అనుభవమే ప్రధానం

ABN , First Publish Date - 2023-03-24T01:18:11+05:30 IST

మీరు ఎన్నో రకాల ఊహాగానాలతో జీవనం సాగిస్తున్నారు. వాటిని వదిలిపెట్టడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. కొందరు ఎలాంటి భ్రమల్లో ఉంటారంటే...

అనుభవమే ప్రధానం

మీరు ఎన్నో రకాల ఊహాగానాలతో జీవనం సాగిస్తున్నారు. వాటిని వదిలిపెట్టడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. కొందరు ఎలాంటి భ్రమల్లో ఉంటారంటే... అసలైన ఆత్మజ్ఞానం మనకు ఈ జన్మలో దొరకదని అనుకుంటారు. కానీ అది మీకు ఈ జన్మలోనే...ఈ జీవితంలోనే తప్పకుండా సాధ్యమవుతుంది.

పూర్వం ఒక రాజుకు ఎవరో వ్యక్తి ఒక మామిడిపండు తెచ్చి ఇచ్చాడు. ఆ రాజు అంతకుముందు మామిడిపండు తినలేదు. దాన్ని చూసి ‘‘అదేమిటి?’’ అని అడిగాడు. అది మామిడి పండు అనీ, చాలా తియ్యగా ఉంటుందనీ, రుచి చూడాలనీ రాజుని ఆ వ్యక్తి కోరాడు.

‘‘మామిడి పండా! నా కొలువులో వాళ్ళు ఎవరైనా తిని, అది ఎలా ఉందో చెబుతారు. నేను దాని రుచిని అర్థం చేసుకుంటాను’’అన్నాడు రాజు.సభలో ఒకతను దాన్ని తిని, ‘‘మహారాజా! ఇది చాలా తియ్యగా ఉంది’’ అని చెప్పాడు.

‘‘మామిడి పండు రుచి ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు’’ అన్నాడు రాజు. మహామంత్రికి ఇచ్చి, ‘‘దాని రుచి నాకు అర్థమయ్యేలా చెప్పండి’’అన్నాడు. మహా మంత్రి దాన్ని తిని, చెప్పినా సరే రాజుకు ఏమాత్రం అర్థం కాలేదు. ఇంతలో కొలువులో ఉన్న ఒక మేధావి... ఆ మామిడి పండును తీసుకువెళ్ళి, రాజు నోట్లో పెట్టి, ‘‘రాజా! మీరు తిని చూడండి. మీరు స్వయంగా తిననంతవరకూ... ఇతరులు ఎంత వివరించాలని ప్రయత్నించినా...దాని రుచి మీకు అర్థం కాదు. ఇది స్వయంగా అనుభూతి చెందవలసిన విషయం’’ అని చెప్పాడు. రాజు దాన్ని స్వయంగా తిన్నాక... దాని రుచేమిటన్నది అతనికే తెలిసింది.

ఇదే విధంగా... భగవంతుడు కూడా మీకు ఎవరో వర్ణించడంవల్ల అర్థం కాడు. ఆయనను ఎవరికి వారే స్వయంగా అనుభూతి చెందాలి. ఇతరులతో మనం ఏర్పరచుకున్న బంధాలన్నీ ఏదో ఒక రోజు తెగిపోవచ్చు. కానీ భగవంతుడితో ఏర్పరచుకొనే బంధం ఎన్నటికీ తెగిపోదు. అలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకోండి. దాని కోసం మీరు దేన్నీ త్యజించాల్సిన పని లేదు. కేవలం మిమ్మల్ని మీరు తెలుసుకుంటే చాలు. మీ ఉనికిని మీరు గుర్తిస్తే చాలు.

ఈ ప్రపంచంలో ‘శాంతి’ అనే విషయం మీద ప్రసంగించేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ మనిషి తనలోని శాంతిని స్వయంగా అనుభూతి చెందనంత వరకూ అదొక మంత్రంలా మిగిలిపోతుంది. అసలైన అంతర్గత శాంతిని ప్రతి ఒక్కరూ స్వయంగా అనుభూతి చెంది తెలుసుకోవాల్సిందే.

-ప్రేమ్ రావత్ సెల్:9246275220

www.premrawat.com

Updated Date - 2023-03-24T01:18:42+05:30 IST