పిల్లల్ని హాస్టళ్ల పెట్టి ఆయన ఎల్లిపోయిండు!

ABN , First Publish Date - 2023-08-12T23:05:10+05:30 IST

గొప్ప మనిషి... పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన తర్వాత గద్దర్‌ చాలా బాధపడ్డాడు. పార్టీ ఆయన్ను అర్థం చేసుకోలేదు.....

పిల్లల్ని హాస్టళ్ల పెట్టి ఆయన ఎల్లిపోయిండు!

ఆయన పాటకు ఆమె రాగం.

ఆయన గొంతుకు ఆమే జీవం.

‘ప్రజా యుద్ధనౌక’గా జన హృదయంలో జయకేతనమై రెపరెపలాడడంలోనూ ఆమె త్యాగం అమూల్యం.

ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ జీవిత భాగస్వామి విమలతో ‘నవ్య’ సంభాషణ.

గొప్ప మనిషి... పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన తర్వాత గద్దర్‌ చాలా బాధపడ్డాడు. పార్టీ ఆయన్ను అర్థం చేసుకోలేదు. పార్టీ విషయంలో ఊరికే ఆయన బాధపడుతుంటే ‘‘ఎందుకు బాధపడుతున్నావు? రిజైన్‌ ఇచ్చేసేయ్‌’’ అని చెప్పినా. తర్వాత పార్టీకి రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలుసు కదా. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్పమనిషితో కలిసి బతికినందుకు గర్వపడుతున్నా.

‘‘కొన్ని లక్షల మంది అభిమానుల్ని సంపాదించి మాకు ఇచ్చారు గద్దర్‌. మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుస్తుంది అంటారు కదా! అలా ఆయన అంతిమయాత్రకు తరలి వచ్చిన జనాన్ని చూశాక... ఎవరి కోసమైతే ఇన్నేళ్లు పరితపించాడో వారి కోసం మరి కొన్నాళ్లు ఉండి ఉంటే బావుండేదని అనిపించింది. ‘ఆస్పత్రి నుంచి కోలుకుని వచ్చాక నెల రోజులు విశ్రాంతి తీసుకుంటా. తిరిగి ప్రోగ్రామ్‌కు వెళతా’ అన్నాడు. ఆస్పత్రిలో చేరే ముందు కూడా ఎందుకో వెళ్లడం ఇష్టం లేదన్నాడు. ‘పోనీలే... రెండు రోజులు ఆగి వెళ్లు’ అన్నాను. అయినా అయిష్టంగానే వస్తువులన్నీ కారులో పెట్టేశాడు. చిన్న బాబు ఫొటోకు ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు. తర్వాత ఆస్పత్రిలో కూడా మా అల్లుడితో జోకులు వేసుకుంటూ, నవ్వుతూ బానే ఉన్నాడు. సర్జరీ తర్వాత ఐసీయూలో కూడా డాక్టర్లకు, నర్సులకు నన్ను చూపిస్తూ ‘ఆమె ఉన్నపాటికే పాతికేళ్లు బతికినా’ అని చెబుతుంటే... ‘‘అట్ల చెప్పకు’’ అనేదాన్ని. నిమ్స్‌ డాక్టర్లను గుర్తు చేసుకున్నాడు. డాక్టర్ల మీద, సిస్టర్ల మీద పాటలు పాడుతూ నవ్వుతూ, నవ్విస్తూ ‘నాకేమీ కాదు. డోంట్‌ వర్రీ... నేను బావున్నా’ అని కూడా చెప్పాడు. అలాంటిది ఇక తిరిగిరాడని గుర్తొస్తున్నప్పుడల్లా దుఃఖం ఆగడంలేదు.

పెళ్లికి ముందే అడిగారు...

