Valentine's Day: పడ్డానండీ ప్రేమలో మరి...
ABN , First Publish Date - 2023-02-13T22:00:02+05:30 IST
ప్రేమికుల రోజు ప్రేమికులదే కాదు. మనల్ని ప్రేమించే, మనం ప్రేమించే సన్నిహితులు, స్నేహితులు రక్తసంబంధీకులందరిదీ! ఇలా ప్రేమించిన వ్యక్తితో పాటు మిగతా అందరికీ అంతే సమానమైన ప్రేమను పంచడంలో....
పరాయి వ్యక్తిని ప్రేమించే ముందు, కని పెంచిన మా ప్రేమ గుర్తుకురాలేదా? అని తల్లితండ్రులు వాపోతే, నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు నాకు లేదా? అని యువత ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు వాదనల్లోనూ న్యాయం ఉంది. అలాంటప్పుడు ఎవరినీ నొప్పించ కుండా, జీవిత లక్ష్యాలు దెబ్బతినకుండా సరైన వ్యక్తిని ఎంచుకునే విషయంలో యువత తెలివిగా నడుచుకోవడం అవసరం అంటున్నారు మానసిక వైద్యులు.
ప్రేమికుల రోజు ప్రేమికులదే కాదు. మనల్ని ప్రేమించే, మనం ప్రేమించే సన్నిహితులు, స్నేహితులు రక్తసంబంధీకులందరిదీ! ఇలా ప్రేమించిన వ్యక్తితో పాటు మిగతా అందరికీ అంతే సమానమైన ప్రేమను పంచడంలో విజ్ఞత ప్రదర్శించినప్పుడే నిజమైన ప్రేమికులం కాగలుగుతాం. సాధారణంగా ఏ తల్లితండ్రులైనా కుటుంబ విలువలు, సంప్రదాయాలు, సంస్కృతులకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. కానీ యువత వీటన్నిటికీ విరుద్ధంగా భావోద్వేగాలకే విలువనిస్తూ ఉంటారు. కానీ ప్రేమోద్వేగంలో మిగతా విషయాలను అలక్ష్యం చేసి, దూకుడుగా ముందుకు వెళ్లడం సరికాదు. ఆ సమయంలో పెరిగిన విధానం, కుటుంబ విలువలు, పద్ధతులను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోగలిగితే, ఆ నిర్ణయంతో ప్రేమికులతో పాటు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. ఇలాంటప్పుడు తల్లితండ్రులకూ, పిల్లలకూ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తకుండా ఉంటాయి.
ఇమ్మెచ్యూర్ ఎమోషనల్ ఆటిట్యూట్ (ఐ.ఇ.ఎ)
ప్రేమించిన వ్యక్తిలో తాము ఎలాంటి మ్యాజిక్‌ను చూశారో, అదే మ్యాజిక్ తల్లితండ్రులకు కూడా కనిపిస్తుందనే ఆలోచనలో ప్రేమికులు ఉండిపోతూ ఉంటారు. నిజానికి ఆ భావోద్వేగాలు ప్రేమికులకే పరిమితం. భావోద్వేగాలు ప్రత్యక్ష ప్రసారాల్లాంటివి కావు. ప్రేమికులకు కనిపించే, అనుభవించే భావోద్వేగాలు, మానసిక అనుబంధాలు అందరికీ కనిపించవు, అర్థం కావు. ఆ మానసిక చట్రంలో ఇరుక్కుపోయిన ప్రేమికులు తమ తల్లితండ్రులను ఎలాగైనా ఒప్పించుకోగలమనే భ్రమలో ఉండిపోతారు. అదే ఇమ్మెచ్యూర్ ఎమోషనల్ ఆటిట్యూడ్.
ఏ విలువలు మరుగున పడుతున్నాయి?
పుట్టినరోజు, ప్రేమికుల రోజు లేదా ఎమోషనల్‌గా కుంగిపోయిన సమయంలో సదరు వ్యక్తి ప్రపోజ్ చేసినప్పుడు ప్రేమను అంగీకరించే అమ్మాయిలు కూడా ఉంటారు. ఇలాంటి ఈవెంట్ రిలేటెడ్ ప్రపోజల్స్ భావోద్వేగ ముసుగులో జరిగిపోతూ ఉంటాయి. పరిస్థితులు, పరిసరాల ప్రభావం వల్ల సదరు వ్యక్తి ప్రేమను నేను అంగీకరించానా అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి? ఇదే వాతావరణం, ఇదే భావోద్వేగం, అంతే సమానమైన ప్రేమ తీవ్రత, జీవితంలో చివరి క్షణం వరకూ సదరు వ్యక్తితో నాకు దక్కుతుందా? అనే విషయం ఆలోచించాలి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగకపోతే, ఇంతే సమానమైన భావోద్వేగాలను నేను కొనసాగించగలిగే అవకాశం ఉంటుందా? అనే విషయం కూడా ఆలోచించాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం.
