OHRK MSK Prasad: నా హయాంలోనే రాయుడి రీఎంట్రీ

ABN , First Publish Date - 2023-06-19T03:25:10+05:30 IST

పది, పదకొండేళ్ల నుంచే క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టా. క్రికెట్‌ తప్ప మరోటి తెలియదన్నట్టుగా సాగుతోంది. ఇందులోనే కొనసాగుతున్నా...

OHRK MSK Prasad: నా హయాంలోనే రాయుడి రీఎంట్రీ

‘వరల్డ్ కప్ ’లో అతడికి అన్యాయం చేయలేదు

సచిన్, ధోనీ, కోహ్లీ గొప్పోళ్లు

అలా చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికయ్యా

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఎమ్మెస్కే ప్రసాద్‌

ఆర్కే: నమస్తే ప్రసాద్‌..ఎలా ఉన్నారు? క్రికెట్‌ప్రయాణం ఎలా సాగుతోంది?

ఎమ్మెస్కే: పది, పదకొండేళ్ల నుంచే క్రికెట్‌ ఆడడం మొదలుపెట్టా. క్రికెట్‌ తప్ప మరోటి తెలియదన్నట్టుగా సాగుతోంది. ఇందులోనే కొనసాగుతున్నా.

ఆర్కే: అసలు మీకు క్రికెట్‌పై ఆసక్తి ఎలా కలిగింది?

ఎమ్మెస్కే: మాది గుంటూరు. ప్రస్తుత బ్యాడ్మింటన్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ కుటుంబం అక్కడే ఉండేది. వాళ్ల కుటుంబంలోని అన్నదమ్ములంతా క్రికెట్‌ ఆడేవారు. నా స్కూల్‌ అయిపోయాక ప్రతిరోజు వాళ్లు ఆడే గ్రౌండ్‌ దగ్గరకొచ్చి చూసేవాణ్ణి. దీంతో వాళ్లు నన్ను కూడా ఆడమన్నారు. నువ్వేం చేస్తావంటే, వికెట్‌ కీపింగ్‌ చేస్తా అన్నా. ఆరోజు నుంచి నేను రిటైరయ్యేదాకా వికెట్‌ కీపింగ్‌ చేశా. తర్వాత బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో పూర్ణచంద్రరావు అనే కోచ్‌ దగ్గర జాయినయ్యా. నా గురించి ఆయన అప్పటి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నెక్కంటి వెంకట్రావుకు ఫోన్‌ చేశారు. ఆరునెలలు తిరిగేసరికి అండర్‌-12 విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యా. అలా నా ప్రయాణం మొదలైంది. నా ఈ ప్రయాణంలో నెక్కంటి వెంకట్రావు, చాముండేశ్వర్‌నాథ్‌ నాకు ఎంతో తోడ్పాటు అందించారు.

ఆర్కే: మరెందుకు అర్ధంతరంగా కెరీర్‌ ముగిసింది?

ఎమ్మెస్కే: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో నేను, వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఓపెనింగ్‌ చేశాం. ఆ మ్యాచ్‌లో వెన్నుకు గాయమైంది. దాదాపు 9నెలలు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మళ్లీ రెండేళ్ల తర్వాత పునరాగమనం చేసి ఇండియా-ఎ జట్టు దాకా వచ్చాను. అప్పుడే ధోనీలాంటి వాళ్లు జట్టులోకి వచ్చి వాళ్ల స్థానాలను పదిలం చేసుకోవడంతో నా రీఎంట్రీ కష్టమైంది.

ఆర్కే: క్రికెట్‌ అంటే రిచ్‌మన్‌ గేమ్‌ అంటారు కదా!

ఎమ్మెస్కే: అలా అనుకుంటారు కానీ, ఇది నిజం కాదు. ధోనీ, సిరాజ్‌ లాంటి వాళ్లు కిందిస్థాయి నుంచి వచ్చి పైకెదిగిన వాళ్లే. సచిన్‌ కూడా ముందునుంచి ధనవంతుడేమీ కాదు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి క్రికెట్‌లో ఉన్నతస్థాయికి వెళ్లినవాడే.

ఆర్కే: కేరళ మినహాయిస్తే, అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్‌లో జట్లున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు లేకపోవడానికి కారణమేంటి?

