మధుమేహులకు ‘సోల్‌’ అదే ఆమె గోల్‌

ABN , First Publish Date - 2023-09-13T23:57:36+05:30 IST

నేను మణిపాల్‌ యూనివర్శిటీలో బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు, ఫ్యామిలీ హెల్త్‌కేర్‌ క్లినిక్స్‌కు వెళ్తూ ఉండేదాన్ని.

మధుమేహులకు ‘సోల్‌’ అదే ఆమె గోల్‌

మధుమేహం అదుపు తప్పి అవయవాలు కోల్పోయే వాళ్ల దుస్థితిని చూసి చలించిపోయినా సాయిశ్రీ ఆకొండి, ‘డి సోల్‌’ అనే ఓ వినూత్నమైన ఉత్పత్తిని ఆవిష్కరించి, టెక్నాలజిస్ట్స్‌, ఇన్వెస్టర్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌, టై విమెన్‌ రీజనల్‌ ఫైనల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ పిచింగ్‌ కాంపిటీషన్‌లో నెగ్గింది. మధుమేహుల పాలిట వరంగా నిలుస్తున్న ఆ ఉత్పత్తి గురించీ, తన భవిష్యత్తు లక్ష్యాల గురించీ అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ నుంచి ఆవిడ ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

టై, టెక్నాలజిస్ట్స్‌, ఇన్వెస్టర్స్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌, మహిళల వ్యాపార ధృక్పథాన్నీ, వ్యాపార నైపుణ్యాలనూ, లక్ష్యాలనూ, విజయాలనూ గుర్తించి, ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చి పెట్టే సంస్థ. దీన్లో మహిళా వ్యవస్థాపకులు పాల్గొంటూ ఉంటారు. ఈ సంస్థ, ప్రతి ఏటా జరిగే ఈ పోటీలో అంతిమంగా పది మంది మహిళా వ్యాపారవేత్తలను ఎంచుకుని, వచ్చే నవంబరులో సింగపూర్‌లో జరగబోయే టై గ్లోబల్‌ సమిట్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. అలా ఈ ఏడాది, ఆక్సొలొటెల్‌ హెల్త్‌ స్థాపకురాలు, శ్రీ సాయి ఆకొండి గ్లోబల్‌ సమిట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించబోతోంది. ఈ అంతిమ పోటీలో పాల్గొనబోయే 40 మంది ప్రపంచవ్యాప్త మహిళా పారిశ్రామిక వేత్తలతో సాయిశ్రీ తలపడబోతోంది. ఈ పోటీలో నెగ్గితే, శ్రీసాయి 50 వేల డాలర్ల (42 లక్షలు)నగదు బహుమతిని గెలుచుకుంటుంది.

నేను మణిపాల్‌ యూనివర్శిటీలో బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నప్పుడు, ఫ్యామిలీ హెల్త్‌కేర్‌ క్లినిక్స్‌కు వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ అవయవాలను కోల్పోయిన ఎంతో మంది మధుమేహులను చూశాను. ఆ దుస్థితికి మధుమేహుల అవగాహనా లోపమే కారణమని తెలిసింది. కాళ్లలో కోల్పోతున్న స్పర్శను కనిపెట్టలేక, పుండును నయం చేసుకోలేక, చివరకు వాళ్లందరూ అవయవాలను కోల్పోతున్నారని వైద్యుల ద్వారా తెలుసుకున్నాను. నేను బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌తో పాటు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో కూడా రీసెర్చ్‌ చేశాను. డాటా ఆధారంగా ఇలాంటి దుస్థితిని అంచనా వేసి, దానికి పరిష్కారం కనుగొనే మార్గాన్ని అన్వేషించడమంటే నాకు స్వతహాగా ఎంతో ఆసక్తి. నిజానికి అవయవాలను కోల్పోయే ఈ పరిస్థితిని ముందుగానే నియంత్రించే వీలున్నా, మధుమేహులకూ, వైద్యులకూ మధ్య సమాచార ప్రసార లోపం వల్ల ఈ దుస్థితి తలెత్తుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన నేను ఇందుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం పాదాల్లో కోల్పోతున్న స్పర్శను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఆ డాటాను వైద్యులకు చేరవేసే ‘డి సోల్‌’ అనే ఒక ఉత్పత్తిని రూపొందించాను. ఇది షూ లోపల, చెప్పులకు అతికించుకునే సోల్‌. ఇది అందించే డాటా ఆధారంగా వైద్యులు మధుమేహలకు తగిన చికిత్సను సూచించగలుగుతారు. అలా 2022లో డి సోల్‌ను ఉత్పత్తి చేసే ఆక్సొలొటెల్‌ హెల్త్‌ అనే కంపెనీని స్థాపించాను.

