ఈ ఔషధ మొక్కలు భేష్
ABN , First Publish Date - 2023-02-21T23:13:37+05:30 IST
ఆధునిక ప్రపంచంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీని వల్ల అనేక శ్వాసకోశ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.....
ఆధునిక ప్రపంచంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీని వల్ల అనేక శ్వాసకోశ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి శ్వాసకోశ సమస్యలు రాకుండా ఉండటానికి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న కొన్ని మూలికలు...
అల్లం: అల్లంలో ఉండే ఔషధ గుణాల వల్ల శ్వాసకోశ వ్యవస్థలో కలిగే ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. మన శ్వాసకోశ నాళంలో ఉండే రకరకాల క్రిములను ఇది నిర్జీవం చేస్తుంది. అందుకే అల్లాన్ని ఆహారంలో తప్పనిసరిగా చేర్చమని నిపుణులు సూచిస్తున్నారు.
పిప్పర్‌మెంట్: పిప్పర్‌మెంట్ ఔషధ మొక్క వల్ల అనేక లాభాలున్నాయి. దీనిలో ఉండే మెంథాల్ గొంతుకు చల్లని అనుభూతిని కలగజేస్తుంది. అస్థమా, బ్రోంకైటిస్, సైన్‌సైటెస్ వంటి శ్వాసకోశ సమస్యలున్నవారికి ఇది మంచి ఔషధం. పిప్పర్‌మెంట్ నూనె కలిపిన ఆవిరి పీల్చటం వల్ల శ్వాసకోశ సమస్యలున్నవారికి స్వాంతన చేకూరుతుంది.
పసుపు: పసుపులో కుర్‌క్యుమిన్ అనే ఒక పదార్థముంటుంది. దీని వల్ల మన శ్వాసకోశ నాళంలో వచ్చే వాపు తగ్గుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతి రోజు ఆహారంలో పసుపును చేర్చమని సూచిస్తూ ఉంటారు.
తులసి: తులసి వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి. తులసిలో జింక్, విటమిన్ సిలతో పాటుగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. తులసి ఆకులకు క్రమం తప్పకుండా తిన్నా.. లేదా తులసిని నీటిలో ఉడకపెట్టి ఆ నీటిని తాగిన అనేక రకాల ప్రయోజనాలుంటాయి.