తక్షణ శక్తి కోసం...

ABN , First Publish Date - 2023-10-02T23:39:42+05:30 IST

గ్యూ, మలేరియా వంటి జ్వరాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడిన వారు - వెంటనే కోలుకోవటం చాలా కష్టం..

తక్షణ శక్తి కోసం...

గ్యూ, మలేరియా వంటి జ్వరాలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వ్యాపిస్తున్నాయి. ఈ జ్వరాల బారిన పడిన వారు - వెంటనే కోలుకోవటం చాలా కష్టం. ఈ జ్వరాల బారిన పడిన వారిని నీరసం, నిస్సత్తువ వెంటాడుతూ ఉంటాయి. వీటి నుంచి కోలుకోవటానికి క్రమం తప్పకుండా కొన్ని పానీయాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

నీళ్లు: వైరల్‌ జ్వరాలు వచ్చి తగ్గిన వారు ఎక్కువ నీళ్లను తాగాలి. చాలా సందర్భాలలో జ్వరం వచ్చి తగ్గిన తర్వాత కూడా ఏమి తాగబుద్ధి వేయదు. కానీ అదే సమయంలో చర్మం పొడిబారిపోతుంది. నోరు ఎండిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల వైరల్‌ జ్వరాలు వచ్చి తగ్గిన వారు ప్రతి రోజు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి.

కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో ఎలకో్ట్రలైట్స్‌ ఉంటాయి. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా వికారాన్ని తగ్గిస్తాయి. అయితే రోజుకు ఒకటి లేదా రెండు కొబ్బరి బొండాల నీళ్ల కన్నా ఎక్కువ తాగకూడదు. షుగర్‌ వ్యాధిగ్రస్తులు డాక్టర్‌ను సంప్రదించి కానీ కొబ్బరి నీళ్లను తాగకూడదు.

పసుపు పాలు: పసుపులో కుర్‌కుమిన్‌ అనే రసాయనం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా శరీరంలో ఉన్న వాపులను తగ్గిస్తుంది. జ్వరం వచ్చి తగ్గిన వారు- క్రమం తప్పకుండా గోరువెచ్చని పసుపు పాలను తాగటం మంచిది.

పళ్ల రసాలు: సాధారణంగా పళ్ల రసాల కన్నా పళ్లు ఎక్కువ మేలు చేస్తాయి. అయితే జ్వరం వచ్చి తగిన తర్వాత - శరీరానికి విటమిన్‌ సి అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రెండు మూడు పళ్లను రసం తీసుకొని తాగితే- తక్షణమే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా నారింజ, నిమ్మ, బొప్పాయి పళ్లలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పళ్లతో చేసిన రసాలను తాగితే తక్షణమే శక్తి వస్తుంది.

అలోవీరా రసం: జ్వరం తగ్గటానికి సాధారణంగా మందులు వేసుకుంటారు. ఈ మందులు వేసుకోవటం వల్ల కడుపులో ఇబ్బంది కలుగుతుంది. అలోవీరా రసం తాగటం వల్ల ఈ ఇబ్బంది తొలగిపోతుంది. అంతే కాకుండా శరీరంలో ఎక్కడైనా వాపు ఉంటే అది కూడా తగ్గుతుంది.

Updated Date - 2023-10-02T23:39:42+05:30 IST