OHRK Naginidu: నాకు ఫేస్‌ వాల్యూ లేదు.. వాయిస్‌ వాల్యూ ఉంది!

ABN , First Publish Date - 2023-02-27T00:23:16+05:30 IST

ఇది లేటెస్ట్‌.. ఫంక్షనింగ్‌ మాత్రం పాతవే. నేను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటా. బాగలేని దానిని సరిచేస్తుంటా.

OHRK Naginidu: నాకు ఫేస్‌ వాల్యూ లేదు.. వాయిస్‌ వాల్యూ ఉంది!

సీరియ్‌సగా ఉండే హుందాతనం పాత్రలకు ఈ నటుడు పెట్టింది పేరు. ఆయనే.. నాగినీడు. హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ ల్యాబ్‌లో అడ్మినిస్ర్టేటర్‌గా ఇరవయ్యేళ్లపాటు పని చేసి.. ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంతో తొలిసారి తెరమీదకు వచ్చి ‘మర్యాదరామన్న’తో పాపులరయ్యారు. బిజీ ఆర్టిస్ట్‌ అయ్యారు. నాగినీడు సినిమాతో పాటు జీవిత విశేషాలను ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో చెప్పుకొచ్చారిలా..

ఆర్కే: చేతికి ఉండేవన్నీ చూస్తుంటే.. మీకు నమ్మకాలున్నాయా?

నాగినీడు: ఇది లేటెస్ట్‌.. ఫంక్షనింగ్‌ మాత్రం పాతవే. నేను ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటా. బాగలేని దానిని సరిచేస్తుంటా. నా పద్ధతులు సనాతన ధర్మం ప్రకారం మన పెద్దలు నేర్పించిన వాటిని ముందుకు తీసుకెళ్లటం. నేను చెప్పేది చెబుతా. ఎవరైనా తప్పు చెబితే ఖండిస్తాను. చెప్పే విధానం లాజికల్‌గా ఉంటుంది. ఒక రోజు కృష్ణగారిని కలవటానికి ఆఫీసుకు వెళ్లాను. ఆయనతో మాట్లాడాక పక్కరూమ్‌కి వెళ్లా. ఆ రూమ్‌లోకి వచ్చి అట్నుంచే వెనక్కి వెళ్తారా ఆయన? అది కరెక్టు కాదు కదా’ అని కృష్ణగారి దగ్గర ఉండే మల్లయ్యను అడిగాను. ‘బాబ్బాబూ ఆ విషయం ఆయనకు చెప్పండి’ అన్నారాయన. కృష్ణగారి దగ్గరకు వెళ్లి ‘సార్‌.. మీకు వాస్తు చెప్పటం లేదు. మీకో విషయం చెప్తా. నైరుతిలో బెడ్‌రూమ్‌, ఆగ్నేయంలో కిచెన్‌, వాయువ్యంలో పిల్లల బెడ్‌రూమ్‌, ఈశాన్యంలో హాల్‌ ఉందనుకుందాం. మీరు పొద్దున్నే బయలుదేరేప్పుడు మీ భార్య మీరు పనికెళ్తున్నారా? అని చూస్తుంది. మీరు పిల్లలు బడికెళ్లారా? అని చూసుకుంటారు. ఆఫీసుకెళ్లి తిరిగి వచ్చాక పిల్లలు వచ్చారా? అని చూసుకుని మీ ఆవిడకు కనపడతారు. మీ రూమ్‌కి వెళ్తారు. ఈ కంపెనీకి బలం మీది. మీ ఆశీర్వాదం. మీరు వెనకనుంచి వచ్చి వెనకనుంచి వెళ్లిపోతే ఎలా?. వచ్చేప్పుడు ముందునుంచి రండి.. అందరినీ చూడండి. వెళ్లేప్పుడు అందరినీ ఓ లుక్కేసి వెళ్లిపోండి. ఇదే వాస్తండి’ అన్నాను. ఆయన రెండు రోజుల తర్వాత నేను చెప్పిందే చేశారని.. మల్లయ్యగారు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ తర్వాత ‘గృహప్రవేశానికి ప్రత్యేకంగా మిమ్మలను పిలవమని కృష్ణగారు చెప్పార’ని.. విజయనిర్మలగారు ఫోన్‌ చేశారు. వాళ్ల ఇంటికి వెళ్తే కృష్ణగారే ఇళ్లంతా చూపించారు. ఓ విషయం లాజికల్‌గా చెబితే ఇలా ఉంటుంది.

ఆర్కే: ఇలా చెప్పటం వల్ల ఇండస్ర్టీలో ఇబ్బంది కదా..

