Share News

సనాతన ధర్మంపై వ్యతిరేకత ఎందుకు?

ABN , First Publish Date - 2023-10-29T05:29:41+05:30 IST

సనాతన ధర్మం విషయమై రాజకీయపరమైన రభస జరుగుతోంది. ఈ ధర్మం పూర్వాపరాలు, ఆ రభసకు కారణాలు తెలుసుకోవాల్సిన అవసరమున్నది....

సనాతన ధర్మంపై వ్యతిరేకత ఎందుకు?

సనాతన ధర్మం విషయమై రాజకీయపరమైన రభస జరుగుతోంది. ఈ ధర్మం పూర్వాపరాలు, ఆ రభసకు కారణాలు తెలుసుకోవాల్సిన అవసరమున్నది.

సనాతనం అంటే ప్రాచీనమైనది, శాశ్వతమైనది అని చెప్పవచ్చు. ధర్మం అనగా మానవత్వాన్ని రక్షించేది. కనిపిస్తున్న, కనిపించని వాటినన్నింటినీ నడిపించే ప్రకృతి నియమావళే ధర్మం. ధర్మం అనే భావనకు భారతీయ మతాలైన హైందవం, బౌద్ధం, జైనం, సిక్కు సంప్రదాయంలో స్వల్ప భేదాలతో చాలా అర్థాలు ఉన్నాయి. ఇవి కాలానుగుణంగా చెప్పబడ్డాయి.

చరాచర జగత్తు అస్తిత్వానికి కారణాలను సనాతన ధర్మం నిర్వచించింది. మానవులు తమ సత్సంకల్పాలను ఇతరులకు గానీ, ప్రకృతికి గానీ హాని కలిగించకుండా నెరవేర్చుకుని, ఇహలోకంలో కీర్తినీ, సుఖాన్ని పొందడానికి దోహదం చేసే నియమావళే సనాతన ధర్మమని స్థూలంగా చెప్పవచ్చు.

ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. ధర్మం అనేది హిందూ మతంలో ఒక నిర్వాహక సూత్రం. మానవుల ప్రకృతిని, నిర్జీవ పదార్థాలను, విశ్వంలో పరస్పర అనుసంధాన చర్యలను అది వివరిస్తుంది. హిందూ మతంలో రెండు ధర్మాలు ఉన్నాయి. మొదటిది సనాతన ధర్మం. ఇది మార్పు లేనిది, స్థిరమైనది. రెండవది యుగధర్మం. ఇది హిందూ సంప్రదాయంతో స్థాపించబడిన యుగానికి, ఏక కాలానికి చెల్లుతుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే యుగ ధర్మం అనేది కాలానుగుణంగా మారుతుంది.

సనాతన ధర్మాన్ని హిందూ మత విశిష్టతగా అభివర్ణించుతారు. వివిధ అంశాల మీద విజ్ఞుల వివేచనను, సమాజాభివృద్ధికి వారు నిర్దేశించిన నియమాలను మనువుతో మొదలైన ఋషి పరంపర క్రోడీకరించింది. మానవ సమాజాలలో లిపి లేని కాలంలో ఈ నియమాలు నోటి మాట ద్వారా ఉపదేశించబడేవి. అందుచేత సనాతన ధర్మ కాలం ఎప్పటి నుంచి ప్రారంభమయిందో గుర్తించబడలేదు. ఈ అనూచాన ధర్మాన్ని లిఖితపూర్వకంగా పొందుపరిచినవారు వేదవ్యాసుడు, భృగు మహర్షి అని అంటారు. ఈ సనాతన ధర్మాన్నే మనుస్మృతి అని కూడా పిలుస్తారు. వేదాలు, ఉపనిషత్తులు సనాతన ధర్మానికి ప్రాతిపదికలు, ప్రామాణికాలు అని చెప్పవచ్చును.

ప్రజాపతి (బ్రహ్మ), శతౄప (సరస్వతి) సంతానమే మనువు. అనంతి అనే ఆమెను మనువు భార్యగా బ్రహ్మ సృష్టించాడు. మానవ జాతి అంతా వీరి సంతానమేనని పురాణాలు చెబుతున్నాయి. మనుస్మృతి ప్రాచీనమైన హిందూ ధర్మశాస్త్రం. దీనినే మనుధర్మశాస్త్రం, మానవ ధర్మశాస్త్రం, మను చట్టాలు అని కూడా చెబుతారు. ఇప్పుడున్న మనుస్మృతి ఏడుగురు మనువుల కాలంలో మార్పులు చెందిందని అంటారు.

బ్రహ్మ సృష్టికర్త. ఆయన నోటి నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టినట్టు ఋగ్వేదం చెప్పింది. వేదాలు చదివి ఆచరించడం, బోధించడం, సమర్పణలు ఇవ్వడం, తీసుకోవడం బ్రాహ్మణుల బాధ్యత; ప్రజాకర్షణ, సమర్పణలు, ఇంద్రియానుభవాలతో అనుబంధం తెంచుకోవడం క్షత్రియుల బాధ్యత; పశు సంరక్షణ, వర్తకం, వ్యవసాయం వైశ్యుల బాధ్యత; పై కులాల వారికి సహనంతో సేవ చేయడం శూద్రుల బాధ్యతగా మనుస్మృతి నిర్దేశించింది. నాలుగు వర్ణాలూ ఆదిలో పుట్టుకతో కాక కార్యనిర్వహణా ప్రతిభతో గుర్తింపబడ్డాయి.

