కొన్ని చోట్లే కొవ్వు...
ABN , First Publish Date - 2023-10-02T23:46:10+05:30 IST
ఒళ్లంతా సరి సమానంగా లావై, బరువు పెరిగితే దాన్ని ఊబకాయం అంటారు. దీన్ని డైట్‌తో, వ్యాయామంతో సరిదిద్దుకోవచ్చు...
ఒళ్లంతా సరి సమానంగా లావై, బరువు పెరిగితే దాన్ని ఊబకాయం అంటారు. దీన్ని డైట్‌తో, వ్యాయామంతో సరిదిద్దుకోవచ్చు. కానీ శరీరంలో నడుము కింది భాగం లేదా చేతులు, కాళ్లు మాత్రమే లావైపోయే పరిస్థితి కొందర్లో ఉంటుంది. ఎలాంటి డైట్‌లూ, వ్యాయమాలూ, బేరియాట్రిక్ సర్జరీలతో వీళ్లకు ఫలితం దక్కదు. ఈ పరిస్థితే ‘లిపిడిమా’! ఈ సమస్యను సరిదిద్దే అద్భుతమైన చికిత్స ఉంది అంటున్నారు ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీ నగేష్!
అధిక బరువును వ్యాయామంతో తగ్గించుకోవచ్చు అనుకుంటాం. డైటింగ్ చేస్తే, శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు కరిగిపోతుంది అని నమ్ముతాం! కానీ అందర్లోనూ ఇది సాధ్యపడదు. మరీ ముఖ్యంగా కొందరు మహిళల్లో కొన్ని అవయవాల్లో లావుపాటి కొవ్వు కణాలు తయారవుతూ, లింఫ్ గ్రంథుల పనితీరు, రక్తనాళాల పనితీరు దెబ్బతింటూ ఉంటుంది. దాంతో నడుము కింది భాగం, కాళ్లు లేదా చేతుల్లో మాత్రమే కొవ్వు విపరీతంగా పేరుకుంటూ ఉంటుంది. ఎన్ని వ్యాయమాలు చేసినా, పస్తులున్నా ఆ భాగాల్లోని కొవ్వు మాత్రం కరగదు. ఈ మొండి కొవ్వు పేరుకునే పరిస్థితే ‘లిపిడిమా’! ప్రపంచవ్యాప్తంగా 11 నుంచి 15ు మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. 1940లోనే ఇదొక ఆరోగ్య సమస్యగా గుర్తింపు పొందినా 2019 వరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్నొక ఆరోగ్య సంస్థగా నిర్థారించలేదు. దాంతో అంతకు ముందు వరకూ ఈ సమస్య ఒబీసిటీ లేదా ఎలిఫెంటియాసిస్, లింఫొడీమా కోవకే పరిమితమైపోయింది.

మూలాలు అవే!
లిపిడిమాకు జన్యుపరమైన మూలాలున్నాయి. అలాగే హార్మోన్లు కూడా ఈ సమస్యకు దోహదపడతాయి. తల్లి నుంచి కూతురికి జన్యుపరంగా సంక్రమిస్తూ ఉంటుంది. తొలి నెలసరి సమయంలో శరీరంలో మొదలయ్యే ఈ సమస్య, ప్రతి ప్రెగ్నెన్సీతో పెరిగిపోతూ ఉంటుంది. అలాగే మెనోపాజ్ దశలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఈ సమస్య పెరిగిపోతూ ఉంటుంది. అలాగే హిస్ట్రక్టమీ లాంటి గైనకాలజీ సంబంధిత సర్జరీలు జరిగిన తర్వాత కూడా ఈ సమస్య మహిళల్లో పెరిగిపోవచ్చు. గర్భాశయం తొలగించే హిస్ట్రక్టమీ సర్జరీ చేయించుకున్న తర్వాత మహిళలు లావైపోతూ ఉండడానికి లిపిడిమానే ప్రధాన కారణం. ఇదొక కనెక్టివ్ టిష్యూ డిజార్డర్. నడుము కింది లేదా పైభాగాలు ఈ సమస్య బారిన పడుతూ ఉంటాయి. పిరుదులు, తొడలు, కాళ్లు, చేతుల్లో మొండి కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. లిపిడిమా ఉన్న వాళ్లలో, నడుము సన్నగానే ఉన్నా, ఈ అవయవాలు లావెక్కిపోతూ ఉంటాయి. ఈ సమస్య ఉన్నవాళ్లు తినే ఆహారంతో చేసే వ్యాయామంతో సంబంధం లేకుండా ఆయా అవయవాల్లో మాత్రమే మొండి కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. డైట్, వ్యాయామాలు చేసినా, నడుము, ఛాతీ సన్నబడిపోయి, ముఖం పీక్కుపోతుంటాయే తప్ప, ఈ కొవ్వు మాత్రం కరగదు. కొంతమంది వ్యాయామాలు, డైట్‌లతో విసిగిపోయి అంతిమంగా బేరియాట్రిక్ సర్జరీని కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ దాని వల్ల కూడా వీళ్లలో ఫలితం ఉండదు.