నాగినీడు: ఎదుటివాళ్లు ఇబ్బంది పడతారు, ఫీలవుతారు అంటే వాళ్లకు నష్టం. నా నష్టం కాదు కదా! కర్మసిద్ధాంతం నమ్ముతాను. నాకు ఎవరూ మార్గం చూపించరు, అవకాశాలు చూపించరనే భయం ఉండదు.

ఆర్కే: ఆలస్యంగా గుర్తింపొచ్చింది. ‘మర్యాదరామన్న’లో రామినీడు పాత్రకి మాటలు తక్కువ.. యాక్షన్‌ ఎక్కువ..!

నాగినీడు: వాస్తవానికి అది నా ఒరిజనల్‌ క్యారెక్టర్‌. పెరిగింది రాయలసీమ. క్యారెక్టర్‌ కూడా అదే. మర్యాద ఇస్తే చాలా ఇస్తా. ఇంత తేడా చేసినా తేడా కూడా చాలా ఉంటుంది. అదృష్టమేంటంటే రాజమౌళిగారు నాలోని ప్రతిభను బయటకు తీశారు.

ఆర్కే: క్యారెక్టర్‌ ఇవ్వడానికి కారణంమేంటి..

నాగినీడు: అప్పటికే ‘పల్లికుడమ్‌’ అనే తమిళ చిత్రంలో ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేశా. 2008 ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి ప్రింట్‌ వచ్చింది. మా ఎడిటర్‌ రాజమౌళి గారికి ఆ సినిమా చూపించారు. ఆయన మంచి క్యారెక్టర్‌ ఇస్తానని చెప్పమన్నారట.

ఆర్కే: ఇన్‌బిల్ట్‌ టాలెంట్‌ ఉంది ఎక్కడో..

నాగినీడు: అది కనిపెట్టింది బెల్లంకొండ సురేష్‌. ఒకరోజు మీరెందుకు చేయకూడదు? అన్నారాయన. ‘మీరు క్యారెక్టర్‌ ఇస్తే చేస్తాను’ అన్నాను. ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంలో పొలిటీషన్‌ పాత్రను ఇచ్చారాయన.

ఆర్కే: మీ నేపథ్యం ఏంటీ..

నాగినీడు: మా అమ్మకు ఎల్వీప్రసాద్‌గారి భార్య మేనత్త అవుతుంది. మానాన్నగారు కాంగ్రెస్‌ పార్టీలో ఉండి 11 ఎకరాలు కరిగించేశారు. నెహ్రూ చనిపోయాక పాలిటిక్స్‌ విరక్తిపుట్టి బయటకు వచ్చారు. ఎల్వీప్రసాద్‌గారు గుంతకల్‌లో సినిమాహాల్‌ కట్టారు. మానాన్నగారిని అక్కడకు పంపించారు. తొమ్మిదో తరగతినుంచే టిక్కెట్లు ఇవ్వడం, బ్లాక్‌ టిక్కెట్‌ తీసుకునేవాళ్లను కొట్టడం చేసేవాణ్ని. ఒకసారి రోడ్డులో తప్పు జరుగుతోంటే ఖండించాను. నేను లీడ్‌ చేస్తున్నానని కానిస్టేబుల్స్‌ స్టేషన్‌కి తీసుకెళ్లారు. రౌండప్‌ చేశారు. ఆ క్షణంలో సీఐగారు వచ్చి ‘మేము ఎందుకు ఉన్నాము? మా పని నువ్వు చూస్తే ఎలా? ఈ వయసులో నువ్వు రాంగ్‌ రూట్‌కి వెళ్లేట్లున్నావు. రాంగ్‌రూట్‌కి వెళ్లి తప్పు చేసి సఫర్‌ అవుతావా? లేదా మంచిరూట్‌లో వెళ్లి పదిమందికి సాయపడతావా? ఆలోచించుకో’ అన్నారు.

ఆర్కే: ఇది ఏ వయసులో..