ఎమ్మెస్కే: దక్షిణ భారతదేశంలో తమిళనాడుకు చెన్నై సూపర్‌కింగ్స్‌, కర్నాటకకు బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్లున్నాయి. ఇక ఈశాన్యాన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఒక్కటే ఉంది. ఐపీఎల్‌ జట్టు అనేది ఫ్రాంచైజీ నుంచి కానీ, ప్రాంతం తరపున కాదు. ఆమధ్య రెండు కొత్త జట్లను ప్రవేశపెట్టినప్పుడు శరత్‌చంద్రా రెడ్డి కూడా 3,500 కోట్లకు బిడ్‌ వేశారు. కానీ, ఎక్కువ కోట్‌ చేసిన వేరేవాళ్లకు ఆ జట్లు వెళ్లాయి. ఒకదశలో వైజాగ్‌, అమరావతి అన్న పేరుతో ఫ్రాంచైజీ వస్తుందన్న టాక్‌ నడిచింది.

Untitled-5.gif

ఆర్కే: ఐపీఎల్‌ అంటే సరిహద్దులు లేవు, దేశాలు లేవు. విజయవంతంగా ఆ లీగ్‌ను కమర్షియల్‌ చేశారు.

ఎమ్మెస్కే: ఇది కచ్చితంగా కమర్షియల్‌ టోర్నమెంట్‌.ఇలాగే ఉంటే కొన్నిరోజులకు బీసీసీఐ కూడా చచ్చిపోతుంది.

ఆర్కే: అంతర్జాతీయ టెస్టులకు మనుగడ ఉండదేమో!

ఎమ్మెస్కే: ఇది కరెక్ట్‌ పాయింట్‌. ఫుట్‌బాల్‌లో ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌నే తీసుకుంటే ఆటగాళ్లంతా తమ దేశాలకు ఆడడం కంటే కూడా ఆ లీగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే జాతీయ జట్టుకు ఆడితే ఒక్క రూపాయి వస్తే, ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొంటే వంద రూపాయలు ఇస్తారు.

ఆర్కే: ఇదంతా డబ్బు మహిమ. ఆటగాడికీ, కొనేవాడికీ డబ్బే ప్రధానం.

ఎమ్మెస్కే: బీసీసీఐ దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్‌ చేయాలి. లేదంటే భవిష్యత్‌లో ద్వైపాక్షిక సిరీ్‌సలుండవు. ఆ సిరీ్‌సలను చూసేవాళ్లుండరు. స్పాన్సర్‌ చేసే వాళ్లుండరు. నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఎక్కువ మ్యాచ్‌లైపోయాయి. ఆటగాళ్లంతా రోబోల్లా అనిపిస్తున్నారు.

ఆర్కే: మొన్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చిత్తుగా ఓడిపోయాం కదా!

ఎమ్మెస్కే: విరామం లేకుండా మన ఆటగాళ్లు ఆడుతూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు ఓడిపోం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు కొంత సమయం ఉండి కౌంటీలాంటి మ్యాచ్‌లాడివుంటే జట్టుకు ఆ పరిస్థితి ఉండేది కాదు.

ఆర్కే: సచిన్‌ టెండూల్కర్‌తో మీ అనుభవం ఎలాంటిది?

ఎమ్మెస్కే: ఒకసారి సచిన్‌, నేను కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రికెట్‌ జట్టుకు ఎంపికయ్యాం. అప్పుడు నేను జట్టులో పదేపదే సచిన్‌ను చూసేవాడిని. ఎందుకలా చూస్తున్నాడని నా ఫ్రెండ్‌ రోహన్‌ గవాస్కర్‌ను కనుక్కోమని చెప్పాడట. సాధారణ ఊరు నుంచి వచ్చి రోల్‌మోడల్‌ లాంటి వ్యక్తితో కలిసి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నానంటే నాకు ఆశ్చర్యమేస్తోందని రోహన్‌తో చెప్పా. ఇదే విషయాన్ని రోహన్‌ ద్వారా విన్న సచిన్‌ నా దగ్గరకి వచ్చి భుజంపై చేయి వేసి.. ఎమ్మెస్కే.. నేను జట్టులోకి ముందొచ్చాను, నువ్వు తర్వాత వచ్చావు అంతే, అందరం ఒక్కటే అని అన్నాడు. ఓ రోజు సచిన్‌ ఫోన్‌ చేసి డిన్నర్‌కెళ్దామా అన్నాడు. రాత్రి 7.30కు రెడీగా ఉండమన్నాడు. సచిన్‌ పిలిచాడు కదా అని ముందే సిద్ధమైపోయా. కానీ, అంతకంటే ముందే సచిన్‌ అక్కడ ఉన్నాడు. అతను కారులో కాకుండా నడుచుకుంటూ వెళ్దామనడంతో ఆశ్చర్యపోయా. అలాగే ఐదు కిలోమీటర్ల దాకా మలేసియా వీధుల్లో నడుచుకుంటూ వెళ్లాం. అంత గొప్ప ఆటగాడైనా నిరాడంబరంగా ఉంటాడు.

