GuruPurnima: గురుపౌర్ణమి రోజున భక్తులు సాయిబాబా గుడికే ఎందుకు వెళతారంటే..

ABN , First Publish Date - 2023-07-03T13:17:22+05:30 IST

చాలామంది గురుపౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు. కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు. మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే వచ్చిన గురువునని సాయిబాబా చెప్పడంతో ఆరోజు మొదలు గురుపౌర్ణమి రోజున సాయిబాబాను పూజించటం ప్రారంభమైంది.

GuruPurnima: గురుపౌర్ణమి రోజున భక్తులు సాయిబాబా గుడికే ఎందుకు వెళతారంటే..

‘గురుఃబ్రహ్మ, గురుఃవిష్ణు, గురుదేవో మహేశ్వరః’ అంటూ మన పెద్దలు గురువు విశిష్టతను చాటిచెప్పారు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్ధం. అటువంటి గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం దక్కుతుందనేది వేదవాక్యం. అందుకే హిందూ ధర్మంలో గురువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ధర్మ శాస్ర్తాల ప్రకారం ‘వ్యాసమహర్షి’ని గురువుగా భావిస్తారు. అందుకే ఆయన ఆవిర్భవించిన జన్మతిథి ఆషాఢపౌర్ణమిని ‘గురుపౌర్ణమి’గా జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. అంతేకాకుండా ఈ గురుపౌర్ణమినే ‘వ్యాసపౌర్ణమి’గా కూడా పిలుస్తారు. సాక్షాత్తు ఆ పరమశివుడే వ్యాసుని రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. కనుక వ్యాసపౌర్ణమి రోజున గురును పూజిస్తే పరమేశ్వరుని పూజించిన ఫలితం దక్కి మంచి జ్ఞానం కలుగుతుంది. అసలు గురువు అన్న మాటకు అజ్ఞానాన్ని పారద్రోలేవాడనీ, అధికుడనీ ఎన్నో అర్థాలు ఉన్నప్పటికీ, గురువు మ నలోని అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానమనే వెలుగును నింపుతాడని సర్వజనీనంగా ఉండే నమ్మకం. అటువంటి గు రుపరంపరంలో ముందుగా చెప్పేది వేదవ్యాసుడు, దక్షిణా మూర్తి గురించే..

కృష్ణద్వైపాయనుడే వ్యాసుడు

పరాశరుడు అనే రుషికీ, సత్యవతి అనే జాలరి కుటుంబానికి చెందిన కన్యకీ జన్మించిన వాడు వ్యాసుడు. ఆయన పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన నలుపు రంగులో ఉంటాడు కాబట్టి ‘కృష్ణ’ అని, ద్వీపం మీద జన్మించిన వాడు కాబట్టి ద్వైపాయనుడని వెరసి కృష్ణద్వైపాయనుడని ఆయనకు పేరు. అయితే అంతవరకు ఒకటిగా ఉన్న వేద సాహిత్యాన్ని క్రోడీకరించి, నాలుగు భాగాలుగా విభజించాడు కృష్ణద్వైపాయనుడు. దీంతో ఆయన వేదవ్యాసునిగా పేరుపొందాడు. ఆయన రుగ్‌, యజు, స్సామ, అధ్వర్వణ వేదాలను మనకు అందించటమే కాకుండా, పంచమ వేదంగా పిలువబడే మహాభారత రచన కూడా చేశాడు. ఆయన తల్లి సత్యవతి భీష్ముని తండ్రి శంతనుని వివాహం చేసుకుంది.అంటే వ్యాసుడు కేవలం మహాభారత రచయిత మాత్రమే కాదు, అందులో ఒక భాగం కూడా. ఇక ప్రస్తుతం మనకు లభిస్తున్న అష్టాదశ పురాణాలన్నీ, యోగసూత్రాలకు భాష్యాన్ని కూడా వేదవ్యాసుడే రచించాడు. అదేవిధంగా కొంతమంది పెద్దల అభిప్రాయం ప్రకారం బ్రహ్మసూత్రాలను రచించిన బాదరాయణుడు కూడా వ్యాసుడే. అంటే హైందవ సంస్కృతికి మూలాధార మైన వాజ్ఞ్మయాన్ని అందించిన మహర్షి వ్యాసుడు.అందుకే ఆయనను తొలి గురువుగా, ఆయన పుట్టినరోజును ‘గురుపౌర్ణమి’గా జరుపుకుంటాం.

చాతుర్మాస్య దీక్షకు ఇదే సమయం

ఇక ప్రస్తుతం మనకు సమాజంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. చదువు నేర్పిన వారిదగ్గర నుంచి మంత్రోపదేశం చేసిన వారు, ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించేవారు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యోగీశ్వరులు ఇలా అనేకమందిని గురువులుగా పూజిస్తుంటాం. వీరిలో ఎక్కువగా పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ఈ గురుపౌర్ణమి మొదలు నాలుగునెలల పాటు చాతుర్మాస్యదీక్షను చేపడతారు. అంటే ఈ కాలంలో వారు ఎక్కడికీ కదలకుండా ఒకేచోట ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఎంతో నిష్టగా జీవిస్తారు. అదే విధంగా బుద్ధునికి జ్ఞానోదయం అయిన తర్వాత తొలి బోధనను ఈ గురు పౌర్ణమి రోజునే చేశారు. అందులోనే ఆర్యసూత్రాలను ఆయన తన శిష్యులకు అందించారు.

సాయిబాబాకు విశేష ప్రాధాన్యం

ప్రస్తుతం చాలామంది గురుపౌర్ణమి అనగానే అది షిరిడి సాయిబాబా పుట్టినరోజు అని భావిస్తుంటారు. కానీ అది ఆయన గురువుగా అవతరించిన రోజు. 1906వ సంవత్సరంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సాయిబాబా తన భక్తుల్లో ఒకరైన కేల్కన్‌ పిలిచి.. ఈ రోజు గురువుల పండుగని, గురువును పూజించాలని, అందుకు కావాల్సిన పూజా సామగ్రిని ఏర్పాటు చేసి భక్తులందరినీ పిలవమని కోరతాడు. అయితే భక్తులు గురువుగా ఎవరికి పూజ చేయాలా అని సందేహిస్తుంటే అప్పుడు సాయిబాబా మీరంతా నన్ను దేవునిగా అనుకుంటున్నారు, కానీ నేను మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే వచ్చిన గురువునని చెప్పడంతో ఆరోజు మొదలు గురుపౌర్ణమి రోజున పూజించటం ప్రారంభమైంది. ప్రస్తుతం గురుపౌర్ణమి రోజున షిరిడి సాయిబాబాను మాత్రమే కాకుండా సత్య సాయిబాబా, భగవాన్‌ వెంకయ్యస్వామి, అచలానంద స్వామి ఇలా అనేకమందిని వేలాదిమంది భక్తులు గురు స్వరూపులుగా భావించి ఆ రోజున పూజిస్తున్నారు.

Updated Date - 2023-07-03T13:17:39+05:30 IST