మహిళా బిల్లు

ABN , First Publish Date - 2023-09-22T00:56:05+05:30 IST

పాయసం వండి ఉట్టి మీద పెట్టాం ఉత్సవాలు చేసుకోండీ ఉత్సాహంగా నృత్యాలు చేయండి అన్నలకు, తండ్రులకు హారతులు పట్టండి...

మహిళా బిల్లు

పాయసం వండి

ఉట్టి మీద పెట్టాం

ఉత్సవాలు చేసుకోండీ

ఉత్సాహంగా నృత్యాలు చేయండి

అన్నలకు, తండ్రులకు హారతులు పట్టండి

ఎదురుచూపులు మీకేం కొత్తకాదు

పలకా బలపం కోసం ఎదురు చూసారు

బస్సుల్లో ప్రత్యేక సీట్లకోసం మధనపడ్డారు

ఆస్తిలో వాటాకోసం తపనపడ్డారు

ఇష్టంలేని కాపురాన్ని వదిలించుకోవడానికి

యుద్ధమే చేసారు

కళ్ళల్లో వత్తులు వేసుకోవడం

గుడ్ల నీళ్ళు గుడ్లల్ల కుక్కుకోవడం

మీకు అలవాటయిందే కదా

మీకు పీటలు వాల్చాం

మెడలో దండలు వేశాం

పూజలు చేశాం

ఆకాశంలో సగమన్నాం చాలదా

***

మీరు ఇవ్వడం కాదు

మేమే గుంజుకుంటాం

మౌనం కాదు మాట్లాడతాం

మీరు పీఠాలివ్వడం కాదు

మేం పాఠాలు నేర్పుతాం

ఆకాశంలో సగం కాదు

ఆకాశంతో సమానం

వారాల ఆనంద్

Updated Date - 2023-09-22T00:56:05+05:30 IST