Untitled-6.gif

ఆర్కే: విరాట్‌ కోహ్లీ కోపిష్టి అంటారు కదా?

ఎమ్మెస్కే: విరాట్‌లో రెండు రూపాలుంటాయి. ఒకరకంగా అపరిచితుడులాంటోడు. అతనికి ఓసీడీ ఉంది. విరాట్‌ ఎంత శుభ్రంగా ఉంటాడో అతని రూమ్‌కెళ్తే తెలుస్తుంది. చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. ఒకప్పుడు తన కుటుంబం ఇంటికి అద్దె కట్టలేని స్థితిని చూశాడు. అందుకే ఎప్పుడూ కసితో ఉంటాడు. ఓ రోజు నా రూమ్‌కొచ్చి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడు. ఒక దశలో అండర్‌-19 వరల్డ్‌క్‌పతో పాటు వరుస టోర్నమెంట్లు నెగ్గి సక్సెస్‌ మీదున్నప్పుడు అన్ని చెడు అలవాట్లకు బానిసయ్యాడు. రాత్రిళ్లు పార్టీకెళ్లేవాడు. బాగా లావెక్కాడు కూడా. దీంతో విరాట్‌ అప్పటికే ఫామ్‌లేమితో జట్టునుంచి ఉద్వాసనకు గురయ్యే పరిస్థితిలో ఉన్నాడు. ఈ సమయంలో ఆస్ట్రేలియాలో శ్రీలంకపై భారత జట్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్‌ అద్భుతంగా ఆడాడు. ఆరోజు ఎందుకో తనను తాను ప్రశ్నించుకున్నాడు. అద్దం ముందు నిలబడి తానెక్కడి నుంచి వచ్చాడు, ఎందుకిలా ఉన్నానని తనను తాను తర్కించుకొన్నాడు. తప్పు తెలుసుకొని పూర్తిగా ఆటపైనే ధ్యాస పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఫలితం రాబట్టాడు. ఇప్పుడు ఎండార్స్‌మెంట్ల ద్వారానే రూ. 200 కోట్లు సంపాదిస్తున్నాడంటే అతను ఏస్థాయికి ఎదిగాడన్నది అర్థం చేసుకోవచ్చు. విరాట్‌కు భార్య అనుష్క అదనపు బలం.

ఆర్కే: ధోనీ గురించి ఏం చెబుతారు?

ఎమ్మెస్కే: ఓసారి బంగ్లాదేశ్‌ పర్యటనలో ధోనీ రాత్రిపూట జిమ్‌ చేస్తూ పడిపోవడంతో వెన్నునొప్పికి గురయ్యాడు. రెండ్రోజుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఉంది. వెంటనే బ్యాకప్‌ కీపర్‌గా పార్థివ్‌ పటేల్‌ను కూడా పిలిపించాం. కానీ, ధోనీ మాత్రం ఎలాంటి గాభరా పడలేదు. శరీరంపై లెదర్‌ బెల్టులు కట్టుకొని ఆరోజు మ్యాచ్‌ ఆడాడు. చాంపియన్లు అంటే ఇలాగే ఉంటారు. నాలుగేళ్ల క్రితం ఓరోజు జార్ఖండ్‌లో ధోనీ ఇంటికెళ్తే మా అందరికీ అందమైన కప్పుల్లో టీ ఇచ్చాడు. అతను మాత్రం చాయ్‌బండివారిచ్చే గాజు గ్లాసులో తాగాడు. ఎందుకు గాజు గ్లాసులో తాగుతున్నావు అని ధోనీని అడిగితే.. ఈ గాజు గ్లాసులో తాగిన ప్రతిక్షణం నేను ఎక్కడి నుంచి వచ్చానన్నది గుర్తొస్తుంది అని సమాధానమిచ్చాడు.