నేను పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌ కాచిగూడలోనే. మాది చాలా బీద కుటుంబం. మేము నలుగురు అక్కచెల్లెళ్లం. మా నాన్న రాజలింగం కట్టుడు పనిలో మేస్త్రీ. మా రెండో అక్కకు మామయ్య అయిన రామస్వామి ద్వారా గద్దర్‌తో నాకు పెళ్లి నిశ్చయమైంది. అంతకు ముందుగానే ‘నేను కమ్యూనిస్టు పార్టీలోకి పోతే నీకు ఇష్టమేనా’ అని ఆయన నన్ను అడిగారు. ‘ఇష్టమే’ అన్నాను. ముహూర్తాలు, లగ్నపత్రికలు లాంటివేమీ లేకుండా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో హిమాయత్‌ నగర్‌లోని హనుమాన్‌ మందిరం ప్రాంగణంలో 1975, నవంబరు 9న ఒకరికొకరం దండలు మార్చుకొని ఒక్కటయ్యాం. పెళ్లికి గద్దర్‌ కొత్త దుస్తులు కూడా కొనుక్కోలేదు. అది గమనించిన మా తాత అప్పటికప్పుడు తన గాంధీ టోపీ తీసి ఆయన నెత్తిమీద పెట్టారు. మమ్మల్ని దీవించేందుకు వచ్చిన అతిథులకు ఛాయ్‌, బిస్కెట్‌ ఇచ్చాం. అలా మా పెళ్లికి అయిన ఖర్చు కూడా అంతా కలిసి రూ.40 లోపే. అంతకు మూడు రోజుల ముందే కెనరా బ్యాంకు క్లర్కుగా జాయినింగ్‌ ఆర్డర్‌ వచ్చిందట. ఆ విషయం మా బంధువులకు చెబితే... ‘పాటలు పాడుతూ తిరిగే నీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది’ అని అంతా నవ్వారు.

చిన్నగదిలో కాపురం...

పెళ్లి అయ్యాక రెండు రోజులు మా ఆడపడుచు వాళ్లింట్లో ఉన్నాం. తర్వాత జాబ్‌కు దగ్గరగా ఉండాలని, మారేడుపల్లిలో చిన్నగది ఒకటి కిరాయికి తీసుకున్నాడు. అదీ మెట్ల కింద ఉండేది. దానిలోనే మా సంసార జీవితం మొదలైంది. అప్పుడు మా సామాను అంటే ఒక చాప, కిరోసిన్‌ స్టవ్‌, రెండు వంట పాత్రలు... అంతే. అప్పటికే నేను ఎర్రగడ్డ మీటరు ఫ్యాక్టరీలో కార్మికురాలిగా చేస్తున్నాను. అప్పుడు నా నెల జీతం పన్నెండు రూపాయలు. నేను చదివింది 8వ తరగతే. పేదరికంవల్ల నా 16వ ఏట ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాను. ఆయన మీద హత్యాయత్నం తర్వాత 1997లో వీఆర్‌ఎస్‌ తీసుకున్నాను.

నిండు గర్భిణి అయినా...

ఎమర్జెన్సీ సమయంలో ఓ రోజు హఠాత్తుగా గద్దర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కానీ ఎక్కడికి తీసుకెళ్లారో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు మా పెద్దబ్బాయి సూర్యం కడుపులో ఉన్నాడు. నిండు గర్భిణిని. ఆ సమయంలో ఏంచేయాలో తెలియక, మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు జేబీ రాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాను. ఆయన సూచనతోనే ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి, అప్పటి మా ఎమ్మెల్యే సైదులను కలిసి నా భర్తను విడిపించాల్సిందిగా మొర పెట్టుకున్నాను. అప్పటి వరకు చాలామంది గద్దర్‌ అజ్ఞాతంలోకి వెళ్లారని అనుకుంటున్నారు. వారందరినీ నేను వెళ్లి కలిసిన తర్వాత ఆంజనేయరెడ్డి గారువాళ్లు ఆనాటి ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి పెట్టడంతో.... పది రోజులకు ఆయన్ను విడుదల చేశారు. అంతకు రెండు రోజుల ముందు నాకు డెలివరీ అయింది. ఆస్పత్రి నుంచి నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి, చేతిలో బాబును ఉంచాను. అప్పటికే ఆయన మీద థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారట. నేను వెళ్లడం ఒకరోజు ఆలస్యమైనా, ఆయన్ను ఎన్‌కౌంటర్‌ చేసేవాళ్లని తర్వాత గద్దర్‌ చెప్పగా విన్నాను.

నా మీద దాడి...