విలువలకు దన్నుగా...
ప్రపోజ్ చేసిన వ్యక్తికి సమాధానం ఏం చెప్పాలో అనే భయం, మళ్లీ ఈ అవకాశం రాదేమోననే అభద్రతా భావం... ఈ రెండు భావోద్వేగాలు ప్రపోజల్ అందుకున్న వాళ్లలో తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాల్లో, వ్యాల్యూ సిస్టమ్‌ను అంచనా వేసుకుని, నిర్ణయానికి అవసరమైనంత సమయాన్ని తప్పక తీసుకోవాలి. తొందరపాటు ప్రేమ, మనకు తెలియకుండానే కుటుంబ విలువలు, సంస్కృతులను మర్చిపోయేలా చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లితండ్రులు పిల్లల ప్రేమను వ్యతిరేకిస్తే, పెద్దల మీద అభియోగాలకు పాల్పడుతూ ఉంటారు. ఇలాంటి ఈ రియాక్షన్, భావోద్వేగం నుంచే తప్ప వాస్తవం నుంచి వచ్చింది కాదు. ప్రేమించిన వ్యక్తి తిట్టడు, విమర్శించడు, అడ్డు చెప్పడు... దాంతో కొత్త ప్రేమలో ఉండే తీయదనం ఒరవడిలో ప్రేమికులు కొట్టుకుపోతూ ఉంటారు. అలా కొద్ది రోజుల ప్రేమతో, తల్లితండ్రుల 20 ఏళ్లు పెంపకంలోని చిన్నా చితకా ప్రతికూల సందర్భాలను బేరీజు వేసుకుంటూ ఉంటారు. అయితే ప్రేమలో పడే సమయంలో, తల్లితండ్రులు ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి దూరాలోచనతో పెంచారు? నీ వయసెంత? నీ లక్ష్యం ఏంటి? ఆ దిశగా ప్రయాణిస్తున్నావా లేదా? లక్ష్యం వైపు సాగే ప్రయాణంలో ఒడిదొడుకులు ఏమున్నాయి? లాంటి అంశాలన్నీ ఆలోచించి, ఈ వ్యాల్యూ సిస్టమ్‌కు ప్రేమించే వ్యక్తి దన్నుగా నిలబడగలుగుతాడా? అనేది ఆలోచించాలి.
వ్యాలెంటైన్స్ డే అంటే?
వ్యాలెంటైన్స్ డే... ఇష్టపడిన వ్యక్తి పట్ల ప్రేమను వ్యక్తం చేసే రోజే కాదు. మన చదువు, మన కుటుంబం, లక్ష్యం పట్ల కలిగి ఉన్న ప్రేమను వ్యక్త పరిచే రోజు కూడా అదే! ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాల్లో జీవిత లక్ష్యం 50 నుంచి 70ు నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటుంది. ప్రేమికుల మధ్య వ్యతిరేకతలు తలెత్తనంతవరకూ, సదరు వ్యక్తి వల్లే తానీ స్థాయికి ఎదిగానని ప్రేమికులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రేమించిన తొలి రోజుల్లో లక్ష్యం వైపు ప్రయాణం సాఫీగా సాగుతున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ తర్వాత ఆ దారి క్రమం తప్పుతుంది. ఇందుకు కారణం ప్రేమానుబంధంలో ఒకరి బలహీనతలు ఒకరికి అర్థమై, వ్యతిరేకతలు తలెత్తడమే! ఫలితంగా ఆసక్తి, ఆలోచనలు లక్ష్యం నుంచి తప్పుకుని, బంధాన్ని కాపాడుకోవడం మీదే కేంద్రీకృతమవుతాయి. దాంతో జీవిత లక్ష్యం మరుగున పడిపోతుంది. కాబట్టి జీవిత లక్ష్యం నిర్లక్ష్యానికి గురవకుండా, గమ్యం వరకూ దాన్ని ఎల్లకాలం కాపాడే ప్రేమే సిసలైన క్లాసికల్ లవ్ స్టోరీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
స్నేహంతో మొదలుపెట్టి..