నాగినీడు: నాకప్పుడు పదిహేడేళ్లు. తెలీని వయసులో భయం లేకుండా చేశాను అలా. సీఐగారి వల్ల జ్ఞానోదయం వచ్చింది. ఇకపోతే మానాన్నగారు పేరు బ్రహ్మయ్య చౌదరి. ఎనిమిదో తరగతి చదివారు. అప్పట్లో ఇంగ్లీషు పత్రిక చదివేవారు.నన్ను ‘పండితపుత్ర పరమ సుంఠహా’ అనేవారు. నేను తెలుగులో ఫెయిలయ్యేవాన్ని. చదువు వచ్చేది కాదు. మనకెప్పుడూ ఎన్టీయార్‌,ఏఎన్నార్‌ కలలుండేవి. నాకు ఇంపార్టెంట్‌ కొశ్చన్స్‌ ఇచ్చినా 35 మార్కులు వచ్చాయి. దీంతో మా తెలుగుపండితుడు ‘గబ్బునాయలా’ అని తిట్టారు. పన్నెండో తరగతిలో తెలుగులో ఫెయిలయ్యా. ఆ తర్వాత చెన్నైలో నన్ను పాలిటెక్నిక్‌ చదివించారు నాన్న. కెమికల్‌ టెక్నాలజీలో ఉద్యోగం చేశా. ఆ తర్వాత మా మేనమామ వల్ల ప్రసాద్‌ ల్యాబ్‌లో చేరా. అప్పటికి ముందు దుబాయ్‌లో పెట్రో కెమికల్‌ ఉద్యోగం చేయాలని కలలు కనేవాన్ని. సినిమా అవకాశం అని ఇటొచ్చా. పెళ్లి తర్వాత ప్రసాద్‌ ల్యాబ్స్‌ ఇండియా అంతా ఎస్టాబ్లిష్‌ చేసేపుడు పని చేశా. బిజీగా ఉండేవాన్ని. రాఘవేంద్రరావు, కృష్ణ, కృష్ణంరాజుగారు లాంటి పెద్దవాళ్లు వచ్చినా ఎవరినీ అవకాశాలు అడగలేదు. కానీ లోపల మాత్రం నటించాలని ఉండేది. వాస్తవానికి అక్కినేనిగారి ‘పూలరంగడు’ చూసినప్పుడే నటించాలనే కోరిక పుట్టింది.

ఆర్కే: ప్రసాద్‌ ల్యాబ్‌లో ఎలా ఉండేది.

నాగినీడు: ల్యాబ్‌లో ఎన్నో విషయాలు ఆలోచించి పర్సనల్‌ లైఫ్‌లో సఫర్‌ అయ్యా. రమే్‌షగారి మీద కోపం వచ్చి సొంత వ్యాపారాలు పెట్టి నష్టపోయా. ఇది కూడా పాజిటివ్‌గా తీసుకుంటా.

ఆర్కే: వేరే వాళ్లకు సహాయపడ్డారు. అదే డబ్బు మీకు దొరకలేదు..

నాగినీడు: మనం వ్యవహారికంగా ఏంటి? పర్సనల్‌గా ఏంటీ? అనేది గుర్తించాలి. డబ్బులు ఎలాగొలా సంపాదిస్తే హ్యాపీగా ఉండలేవంటా.

ఆర్కే: ప్రసాద్‌ల్యాబ్‌లో తొలిప్రేక్షకుడు మీరే కదా..

నాగినీడు: తొలికాపీ వస్తూనే రీల్‌ బై రీల్‌ చూసేవాణ్ని. ‘శంకరాభరణం’ చూశాక ఏడిద నాగేశ్వరరావు డల్‌గా ఉన్నారు. ‘శంకరా నాద..’ పాట చాలండీ. ‘గుండమ్మ కథ’ తర్వాత ఇదేనండి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుతో ఇలా చేయటం కష్టమన్నా. ‘శ్రీవారి ప్రేమలేఖ’, ప్రేమాభిషేకం’.. ఇలా చాలా సినిమాలు చూసి హిట్‌ అవుతాయని చెప్పాను. మద్రా్‌సనుంచి హైదరాబాద్‌కు వచ్చాక ట్విస్ట్‌ చేసి చెప్పేవాన్ని. అడ్మినిస్ర్టేర్‌ అయ్యాక బయటకి ఏమీ చెప్పలేదు.

ఆర్కే: మీకు వచ్చిన పేరుకు ప్రొడ్యూసర్స్‌ లైన్‌ కట్టి ఉండాలే..

నాగినీడు: కొందరు ప్రొడ్యూసర్స్‌ వచ్చి అడిగేవారు.. ఫలానా తమిళ సినిమా ఎలా ఉందని. ఎవరు ఏ ఆఫరు ఇచ్చినా తీసుకోలేదు. ఒకతనికి ఫైనాన్స్‌ ఇప్పించా. ఆయన వచ్చి కమీషన్‌ ఇస్తానన్నారు. కంపెనీ మాది.. ఎందుకండీ అన్నాను. ఇదీ నా పద్ధతి.

ఆర్కే: మీరు ఆర్థికంగా స్థిరపడ్డారా..