4.jpg

వైకల్యానికి అడ్గుకట్ట వేద్దామని...

సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపించడంతో పాటు సవాళ్లతో కూడుకున్న ఈ వినూత్న ప్రక్రియను ఎంచుకోవడం వెనక నా తల్లితండ్రులు భారతి దేవి, శ్రీరామ్‌ ఆకొండిల పోత్సాహం ఎంతో ఉంది. వాళ్లు నాకు చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్తలా ఆలోచించే విధానాన్ని నేర్పించారు. నాకు పరిశోధన మీద ఆసక్తి ఉండేది. కానీ వాళ్లు నాదైన ఒక వ్యాపారాన్ని నెలకొల్పాలని అంటూ ఉండేవాళ్లు. అలా నా ఆసక్తి వ్యాపార రంగం వైపు మళ్లింది. అయితే ఆరోగ్య రంగం పట్ల నాకున్న ఆసక్తిని, వ్యాపార రంగానికి జోడించి, ఆక్సొలొటెల్‌ హెల్త్‌ అనే కంపెనీని స్థాపించాను. అయితే ఆరోగ్య పరికరాలు, ఉత్పత్తుల తయారీ ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. పైగా లోతైన పరిజ్ఞానం కూడా అవసరం. కాబట్టి ఇన్‌సోల్‌ ఎలా డిజైన్‌ చేయాలో, పేషెంట్‌ సెంటర్డ్‌ టెక్నాలజీ ఎలా సృష్టించాలో, అలాగే ఇన్‌సోల్‌ ద్వారా రోగి జీవితంతో ఎలా అనుసంధానమవ్వాలో తెలుసుకోవడం కోసం అమెరికాలోని కార్నెజీ మెలన్‌ యూనివర్శిటీలో ప్రస్తుతం ఎమ్మెస్‌ చేస్తున్నాను. ప్రస్తుతం నా ఉత్తత్తి ట్రయల్స్‌లో ఉంది. త్వరలో ఎఫ్‌డిఎ అనుమతి పొంది అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇక్కడితోనే నా కృషి ఆగిపోదు. ఉత్పత్తి మార్కెట్లో విడుదల అయిన తర్వాత, తిరిగి డాటా సేకరించి, మధుమేహలకు ఉపయోగకరమైన మరిన్ని ఫీచర్స్‌ను ఉత్పత్తిలో పొందుపరిచే ప్రయత్నం చేస్తాను.

కుటుంబ ప్రోత్సాహం కీలకం

పోత్సహించే కుటుంబాన్ని కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. మరీ ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ప్రయోగాత్మక వ్యాపారాల్లో అడుగు పెట్టే మహిళలకు కుటుంబ ప్రోత్సాహం మరింత అవసరం. ఈ రంగంలో ఎన్నో సవాళ్లుంటాయి. దీన్లోకి ప్రవేశించడమే ఎంతో కష్టం. అమెరికాలో ఇలాంటి ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావాలంటే, బీమా సంస్థలను ఒప్పించాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తూ నాకు కుటుంబం నుంచే కాకుండా, నిధుల పరంగా, సలహాలు, మార్గదర్శకత్వం పరంగా నేను ఎమ్మెస్‌ చేస్తున్న యూనివర్శిటీ నాకెంతో మద్దతునిస్తోంది. నేనింతదూరం ప్రయాణించడం వెనక ఎన్నో శ్రమలు, నిద్రలేని రాత్రులు, నేర్చుకోవాలనే తపనలూ ఉన్నాయి.

మాది విశాఖపట్నం. ముంబయిలో పెరిగాను. కర్నాకటలోని మణిపాల్‌లో బయో మెడికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేశాను. ప్రస్తుతం యుస్‌లోని పిట్స్‌బర్గ్‌లో ఉంటున్నాను. ప్రస్తుతం యుఎ్‌సలోని కార్నెజీ మెలన్‌ యూనివర్శిటీలో ప్రస్తుతం ఎమ్మెస్‌ చేస్తున్నాను.

గోగుమళ్ల కవిత

Updated Date - 2023-09-13T23:57:36+05:30 IST