించారు. వీటిపై నేను హైకోర్టుకు వెళ్లి గెలిచా. వాళ్లు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కగా నెగ్గా. నేను దానిని అమలు చేస్తే దయాకర్‌, కేటీఆర్‌కు ఏమీ కాదు. అధికారులు జైలుకు వెళతారని వదిలేశా.

ఆర్కే: వైఎస్‌ ఉన్నప్పుడు మీ హవా నడిచింది..

సురేఖ: ఆయన ఉంటే ఇంకా నడిచేది. ఇంకా ఇంకా నడిచేది. ‘‘రేపటి నుంచి కొండా మురళిదే వరంగల్‌. ఇన్ని రోజులు పొన్నాల లక్ష్మయ్య, రెడ్యా నాయక్‌ ఏదో చేస్తారనుకున్నా.. కానీ నీకు ఇవ్వక తప్పు చేశా. రేపటి నుంచి మురళి ఏది చెబితే అదే’’ అని చెప్పారు. మా దురదృష్టం కొద్దీ ఆ తర్వాత రోజే ఆయన చనిపోయారు. వైఎ్‌సఆర్‌ కోసం రాజీనామా చేసిందుకు మేం ఫీలవ్వం కానీ, జగన్మోహన్‌ రెడ్డి వెంట నడిచామనే ఫీలింగ్‌ ఒక్కటే ఉంటుంది. ఆయన కోసం మేం తెలంగాణ ద్రోహులమని ముద్ర వేయించుకున్నాం.

మురళి: కిరణ్‌కుమార్‌ రెడ్డి నన్ను పిలిచి మాట్లాడారు. తిరుపతిలో రూ.5 వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తా.. రేఖమ్మను కాంగ్రె్‌సలోకి తీసుకురా. ఆమెకు మంత్రి పదవి ఇస్తా. నీ ఎమ్మెల్సీ కొనసాగిస్తా. అని చెప్పారు. నేను సారీ చెప్పా. తర్వాత జగన్‌ దగ్గరికి వెళ్లాను. అన్నా నాకు సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఎమ్మెల్సీ కావాలని అడిగా. ‘అరె అన్నా.. నువ్‌ ఎమ్మెల్సీ అని నేననుకోలేదు. మరచిపోయా’ అన్నాడు.

సురేఖ: వీటన్నింటిపై జగన్‌ ఓ లేఖ రాసి పంపారు. ‘‘ఏ ఫ్యామిలీలోనైనా మూడు పదవులు ఉంటాయా. అడగటంలోనూ హద్దుండాలి’’ అని రాశారు.

మురళి: ఆయనది వక్రబుద్ధి. ఆయన మీటింగ్‌ల కోసం చాలా ఖర్చు చేశా. ధర్నా చౌక్‌ దగ్గర ఆయన ధర్నా చేస్తే.. జనం రావటం లేదు అన్నా.. అని నా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తెల్లారేసరికి 25వేల మందిని తీసుకెళ్లా.

Untitled-9.jpg

ఆర్కే: షర్మిల పార్టీ పెట్టారు కదా..? పిలిచారా మిమ్మల్ని..?

సురేఖ: ఫోన్‌ చేశారు. ఆమె ఇక్కడ పార్టీ పెట్టడమే తప్పు. అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాలో పార్టీ పెట్టాలి. లేదా ఏపీలో కాంగ్రె్‌సలో చేరి కొట్లాడాలి. క్రిస్టియన్‌ ఓట్లు, రాజశేఖర్‌ రెడ్డి అభిమానుల ఓట్లను చీల్చేందుకు కేసీఆర్‌ వేసిన ప్లాన్‌ ఇది. దీని వల్ల కాంగ్రె్‌సకు దెబ్బ. బీజేపీ, బీఆర్‌ఎస్‌, షర్మిల.. అంతా ఒక్కటే. రేపో మాపో కవిత అరెస్టు అన్నారు.. ఏమైంది. ఇలా అయితే కేంద్ర ప్రభుత్వాన్ని జనం ఎలా నమ్ముతారు.