కొన్నాళ్ల తర్వాత గద్దర్‌ కెనరా బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అప్పుడు ఫిరోజ్‌గూడ బస్తీలోని ఒక చిన్న గుడిసెలో కొంతకాలం ఉన్నాం. అక్కడున్న ప్రభుత్వ జాగాలో బస్తీ వాసులంతా కలిసి పిల్లలకు ఉచిత పాఠశాలను నడపాలనుకున్నారు. దాన్ని కొందరు గూండాలు కబ్జా పెట్టారు. ‘ఇదేంటని’ నిలదీసిన బస్తీవాళ్ల మీదా దాడి చేశారు. అప్పుడు వారంతా వచ్చి గద్దర్‌కు చెబితే, ఆయన వెళ్లి కొట్లాడాడు. ఆ కక్షతో ఓ రోజు వారంతా గుంపుగా మా గుడిసె మీదకు వచ్చారు. వాళ్లతో వచ్చిన ఆడవాళ్లు కొందరు తడికెలతో కట్టిన స్నానాల గదిలో ఉన్న నన్ను జుత్తు పట్టుకొని బయటకు ఈడ్చి నేల మీద పడేసి కొట్టారు. అడ్డువచ్చిన మూడేళ్ల మా సూర్యాన్ని కూడా కొట్టారు. అంతటితో వదలకుండా గుడిసెకు నిప్పు పెట్టబోతే, అంతలోకి చుట్టుపక్కల జనం వచ్చి అడ్డుకున్నారు. ఇక ఆ ప్రాంతంలో ఉండటం మా ప్రాణాలకూ ప్రమాదమని గమనించి, అల్వాల్‌ వెంకటాపురంలో కిరాయి ఇంటికి మారాం. అందులోనే చాన్నాళ్లు ఉన్నాం. తర్వాత నా పీఎఫ్‌ డబ్బుతో ఇల్లు కట్టుకున్నాం. అంతకు మించి మాకు ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు.

సీఐడీ వేధింపులు...

ఆయన అజ్ఞాతంలో ఉన్న కాలంలో మూడు సార్లు ఇంటి మీదకు సీఐడీ అధికారులు దాడికొచ్చారు. అప్పుడు నేను, నా కూతురు వెన్నెల ఉండేవాళ్లం. ఓ రోజు అయితే అర్థరాత్రి 12 గంటలకు ఆరుగురు పోలీసోళ్లు వచ్చి, నిద్రపోతున్న పాపను దాటుకుంటూ వెళ్లి మరీ ఇల్లంతా సోదా చేశారు. సామానంతా చిందరవందరగా పడేశారు. అలా ఆ వేళ అర్ధరాత్రి 3 గంటల వరకు హింసించారు. అంతటితో ఆగకుండా ‘‘విప్లవ రాజకీయాలు మానుకోమని నువ్వయినా నీ భర్తకు చెప్పద్దా’’ అని నన్ను నిలదీశారు. అప్పుడు నేను అన్నాను ‘‘ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం. నేను చెబితే వింటారా’’ అనంటే వాళ్లు పరేషాన్‌ అయ్యారు. ఇంకొకడు అయితే, రోజూ ఉదయాన్నే మా ఇంటి దగ్గర బస్‌స్టాప్‌ దగ్గర మొదలు ఎర్రగడ్డ మీటరు ఫ్యాక్టరీ వరకు యములోడికి మల్లే నాలుగేళ్లు రోజూ వెంబడించేవాడు. చివరికి నాకు కోపం వచ్చి, ఒక రోజు ఎదురెళ్లి నువ్వు ఎవరని నిలదీశాను. అతని పేరు బాలరాజు అని, సీఐడీ పోలీసు అని అప్పుడు తెలిసింది. ఇలా ఒకటా రెండా.... నరకమే అనుభవించాను.

నాకిష్టమైన పాట...

ఆయన ఏం పాడుతున్నడో, ఏం రాస్తున్నడో నాకు తెలియదు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు. ఎప్పుడు వస్తావు అని కూడా ఆయన్ను ఒక్కసారి కూడా అడిగి ఎరుగను. అలాగని వెళ్లద్దని కూడా అనలేదు. ఆయన ఏదైనా సీరియస్‌ వర్క్‌లో ఉంటే, ఆ దరిదాపులకు కూడా వెళ్లను. డిస్ట్రబెన్స్‌ అవుతుందని అనుకునేదాన్ని. మొదటి నుంచి ఆయన మనసు ఎరిగి నడుచుకున్నాను. మేము మాట్లాడుకున్నది, కబుర్లు చెప్పుకున్నది కూడా చాలా చాలా తక్కువ. నేను ఇంట్లో పని చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే, ఆయన బల్ల మీద దరువేస్తూ, నా మీద రాసిన పాటను పాడేవాడు. అందరి మీద రాస్తాడు కదా... అట్లా నా మీద కూడా రాసిండు అనుకున్నా. గద్దర్‌ ప్రోగ్రామ్స్‌కు కూడా ఒకటి రెండు సభలకే వెళ్లాను. అయితే నా కోడలు నన్ను ‘జైబోలో తెలంగాణ’ సినిమాకు తీసుకెళ్లింది. అందులో ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా...’ పాట వస్తే థియేటర్‌లోని జనమంతా లేచి ధూంధాం ఆడుతున్నారు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. చాలా బాగా రాశారు అనిపించింది. నాకిష్టమైన పాట కూడా అదే. ‘అబ్బ... ఏమి రాశాడురా’ అని జనమంతా అనుకుంటుంటే విని ఆనందించాను.

