ఇన్‌ఫెక్షన్లు రక్తంలో కలిస్తే?
ABN , First Publish Date - 2023-09-05T00:03:03+05:30 IST
రక్తంలోకి ఇన్‌ఫెక్షన్ ప్రవేశిస్తే, ఆ పరిస్థితిని సెప్సి్‌సగా పరిగణించాలి. ఈ ఇన్‌ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు.....
జబ్బు పడిన అవయవానికి చికిత్స అందకపోతే, ఆ ఇన్‌ఫెక్షన్ రక్తంలోకి చేరుకుంటుంది.
అదే ‘సెప్సిస్’. ఈ సమస్యను అలక్ష్యం చేయకుండా సమర్థమైన చికిత్సతో సరిదిద్దుకోవాలి.
ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలిసి, రక్తం ద్వారా మరొక అవయవాన్ని దెబ్బ తీస్తుంది. అలా ఒక ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల రెండు, మూడు అవయవాలు దెబ్బతిని ‘మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్’ ప్రమాదం కూడా తలెత్తుతుంది.
రక్తంలోకి ఇన్‌ఫెక్షన్ ప్రవేశిస్తే, ఆ పరిస్థితిని సెప్సి్‌సగా పరిగణించాలి. ఈ ఇన్‌ఫెక్షన్ ఎవరికైనా రావచ్చు. అయితే రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవాళ్లలో, మధుమేహుల్లో, మద్యపానం ఎక్కువగా తీసుకునేవాళ్లలో, కాలేయ జబ్బులున్నవాళ్లలో, కేన్సర్ రోగుల్లో సెప్సిస్ కనిపిస్తూ ఉంటుంది. సెప్సిస్... మైల్డ్, మోడరేట్, సివియర్ ఈ మూడు రకాల్లో ఉండవచ్చు. తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌ను యాంటిబాయాటిక్స్‌తో నయం చేసుకోవచ్చు. మోడరేట్ సెప్సి్‌సను ఇంట్రావీనస్ ఇంజెక్షన్లతో నయం చేసుకోవచ్చు. రక్తంలో ఇన్‌ఫెక్షన్ తీవ్ర స్థాయికి చేరుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. కాబట్టి పరిస్థితి విషమించకుండా ఉండడం కోసం ఐసియులో ఉంచి సెలైన్ ద్వారా ద్రవాలను అందించవలసి ఉంటుంది. అలాగే ఇన్‌ఫెక్షన్ సోకిన అవయవాన్ని బట్టి అదనపు చికిత్సలను కూడా కొనసాగించవలసి ఉంటుంది.
అవయవాల నుంచి రక్తంలోకి...
శరీర అంతర్గత అవయవాలకు ఇన్‌ఫెక్షన్ సోకి, తీవ్రమైనప్పుడు, ఆ ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలిసే అవకాశాలుంటాయి. రక్తంలో ఇన్‌ఫెక్షన్ ప్రధాన లక్షణం చలి జ్వరం. వాంతులు, విరోచనాలు కూడా ఉండవచ్చు. ఏ అవయవం నుంచి ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలుస్తోందో, ఆ అవయవం తాలూకు లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలిస్తే, చలిజ్వరంతో పాటు దగ్గు, ఆయాసం ఉండవచ్చు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలిస్తే చలిజ్వరంతో పాటు వాంతులు మొదలవుతాయి. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలిస్తే చలిజ్వరంతో పాటు మూత్రంలో మంట వేధిస్తుంది. మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్, రక్తంలోకి ప్రవేశించే అవకాశాలు 5 నుంచి 10 శాతం ఉంటాయి. చర్మ ఇన్‌ఫెక్షన్లు కూడా అరుదుగా ముదిరి రక్తంలోకి చేరుకుంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక అవయవంలో మొదలైన ఇన్‌ఫెక్షన్ రక్తంలో కలిసి, రక్తం ద్వారా మరొక అవయవాన్ని దెబ్బ తీస్తుంది. అలా ఒక ఇన్‌ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల రెండు, మూడు అవయవాలు దెబ్బతిని ‘మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్’ ప్రమాదం కూడా తలెత్తుతుంది.
పరీక్షలతో అంచనా
రక్త పరీక్షలు, బ్లడ్ కల్చర్ ద్వారా ఇన్‌ఫెక్షన్ తీవ్రతను అంచనా వేయవచ్చు. ఇన్‌ఫెక్షన్ సోకిన అవయవాన్ని బట్టి ఆయా అవయవాల పని తీరును తెలిపే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ లాంటివి చేయవలసి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ తీవ్రత మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. అయితే రక్తంలో ఇన్‌ఫెక్షన్ ప్రధాన లక్షణం చలి జ్వరం కాబట్టి దాన్ని సాధారణ జ్వరంగా పొరపాటు పడకూడదు. జ్వరం మాత్రలు వాడినా జ్వరం 100 డిగ్రీలకు మించి తగ్గకపోతున్నా, తగ్గినట్టే తగ్గి పెరిగిపోతున్నా, జ్వరంతో పాటు కండరాలు కదిలిపోతున్నంత చలి వేధిస్తున్నా, వాంతులు ఆగకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. చికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి, ఆరోగ్యం పుంజుకుంటారు.
నియంత్రణ ఇలా...
రక్తంలో ఇన్‌ఫెక్షన్ చేరిందంటే, అంతకంటే ముందు శరీరంలోని ఏదో ఒక అవయవానికి ఇన్‌ఫెక్షన్ చేరిందని అర్థం. కాబట్టి అవయవాలు ఇన్‌ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. సమతులాహారం తీసుకోవాలి. కంటి నిండా నిద్ర పోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుకోవాలి. 65 ఏళ్లు దాటిన వాళ్లు, మధుమేహులు, కిడ్నీలు ఫెయిల్ అయిన పేషెంట్లు వాళ్లు ఏడాదికోసారి ఫ్లూ, న్యుమోనియా వ్యాక్సిన్లు వేయించుకోవాలి.
డాక్టర్ సామ్రాగిణి వాశి రెడ్డి
జనరల్ ఫిజీషియన్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్