నాగినీడు: ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నా. మా అబ్బాయిలు ఇద్దరూ ఇంజనీరింగ్‌ చదువుకోవడానికి వెళ్లినపుడు.. మా ఆవిడకు ఒక కలర్‌ల్యాబ్‌ పెట్టించి అక్కడే ఉండమన్నా. పదో తరగతి కూడా చదవని ఆమె ‘వ్యాపారం తెలీదు’ అన్నది. ‘సీరియల్స్‌ చూసి కన్నీళ్లు పెట్టి బాధపడే బదులు.. వచ్చిన డబ్బు గల్లాపెట్టెలో వేసుకో. ఎవరైనా డబ్బులు అడిగితే నన్ను అడగమను’ అన్నాను. ఆ తర్వాత కలర్‌ల్యాబ్స్‌ పోయాక పార్టీస్టోర్‌ పెట్టాము. బర్త్‌డే ఫంక్షన్స్‌కి కావలసిన వస్తువులు అమ్ముతాం. అబ్బాయిలు ఇద్దరూ అమెరికా వెళ్లారు. రెండోవాడు అక్కడ నచ్చక ఇక్కడికే వచ్చాడు.

ఆర్కే: మీ పనులు మీరే చేసుకుంటారంట కదా..

నాగినీడు: నా కార్‌ నేనే డ్రైవ్‌ చేస్తా. నా కార్‌ నేను కడుగుతా. ఇంట్లో పనులు చేసుకుంటే సరి మనం ఫిట్‌గా ఉంటాం. పని అంటే.. మీకో విషయం చెప్పాలి. ముంబైలో ఉన్నప్పుడు.. ఒక రోజు రాత్రి శబ్దాలు వస్తున్నాయి. అక్కడ చూస్తే 75 ఏళ్లుండే ఎల్వీ ప్రసాద్‌గారు బట్టలు ఉతుక్కుంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే.. ఫిట్‌నె్‌సకోసం ఇలా చేస్తున్నానన్నారు. భోజనం కోసం దూరంగా నడిచి వెళ్లేవారు. ఎవరైనా తెస్తారు కదా అంటే.. సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి కదా! అనేవారాయన.

ఆర్కే: మీ విలక్షణ వ్యక్తిత్వానికి, ఇండస్ర్టీకి పొసగదే..

నాగినీడు: నేను ఒకరి దగ్గర పని చేయలేను. నేనే రాజు నేనే మంత్రి. నా లోపం తెలుసు కాబట్టి హైయ్యర్‌ ప్యాకేజీలకు వెళ్లలేదు. వెళ్లలేదని రిగ్రెట్‌ కూడా లేదు.

ఆర్కే: క్యారెక్టర్‌ ఆర్టిస్టులు చేసిన క్యారెక్టర్స్‌ చేస్తుంటారు. చిన్న ఇబ్బంది వస్తే రోడ్డున పడిపోతారు?

నాగినీడు: కొందరు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు తెలీని నిర్మాణరంగంలోకి వెళ్లి ఇబ్బందులు పడతారు.

ఆర్కే: మీకు ఈ గాంభీర్యం ఎలా వచ్చింది..

నాగినీడు: నాకు ఫేస్‌ వాల్యూ లేదు. వాయిస్‌ వాల్యూ ఉంది. సైలెంట్‌గా ఉంటే రామినీడు పాత్రలా కనిపిస్తా. మనుషులకు దూరం అయిపోతా. మాట్లాడితేనే ప్లస్‌ నాకు.

ప్రసాద్‌ ల్యాబ్‌లో పని చేసేప్పుడు సినిమాను సేవ్‌ చేయాలని అనుకుండేవాన్ని. సినిమా ఆగిపోతే నమ్ముకున్నవాళ్లు ఇబ్బందులు పడతారని.. సామరస్యంగా మాట్లాడేవాన్ని. ఒకరకంగా పంచాయితీలనమాట. నిర్మాతలు డబ్బులు ఇవ్వకున్నా మంచి సినిమా అయితే.. సినిమా రిలీజ్‌ చేసిన సందర్భాలున్నాయి. ఆ తర్వాత డబ్బులు రాబట్టేవాళ్లం.

మామూలు కోపం రాదు నాకు. కొన్ని సందర్భాల్లో కొందరిని కొట్టడానికి వెళ్లిపోయి వివరణ ఇచ్చేవాన్ని. అయితే ఎక్కడా నా కోపాన్ని మిస్‌యూజ్‌ చేయలేదు. ఇకపోతే గోల్స్‌ విషయానికొస్తే.. సినిమాకు సంబంధించిన ఆలోచనలున్నాయి. సేంద్రీయ వ్యవసాయం చేయాలని ఉంది.

Updated Date - 2023-02-28T19:25:25+05:30 IST