SriRama:అభయ మొసగే నామం.. శ్రీరామం

ABN , First Publish Date - 2023-03-24T00:10:21+05:30 IST

వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు మధుసూదన మాసం... అంటే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే చైత్ర మాసంలో ఈ భువిపై అవతరించాడు.

SriRama:అభయ మొసగే నామం.. శ్రీరామం

అభయ మొసగే నామం.. శ్రీనామం

వాల్మీకి రామాయణాన్ని అనుసరించి శ్రీరామచంద్రుడు మధుసూదన మాసం... అంటే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే చైత్ర మాసంలో ఈ భువిపై అవతరించాడు. చైత్ర మాస శుక్లపక్ష నవమి తిథిన జన్మించిన కారణంగానే ఆ రోజును శ్రీరామ నవమి మహోత్సవంగా లోకమంతా జరుపుకొంటోంది.

అభయమొసగే నామం... శ్రీరామం!

‘భగవద్గీత’లో శ్రీకృష్ణపరమాత్ముడు ఉద్బోధించినట్టు... దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మసంస్థాపనకు భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడు. భగవంతుణ్ణి జీవుడు శరణు పొందే మార్గాన్ని మరింత సుగమం చేస్తాడు. దేవదేవుని శరణు పొందినవారెవరూ భయపడాల్సిన అవసరం లేదన్న సత్యాన్ని లోకానికి నిరూపించడమే... శ్రీరామచంద్ర ప్రభువు అవతరణలోని ముఖ్యోద్దేశం. శ్రీమద్రామాయణ, భాగవతాదుల్లో పొందుపరచిన శ్రీరాముని లీలల్లో తరచూ ఈ సూత్రమే గోచరిస్తూ ఉంటుంది.

ఈ ప్రపంచంలో అత్యంత భయాన్ని కలిగించేది కర్మబంధనం. అంటే మనం చేసిన కర్మల ఫలాలకు మనమే బద్ధులుకావడం. అలాంటి కర్మబంధాల నుంచి జీవునికి ముక్తినొసగే శ్రీరాముని దివ్య ఆవిర్భావం గురించి శ్రీమద్భాగవతం ఇలా వివరించింది:

పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్‌

ఆనృశంస్యపరో రాజన్కర్మబన్ధైర్విముచ్యతే

‘‘ఓ పరీక్షిత్‌ మహారాజా! శ్రీరామచంద్రుని లీలా గుణగణ వైభవాన్ని గురించి ఎవరైతే వింటారో... వారి మదిలోని ఈర్ష్యలన్నీ తొలగి, కర్మబంధనాల నుంచి విముక్తి పొందుతారు’’ అని భావం.

పై శ్లోకం వివరిస్తున్నట్టు.. శ్రీరామచంద్రుని లీలా వైభవాన్న తెలిపేదే రామచరితం. శ్రీరాముని దివ్య చరితను విన్నవారు తమ మదిలోని ‘ఈర్ష్య’ అనే జబ్బు నుంచి ఉపశమనాన్ని పొంది, ముక్తి పొందుతారని శ్రీమద్భాగవతం తెలియజేస్తోంది.

శ్రీరామచంద్రుడు ఈ లోకాన్ని పాలిస్తున్నప్పుడు... పుడమి ఎంతగా పులకించిందో కూడా శ్రీమద్భాగవతం వివరిస్తూ...

నాధివ్యాధిజరాగ్లాని దుఃఖశోకభయక్లమాః

మృత్యుశ్చానిచ్ఛతాం నాసీద్రామే రాజన్యధోక్షజే

‘‘భగవంతుడైన శ్రీరామచంద్రుడు ప్రపంచ చక్రవర్తిగా ఉన్నప్పుడు... దైహిక, మానసిక క్లేశాలు, వ్యాధులు, వృద్ధాప్యం, నష్టం, దుఃఖం, శోకం, భయం, అలసట ఏమాత్రం లేవు. కోరనివారికి మృత్యువైనా సంప్రాప్తించేది కాదు’’ అని చెబుతోంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో పై శ్లోకాన్ని చదివితే... అప్పటి ప్రజలందరూ ఆ బాధలేవీ లేకుండా జీవించారని తెలిసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు, మృత్యువు సైతం... కేవలం కోరినవారికి మాత్రమే సంప్రాప్తించేదని కూడా ఆ శ్లోకం వివరిస్తోంది. అదే ఒక ఆదర్శవంతమైన రాజు పరిపాలన. అదే భగవంతుడైన శ్రీరామచంద్రుడి సుపరిపాలన. అందుకే ‘రామరాజ్యం’ అనేది చిరస్మరణీయంగా నిలిచిపోయింది.

