Che Guevara Daughter : అదే నాకు మిగిలిన మా నాన్న జ్ఞాపకం
ABN , First Publish Date - 2023-01-23T02:11:31+05:30 IST
దేశదేశాల యువతరం గుండెల మీద చెరగని సంతకం... చే గువేరా. ఆయన మరణానంతరం కూడా చే రూపం విప్లవోద్యమ స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాపితంగా పీడిత ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న క్యూబా విముక్తి పోరాట యోధుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా ...
దేశదేశాల యువతరం గుండెల మీద చెరగని సంతకం... చే గువేరా. ఆయన మరణానంతరం కూడా చే రూపం విప్లవోద్యమ స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తోంది అంటే అతిశయోక్తి లేదు. ప్రపంచ వ్యాపితంగా పీడిత ప్రజల ఆదరాభిమానాలను అందుకుంటున్న క్యూబా విముక్తి పోరాట యోధుడు చే గువేరా కుమార్తె డా. అలైదా గువేరా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా... ప్రముఖ పిల్లల వైద్యురాలిగా సేవలు అందిస్తున్న ఆమె క్యూబన్ వైద్యరంగ విశేషాలతో పాటు అక్కడి మహిళల స్థితిగతులు, ఫిడెల్ క్యాస్ర్టోతో తనకున్న అనుబంధం తదితర విషయాల గురించి అలైదా చెబుతున్నారిలా..!
కరోనా సమయంలో యాభైకుపైగా దేశాల్లో క్యూబా వైద్యులు సేవలందించారు కదా.! ఒక చిన్న దేశం నుంచి అదెలా సాధ్యమైంది.?
అలైదా గువేరా: కరోనా వంటి అంటు వ్యాధులు ప్రబలినప్పుడే కాదు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఇతర దేశాల అభ్యర్థన మేరకు క్యూబన్ వైద్యులు ఆయా దేశాలకు వెళ్లి సేవలందిస్తారు. అలా కరోనా సమయంలోనూ ఆఫ్రికా, యూరప్ దేశాల్లో వైద్య సేవలు అందించాం. క్యూబన్ వైద్యులకు ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యం. అంతకు మించి డబ్బులు ప్రధానం కానే కాదు. ఉదాహరణకు ఖతర్‌లోని ఓ పెద్ద ఆస్పత్రిలో క్యూబన్ వైద్యుల బృందం పనిచేస్తోంది. అందుకు ఆ దేశం మాకు మంచి వేతనాలు కూడా చెల్లిస్తోంది. అయితే, హైతీ దేశంలోనూ మా వైద్యులున్నారు. ఆ దేశ ప్రభుత్వం వారికి వేతనాలు చెల్లించలేని పరిస్థితి. అప్పుడు ఖతర్ చెల్లించే వేతనంలోని కొంత సొమ్మును హైతీలోని క్యూబన్ వైద్యులకు అందిస్తామన్నమాట. అంతేకానీ, డబ్బులు చెల్లించలేదని రోగుల ప్రాణాలను గాలికొదిలేయడం మాత్రం ఉండదు. ఇదీ సామ్యవాద వ్యవస్థ గొప్పతనం. ఒకవైపు క్యూబా అమెరికా నుంచి అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొంటూనే ప్రపంచ దేశాలకు వైద్య సేవలు అందించగలుగుతోంది అంటే అది కేవలం సోషలిజం విజయమే.!
బొలీవియాలోని చే గువేరా స్మారక ఆస్పత్రి చాలా ప్రత్యేకమైనదిగా చెబుతుంటారు.?