అప్పుడు అవస్థలు పడ్డాను...

గద్దర్‌ అజ్ఞాతంలోకి వెళ్లే ముందు 1985 సమయంలో... అబ్బాయిలిద్దరినీ ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూలు హాస్టల్‌లో చేర్పించాడు. ఇలా వెళుతున్నానని కూడా చెప్పలేదు. నేను కూడా ఆయన ఏదో ప్రోగ్రామ్‌కు వెళ్లుంటాడు అనుకుంటున్నా. ఇవాళ వస్తాడు.. రేపు వస్తాడు అని ఎదురుచూసుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నాను. కనీసం ‘ఫలానా చోట ఉన్నాను’ అని ఉత్తరం ముక్క రాయడం కానీ, కబురు పంపడం కానీ చేయలేదు. ఆ సమయంలో చానా కష్టాలు పడ్డాను. చుట్టాలయితే ఆ సమయంలో పలకరించడానికి కూడా భయపడేవారు. తెలిసినోళ్లు నన్ను చూసి ముఖం తిప్పుకొనేవాళ్లు. అయినా ఒకరి దగ్గర చేయి చాచకుండా కష్టపడి నా పిల్లల్ని పెంచాను. అదీ నాన్న దగ్గర లేడనే లోటు వాళ్లకు ఎన్నడూ తెలియనివ్వలేదు. నేను తినో తినకనో వాళ్లకు మాత్రం లోటు లేకుండా చూసేదాన్ని. పండగలొస్తే పిల్లలు నోరు తెరిచి అడగకముందే కొత్త దుస్తులు కొనిచ్చేదాన్ని. రేషన్‌ బియ్యంతో రోజులు వెళ్లదీశాను. మాకు తిండి, పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాలు... ఇలా కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం డ్యూటీకి రోజూ ఉదయం ఆరుగంటలకు వెళితే, రాత్రి ఎనిమిది గంటల వరకు ఓవర్‌ టైమ్‌ కూడా చేసేదాన్ని. దసరా, దీపావళి సెలవు రోజుల్లో కూడా డ్యూటీకి వెళ్లేదాన్ని.

ఐదేళ్ల తర్వాత...

అజ్ఞాతంలో ఉన్నప్పుడే, గద్దర్‌ గురించి పేపర్లో ఏమైనా వార్తలు వస్తే... పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని మరీ ఆ వార్తలు వాళ్లతో చదివించేదాన్ని. ఐదేళ్ల తర్వాత 1990 ఫిబ్రవరి 17న ఆయన వస్తున్నారని తెలిసి పిల్లలను వెంటబెట్టుకొని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌కు వెళ్లాను. అక్కడ ఆయన్ను దూరం నుంచి చూస్తూనే, కళ్లతో పలకరించాను. ప్రెస్‌మీట్‌ అయ్యాక నా దగ్గరకు వచ్చి ‘పిల్లలేరి’ అనడిగారు. ఆ పక్కనే సూర్యం, చంద్రం, వెన్నెల ఉన్నా... పెద్దబ్బాయిని గుర్తుపట్టాడు కానీ మిగతావాళ్లిద్దరినీ గుర్తుపట్టలేదు. ఐదేళ్ల తర్వాత అదే చూడటం కదా. అప్పుడు చిన్నోళ్లను దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాను.

ఆ బాధ్యతలు తీసుకున్నా...