ఈ సమస్యలూ తప్పవు
లిపిడిమా ఉన్న మహిళల్లో మోకీళ్లు, చీలమండల కీళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే అరికాళ్లలో వంపు తగ్గిపోయి, చదునుగా మారిపోతాయి. వీళ్లలో వెరికోజ్ వెయిన్స్ సమస్య కూడా ఎక్కువే! ఇది కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ కాబట్టి వీళ్లలో లింఫ్ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. రక్తనాళాల గోడలు కూడా బలహీనపడతాయి. దాంతో ఆయా అవయవాల్లో నీరు చేరుకుంటూ ఉంటుంది. కొవ్వు కణాలు లావుగా, ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. కొందర్లో ఆ అవయవాల్లో స్పైడర్ వెయిన్స్ కూడా కనిపిస్తాయి. చిన్న పాటి దెబ్బలకే చర్మం కందిపోతూ ఉంటుంది. ఆ ప్రవేశంలో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. దశలవారీగా పెరుగుతూ పోయే ఈ సమస్యను ప్రారంభంలోనే గుర్తించి, చికిత్సతో సరిదిద్దుకోగలిగితే, లిపిడిమా వృద్ధిని అదుపు చేయవచ్చు. అలా కాకుండా చివరిదైన నాలుగో దశకు చేరుకుంటే, సమస్యను సరిదిద్దడం అసాధ్యం. కాబట్టి ప్రారంభంలోనే గుర్తించి, లింఫాటిక్ స్పేరింగ్, వాటర్ అసిస్టెడ్, మినిమల్ యాక్సెస్ ఫ్యాట్ రిమూవల్ పద్ధతి ద్వారా ఆయా అవయవాల్లోని కొవ్వును తొలగించుకోవాలి. ఈ చికిత్సతో లిపిడిమా అక్కడితో ఆగిపోతుంది. లేదా వృద్ధి నెమ్మదిస్తుంది.
కొవ్వు తొలగిస్తే తంటా తప్పుతుంది
లింఫ్ వ్యవస్థను, రక్తనాళాలను ఇబ్బంది పెడుతున్న కొవ్వును ఆయా అవయవాల్లో నుంచి తొలగించమే లిపిడిమాకు ఏకైక పరిష్కారం. సాధారణ వ్యక్తుల్లో కొవ్వు కణాలు చిన్నవిగా, దగ్గర దగ్గరగా, మెత్తగా ఉంటే, లిపిడిమా ఉన్న వాళ్లలో కొవ్వు కణాలు లావుగా, బరువుగా ఉంటాయి. దాంతో రక్తనాళాలు, లింఫ్ నాళాలు నొక్కుకుపోతూ ఉంటాయి. దాంతో లింఫ్ స్రావాలు ప్రవహించే వీలు లేకుండా పోయి, అవయవాల్లో నీరు నిలిచిపోతూ ఉంటుంది. కాబట్టి లావుగా, బరువుగా ఉండే కొవ్వును తొలగిస్తే, పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. కాబట్టి ఎమ్మారై ద్వారా కొవ్వు పరిమాణాన్ని కనిపెట్టి, రెండు నుండి నాలుగు సిట్టింగ్స్‌లో వాటిని తొలగించవలసి ఉంటుంది. చికిత్సలో భాగంగా బాడీ జెట్ పరికరంతో, వాటర్ అసిస్టెడ్, లింఫాటిక్ స్పేరింగ్ లైపోసక్షన్ ద్వారా కొవ్వు కణాలను తొలగిస్తారు. ఈ ప్రక్రియలో భాగంగా సమస్య ఉన్న అవయవం దగ్గర చిన్న రంథ్రం చేసి, క్యానెల్లాను లోపలికి పంపించి, నీళ్లను వేగంగా చిమ్మేలా చేస్తారు. అప్పుడు రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాంతో చికిత్స తాలూకు ప్రభావం నుంచి అవి రక్షణ పొందుతాయి. తర్వాత, లింఫ్‌నాళాలకూ, రక్తనాళాలకూ అతుక్కున్న ఉన్న కొవ్వు కణాలు కదిలి, విడిపోతాయి. వాటిని క్యానెల్లా ద్వారా పీల్చేయడం జరుగుతుంది.

బిగుతు పెంచే ‘రెనూవియాన్’
ఎపిడిమా చికిత్స పూర్తయిన తర్వాత, ఆయా శరీర భాగాల్లో చర్మం వదులు కావచ్చు. అలాంటప్పుడు అప్పటికే లింఫ్ వ్యవస్థ దెబ్బతిని ఉంటుంది కాబట్టి ఆ అదనపు చర్మాన్ని తొలగించడం సర్జరీని ఎంచుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి రెనూవియాన్ అనే విధానాన్ని వైద్యులు ఎంచుకుంటారు. ఈ ప్రక్రియలో ఒక చిన్న రంధ్రం ద్వారా చర్మం అడుగున హీలియం ప్లాస్మాను విడుదలయ్యేలా చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడే 30ు మేరకు చర్మం బిగుతుగా మారిపోతుంది. తర్వాతి ఆరు నెలల్లో చర్మం బిగువు మరింత పెరుగుతుంది. ఈ ప్రభావం పదేళ్ల వరకూ ఉంటుంది.
డాక్టర్ వి. కె. శ్రీ నగేష్
ప్లాస్టిక్ సర్జన్,
అపోలో హాస్పిటల్స్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్.