కరెంట్ బిల్లులు షాక్ ఎందుకు కొడుతున్నాయి?

ABN , First Publish Date - 2023-02-02T00:42:48+05:30 IST

అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వసూలు చేస్తున్న అదనపు బిల్లులు జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి..

కరెంట్ బిల్లులు షాక్ ఎందుకు కొడుతున్నాయి?

అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వసూలు చేస్తున్న అదనపు బిల్లులు జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వందల రూపాయల్లో బిల్లు కట్టే వినియోగదారులకు, ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. ఏ లెక్కలు కట్టి ఇలా వేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. డిస్కంలు ఏ నిబంధనల మేరకు ఈ వసూళ్లు చేస్తున్నాయో ఇంతవరకూ వివరణ ఇవ్వలేదు.

‘అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ)’ అనే పదం మొత్తం విద్యుత్ చట్టంలో కానీ, తెలంగాణ విద్యుత్ వ్యవస్థను నియంత్రించే తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (టి‌ఎస్‌ఈ‌ఆర్‌సి) నిబంధనలలో గానీ ఎక్కడా కనబడదు. టి‌ఎస్‌ఈ‌ఆర్‌సి ఇచ్చిన నిబంధనలలో కేవలం సెక్యూరిటీ డిపాజిట్ (ఎస్‌డి), అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ (ఏ‌ఎస్‌డి) అనే పదాలు కనబడతాయి.

రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన రెగ్యులేషన్ 6, 2004 ప్రకారం, వినియోగదారులు డిస్కంల వద్ద ఎల్లప్పుడూ రెండు మూడునెలల విద్యుత్ వినియోగానికి సరిపడా మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌ (ఎ‌స్‌డీ)గా ఉంచాలి. డిస్కంలు వినియోగదారుల నుంచి ఈ మొత్తాన్ని మూడు దశలలో వసూలు చేస్తాయి: 1) గృహ వినియోగదారులకు కొత్తగా కనెక్షన్ ఇచ్చేటప్పుడు దీనిని కిలోవాట్‌కు సుమారు రూ.80 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తాయి. పరిశ్రమలకు, వ్యాపార వర్గాలకు ఈ ఛార్జీలు వేరుగా ఉన్నాయి. 2) ఒకసారి కనెక్షన్ ఇచ్చిన మూడు నెలల తరువాత విద్యుత్ సగటు వినియోగాన్ని లెక్కించి, ఒకవేళ వినియోగం మొదట కట్టిన ఎస్‌డీ కన్నా ఎక్కువ ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ (ఏ‌ఎస్‌డి)గా వసూలు చేస్తాయి. 3) ఆ పై ప్రతీ ఏటా ఆ ఏడాది సగటు వినియోగాన్ని అంతకుముందు ఏడాది సగటుతో పోల్చి చూసి, అదనంగా జరిగిన సగటు వినియోగానికి ఏ‌ఎస్‌డీ వసూలు చేస్తాయి. ఒకవేళ వినియోగం తగ్గితే ఆ మేరకు ఏ‌ఎస్‌డీని బిల్లులలో సర్దుబాటు చేసి తగ్గిస్తాయి. ఈ ఎస్‌డీ మొత్తం వియోగదారుడి పేరు మీదనే విద్యుత్ సంస్థల వద్ద ఉంటుంది. అసలు ఎస్‌డీ ఎందుకూ అంటే– వాడిన విద్యుత్తుకు ఒకవేళ వినియోగదారుడు బిల్లు చెల్లించకపోతే, విద్యుత్ సంస్థలు కనెక్షన్ కట్ చేస్తాయి. అయినప్పటికీ వినియోగదారుడు బిల్లు చెల్లించకపోతే, ఆ బిల్లు మొత్తాన్ని ఎస్‌డీ నుంచి మినహాయించుకుంటాయి. సెక్యూరిటీ డిపాజిట్‌ కనుక లేకపోతే బిల్లు మొత్తాన్ని విద్యుత్ సంస్థలు నష్టపోతాయి. నిజానికి ఈ నిబంధన ఇప్పటివరకూ వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకే వర్తింపచేసేవారు. గృహ వినియోగదారుల నుంచి ఏ‌ఎస్‌డీ వసూళ్లపై విద్యుత్ సంస్థలు ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదు.

