ఆ రాళ్లపై.. ఓ కన్ను వేసి ఉంచండి!
ABN , First Publish Date - 2023-09-17T23:51:18+05:30 IST
‘‘నలభై ఏళ్ల వయసు స్థూలకాయులైన, పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల్లో పిత్తాశయంలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది.

డాక్టర్
పిత్తాశయంలో రాళ్లు చేరితే ఆపరేషన్ తప్పదు అనుకోవడం పొరపాటు. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయడమూ సరి కాదు. పొంచి ఉండే ఈ ముప్పు మీద ఓ కన్నేసి ఉంచమంటున్నారు నిపుణులు.
‘‘నలభై ఏళ్ల వయసు స్థూలకాయులైన, పునరుత్పత్తి దశలో ఉన్న మహిళల్లో పిత్తాశయంలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఊబకాయుల్లో పిత్తాశయంలో రాళ్లు చేరే అవకాశాలు ఎక్కువ. కొవ్వుతో కూడిన ఆహారం తినడం వల్ల బైల్ కాంపొజిషన్ మారుతుంది. కాలేయం నుంచి వచ్చే బైల్ సాంద్రతను పెంచి కొంత సమయం వరకూ తనలో నిల్వ చేసుకోవడం పిత్తాశయం స్వభావం. అయితే బైల్ కాంపోజిషన్‌లో మార్పులు జరిగినా, అవసరానికి మించి కొవ్వు పదార్థాలు తినడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగినా అది పిత్తాశయంలోని బైల్‌తో కలిసిపోయి స్ఫటికాలు ఏర్పడేలా చేస్తుంది. ఈ స్ఫటికాల సంఖ్య క్రమేపీ పెరిగి, అవి రాళ్లులా మారతాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణాలు.
అలా్ట్రసౌండ్‌లో మాత్రమే..
సాధారణంగా పిత్తాశయంలో రాళ్లున్న వారిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా అలా్ట్రసౌండ్ పరీక్ష చేసినప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది. ఈ కోవకు చెందిన వారిలో ఎలాంటి లక్షణాలు, అసౌకర్యాలూ ఉండవు. వీళ్లు ఎసింప్టమాటిక్ కోవలోకి వస్తారు. కానీ కొంతమందిలో లక్షణాలు ఉంటాయి. బొడ్డు పైభాగంలో నొప్పి, అప్పుడప్పుడూ కుడి భుజంలో నొప్పి మొదలై వెన్నులోకి పాకుతూ ఉంటుంది. ఇంకొంత మందిలో అజీర్తి, డిస్లెప్సియా, కడుపు ఉబ్బరం లాంటి లక్షణాలుంటాయి.
క్లిష్టం కావచ్చు
పిత్తాశయంలో రాళ్ల చుట్టూ ఇన్‌ఫెక్షన్ చేరి వాపు రావచ్చు. దీన్ని కొలిసిస్టైటిస్ అంటారు. ఈ పరిస్థితి తలెత్తినప్పుడు తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. జ్వరం, వాంతులు వేధిస్తాయి. అలాగే కామెర్లు కూడా మొదలవుతాయి. ఒకవేళ రాయి కిందకు జారి కాలేయ నాళం లేదా పిత్తాశయ నాళంలోకి ప్రవేశించి అక్కడ ఇరుక్కుపోవచ్చు. పిత్తాశయంలోని స్రావాలన్నీ కాలేయం నుంచి వచ్చే నాళాల ద్వారా పేగుల్లోకి చేరుకుంటాయి. ఎప్పుడైతే పిత్తాశయంలోని రాళ్లు కిందకు జారి కాలేయ నాళంలో ఇరుక్కుంటాయో, ఆ ప్రభావం కాలేయం మీద పడి కామెర్లు మొదలవుతాయి. అలాంటి సందర్భంలో అబ్‌స్ట్రక్టివ్ జాండిస్ మొదలవుతుంది. అలాగే ఈ రాళ్లు ఇంకాస్త కిందకు జారి పిత్తాశయ నాళంలో ఇరుక్కుంటే బిలరీ పాంక్రియాటైటిస్ తలెత్తుతుంది. ఈ రెండు సమస్యలూ ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టేవే!
ముప్పు ఎవరికి?
