ప్రశ్నపత్రాల లీకేజీపై మౌనం ఎందుకు?

ABN , First Publish Date - 2023-03-31T01:01:23+05:30 IST

టిఎస్‌పియస్‌సిలో నిర్లక్ష్యం రాజ్యమేలి నిరుద్యోగులను నిండా ముంచింది. రాజకీయ అండదండలతో పరీక్షా పత్రం అంగడి సరుకుగా మారింది. డబ్బున్నవాడు దండుకున్నాడు..

ప్రశ్నపత్రాల లీకేజీపై మౌనం ఎందుకు?

టిఎస్‌పియస్‌సిలో నిర్లక్ష్యం రాజ్యమేలి నిరుద్యోగులను నిండా ముంచింది. రాజకీయ అండదండలతో పరీక్షా పత్రం అంగడి సరుకుగా మారింది. డబ్బున్నవాడు దండుకున్నాడు. పేదోడు మాత్రం పుస్తకాలతో కుస్తీపట్టి.. చాలీచాలని తిండి తిని కంట్లో వత్తులు వేసుకుని చదివాడు. కానీ పేపర్ లీకేజీ అతడి కష్టాన్ని నేలపాల్జేసింది. ఇది క్షమించరాని నేరం. లక్షలాదిమంది నిరుద్యోగులు.. కోట్లాదిమంది ప్రజలకు సంబంధించిన అంశం. కానీ లీకేజీకి బాధ్యులను గుర్తించి దోషులుగా నిలబెట్టేందుకు తెలంగాణ సర్కారు ఆసక్తి కనబరచకపోవడం మరో విచిత్రం. అందులో భాగమే కావచ్చు నేటికీ ముఖ్యమంత్రి కనీసం పత్రికా ప్రకటన కూడా వెల్లడించలేదు. జరిగిన ఘోరానికి చింతిస్తున్నామని.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రజల్లోకి ఓ సందేశం కూడా పంపలేదు. మరీ ఇంతటి నిర్లక్ష్యపు ధోరణి ముఖ్యమంత్రికి తగునా? నీళ్లు.. నిధులు.. నియామకాల పేరుతో ప్రారంభమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలంగాణ సాధించింది. కానీ ఏ ఆశయం కోసం యువత ఉద్యమించిందో ఆ లక్ష్యం నేడు పూర్తిగా నీరుగారుతోంది. అంతకుమించి నవ్వుల పాలవుతోంది.

దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలను భయపెట్టే రీతిలో సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏ విధంగా భావించాలి? ప్రభుత్వం ఎన్ని అక్రమాలు, అవినీతి చేసినా నోరు మూసుకొని కూర్చోవాల్సిందేనా? న్యాయపరంగా పోరాడిన వారిపై ఎదురు దాడి చేసి నోటీసులు పంపడం.. పరీక్ష లీకేజీ విషయం తెలిసి కడుపు మండి నిరసన వ్యక్తం చేసిన నిరుద్యోగులను, వివిధ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతలను జైల్లో వేయడం ఎటువంటి ప్రజాస్వామ్యం అనుకోవాలి? తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా? రాహుల్ గాంధీ సస్పెన్షన్ విషయంలో స్పందించడం.. వర్షానికి నష్టపోయిన రైతులను పరామర్శించడం.. మహారాష్ట్రకు వెళ్లి రాజకీయ సభలు నిర్వహించడం తెలుసు కానీ లీకేజీ విషయంలో మాట్లాడడానికి ముఖ్యమంత్రికి సమయం లేదా? ప్రతిపక్షాలపై దాడి చేయడం మానుకొని నిష్పాక్షిక విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి.

పగుడాకుల బాలస్వామి

Updated Date - 2023-03-31T01:01:23+05:30 IST