ఒక సినిమా వాల్ పోస్టర్ చూసి సినిమా సక్సె్‌సను అంచనా వేయడానికీ, సినిమా చూసి సినిమా సక్సె్‌సను అంచనా వేయడానికీ తేడా ఉంది. లవ్ ప్రపోజల్ కేవలం వాల్ పోస్టర్ లాంటిది. ఆ చిన్న పరిధి గొప్పగా అనిపిస్తుంది. కానీ ప్రపోజల్ సమయంలో సుదూరంగా ఆలోచించడం అవసరం. మరి ప్రేమలో పడకుండా సదరు వ్యక్తిని ఎలా అంచనా వేయడం? అనే అనుమానం రావచ్చు. అందుకోసం మొదట మంచి స్నేహితులుగా కొనసాగవచ్చు. ఆ సమయంలో ప్రవర్తనపరంగా, మాటల పరంగా అవతలి వ్యక్తిలో ప్రేమ భావాలు తలెత్తకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎప్పటికప్పుడు మంచి స్నేహితులమనే భావననే అతనికి కలిగిస్తూ, స్పష్టతతో నడుచుకుంటూ ఉండాలి. ప్రేమ అనే ఎమోషనల్ కనెక్టివిటీ పరిధిలోకి వెళ్లకుండా ఒకరి అలవాట్లు, అభిప్రాయాలు, ప్రవర్తనలనూ మ్యాచ్ అవుతాయో లేదో గమనించుకోవాలి. ఇలా ఎమోషనాలిటీలో ప్రాక్టికాలిటీని కలగలిపి ఒకర్నొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతిమంగా అన్ని రకాలుగా ఆ బంధం అనుకూలంగా ఉంటే, ప్రపోజ్ చేసుకుని ప్రేమబంధాన్ని కొనసాగించాలి. లేదంటే స్నేహితులుగానే విడిపోవాలి.
డాక్టర్ కల్యాణ చక్రవర్తి
కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,
ల్యూసిడ్ డయాగ్నొస్టిక్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్.
లవ్‌కెమిస్ట్రీ
ప్రేమలో పడితే ఆకలి దప్పులుండవు. నిద్ర పట్టదు. ఇరవై నాలుగ్గంటలూ మనసు పడిన వ్యక్తి గురించిన ఆలోచనలే! గమ్మత్తైన ప్రేమ మత్తులో తేలిపోవడం, ఊహాలోకంలో విహరించడం, ప్రేమించిన వ్యక్తికి సంబంధించిన ప్రతి అంశమూ మనోహరంగా కనిపించడం లాంటివన్నీ అత్యంత సహజం. అయితే ఈ భావనలన్నీ మనసులోనే పుడుతున్నాయి అనుకుంటే పొరపాటు. నిజానికి ఇవన్నీ మెదడులో స్రవించే హార్మోన్ల తుంటరి చేష్టలు. ప్రేమలోపడే తీరును దశలవారీగా పరిశీలిస్తే...
ఆకర్షణీయమైన వ్యక్తిని చూసినప్పుడు హైపోథలామస్ శరీరంలోకి డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దాంతో పారవశ్యం, ఎక్సైట్‌మెంట్ మొదలైన భావాలు మొదలవుతాయి.
డోపమైన్ పరిమాణం పెరిగినప్పుడు సెరటోనిన్ మోతాదు తగ్గుతుంది. సెరటోనిన్ తగ్గడంతో ఆకలిదప్పులు, నిద్ర తగ్గుతాయి. భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. ప్రేమలో పడిన వ్యక్తుల్లో సెరటోనిన్ మోతాదులు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ సమస్య ఉన్న వ్యక్తుల్ల సెరటోనిన్ మోతాదులు సమానంగా ఉంటాయి. ఫలితంగా సదరు వ్యక్తులు ఆకర్షణ లేదా అబ్సెషన్‌కు లోనవుతారు.
డోపమైన్‌తో పాటు శరీరం నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే పదార్థాన్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. శృంగార భావాలకు కారణమైన ఈ నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్ కొత్తగా ప్రేమలో పడిన వారిలో మరింత ఉధృతంగా ఉంటుంది. దీర్ఘకాల అనుబంధాల్లో ఉన్న వారిలో ఈ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది. ఈ ఫ్యాక్టర్ మోతాదు మీదే సదరు వ్యక్తుల శృంగార భావనల తీవ్రత ఆధారపడి ఉంటుంది.
ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ హార్మోన్లు... అనుబంధం, కట్టుబడి ఉండడం లాంటి భావాలకు కారణాలు. మెదడులోని హైపోథలామస్ ఈ రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. విపరీతమైన ఉద్రిక్తతకు లోనైనప్పుడు, సుఖప్రాప్తి సమయంలో ఈ హార్మోన్లు రక్తంలోకి స్రవించబడి, దీర్ఘకాల అనుబంధానికి బాటలు వేస్తాయి.
ఈ హార్మోన్లు మెదడులోని వేర్వేరు ప్రదేశాల మీద ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా మెదడులో ప్రేమకు సంబంధించిన ప్రదేశంలో యాక్టివిటీ పెరిగిపోతుంది. దాంతో అమిగ్దాలా పనిచేయడం మానేసి, ప్రేమించిన వ్యక్తిలోని లోపాలను, తప్పులను పరిగణించడం మానేస్తాం.