రాముడు లేనిదే అది సాధ్యం కాదు...

వివిధ రకాల సమస్యల నుంచి విముక్తులవ్వాలనే అందరూ కోరుకుంటారు. రామరాజ్యం మళ్ళీ రావాలనే ప్రజలంతా కాంక్షిస్తారు. అయితే, ఆ రామరాజ్యాన్ని మళ్ళీ ఎలా తీసుకురాగలమన్నది మాత్రం పాలనా వ్యవస్థకు తెలీదు. ‘‘అసలు రామరాజ్యాన్ని మళ్ళీ స్థాపించడం సాధ్యమేనా?’’ అనే సందేహం కూడా ప్రజల్లో ఉంటుంది. ‘‘అవును, ప్రజల్లో శ్రీరామచంద్రుని పట్ల శరణాగతి భావన పెంపొందేలా వారికి తగిన శిక్షణ అందజేస్తే... కచ్చితంగా అది సాధ్యమే’’ అంటుంది శాస్త్రం. మరి శ్రీరాముడు లేనిదే... శ్రీరామ రాజ్యం ఎలా సాధ్యం!

లోక రక్షకుడు శ్రీరామచంద్రుడు...

సకృదేవ ప్రపన్నో యస్తవాస్మీతి చ యాచతే

అభయం సర్వదా తస్మై దదామి ఏతద్‌ వ్రతం మమ

‘‘ఎవరైనా నన్ను ఒక్కసారైనా నిజంగా శరణువేడి... ‘‘స్వామీ! ఈ రోజు నుంచి నేను నీ వాణ్ణి’’ అంటూ తనకు అభయం ఇవ్వాలని ప్రార్థిస్తే, అభయం ఇచ్చి, అతణ్ణి ఆ క్షణం నుంచి సర్వదా సంరక్షిస్తాను’’ అని రామాయణంలో శ్రీరాముడు లోకానికి ప్రకటించాడు. శ్రీరామచంద్రుని లీలా వైభవంలోని విశిష్టత ఇదే.

రామాయణంలోని ప్రతి కాండలోనూ ‘రక్ష’ అన్నవారికి అభయాన్నొసగే ధోరణే దర్శనమిస్తుంది. రావణాసురుని బారి నుంచి తమను రక్షించాలని దేవతలు అడిగినా, లక్ష్మణుని తల్లికి, సుగ్రీవునికి లేదా విభీషణుడికి ఇచ్చిన మాటైనా... ప్రతి సందర్భంలోనూ అందరికీ అభయాన్నొసగిన వాడు శ్రీరామచంద్రుడు. ‘అభిన్నత్వాన్‌ నామ నామినోః’ అంటుంది పద్మపురాణం. అంటే భగవన్నామానికి, భగవంతునికి మధ్య ఎట్టి వ్యత్యాసమూ లేదని అర్థం. కనుక, భగవన్నామాన్ని జపిస్తే, భగవంతుడు మన దగ్గర ఉన్నట్టే. రామ నామాన్ని జపించేవారికి ఆ నామమే అభయాన్ని ప్రసాదిస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువు నేటికీ తన నామ రూపంలో... ఈ లోకంలోనే ఉన్నాడు!

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

హరే రామ హరే రామ రామ రామ హరే హరే... అనే ఈ మహామంత్రంలోనూ ఉన్నాడు.

పవిత్రమైన ఈ శ్రీరామ నవమి సందర్భంగా ప్రతిఒక్కరూ శ్రీరాముని అభయహస్తాన్ని అందరికీ చేర్చడానికి ప్రయత్నించాలి. ఆ మహామంత్రాన్ని అందించాలి. ప్రజల్లో ఆదర్శ జీవన స్ఫూర్తిని కలిగించడానికి శ్రీరామచరితం ఎంతో తోడ్పడుతుంది. ఆ స్ఫూర్తి ఉన్నప్పుడే లోకం శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లుతుంది.

శ్రీమాన్‌ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9396956984

Updated Date - 2023-03-24T00:37:18+05:30 IST