ఆర్కే: క్రికెటర్‌గా గొప్ప కెరీర్‌ లేకపోయినా, చీఫ్‌ సెలెక్టర్‌గా ఎమ్మెస్కేను ఎంపిక చేయడం వెనుక అదృశ్యహస్తముందన్న విమర్శలపై ఏమంటారు?

ఎమ్మెస్కే: ఆంధ్ర క్రికెట్‌ సంఘంలో నేను చాలా మార్పులు తీసుకొచ్చా. వీటిని ఎప్పటికప్పుడు బీసీసీఐకి నివేదించేవాడిని. నా సేవలను అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ సహా బోర్డు సభ్యులు గుర్తించారు. నన్ను సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. అంతేగానీ, చంద్రబాబు నాయుడుగారో, లేదంటే వెంకయ్య నాయుడుగారో రెకమెండ్‌ చేయడం వల్ల నాకు ఆ పదవి దక్కలేదు.

ఆర్కే: సొంత రాష్ట్ర ఆటగాడైన అంబటి రాయుడుకు మీరు అన్యాయం చేశారన్న వార్తలపై స్పందనేంటి?

ఎమ్మెస్కే: దీని గురించి నేను ఇప్పటిదాకా ఎక్కడా మాట్లాడలేదు. కానీ, వాస్తవమేంటో ఇప్పుడు చెప్తున్నా. ఒక ఆటగాడిని ఎంపిక చేసేటప్పుడు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గా నాతో పాటు కోచ్‌, కెప్టెన్‌ అంతా కూర్చొంటారు. నా కులంవాడనో, నా రాష్ట్రం వాడనో ఒకరిని ఎంపిక చేయడం కుదరదు. అయినా ఎవ్వరికీ తెలియని విషయం చెబుతా.. నాలుగేళ్ల క్రితం వన్డే వరల్డ్‌క్‌పనకు ముందు రాయుడును జట్టులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అతనితో మాట్లాడాలనుకున్నా. అయితే, అతను ఫోన్‌ వాడడు. దీంతో నాకు తెలిసిన మీడియా మిత్రుల ద్వారా రాయుడు కుటుంబం ఫోన్‌ నెంబర్‌ తీసుకొని అతనితో మాట్లాడా. నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు హాజరవ్వమని రాయుడుకు చెప్పా. అందులో అతను ఫెయిలయ్యాడు. వెంటనే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉండమని చెప్పి అక్కడి ట్రైనర్లతో మాట్లాడి మళ్లీ ఫిట్‌నెస్‌ మెరుగుపరచుకునేలా చేసి ఇండియా-ఎ జట్టులో ఆడేలా చేశా. రాయుడుపై నాకు ప్రత్యేక శ్రద్ధ ఉండబట్టే కదా ఇదంతా చేసింది. ఓ ఆటగాడి కోసం మరే సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ అయినా ఇలా చేశాడా? ఇవన్నీ ఎవరికీ తెలియవు. రాయుడుకు కూడా నా గురించి తెలుసు. ఆ విషయంలో అతను నన్నెప్పుడూ వ్యక్తిగతంగా దూషించలేదు కూడా. నేను కమిటీ చైర్మన్‌గా అయ్యాకే రాయుడు పునరాగమనం చేశాడన్న విషయం అందరూ తెలుసుకోవాలి. ఆ వరల్డ్‌క్‌పలో రాయుడును కాదని విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడానికి అతను ఆల్‌రౌండర్‌ కావడమే కారణం. రాయుడు విషయంలో నేనేం చేశానన్నది ఈ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ స్పష్టత వచ్చిందనుకుంటున్నా.

ఆర్కే: మీరు కోచింగ్‌ సెంటర్‌ పెట్టారనుకుంటా..

ఎమ్మెస్కే: హైదరాబాద్‌లో కోచింగ్‌ సెంటర్‌ పెట్టా. నా అకాడమీలో 80 మంది దాకా చిన్నపిల్లలున్నారు. ప్రాథమిక దశలోనే వాళ్లకు సరైన పునాది వేయగలిగితే అద్భుత ఫలితాలు వస్తాయన్నది నమ్ముతా. అందుకే చిన్నపిల్లలకు శిక్షణ ఇస్తున్నా.

ఆర్కే: భవిష్యత్‌లో తెలుగు రాష్ట్రాల తరపున మీ నుంచి అద్భుతమైన క్రికెటర్లు రావాలని కోరుకుంటూ... థాంక్యూ.

Updated Date - 2023-07-30T13:52:13+05:30 IST