అలైదా: అవును! అర్జైంటీనాలోనూ చే స్మారక ఆస్పత్రి ఉంది. అయితే అక్కడ కేవలం కంటి వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బొలీవియాలోని చే స్మారక ఆస్పత్రిలో సాధారణ వైద్య సేవలన్నీ అందిస్తున్నారు. అయితే, బొలీవియాలో నేను గమనించించింది ఏమంటే, స్థానికంగా ఉన్న శ్వేతజాతీయులు కొందరు, ఆ దేశ జనాభాలో 80శాతంగా ఉన్న లాటిన్ అమెరికన్ల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తుంటారు. అది వైద్యరంగంలోనూ కొనసాగేది. కొన్ని సందర్భాల్లో లాటిన్ అమెరికన్లకు చికిత్స చేసేందుకు కూడా వైట్ డాక్టర్లు నిరాకరించేవారు. అలాంటిది క్యూబన్ వైద్యులు అక్కడి పరిస్థితులకు పూర్తి భిన్నంగా, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. దాంతో బొలీవియన్లు స్థానిక వైద్యులకంటే క్యూబన్ వైద్యులను విపరీతంగా అభిమానించేవారు. క్యూబాలోనూ లాటిన్ అమెరికన్ స్కూల్ ఆఫ్ మెడిసన్ పేరుతో ఉచిత వైద్యకళాశాలను స్థాపించాం. తద్వారా 17వేల మందికిపైగా వైద్యులను లాటిన్ అమెరికా దేశాలకు క్యూబా అందించింది. అంతేకాదు, మా దేశంలో వైద్య విద్య పూర్తి ఉచితం. సోషలిస్టు వ్యవస్థలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, వైద్యం అందుతాయనడానికి క్యూబా నిదర్శనం.
మరి సంక్రమిక వ్యాధులను ఎలా నియంత్రించగలుగుతున్నారు ?
అలైదా: పెట్టుబడి దారీ, సామ్రాజ్యవాద దేశాలలో నీరు, గాలి కూడా వ్యాపార వస్తువులే.! కనుక కొద్దిమందికి మాత్రమే స్వచ్ఛమైన నీరు, ఆహారం వంటివి అందుతాయి. అదే క్యూబాలో... గాలి, నీరు కాలుష్యానికి తావులేదు. పోషక విలువలు కలిగిన మంచి ఆహారం ప్రతి ఒక్కరికి అందుతుంది. పైగా బిడ్డ పుట్టింది మొదలు, 14ఏళ్లు వచ్చేవరకు 14 రకాల రోగనిరోధక టీకాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా, అప్పుడప్పుడు డయేరియా వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతుంటుంది. దాంతో చాలా వరకు సంక్రమిక వ్యాధులను నియంత్రించగలిగాం. ఒక క్యూబన్‌గా చెప్పాలంటే, మేము పేదోళ్ళలా బతుకుతుంటాం. కానీ సంపన్నవంతులుగా చనిపోతాం.
క్యూబాలో మహిళల స్థితిగతుల గురించి వివరిస్తారా.?
అలైదా: మా దేశంలో స్త్రీ, పురుష అసమానలతకు చోటులేదు. క్యూబన్ విప్లవం తొలినాళ్ళలోనే మహిళా సాధికారత లక్ష్యంతో ఓ ఫెడరేషన్ ప్రారంభమైంది. అసమానతలను చెరిపివేయడం కోసం ఈ మహిళా ఫెడరేషన్ సుదీర్ఘకాలంగా పనిచేస్తోంది. సమాన పనికి సమానవేతనం లభిస్తుంది. స్కూళ్ళలోనూ బాల, బాలికల మధ్య వివక్ష కనిపించదు. మా దేశ వైద్యరంగంలో 72శాతం మంది వైద్యురాళ్లు ఉన్నారు. అందులోనూ నిర్ణయాధికార స్థానాల్లో ఎక్కువ శాతం మహిళలే.! ఆడవాళ్ల రక్షణకు పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. వాటి అమలుతీరు కూడా అద్భుతం. మహిళా ఉద్యోగులకు కాన్పుకు ముందు రెండు నెలలు, తర్వాత 9 నెలలు పూర్తి వేతనంతో కూడిన సెలవులుంటాయి. ఆ తర్వాత అవసరమైతే మరో మూడు నెలల వరకు 75శాతం వేతనంతో కూడిన సెలవులు తీసుకోవచ్చు. ఏడాది పాటు పూర్తి వేతనంతో కూడిన సెలవు ఇచ్చేలా త్వరలోనే కొత్త చట్టం రాబోతోంది. తండ్రికి కూడా ఆరు నెలల వరకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలనే ప్రతిపాదననూ ఉంచారు. ఇళ్ళల్లో ఎక్కడైనా ఒకచోట అంతర్లీనంగా పురుషాధిపత్యం ఉండచ్చేమో కానీ, సమాజంలో మాత్రం అస్సలు కనిపించదు. మీడియా ద్వారా లింగ సమానత్వంపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు సాగుతుంటాయి. క్యూబన్ రచయితలు సైతం అందులో భాగస్వామ్యం వహిస్తారు. అలా గృహహింస, పిల్లలను దండించడం వంటి సమస్యలను క్యూబా సమాజం అధిగమించిందని గట్టిగా చెప్పగలను.