కాలక్రమేణా వర్ణాలు జన్మతహ వర్ణాలుగా/ కులాలుగా పరివర్తన చెందాయి. ఏ కులం వారు ఆ కులానికి నిర్దేశించిన పని చేయడం ఆచారంగానూ, నిబంధనగానూ మారింది. ప్రస్తుత యాంత్రీకరణ కాలంలో పూజారులు, సలహాదారులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, కవులు, రచయితలు, తత్త్వవేత్తలను బ్రాహ్మణ వర్ణంగా చెప్పుకోవచ్చును. అలాగే స్వలాభాకాంక్ష లేని పాలకులు, శాసనకర్తలు, న్యాయమూర్తులు, సైనికులు, రక్షకభటులను క్షత్రియులుగా గుర్తించవచ్చు. పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను వైశ్యులుగా; శ్రామికులు, చేతివృత్తులు, వ్యవసాయం, ఇంటి పనులు, పారిశుద్ధ్య కార్మికులను శూద్రులుగా పరిగణించవచ్చును.

సనాతన ధర్మం ప్రకారం జీవాత్మ పూర్వ జన్మలలో సముపార్జించిన శక్తి, జ్ఞానాన్ని బట్టి ఏదో ఒక వర్ణంలో జన్మిస్తుంది. శూద్రులు వేదాలు చదివి ఆచరించడానికి అర్హులు కాదు కాబట్టి, ఎన్ని జన్మలైనా వారు సేవక వృత్తికే పరిమితం. సనాతన ధర్మంలో చెప్పిన నియమ నిబంధనలను మూడుభాగాలుగా విభజించవచ్చును. అవి: 1) మోక్ష సిద్ధికై ఆచరించేవి; 2) సర్వ మానవ సౌభ్రాతృత్వం వెల్లివిరయడానికి ప్రతీ మనిషి అనుసరించవలసిన ప్రవర్తనారీతులు; 3) సమాజాభివృద్ధికి నాలుగు వర్ణాల స్వతస్సిద్ధ బాధ్యతలు. వీటిలో మొదటి రెండూ పూర్తిగా వ్యక్తికే పరిమితమై ఇతరుల జీవనంపై అంత ప్రభావం చూపవు. మూడవది మానవ జీవన స్థాయిని శాసిస్తుంది.


నాలుగు వర్ణాల బాధ్యతలు ప్రతిభను బట్టి నిర్ణయమయ్యేవి. కాలక్రమేణా ఈ బాధ్యతలు ప్రతిభను బట్టి కాకుండా వారసత్వంతో మొదలై వర్ణాలు, కులాలు గాను, ఉప కులాలు గాను పరిణమించి ఏ కులం వారు ఆ కులానికి నిర్దేశించిన పనులే చేయాలనే ఆచారం వచ్చింది. సామాజిక వ్యవస్థలలో మార్పులు, పారిశ్రామికీకరణ, పెరుగుతున్న జనాభాతో అనేక రకాల వృత్తులు, ఉద్యోగాలు ఉనికిలోకి వచ్చాయి. వీటిని ఉన్నత కులాలు (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) కైవశం చేసుకుంటున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన శూద్ర కులాలు వాటితో పోటీ పడలేక అసంతృప్తికి లోనవుతున్నాయి. తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తున్నాయి. ప్రతిఘటిస్తున్నాయి. తత్ఫలితంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కులాల వారికి చదువులు, కొలువులు, చట్ట సభలలో నియమిత కేటాయింపులు జరిగాయి.

గౌతమ బుద్ధుడు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు మొదలైన మహానుభావులు కుల వ్యవస్థను ఖండించి, మానవ జాతిని ఏక త్రాటిమీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. సనాతనధర్మం చెప్పే వర్ణ వ్యవస్థకు కాలం చెల్లింది. ఆ ధర్మంలోని ఆచార నియమాలను మోక్ష సాధనకు అనుసరిస్తే ఎవరూ కాదనరు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థను హిందూ మతం సనాతనధర్మం పేరుతో ప్రోత్సహించి కొందరిని తక్కువ చూపు చూసింది, ఇంకా చూస్తోంది. ఇది కొనసాగినంత కాలం ఆయా వర్గాల నుంచి తిరుగుబాటు రావడం సహజం.

ఈ మతపరమైన ఆచారాలు, ఆచరణలకు రాజకీయం కూడా తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే! మతంలో వివాదాలు సృష్టించవద్దని మనుధర్మం ఘోషించింది. ఈ సత్యాన్ని అందరూ అర్థం చేసుకుని సనాతన ధర్మ వ్యవహారాలను మత పెద్దలకు వదిలిపెట్టాలి. శ్రామిక ధర్మం (అసమాన శ్రమ విభజనను సమాన శ్రమ విభజనగా మార్చే బాధ్యత)ను నిర్వహించడంపై రాజకీయ నాయకులు శ్రద్ధ చూపాలి. తరతరాలుగా వెనక్కి నెట్టబడిన కులాలకు చేయూతనిచ్చి సహాను భూతితో సమైక్యంగా ముందుకు నడిపించడంపైనే మన జాతి పురోగతి ఆధారపడి ఉన్నది. సనాతన ధర్మం పేరిట కలహాలు, వివాదాలు ఎవరికీ మేలు చేయకపోగా అందరికీ అపకారం చేస్తాయి.

ప్రొఫెసర్‌ ఎన్‌.శివప్రసాద్‌

విశ్రాంత ఆచార్యులు, ఐఐటీ మద్రాసు

Updated Date - 2023-10-29T05:29:41+05:30 IST