Teachings of the Buddha: కోర్కెల పుట్టను కూల్చాలంటే..

ABN , First Publish Date - 2023-03-24T01:08:32+05:30 IST

శ్రావస్తి నగరానికి సమీపంలో అనేక బౌద్ధ కేంద్రాలు ఉండేవి. వాటిలో అనాథపిండికుని జేతవనం ఒకటి. ఆంధ్ర (తెలుగు) భిక్షువులు నివసించే అంధకవనం మరొకటి.

Teachings of the Buddha: కోర్కెల పుట్టను కూల్చాలంటే..

కోర్కెల పుట్టను కూల్చాలంటే..

శ్రావస్తి నగరానికి సమీపంలో అనేక బౌద్ధ కేంద్రాలు ఉండేవి. వాటిలో అనాథపిండికుని జేతవనం ఒకటి. ఆంధ్ర (తెలుగు) భిక్షువులు నివసించే అంధకవనం మరొకటి. బుద్ధుని ప్రధాన అనుచరుల్లో కుమార కాశ్యపుడు ముఖ్యుడు. ఒక రోజున అతను అంధకవనంలో ఉన్నాడు. ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు అతనికి కల వచ్చింది. ఆ కలలో... కాశ్యపుడు ఒక పెద్ద చెట్టు కింద నిలుచున్నాడు. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో ఒక దేవత వచ్చింది. ఆ సమయానికి కాశ్యపునికి కొంత దూరంలో సుమేధుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి దగ్గరలో ఒక పుట్ట ఉంది. ఆ దేవత... సుమేధుని దగ్గరకు వెళ్ళింది.

‘‘ఈ పుట్ట పగటిపూట ప్రజ్వలిస్తుంది. రాత్రివేళ పొగలు కక్కుతుంది. దీన్ని ఏం చెయ్యాలి? ఎలా తొలగించాలి?’’ అని ఆ దేవతను సుమేధుడు అడిగాడు.

‘‘సుమేధా! పదునైన కత్తి తీసుకో’’ అంది దేవత.

కానీ సుమేధుడు అడ్డగర్రను తీసుకున్నాడు. పుట్ట పగలలేదు. ‘‘సుమేధా! కత్తి తీసుకో’’ అంది దేవత.

ఈసారి మూతలాంటి ఇనుప పళ్ళేన్ని తీసుకున్నాడు. దానికీ పుట్ట పగలలేదు. ఒకవైపు ‘‘కత్తి తీసుకో’’ అని దేవత చెబుతూనే ఉంది. కానీ, ఆ తరువాత సుమేధుడు పంగలకర్ర తీసుకున్నాడు. జల్లెడ తీసుకున్నాడు. తాబేలు డిప్ప, మాంసం కొట్టే కత్తి, కర్ర మొద్దు లాంటి వాటితో ప్రయత్నించాడు. ప్రయోజనం కనిపించలేదు.

‘‘సుమేధా! వాటిని అవతల పారెయ్‌. పదునైన కత్తి తీసుకో’’ అంది దేవత. ఈసారి సుమేరుడు పెద్ద మాంసం ముక్కను పట్టుకున్నాడు. దేవత మళ్ళీ హెచ్చరించింది. ఈసారి మాంసం ముక్కను అవతల పారెయ్యాలని దేవత చెప్పిన వెంటనే... అతను పారేశాడు. అప్పుడు సుమేధుడికి ఎదురుగా నాగుపాము నిలిచి ఉంది. ‘‘నాగుపాము కనిపించింది ’’అన్నాడు. ‘‘ఆ పామును చంపకు. పట్టి అవతల పారెయ్యకు’’ అంది దేవత.