మీ నాన్న నుంచి మీరు పొందిన స్ఫూర్తి అంటే, ఏమి చెబుతారు.?
అలైదా: అంతకన్నా ముందు ఓ విషయం చెప్పాలి.! తన భార్యమీద ప్రేమతో నాకు మా నాన్న మా అమ్మపేరే పెట్టారు. మా అమ్మ గొప్ప మానవతామూర్తి. ఆమె మమ్మల్ని అత్యంత సాదాసీదాగా సామాన్యులకు మల్లే పెంచింది. అదే మా నాన్న కోరిక కూడా.! నా 16వ యేట, చదవమని మా అమ్మ నాకొక పుస్తకం ఇచ్చింది. కానీ అదెవరు రాశారో చెప్పలేదు. నేను చదవడం మొదలుపెట్టాను. చాలా బాగా అనిపించింది. ఆ రచనను నేను ప్రేమించడం ప్రారంభించాను. తర్వాత తెలిసింది అది మా నాన్న రాసిన ‘మోటారుసైకిల్ డైరీ’ రాతప్రతి అని. తర్వాత మెల్లమెల్లగా మా నాన్న రచనలన్నీ మా అమ్మా ద్వారా నాకు పరిచయం అయ్యాయి. ప్రస్తుతం నేను ‘మ్యాన్ ఆఫ్ ది సోషలిజం’ పుస్తకం రాస్తున్నాను. అందులో ‘చే గువేరా - వైద్యం’ అనే ఒక చాప్టర్ రాసేందుకు. మా నాన్న రచనలను తిరిగి చదవాల్సి వచ్చింది. అప్పుడు ‘బొలీవియన్ డైరీ’ ఆఖరి పేజీ చదవడం నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే, అది మా నాన్న చివరి రోజు స్మృతి కనుక. జీవితంలో కష్టాలు, అవాంతరాలు ఎన్ని ఎదురైనా భవిష్యత్తు పట్ల ఆశ కోల్పోకూడదు అనే విషయాన్ని ఆ పుస్తకం ద్వారా నేర్చుకున్నాను. బొలీవియన్ డైరీ నా దృష్టిలో ఒక అద్భుతమైన పుస్తకం. అదొక పోరాట యోధుడి డైరీ.
ఫిడెల్ క్యాస్ట్రోతో మీకున్న అనుబంధం...?
అలైదా: క్యాస్ట్రో నాకు తండ్రితో సమానం. నేను మా నాన్నకంటే ఆయనతోనే ఎక్కువ సమయం గడిపాను. కొన్ని అత్యవసర పనుల వల్ల నా పెళ్లి వేడుకకు క్యాస్ట్రో మధ్యాహ్నం రావాల్సింది, రాత్రి అయినా రావడం లేదు. నేనా, ఆయన వచ్చే వరకూ వివాహ వేదిక ఎక్కను అని పట్టుపట్టి కూర్చున్నాను. చివరికి రాత్రి 11.30గంటలకు క్యాస్ట్రో వచ్చాకే నా పెళ్లి జరిగింది. తర్వాత నా పెద్ద కూతురు పుట్టినప్పుడు, చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన క్యాస్ట్రో, పొత్తిళ్ళలోని పసిపాపను ముద్దాడుతూ.. విక్టోరియా అనే పేరు పెడదామని ప్రతిపాదించాడు. కుదరదు, అమ్మాయికి ఎస్తేఫానియా పేరును నా భర్త నేను ముందే నిర్ణయించుకున్నామని చెప్పాను. దాంతో క్యాస్ట్రో కొంచెం నొచ్చుకున్నారు. తర్వాత తిరిగి వెళ్లేప్పుడు పాపను చూస్తూ, ‘నువ్వు మీ అమ్మలా మొండిదానివి కావద్దు’ అని సరదాగా అన్నారు. అలా ఒకటా, రెండా క్యాస్ట్రోతో నాకు ఎన్నో విలువైన జ్ఞాపకాలున్నాయి. మాది తండ్రీకూతుళ్ళ బంధం. ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేనిది.