పిత్తాశయంలోని రాళ్లు కిందకు జారి ప్రాణాంతకంగా మారే పరిస్థితి కొందరిలో ఉంటుంది. పిత్తాశయంలోని రాళ్ల వల్ల పదే పదే తలెత్తే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, రాళ్లు మరీ చిన్నవిగా ఉండడం వల్ల ఈ పరిణామం తలెత్తుతుంది. సాధారణంగా రాళ్లు ఎంత పెద్దవిగా ఉంటే ప్రమాదం అంత ఎక్కువ అనుకుంటూ ఉంటారు. కానీ పిత్తాశయం విషయంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. పెద్ద రాళ్లు పిత్తాశయం నాళం కంటే పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవి అక్కడి నుంచి కిందకు జారే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రాణంతకంగా మారే పరిస్థితి తలెత్తదు. కానీ చిన్న రాళ్లు తేలికగా కిందకు జారి కాలేయ నాళంలో లేదా పిత్తాశయ నాళంలో ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలా కిందకు జారిపోకుండా పిత్తాశయంలోనే ఉండిపోయిన రాళ్లు కూడా సమస్యను తెచ్చి పెడతాయి. వాటి చుట్టూ ఇన్‌ఫెక్షన్ చేరి, వాపు, చీము పేరుకుంటాయి. కాబట్టి పిత్తాశయంలో రాళ్ల పరిమాణం ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా ఏదో ఒక సమయంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కోక తప్పదు.
సర్జరీని వాయిదా వేయచ్చా?
లక్షణాలు లేని వాళ్లు సాధారణంగా సర్జరీని వాయిదా వేస్తూ ఉంటారు. సాధారణంగా మధుమేహుల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. వీరిలో నాడులు దెబ్బతిని ఉంటాయి. ఏ నొప్పి తీవ్రతను కూడా వీళ్లు సంపూర్ణంగా గ్రహించలేరు. ఆఖరుకు గుండెపోటు వచ్చినా, ఆ నొప్పి లక్షణాలు వీళ్లలో తీవ్రంగా ఉండవు కాబట్టి నిర్లక్ష్యం చేసి ప్రాణాలు పోగొట్టుకునే మధుమేహులూ ఉన్నారు. అలాగే పిత్తాశయంలోని రాళ్ల నొప్పి కూడా! లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో ఈ సమస్యను కూడా మధుమేహులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. పరిస్థితి ప్రాణాంతకంగా మారినా వీళ్లు కనిపెట్టలేరు. కాబట్టి ఇలాంటి వాళ్లకు పరీక్షల్లో పిత్తాశయంలో రాళ్లు కనిపిస్తే, వెంటనే సర్జరీ చేయించుకోమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అజీర్తి, నొప్పి, కడుపు ఉబ్బరం, పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు ఏ కొద్దిగా కనిపించినా మధుమేహులు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించడం మేలు. అయితే పిత్తాశయంలో రాళ్లు కనిపించిన వెంటనే ప్రతి ఒక్కరూ అత్యవసరంగా సర్జరీ చేయుంచుకోవలసిన అవసరం కూడా లేదు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని తేలినప్పుడు, లక్షణాలు ఉన్నా, లేకపోయినా వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకుంటూ, వారి పర్యవేక్షణలో మెలుగుతూ ఉండాలి. లక్షణాలు ఏడాది పాటు కనిపించకపోతే, తదుపరి స్కాన్ కోసం మరుసటి ఏడాది వరకూ ఆగవచ్చు. అలాగే పిత్తాశయంలోని రాళ్ల పరిమాణాన్ని పట్టించుకోకూడదు. వాటి పరిమాణం పెరిగినా భయపడవలసిన అవసరం లేదు. పిత్తాశయంలోని రాళ్ల విషయంలో వాటి పరిమాణం కంటే బయల్పడే లక్షణాలే కీలకం.
సర్జరీ ఇలా....
ల్యాప్రోస్కోపిక్ పద్థతిలో పొట్టకు నాలుగు చిన్నపాటి రంథ్రాలు వేసి, పరికరాలు, కెమెరా సహాయంతో సర్జరీ చేయవలసి ఉంటుంది. కొత్తగా రోబోటిక్ సర్జరీ కూడా అందుబాటులోకొచ్చింది. రెండు సర్జరీల్లో వైద్యులు ఒకే సూత్రాన్ని అనుసరిస్తారు. ఈ రెండు సర్జరీల్లో పక్కన ఉన్న సున్నితమైన అవయవాలు ఏమాత్రం దెబ్బ తినకుండా రాళ్లని తొలగించడం జరుగుతుంది. ఈ సర్జరీల్లో కోలుకునే సమయం కూడా ఎంతో తక్కువ.
ఇదే సరైన నిర్ణయం
లక్షణాలు పెరిగితే సర్జరీని వాయిదా వేయకూడదు. అలాగే రాళ్లు కిందకు జారే వరకూ ఆగకపోవడమే మంచిది. రాళ్లు కిందకు జారే ప్రాణాంతకమైన సందర్భాల్లో సర్జరీ కూడా క్లిష్టంగా మారుతుంది. అలా కాకుండా రాళ్లు పిత్తాశయంలోనే ఉండి ఇన్‌ఫెక్షన్‌కు గురైతే తేలికైన సర్జరీతో పిత్తాశయాన్ని తొలగించుకోవచ్చు.
డాక్టర్ వి. పవన్ కుమార్,
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,
ఎస్‌ఎల్‌జి హాస్పిటల్స్, బాచుపల్లి, హైదరాబాద్.