‘‘అలాగే...’’ అన్నాడు సుమేధుడు. అంతలో ఆ దేవత దగ్గర ఒక్కసారిగా వెలుగు ప్రకాశించింది. ఆమె అదృశ్యమయింది. సుమేధుడూ అదృశ్యమయ్యాడు. ఆ దృష్టాంతాలన్నీ అదృశ్యమయ్యాయి. వాటిని చూస్తూ నిలబడిన కాశ్యపుడు అక్కడి నుంచి కదిలాడు. ఆ కదలికతో నిద్ర నుంచి లేచాడు. మరునాడు కుమార కాశ్యపుడు బుద్ధుని దగ్గరకు వెళ్ళి, నమస్కరించి, ఆ రాత్రి తనకు వచ్చిన స్వప్నం గురించి వివరించాడు.

‘‘భగవాన్‌! సుమేధుడు ఎవరు? పుట్ట ఏమిటి? కత్తి, అడ్డగర్రా, పంగల కర్రా...ఇవన్నీ దేనికి సంకేతం? నాగుపాము ఇచ్చే సందేశం ఏమిటి?’’ అని అడిగాడు.

‘‘కాశ్యపా! తల్లితండ్రుల ద్వారా మనకు సంక్రమించే దేహమే పుట్ట. ఇది ఆహారంతో వృద్ధి పొందుతుంది. కానీ, ఇది అనిత్యమైనది. ఇక మనిషి పగటిపూట చేసే పనుల గురించి రాత్రి చింతన చేస్తాడు. సమీక్షించుకుంటాడు. అలా చింతన చేయడమే పుట్టలోంచి రాత్రివేళ పొగ లేవడం. అలా రాత్రి ఆలోచించిన వాటిని పగలు ఆచరణలో పెడతాడు. అదే పగటిపూట పుట్ట ప్రజ్వలించడం. అంటే ఆ పుట్ట కోర్కెల పుట్ట అన్నమాట. ఇక... సుమేధుడు నా ధర్మంలో శిక్షణ పొందే భిక్షువు. పదునైన కత్తి అనేది ప్రజ్ఞకు సంకేతం. కోరికలను జయించేది ప్రజ్ఞ మాత్రమే. కత్తితో నిరంతరం ప్రయత్నించడం అనేది కోర్కెలను జయించే ధ్యానసాధనం. అడ్డకర్ర అవిద్యకు సంకేతం. దాన్ని పారెయ్యడం అంటే అవిద్యను దూరంగా వదిలిపెట్టడం. అలాగే ఇనుప మూత నిరాశకు, పంగలకర్ర ‘అది చేయాలా? ఇది చేయాలా?’ అనే సంశయానికీ, జల్లెడ... ‘కోరిక, ద్రోహం, జడత్వం, సోమరితనం, సంశయం, పశ్చాత్తాపం’ అనే అవరోధాలకు గుర్తు. ‘దూరం, వేదన, సంజ్ఞా, సంస్కార, విజ్ఞాన’ అనే అయిదింటికీ తాబేలు డిప్ప గుర్తు. మాంసం కొట్టే కత్తి, మొద్దు... కామగుణానికీ, మాంసం ముక్క రాగానికీ (వ్యామోహానికి) చిహ్నాలు. నాగుపాము... చిత్తంలోని మలినాలు వదిలిన భిక్షువుకు సంకేతం. నిరంతరం కత్తితో ప్రయత్నించడం అంటే... సరైన మార్గంలో చేసే ప్రయత్నం. అదే సమగ్రమైన ప్రయత్నం. దాని వల్లే దుఃఖం దూరమవుతుంది. దుఃఖంలాగే.. పెరిగిపోయే ఆ పుట్టను ప్రజ్ఞతో చేసే సరైన ప్రయత్నం వల్ల మాత్రమే ధ్వంసం చెయ్యగలం. మొదలంటా నిర్మూలించగలం’’ అని చెప్పాడు. తన స్వప్నానికి ధార్మిక అర్థంలో వివరణ ఇచ్చిన బుద్ధునికి... కుమార కాశ్యపుడు ప్రణమిల్లాడు. అతని మనస్సు కుదుటపడింది.

-బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2023-03-24T01:08:51+05:30 IST