అమెరికా ఆంక్షలను, ఒత్తిళ్ళను క్యూబా ఎలా నిలువరించగలుగుతుంది.?
అలైదా: అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాన్ని నిలువరించడం చాలా కష్టమైన పని. అది విధించిన ఆర్థిక ఆంక్షలు క్యూబన్ ప్రజల జీవితాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయినా, క్యూబా ఎదిరించి నిలుస్తోంది. అందుకు కారణం మాది సామ్యవాద దేశం అవ్వడమే. అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వాలు క్యూబాలో ఉన్నకాలంలో... ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో 60మంది పొత్తిళ్ళలోనే కన్నుమూసేవారు. మరి ఇప్పుడు, శిశుమరణాల సంఖ్య ఆరుకు తగ్గింది. ఆనాడు నిరక్ష్యరాస్యతకు చిరునామాగా ఉన్న క్యూబా, ఇప్పుడు వైద్య రంగానికి పెట్టనికోటగా నిలిచింది. దేశవిదేశాల్లో మా వైద్యులు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. క్యూబన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కెనడాలోనూ పనిచేస్తున్నారు. సామ్యవాదం వల్లే ఇంత ప్రగతిని సాధించగలిగాం. క్యూబన్లు సోషలిస్టు వ్యవస్థను దృఢంగా కోరుకుంటున్నారు కనుకే, సామ్రాజ్యవాద దేశాలను ఎదిరించి మరీ క్యూబా నిలవగలుగుతోంది.
భారత్ వంటి చోట్ల చే గువేరా భావాలకు విరుద్ధమైన వారు కూడా ఆయన చిత్రాలను ముందుంచడంపై మీ అభిప్రాయం ?
అలైదా: చే గువేరా క్రమశిక్షణ కలిగిన ఓ కమ్యూనిస్టు యోధుడు. చే భావజాలం కమ్యూనిస్టు భావజాలం. ఆయన ఓ ఆచరణాత్మక కమ్యూనిస్టుగా బతికారు, అలానే మరణించారు. ఇరాక్, ఇరాన్‌లోనూ చే కు అభిమానులున్నారు. అలా అని వాళ్ళకు ఆయన కమ్యూనిస్టు అని తెలియదు. ఆ వైరుధ్యం చూసి నాకు ఆశ్చర్యం వేసింది కూడా. కనుక మీరు ఏ విలువనైతే చే గువేరా నుంచి తీసుకోవాలి అనుకుంటున్నారో, దాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. అయితే ఆయన మార్క్సిస్టు అనే నిజాన్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు.
మీ నాన్నతో మీకున్న జ్ఞాపకాలను చెప్పండి.?
అలైదా: నాకు ఏడేళ్లున్నప్పుడు మా నాన్న హత్యకు గురయ్యారు. నాన్నతో నేను గడిపిన సమయం చాలా తక్కువ. ఆయన జీవించింది కొన్నేళ్లే అయినా, ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రజల్లో పని సంస్కృతిని, శ్రమ విలువను పెంపొందించడానికి మిగతా రోజుల్లో ఆయన ఎంత కష్టపడేవారో, వారాంతంలోనూ సమాజ సేవా కార్యక్రమాల్లో వలంటీర్‌గా అంతే పనిచేసేవారు. నన్ను ఉదయం 5గంటలకు నిద్రలేపి చెరుకుగడలు కత్తిరించే పనికి వెంట తీసుకెళ్లేవారు. అప్పుడే ఆయనతో నేను కొంత సమయం గడిపాను. అక్కడ నేను చెరుకు గడలు తింటూ, మా నాన్న ఇతరులతో ఏమి మాట్లాడుతున్నారో వినడం. రోజంతా పనిచేసి చెమటలు కక్కుతూ ఇంటికొచ్చిన నాన్న భుజాలమీద నన్ను ఎక్కించుకొని ఆడించడం... నాకు మిగిలిన నాన్న జ్ఞాపకాలు.
ఇంటర్వ్యూ : డా. కాసుల లింగారెడ్డి,
కన్వీనర్, ప్రొగ్రెస్సీవ్ డాక్టర్స్ ఫోరం
ఫొటోలు: లవకుమార్