సార్‌ తల్లితండ్రులకు మేమిచ్చే కానుక!

ABN , First Publish Date - 2023-02-12T00:03:24+05:30 IST

విద్యావిధానం.. దానిలో ఉన్న లొసుగులు.. మన సమాజంపై వాటి ప్రభావం నేపథ్యంలో తెలుగులో చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి...

సార్‌ తల్లితండ్రులకు మేమిచ్చే కానుక!

విద్యావిధానం.. దానిలో ఉన్న లొసుగులు.. మన సమాజంపై వాటి ప్రభావం నేపథ్యంలో తెలుగులో చాలా తక్కువ చిత్రాలు వచ్చాయి. 90లలో ఉన్న విద్యావిధానంలోని సమస్యలను విశ్లేషించే చిత్రం ‘సార్‌’ త్వరలో విడుదలకానుంది. తమిళ సూపర్‌ స్టార్‌ ధనుష్‌ నటించిన ఈ చిత్ర నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నాగవంశీను ‘నవ్య’ పలకరించింది.

‘‘డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు.. కానీ చదువు మాత్రం సమాజంలో మర్యాద ఇస్తుంది. ఈ విషయాన్ని నేను గాఢంగా నమ్ముతా! అందుకే నాకు చదువుకున్నవారంటే గౌరవం. కానీ ఆ చదువు ఎలా ఉండాలి? అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ నేను చదువుకున్న రోజుల గురించి చెప్పాలి. 1990లలో మన దేశంలో .. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చిత్రమైన పరిస్థితి ఉండేది. పిల్లలకు చదువుకోవటానికి ఎంపీసీ, బైపీసీ తప్ప వేరే ఆప్షన్‌ ఉండేది కాదు. చాలా మందికి ఎంపీసీలో చేరాలి. ఎంసెట్‌ రాయాలి. ఇంజినీరింగ్‌ చేయాలి. యూఎస్‌ వెళ్లాలి. నేను కూడా ఈ పద్ధతిలోనే చదివా. అమ్మ పొలం అమ్మి నన్ను చదివించింది. అమ్మలాంటి లక్షల తల్లితండ్రులు తమ పిల్లల చదువుకోసం ఎంత కష్టపడతారో నాకు తెలుసు. అందుకే వారంటే నాకు చాలా గౌరవం. వాళ్ల కోణం నుంచి ఏదైనా సినిమా తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘సార్‌’. మన విద్యావిధానంలోని అనేక అంశాలను విశ్లేషిస్తూ తీసిన ఒక కమర్షియల్‌ సినిమా. మొదట ఈ సినిమాని అనుకున్నప్పుడు- రెండు భాషల్లో చెబితే బావుండుననిపించింది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ ద్వారా ధను్‌షను వెళ్లి కలిసాం. వెంటనే ఆయన ఈ సినిమా చేయటానికి అంగీకరించారు. సినిమా చాలా బాగా వచ్చింది. కొన్ని సీన్స్‌ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ సినిమా మేము తల్లితండ్రులకు ఇచ్చే కానుక. సాధారణంగా తల్లితండ్రులందరూ తమ పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటారు. వారి జీవితాలను ధారపోస్తారు. నాణ్యమైన విద్యను తమ పిల్లలకు అందించాలనుకొనే తల్లితండ్రులందరూ ఈ సినిమాకు కనెక్ట్‌ అవుతారు.

టాలీవుడ్‌ చోదక శక్తి...