గద్దర్‌ ఏనాడూ బజారుకెళ్లి చెప్పులు గానీ దుస్తులు గానీ తెచ్చుకోలేదు. అసలు షాపుల గురించి కూడా తెలియదు. ఆయనకు కావాల్సిన ప్రతి వస్తువూ నేనే కొనేదాన్ని. ‘ఇంట్లో బియ్యం లేవు... కారం లేదు’ లాంటి విషయాలు కూడా పట్టేవికావు. ఆయన పట్టించుకోవడం లేదని కూడా నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన లోకమంతా జనమే. దాంతో కుటుంబ బాధ్యతలతో పాటు వాళ్ల తరపు, మా తరపువాళ్ల మంచిచెడులన్నీ నేనే చూశాను. తిండి విషయంలో కూడా ఇది కావాలి అది తినాలి అని ఎన్నడూ ఆయన నోరు తెరిచి అడగలేదు. ఏదీ లేకుంటే కారంపొడిలో నూనె, ఉప్పు వేసుకొని, అదే అన్నంలో కలిపి తినిపోతుండే.

కలిసి వెళ్లింది అంటే...

మేమెన్నడూ కలిసి ఓ ఫంక్షన్‌కు పోలేదు, సినిమాలకు పోలేదు. అది నేనెన్నడూ లోటుగా అనుకోలేదు. ఎందుకంటే ‘ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నాడు. నేనెందుకు ఇబ్బంది కలిగించాలి’ అనుకున్నాను. మేమిద్దరం కలిసి వెళ్లింది అంటే... ఆయన ప్రాణాపాయం తప్పించుకుని నిమ్స్‌ ఆస్పత్రి నుంచి డిశార్జి అయిన నెల రోజులకు ఢిల్లీ ప్రయాణం అయ్యాడు. అప్పుడు వెంట వెళ్లాను. అక్కడ కూడా నన్ను తెలిసినవాళ్ల దగ్గర వదిలేసి తాను ప్రోగ్రామ్స్‌కు వెళ్లాడు. పదిహేను రోజుల తర్వాత ఢిల్లీ నుంచి కోల్‌కత్తా తీసుకెళ్లాడు. అక్కడ ఒకరింట్లో వదిలి వెళ్లాడు. నేను వాళ్లతో పాటు నెల రోజులు అక్కడే ఉన్నాను. నాకు భాష రాదు. నేను హిందీలో మాట్లాడుతుంటే నవ్వేవారు. అక్కడున్నప్పుడే ఓ రోజు కిషన్‌ వచ్చి ‘విమలక్క బావున్నావా’ అని పలకరించాడు. తిరుగు ప్రయాణం అయ్యే ముందు రోజు వచ్చి హైదరాబాద్‌ తీసుకొచ్చాడు. అంతే. ఆయనతో కలిసి ప్రయాణించింది అంటే అదే.’’

సాంత్వన్‌

ఫొటో: రాజ్‌కుమార్‌

మా పిల్లల పరిస్థితి ఇదీ...

మా పెద్దబ్బాయి సూర్యానిది ప్రేమ వివాహం. మా కోడలు సరిత కాంగ్రెస్‌ నాయకుడు వెంకటస్వామికి స్వయానా మరదలి కూతురు. ప్రస్తుతం మా అబ్బాయి ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ’లో రీసెర్చి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. చిన్నబ్బాయి చంద్రం కొన్నేళ్ల కిందట ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరంలో ఉండగా అనారోగ్యంతో కన్నుమూశాడు. అమ్మాయి వెన్నెల పేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ‘మహాబోధి విద్యాలయ’ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. మా పిల్లలు ఎన్నడూ దేశం కాదు కదా పొరుగు రాష్ట్రాలకు కూడా పోయి ఎరుగరు.

ఇళ్ల పట్టాలు ఇప్పించాను...

యాదమ్మనగర్‌లో రైల్వే లైను పక్కన కొందరు పేదలు గుడిసెలు వేసుకొని బతుకుతున్నారు. రైల్వేవాళ్లు ఆ గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారని తెలిసింది. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అక్కడికి వస్తున్నారని తెలిసి, నేను వెళ్లి, ఆయన్ను కలిసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరాను. ‘ధైర్యంగా వచ్చి మాట్లాడారు’ అని నన్ను అభినందిస్తూ... అప్పటికప్పుడు ఎన్టీఆర్‌ కలెక్టరుతో మాట్లాడి 300 మంది పేదలకు ఇండ్లు మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు. తర్వాత వాళ్లకు ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు.

Updated Date - 2023-08-12T23:05:10+05:30 IST