ఆర్కే: వైఎస్‌ హయాంలో దయాకర్‌ను ఎందుకు వదిలేశారు?

మురళి: దానికో కారణం ఉంది. వైఎస్సార్‌ పక్కన కేవీపీ దొర ఉన్నాడు కదా. దొరలు ఎక్కడున్నా.. అందరూ ఒక్కటే.

సురేఖ: దయాకర్‌ను, మురళిని కూర్చోబెట్టి గిరీశ్‌ సంఘీ మాట్లాడాడు. అప్పుడు నేనూ వెళ్లా. అక్కడ దయాకర్‌ను నేను కడిగేశా. చేసిన దారుణాలన్నీ ఏకరువు పెట్టా. కాంప్రమైజ్‌ కావాల్సిన అవసరం లేదని చెప్పా.

ఆర్కే: ఇప్పుడు దయాకర్‌ పవర్‌లో ఉన్నాడు. మీకు రక్షణ ఎలా?

మురళి: నన్ను హరీశ్‌ అడిగాడు. మా వాడిని తట్టుకుంటావా అని. నేను బాబు గారినే తట్టుకున్నా అని చెప్పా. నాకు చావంటే భయం లేదని అన్నా. దయాకర్‌ కూర్చున్న స్టేజీ మీద నేను కూర్చోలేనని చెప్పా.

సురేఖ: రాజకీయాలు ఇంత దరిద్రంగా అవుతాయని అనుకోలేదు. ఈసారి నేను గెలిచి ఉంటే.. మరోసారి పోటీ చేసేదాన్ని కాదు. కాంగ్రె్‌సలో ఐక్యత కూడా చాలా ముఖ్యం. వచ్చిన చిక్కల్లా నల్లగొండ కాంగ్రెస్‌ నేతలతోనే. మొత్తం తెలంగాణలో ఎంత మంది సీఎం అభ్యర్థులు ఉన్నారో.. ఒక్క నల్లగొండలో అంత మంది ఉన్నారు. కొత్త వ్యక్తి వచ్చి పార్టీని బలోపేతం చేస్తుంటే.. మనం సహకరించాలా.. వద్దా? ఇకనైనా బుద్ధి తెచ్చుకోకపోతే కాంగ్రెస్‌ పని అయిపోతుంది.

ఆర్కే: ఇప్పుడు వరంగల్‌లో యాక్టివ్‌గా ఉన్నారా నక్సలైట్లు..?

మురళి: ఉన్నారు. అందుకే భయంగానే గన్‌మెన్లను వేసుకుని తిరుగుతా. కోర్టు అనుమతితో నేను ముగ్గురు గన్‌మెన్లను పెట్టుకున్నా. సురేఖకు ఇద్దరు ఉన్నారు. మేమిద్దరం ఒకే వాహనంలో ఎప్పుడూ వెళ్లం.

ఆర్కే: దయాకర్‌, మీరూ నేరుగా ఎన్నికల్లో తలపడొచ్చు కదా..?

మురళి: ఆ నియోజకవర్గం(పాలకుర్తి)లో నేనంటే క్రేజ్‌ ఉంది. అక్కడి ప్రజలు వచ్చి నన్ను కలిసి పోటీ చేయాలని కోరారు. వేరే వాళ్లు దయాకర్‌కు పోటీ ఇవ్వలేరు. నాకు టికెట్‌ ఇవ్వాలని రేవంత్‌ను అడిగా.. చూద్దాం అన్నారు. నేను దయాకర్‌ను ఓడించకపోతే రాజకీయాలు మానేస్తానన్నా. అయినా, నాకు పోటీగా దయాకర్‌ నిలబడడు. నేను మాట్లాడటం మొదలుపెడితే.. ఇబ్బందిపడతాడు. చాలెంజ్‌ చేసి చెప్తున్నా. దయాకర్‌పై ఓడిపోతే ఇంకోసారి మీ ముందుకు రాను.

Updated Date - 2023-07-30T13:21:50+05:30 IST