టాలీవుడ్‌ ఇప్పటికీ హీరో ఆధారిత ఇండస్ట్రీనే! హీరోనే దీనికి చోదకశక్తి. హీరో ముఖం చూసే ప్రేక్షకుడు థియేటర్‌కు వస్తాడు. అందువల్ల హీరోకు ప్రాముఖ్యం ఉండేలాగే సినిమాలు తీస్తాం. ఈ పరిస్థితి ఇప్పుడప్పుడే మారుతుందని అనిపించటం లేదు. త్రివిక్రమ్‌, రాజమౌళి, సుకుమార్‌, బోయపాటిలాంటి కొద్ది మంది దర్శకులను చూసి సినిమాలకు వచ్చే ప్రేక్షకులు ఉన్నారు. కానీ ఇలాంటి దర్శకులు తక్కువ మందే కదా.. అందువల్ల ఏ సినిమాకైనా హీరోనే హీరో! ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. ఓటీటీ వారికి కొత్త రుచులు అందించింది. అయితే ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పుకోవాలి. ఓటీటీ వల్ల థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుందని అనుకున్నారు. అలా జరగలేదు. కొద్దిగానే తగ్గింది. సినిమా బావుంటే థియేటర్లకు వచ్చి చూస్తున్నారు. సినిమా బావుండకపోతే- గతంలో చూడలేదు. ఇప్పుడూ చూడటం లేదు. అంటే ఓటీటీ వల్ల థియేటర్లకు రావటం లేదనుకోవటం తప్పు. ఓటీటీ వల్ల నిర్మాతలకు లాభం జరిగింది. సినిమాలకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. కోవిడ్‌ తర్వాత దెబ్బతిన్న పరిశ్రమకు ఓటీటీ ఒక విధంగా సాయం చేసిందనే చెప్పాలి.

మార్కెటింగ్‌తో పాటుగా...

మార్కెటింగ్‌ వల్ల సినిమాలు హిట్‌ అవుతాయనే వాదన ఒకటి వినిపిస్తూ ఉంటుంది. దీనిలో కొంత నిజం లేకపోలేదు. కానీ మార్కెటింగ్‌ వల్ల మాత్రమే సినిమా హిట్‌ కాదు. అప్పుడప్పుడు తక్కువ బడ్జెట్‌లో తీసిన కొన్ని చిన్న సినిమాలు సంచనాలు సృష్టిస్తాయి. పెళ్లి చూపులు.. అర్జున్‌రెడ్డి.. జాతిరత్నాలు.. రైటర్‌ పద్మనాఽభంలాంటివి బాక్స్‌ ఆఫీసు వసూళ్లు బాగా చేస్తాయి. కానీ అరుదు. వీటిని దృష్టిలో పెట్టుకొని మిగిలిన సినిమాలు తీయలేం. అంతే కాకుండా ప్రేక్షకుల అభిరుచులు త్వరగా మారిపోతున్నాయి. ఉదాహరణకు తాజాగా నేను తీసిన బుట్టబొమ్మ అనే సినిమా గురించి చెబుతా. 2020లో నేను ఒక మలయాళం సినిమా చూశా. అది నాకు నచ్చింది. దానిని రీమేక్‌ చేయాలనుకున్నా. కానీ ఈ మూడేళ్లలో పరిస్థితులన్నీ మారిపోయాయి. మూడేళ్ల క్రితం చూసినప్పుడు బానే ఉంది. కానీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. దాంతో ఈ సినిమా ఫెయిల్‌ అయింది. ఈ సినిమాను చూసిన బాబాయి రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్‌గారు- ఫలితాన్ని ముందే ఊహించారు. అందుకే మేము డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఎటువంటి సొమ్ము తీసుకోకుండా సినిమాను విడుదల చేశాం.

4.jpg

బిజీ..బిజీ

ఈ ఏడాది ఆరు సినిమాలు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. డీజే టిల్లు పార్ట్‌టూ 50 శాతం పూర్తయింది. దీనిని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నాం. మహే్‌షతో చేస్తున్న సినిమాను కూడా ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నాం.

బ్లాక్‌ బస్టర్‌..

సార్‌ తప్పనిసరిగా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. దీనిలో ఉండే ఎమోషన్స్‌కు అందరూ తప్పనిసరిగా కనెక్ట్‌ అవుతారు. ధనుష్‌ కూడా చాలా గొప్పగా చేశారు.

Updated Date - 2023-02-12T00:03:25+05:30 IST