చిన్న చిన్న మొత్తాలు బిల్లులలో వస్తే సమస్య ఉండేది కాదు. కానీ వేలల్లో బిల్లులు వస్తున్న కారణంగా ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. నిజానికి రెండు మూడు నెలల సగటు బిల్లు వేసినా బిల్లులు వేల రూపాయల్లో రాకూడదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడి ఈ ఏడాది సగటు వినియోగం 110 యూనిట్లు, అంతకు ముందు ఏడాది సగటు వినియోగం 80 యూనిట్లు ఉంటే, అదనంగా 30 యూనిట్ల మీద, రెండు లేదా మూడు నెలల పాటు అంటే అధికంగా 90 యూనిట్లకు ఏ‌ఎస్‌డీ వసూలు చేయాలి. ఈ లెక్కన మొత్తం ఏ‌ఎస్‌డీ రూ.400 దాటకూడదు. కానీ ‘అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్’ (ఏసీడీ) పేరుతో సుమారు రూ.3500 అదనంగా చూపిస్తున్నారు.

నిజానికి విద్యుత్ వినియోగదారుల నుంచి ఏ‌ఎస్‌డీ వసూలు చేయాలంటే, టి‌ఎస్‌ఈ‌ఆర్‌సి రెగ్యులేషన్ 6, 2004క్లాస్ 6(2)(C) ప్రకారం ఆ మొత్తం ఎలా వచ్చిందో పూర్తి లెక్కలతో 30 రోజుల ముందు ప్రత్యేక నోటీసు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం విద్యుత్ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి వివరాలు ఇవ్వకుండా, బిల్లులలో ఈ మొత్తాన్ని ఒక చోట ఏసీడీ పేరుతో చూపించి వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

పైన చెప్పినట్టు అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో వేల రూపాయలలో బిల్లులు, అదీ తక్కువ విద్యుత్ వినియోగించే పేద, మధ్య తరగతి వినియోగదారులకు వచ్చే అవకాశం లేదు. మరి కారణం ఏమై ఉండొచ్చు? విద్యుత్ సంస్థలు ‘ఏ‌ఎస్‌డి’కి ‘డెవలప్‌మెంట్’ ఛార్జీలు కూడా కలిపి ‘ఏసీడీ’ పేరుతో బిల్లులు తయారు చేయటమే. వినియోగదారులకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే విద్యుత్ సంస్థలు లైన్లు, సబ్‌స్టేషన్లు మొదలైనవి నిర్మించాలి. వీటికయ్యే ఖర్చులను వినియోగదారుల నుంచి డెవలప్‌మెంట్ ఛార్జీలుగా వసూలు చేయడానికి చట్టం అనుమతిస్తుంది. మీ ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల సామర్ధ్యాన్ని లోడ్ అని పిలవవచ్చు. డెవలప్‌మెంట్ ఛార్జీల్లో భాగంగానే– కనెక్షన్ తీసుకునేటప్పుడు అరకిలో వాట్ లోడ్ వరకూ రూ.600, అర కిలోవాట్ నుంచి ఒక కిలోవాట్ వరకూ రూ.1200, ఒక కిలోవాట్ ఏ మాత్రం దాటినా ఆ పై మొత్తానికి ప్రతీ కిలోవాట్‌కూ అదనంగా రూ.1200 చొప్పున వసూలు చేయవచ్చు.

