నా సీత మానవతావాది
ABN , First Publish Date - 2023-02-21T22:42:11+05:30 IST
మన దేశంలోని ప్రముఖ హిందీ మహిళా కవియిత్రుల్లో అనామిక ఒకరు. ఆమె రాసిన కవితలను అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా విద్యార్థులు చదువుకుంటున్నారు...
మన దేశంలోని ప్రముఖ హిందీ మహిళా కవియిత్రుల్లో అనామిక ఒకరు. ఆమె రాసిన కవితలను అనేక విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆమె తాజాగా సీతపై రాసిన కవిత్వం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. తాను ఊహించుకున్న సీత ఎలా ఉంటుందనే విషయంపైనా.. మన సమాజంలో మహిళలకు ఉన్న స్థానంపైన తన మనోభావాలను ఆమె ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘చాలా కాలం క్రితం నేనొక కవిత రాశాను. రెండో ప్రపంచ యుద్ధంలో కుందేళ్లకు సంబంధించిన ఇతివృత్తమిది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆధునిక సాంకేతికత అంతగా అభివృద్ధి చెందలేదు. శక్తిమంతమైన రాడార్లు ఉండేవి కావు. అందువల్ల జలాంతర్గాముల్లో శత్రువుల ఆనుపానులను కనిపెట్టడానికి కుందేళ్లను వాడేవారట. కుందేళ్లకు దూరం నుంచి శబ్దాన్ని గ్రహించి.. వచ్చే ప్రమాదాన్ని పసిగట్టగలిగే శక్తి ఉంటుంది. కానీ ఆ క్రమంలో ఎప్పుడూ అప్రమత్తంగా, అతి జాగ్రత్తగా ఉంటుంది. మన సమాజంలో మహిళల పరిస్థితి కూడా అంతే! బయటకు చెప్పచ్చు.. చెప్పకపోవచ్చు. కానీ మహిళలు అందరూ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ప్రమాదాన్ని పసిగట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అంటే మేమందరం కుందేళ్లలాంటివాళ్లమే! దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాసిన ఈ కవిత ఈ నాటి పరిస్థితులకు అన్వయించుకోవచ్చు. మనం ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు. ఎన్ని దేశాలకైనా వెళ్లవచ్చు. కానీ మన మహిళలలో అభద్రతా భావం మాత్రం పోలేదు.
ఆమెకు అనేక కోణాలు...
సీత చాలా మందికి ఒక దేవత. కానీ నా దృష్టిలో ఒక మంచి మానవతావాది. సున్నితమైన మనసున్న మహిళ. తన పిల్లలను ఒంటరిగా పెంచుకోగలిగిన శక్తిసామర్థ్యాలున్న వ్యక్తి. ఆమెకు ఎవరిపైనా ఎటువంటి వ్యతిరేక భావనలు ఉండవు. తాను ప్రేమించినవారితో ఆనందంగా గడపాలనుకుంటుంది. ఆమెకు క్షమాగుణం మెండు. నా సీత పర్యావరణ స్త్రీవాదం (ఎకో ఫెమినిజానికి) ప్రతీక. దీనికి ప్రతీకాత్మకంగా ఒక ఉదాహరణ చెబుతాను. మన గ్రామాల్లో ఉండే పిల్లలకు ఒక తల్లే ఉండరు. వారు నివసించే ప్రాంతంలో ఉన్నవారందరూ ఆ పిల్లలను దగ్గరకు తీస్తారు. వారిని ఆదరిస్తారు. అమ్మ తర్వాత అమ్మలవుతారు. అది మన సంస్కృతి. నా సీత కూడా అంతే! రాముడితో పాటు వనవాసానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మొక్కలను, పక్షులను ప్రేమిస్తుంది. వాటితో మాట్లాడుతుంది. వాటిని పరిరక్షించమని అక్కడ ఉన్న ఆదివాసీలను కోరుతుంది. అంతే కాదు... అక్కడున్న ఆదివాసీలతో కలిసిపోతుంది. ఒక సారి రాముడితో వాదనకు దిగుతుంది.
‘‘వారితో యుద్ధం చేయాలనుకోకు. యుద్ధం వల్ల వారు తిరగబడతారు. తిరుగుబాటు మరింత అణిచివేతకు కారణమవుతుంది. ఇదంతా ఒక విషచట్రం మాదిరిగా తయారవుతుంది. వారికి మనమే అన్నీ ఎందుకు చెప్పాలి? మనం వాళ్ల దగ్గర ఎందుకు నేర్చుకోకూడదు? వారికి మనం చెప్పాలనే విషయం దగ్గరే సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి కదా’’ అని రాముడిని సమాధానపరచటానికి ప్రయత్నిస్తుంది. నా సీత ఆదివాసీల దగ్గర వైద్యం నేర్చుకుంటుంది. వారికి అవసరమయినప్పుడు సహాయపడుతుంది. ఇంత ఆత్మవిశ్వాసం.. సైర్థ్యం ఉన్న సీత మౌనంగా తనకు వచ్చిన కష్టాలను ఎందుకు భరిస్తుంది? ఎందుకు తిరిగి పోరాడదు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తుల ప్రవర్తన కాదు. ఉదాహరణకు ఎవరైనా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టారనుకుందాం. నేను ఇతరులను అదే విధంగా ఇబ్బంది పెట్టాలనుకోవటం మూర్ఖత్వం. సాధారణంగా మహిళలు ఎంత ఇబ్బందైనా పడతారు. కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడానికి సిద్ధపడరు. ఇది వారికుండే సహజగుణం. నా సీతకు కూడా అలాంటి గుణమే ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా సీత ఈతరం మహిళలకు ఒక రోల్‌మోడల్. ఆనందకరమైన, సామరస్యపూరిత జీవితాన్ని గడపటానికి అవసరమైన అన్ని గుణాలు నా సీతలో ఉన్నాయి.
-సివిఎల్‌ఎన్ ప్రసాద్
ప్రజలే టీచర్లు...
నా ఉద్దేశంలో ప్రజలే అందరికీ నిజమైన టీచర్లు. వారి దగ్గర నుంచే అందరూ నేర్చుకోవాలి. దీని నుంచే అన్ని విధానాలనూ అమలుచేయాలి. మీకో ఉదాహరణ చెబుతాను. ఈ మధ్యకాలంలో మాతృభాషలో విద్యాబోధనపై చర్చ జరుగుతోంది. చాలా మంది మాతృభాష కన్నా ఇంగ్లీషు ముఖ్యమని వాదిస్తున్నారు. దీనిలో అనేక సమస్యలున్నాయి. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్నాడనుకుందాం. వాళ్ల తల్లితండ్రులకు ఇంగ్లీషు రాదు. వాళ్ల తాత, అమ్మమ్మలకు ఇంగ్లీషు రాదు. పిల్లవాడు చదువుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. వాడికి ఇంగ్లీషు తప్ప వేరే భాష రాయటం రాదు. అప్పుడు తన కుటుంబంతో ఎలా కమ్యూనికేట్ చేస్తాడు? ఏ భాషలో మెయిల్ పంపిస్తాడు? ఇవన్నీ మౌలికమైన సమస్యలు. నా ఉద్దేశంలో అందరూ మాతృభాషలో మాట్లాడాలి. ప్రతి స్కూల్లో మాతృభాష సహా మూడు భాషలు తప్పనిసరిగా నేర్పించాలి.