Ramzan: ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా... ఆత్మ ప్రక్షాళన

ABN , First Publish Date - 2023-03-24T00:31:22+05:30 IST

భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో... ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ఇరవై కోట్ల మంది ముస్లింలు ఏటా నిర్వహించుకొనే పండుగ రంజాన్‌. అరబిక్‌ భాషలో ‘రమ్జ్‌’ అంటే ‘ఆగడం’ అని అర్థం.

Ramzan: ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా... ఆత్మ ప్రక్షాళన

ఉపవాసంతో అనంతఫలం

భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో... ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ఇరవై కోట్ల మంది ముస్లింలు ఏటా నిర్వహించుకొనే పండుగ రంజాన్‌. అరబిక్‌ భాషలో ‘రమ్జ్‌’ అంటే ‘ఆగడం’ అని అర్థం. ఈ మాసంలో చేపట్టే నెల రోజుల ఉపవాస దీక్ష ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా... ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా సర్వపాపాలు సమసిపోతాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అదుపులోకి వస్తాయి. మనో నిగ్రహం ఏర్పడుతుంది. ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సహనం, దాతృత్వం, పవిత్ర జీవనం, న్యాయమార్గానుసరణం, ఆర్థిక సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం లాంటి ఉత్తమ గుణాలు మానవులు అలవరచుకోవడానికి... సర్వశక్తిమంతుడు, సర్వసాక్షి అయిన అల్లాహ్‌ రంజాన్‌ మాసాన్ని ప్రసాదించాడు.

ఆధ్యాత్మిక వికాసానికి, జీవన సాఫల్యానికి అవసరమైన సమస్త అంశాలూ రంజాన్‌ మాసంతో ముడిపడి ఉన్నాయి. పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించింది ఈ మాసంలోనే. వెయ్యి నెలలకన్నా ఎక్కువ విలువైన రాత్రిగా పెద్దలు చెప్పిన ‘లైలతుల్‌ ఖద్ర్‌’ ఈ మాసంలోనే వస్తుంది. ఆ ఒక్క రాత్రి చిత్తశుద్ధితో చేసే ఆరాధన... వెయ్యి మాసాల్లో చేసిన ఆరాధనకు సమానంగా పరిగణన పొందుతుంది. రంజాన్‌ మాసంలో ఆచరించే తరావి నమాజులు మరింత పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఒక సువర్ణావకాశం. అలాగే... రంజాన్‌ నెలలో పాటించే ‘ఫిత్రా’ ద్వారా, ఎక్కువమంది ముస్లింలు ఈ నెలలోనే చెల్లించే ‘జకాత్‌’ ద్వారా పేద సాదలకు ఊరట లభిస్తుంది. ఈ మాసంలో ఆచరించే ‘రోజా’కు (ఉపవాసాలకు) చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తవానికి ఉపవాసాలనేవి అన్ని మతాలూ, సంస్కృతుల్లో కనిపించే నియమమే. ఇస్లాంలో ఇది నిర్దిష్టమైన, మార్గదర్శకమైన సంప్రదాయంగా కొనసాగుతోంది.

పవిత్ర రంజాన్‌ నెలలో సత్కార్యాల పుణ్యం డెబ్భై రెట్ల వరకూ పెరుగుతుంది. కానీ ఉపవాసం వీటన్నిటికీ అతీతం. దాని ఫలానికి పరిమితి లేదు. అది అనూహ్యం, అనంతం. అనంతమైన తన ఖజానా నుంచి ఉపవాస ప్రతిఫలాన్ని స్వయంగా ఇస్తాననంటున్నాడు విశ్వప్రభువు. కాబట్టి అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాసాలను పాటించి, ఆ ప్రతిఫలాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న పొరపాట్ల నుంచి ఉపవాసాలను దోషరహితంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ నిర్దేశించిన ఒక దానాన్ని ‘సద్‌ ఖాయే ఫిత్ర్‌’ అంటారు. ఫిత్రా దానం చెల్లించనంతవరకూ రంజాన్‌ ఉపవాసాలు దైవ సన్నిధికి చేరవు. ఆ ఉపవాసాల్ని దైవం స్వీకరించే భాగ్యం కలగాలంటే... ఫిత్రా దానం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. అంతేకాదు... దీనివల్ల సమాజంలోని పేదసాదలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. అందుకే ఫిత్రా దానాన్ని దీనుల, ‘నిరుపేదల భృతి’గా మహా ప్రవక్త అభివర్ణించారు.

ఈ కారణంగానే ఫిత్రా దానాన్ని కేవలం ఉపవాసానికి మాత్రమే పరిమితం చేయకుండా... అందరికీ విస్తరించారు. అంటే... పండుగకు ముందురోజు జన్మించిన శిశువుతో సహా... కుటుంబంలో ప్రతి ఒక్కరి తరఫునా ఫిత్రాలు చెల్లించాలి. పేదలకు ఫిత్రా, జకాత్‌ల ద్వారా ఆందే సాయంతో... అందరూ పండుగను సంతోషంగా చేసుకుంటారనేది దీని వెనుక ప్రధానోద్దేశం. ఉపవాసాల ద్వారా, దానధర్మాల ద్వారా అందరూ దైవప్రసన్నతకు పాత్రులు కావాలి.

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2023-03-24T00:34:33+05:30 IST