సాధారణంగా చిన్న వినియోగదారులు కనెక్షన్ తీసుకునేటప్పుడు అర కిలోవాట్ వరకు లోడ్ ఉంటుందని చెప్పి రూ.600 చెల్లించి కనెక్షన్ తీసుకుంటారు. సర్వసాధారణంగా నాలుగు బల్బులు, మూడు ఫ్యానులు ఉన్నా 500 వాట్లు దాటదు. గతంలో పాత మీటర్లు ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పరికరాల సామర్థ్యం ఎంతో ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పెట్టిన ఎలక్ట్రానిక్ మీటర్లు మీ విద్యుత్ వినియోగాన్ని యూనిట్లలో చూపెట్టడమే కాకుండా, మీ ఇంట్లో ఉన్న మొత్తం విద్యుత్ పరికరాల సామర్థ్యాన్ని కిలో వాట్లలో లెక్కగట్టి చూపెడుతున్నాయి. దీంతో మీటరులో నమోదైన కిలోవాట్ల ప్రకారం విద్యుత్ సంస్థలు అదనంగా కిలోవాట్‌కు రూ.1200, దానికి 18శాతం జీఎస్టీని కలిపి రూ.1416 వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు ఇంట్లో ఎండా కాలంలో అదనంగా రెండు కూలర్లు పెట్టుకుంటే, ఒక్కో కూలరు సామర్థ్యం 300వాట్ల వరకూ ఉంటుంది. ఈ లెక్కన కూలర్ల మొత్తం సామర్థ్యం 600 వాట్లు. కాబట్టి మొదట ఉన్న 500 వాట్ లోడ్‌కు అదనంగా 600 వాట్లు కలిస్తే మొత్తం లోడ్ 1100 వాట్లు, అంటే 1.1 కిలోవాట్ అయింది. ఈ లెక్క ప్రకారం మొదటి కిలోవాట్‌కు రూ.1416, కిలోవాట్ దాటాక 0.1 కిలోవాట్‌కు అదనంగా మరో రూ.1416 వేస్తారు. అంటే కేవలం రెండు కూలర్లు పెట్టుకుంటే మీపై పడే అదనపు డెవలప్‌మెంట్ ఛార్జీ 2 x 1416 = రూ.2832 అన్నమాట.

కానీ పై విధంగా డెవలప్‌మెంట్ ఛార్జీ వసూలు చేయాలన్నా ‘జనరల్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సప్లయి’ నిబంధనల ప్రకారం వినియోగదారునికి పూర్తి లెక్కలతో నోటీసు ఇవ్వాలి. ఒక వేళ నోటీసు తరువాత వినియోగదారుడు అదనపు విద్యుత్ పరికరాలను తొలగిస్తే, అతనినుండి డెవలప్‌మెంట్ ఛార్జీ వసూలు చేయకూడదు. కానీ విద్యుత్ సంస్థలు వినియోగదారునికి లోడ్ తగ్గించుకునే అవకాశం ఇవ్వకుండా వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇది నిబంధనలకు విరుద్ధం. ఇప్పటికే ఛార్జీల పెంపు భారాలు మోయలేక సతమతమౌతున్న చిన్న విద్యుత్ వినియోగదారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వేల రూపాయలు వసూలు చేయడం సమంజసం కాదు. చిన్న హీటర్ ఒక్క నిమిషం వాడినా అదనంగా మూడువేల రూపాయల బిల్లు పడుతుందంటే ఎవరు హీటర్ వాడతారు. నిబంధనల మేరకు వినియోగదారునికి ఈ లోడును తొలగించుకునే అవకాశం విద్యుత్ సంస్థలు ఇవ్వాలి.

ప్రస్తుతం విద్యుత్ సంస్థలు భారీ నష్టాల్లో ఉన్నాయి. కాబట్టి విద్యుత్ సంస్థలు ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ మార్గాన్ని కూడా వదులుకోవడం లేదు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. పేద, గొప్ప అని చూడకుండా నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి వసూలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో విద్యుత్ సంస్థలు సమీక్షించుకోవాలి.

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజే‌ఏసీ)

Updated Date - 2023-02-02T13:07:28+05:30 IST