మహిమాన్విత మంత్రం
ABN , First Publish Date - 2023-10-27T00:22:49+05:30 IST
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్...’ అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైనది. గాయత్రీ మంత్రానికి సవితాదేవి అధిష్టాన దేవత అని వేదాలు చెబుతున్నాయి...
‘ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్...’ అనేది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైనది. గాయత్రీ మంత్రానికి సవితాదేవి అధిష్టాన దేవత అని వేదాలు చెబుతున్నాయి. ఈ మంత్రం ప్రాచీనమైనది. నాలుగు వేదాల సృష్టికి ముందు... ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రాన్ని బ్రహ్మ రచించాడని పెద్దలు చెబుతారు. ఇది సవితా దేవినీ, సూర్యదేవుణ్ణీ కీర్తిస్తూ... సూర్య (పింగళ) నాడిని, ముఖ్యంగా స్వాధిష్టాన చక్రాన్ని చైతన్యపరచడానికి చదివే మంత్రం. సుమారు అయిదు వేల ఏళ్ళ క్రితం విశ్వామిత్రుడు ప్రస్తుతించిన ఈ మంత్రం ఋగ్వేదంలోనిది. గాయత్రీ మంత్రం పరమార్థం ఏమిటో, ఆ మంత్ర పఠనం ఎలా చేయాలో అవగాహన కలిగి ఉండడం అవసరం. అతి సర్వత్ర వర్జయేత్... ఏదీ అతిగా చేయడం, ఆచరించడం శ్రేయస్కరం కాదు. దానివల్ల ఒక్కోసారి ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు. చెప్పే మంత్రం మీద అవగాహన, శ్రద్ధ లేకుండా... ఒకే మంత్రం లేదా దైవ నామస్మరణ పలుసార్లు చేయడంకన్నా.. అకుంఠిత భక్తితో, హృదయపూర్వకమైన తన్మయత్వంతో, చిత్తశుద్ధితో ఒకసారి చెప్పినా సరిపోతుంది. గాయత్రి... భగవంతునిలోని శక్తి. ఆ భగవంతునితో మనం అనుసంధానమైతే తప్ప... గాయత్రీ తత్త్వాన్ని గ్రహించలేం.
గాయత్రీ మంత్రం... మన సూక్ష్మ నాడీ వ్యవస్థలోని చక్రాలలో ఉన్న పంచ మహాభూతాల సారాన్ని మనకు బోధిస్తుంది. మంత్రాల గురించి మనకు చాలా పెద్ద శాస్త్రమే ఉంది. మానవ అంతర్గత సూక్ష్మ శరీర వ్యవస్థలోని చక్రాలలో, నాడులలో దేవీదేవతలు అధిష్టాన దేవతలుగా ఉంటారు.‘దేవీ కవచం’లో వివరించినట్టు... మన శరీరంలోని అంగ-ప్రత్యంగాలన్నీ ఏదో ఒక దేవత ఆధీనంలో ఉంటాయి. వాటిని వారు రక్షిస్తూ ఉంటారు. ఏ అవయవానికైనా సమస్య వస్తే... ఆ అవయవానికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రాన్ని పఠించాలనీ, తద్వారా ఆ దేవతను ప్రసన్నం చేసుకొని... సమస్య పరిష్కరించుకోవచ్చనీ శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనం చేసే ప్రార్థన... కాలుకు సమస్య వస్తే చేతికి వైద్యం చేసినట్టు కాకుండా... ఏ చక్రాలలో లేదా ఏ నాడిలో లోపం ఉందో... వాటికి సంబంధించిన దేవతను ప్రసన్నం చేసుకొనేలా ఉండాలి.
మన శరీరంలోని కుడి పార్శ్వ (పింగళ) నాడి... గాయత్రీదేవి నివాస స్థానం. నా అంతటివాడు లేడనే అత్యహంకారం వల్ల... ఈ నాడి అసమతుల్యతకు లోనవుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అలా కుడి పార్శ్వంలో సమస్యలు ఉన్నవారు... అతిగా గాయత్రీ మంత్ర పారాయణం చేయడం వల్ల... మరింత కోపిష్టిగా, అహంకారిగా మారి, విజ్ఞతను కోల్పోయే ప్రమాదం ఉంది. పూర్వకాలంలో కఠోర తపస్సు చేసి, భగవంతుని అనుగ్రహం పొందిన మునులలో కొందరు... ఇటువంటి కారణంగానే ఆ దేవుడి ఆగ్రహానికి గురయ్యారనేది మనకు తెలిసినదే.
మహా పంచభూతాలైన మూలకాలన్నీ మన కుడి పార్శ్వంలోని పింగళినాడిలో నిక్షిప్తమై ఉంటాయి. గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలు మన చక్రాలలోని పంచభూత తత్త్వాలతో అనుసంధానమై ఉంటాయి. అదే గాయత్రీ మంత్ర విశిష్టత, పరమార్థం.
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యమ్!
భూః - భూ తత్త్వం తాలూకు సారం కలిగినది (మూలాధార చక్రం)
భువః - జలతత్త్వం, సృష్టి రచన సారం కలిగినది (స్వాధిష్టాన చక్రం)
స్వాహః - అగ్నితత్త్వ సారం కలిగినది (నాభి చక్రం)
మహః - వాయుతత్త్వ సారం కలిగినది (అనాహత చక్రం). ‘మహాః’ అంటే పరమాత్ముని ప్రేమ శక్తి కారకం. ‘మహా’ అంటే ‘గొప్పతనం’ అనేది మరో అర్థం.
జనః - ఆకాశ తత్త్వం లేక సామూహికత తత్త్వసారం కలిగినది (విశుద్ధి చక్రం)
తపః- ప్రకాశించే, శుద్ధమైన కాంతి సారం కలిగినది (ఆజ్ఞా చక్రం)
సత్యః - పరిపూర్ణ సత్యం, చైతన్య (వైబ్రేషన్స్) సారం కలిగినది (సహస్రార చక్రం)
ఇక్కడ ‘సత్యం’ అనే మాటను ‘నిజం’ అనే సాధారణమైన అర్థంలో తీసుకోకూడదు. సత్యం అంటే... ‘మనం ఆత్మస్వరూపులం’ అనే సత్యం. కుండలినీ శక్తి జాగృతమై... భగవంతుడి పరమ చైతన్య శక్తితో ఏకీకీకృతమైనప్పుడు... మనం ఆత్మసాక్షాత్కార అనుభూతిని పొందుతాం. అలా ఆత్మసాక్షాత్కారం పొంది, సహజయోగ సాధన చేస్తున్నవారికి... గాయత్రీ మంత్రం ప్రాధాన్యత, గాయత్రీ మంత్రోచ్చారణ ఫలితం బాగా అవగతమవుతుంది.
డాక్టర్ పి. రాకేష్ 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