ఎన్నికల వేళ అంతకు మించి ఏముంది?

ABN , First Publish Date - 2023-07-12T00:46:31+05:30 IST

జాతీయ ఆదాయంలో పౌరులు అందరికీ సమాన భాగం లభించినప్పుడే దేశాలు వర్ధిల్లుతాయి. అభివృద్ధి అవకాశాలు సమానంగా అందిపుచ్చుకునే దేశాల నుంచి...

ఎన్నికల వేళ అంతకు మించి ఏముంది?

జాతీయ ఆదాయంలో పౌరులు అందరికీ సమాన భాగం లభించినప్పుడే దేశాలు వర్ధిల్లుతాయి. అభివృద్ధి అవకాశాలు సమానంగా అందిపుచ్చుకునే దేశాల నుంచి వలసలు సాధారణంగా ఉండకపోవడానికి కారణం అదే. ఇటువంటి నేపథ్యమున్న పాశ్చాత్య లేదా గల్ఫ్ రాజ్యాల నుంచి ఇతర దేశాలకు ఉపాధి వలసలు అతి అరుదు. అయితే జీవనోపాధి అవకాశాలు లేకపోవడంతో మెరుగయిన జీవన ప్రమాణాల కోసం వలస వెళ్ళడం సహజం. అందరికీ సమాన ఆవకాశాలను కల్పించడం ద్వారా ఉపాధి వలసలను నివారించి, ప్రగతిశీల, సంపన్న సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో భారత గణతంత్ర రాజ్య నిర్మాతలు రాజ్యాంగంలో కొన్ని నిర్దేశాలు చేశారు. పేదరికం తాండవిస్తున్న దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించి అందరికీ సమాన హక్కుల కల్పనకు చట్టబద్ధంగా కృషి చేయాలని వారు అభిలషించారు. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన ఆదేశిక సూత్రాలు సమస్త ప్రపంచానికి ఒక స్ఫూర్తి, దిక్సూచి, ఒక ఆశాకిరణం. భూమిపై హక్కు, గౌరవప్రదమైన ఉద్యోగావకాశాలు, గౌరవప్రదమైన జీవితాన్ని నిర్మించుకునేందుకు అవసరమైన వేతనం తదితర సమాన ఆవకాశాలను చట్టబద్ధంగా కల్పించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ఆదేశిక సూత్రాలు లక్ష్యిస్తున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్ –యూసీసీ) కూడ ఈ ఆదేశిక సూత్రాలలో ఒకటి.

ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఉపకరించే ఇతర ఆదేశిక సూత్రాలతో పోల్చితే ప్రాధాన్యం లేకున్నా రాజకీయ కారణాల వలన మొదటి నుంచీ ఉమ్మడి పౌరస్మృతి అనేది అత్యంత వివాదస్పద అంశంగా ఉంది. రాజ్యాంగ సభలో టంగుటూరి ప్రకాశం పంతులుతో సహా పలువురు సభ్యులు యూసీసీని వ్యతిరేకించారు. ఉమ్మడి పౌరస్మృతిలో ప్రధానంగా వివాహాలు, విడాకులు, వారసత్వ హక్కులు, దత్తత అనే అంశాలు కీలకం. వ్యక్తిగత జీవనానికి సంబంధించిన సున్నితమైన ఈ అంశాలు ఆయా ధార్మిక ఆచారాల ప్రకారం జరుగుతాయి. ఏ రకమైన ఆచార వ్యవహారాలను పాటించడం అనేది ప్రజల అభీష్టం. ప్రాంతాలు, మతాలు, కులాలు, తెగల మధ్య ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ ఆచార వ్యవహారాలలో ఏమైనా వివక్షపూరితమైనవి ఉంటే వాటిని తొలగించే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకు ముస్లిం, క్రైస్తవ మతాచారాలలో విడాకులకు సంబంధించి ఉన్న కొన్ని ప్రధాన లొసుగులను ప్రత్యేక చట్టాల ద్వారా తొలగించడం జరిగింది.

స్వపరిపాలన ప్రారంభమై ఏడు దశాబ్దాలు దాటినా దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అంటూ అమలులోకి రాలేదు. జీఎస్టీ ఉన్నా ఇప్పటికీ పన్నుల విధానంలో ఏకీకరణ లేదు. పెట్రోలు ధరలు ఒకో రాష్ట్రంలో ఒకో విధంగా ఉండడమే ఇందుకొక ఉదాహరణ. అదే విధంగా, హిందూ అవిభక్త కుటుంబ (హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ – హెచ్‌యూఎఫ్) విధానం ద్వారా ఆదాయపు పన్ను ఆదా ప్రయోజనాలు, దాని దుర్వినియోగం గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఒక వైపు ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ విచ్ఛిన్నమవుతుండగా మరో వైపు అదే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పేర ఆదాయపు పన్ను రాయితీ ప్రయోజనాలు పొందే వారి సంఖ్య పెరిగిపోతోంది. తత్ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం సంభవిస్తోంది. అడవి బిడ్డలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా జల్ జంగల్ జమీన్ అడిగిన సందర్భంగా జరిగిన ఇంద్రవెల్లి కాల్పుల దుర్ఘటన, ఆదివాసులకు ఇంకా గుర్తుంది. తమిళనాట జల్లికట్టు ఆ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వానికి తూట్లు పొడిచే ప్రయత్నమే మణిపూర్ తాజా గాయాలు. విద్య, వైద్య సదుపాయాలు కూడ ఆదేశిక సూత్రాలలో భాగంగా ఉండగా కీలకమైన ఈ రెండు సేవలు నానాటికి ప్రియమవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

మనిషికి కావల్సింది కూడు, గూడు, గుడ్డ. ఇందులో మతాలకు ఎలాంటి ఆస్కారం లేదు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు కూడ ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి. కానీ కీలకమైన ఈ అంశాలను వదిలి ఉమ్మడి పౌరస్మృతి (అధికరణ 44)పై మాత్రమే రచ్చ జరుగుతోంది. ఉమ్మడి పౌరస్మృతిని రాజకీయ పరిభాషలో విశదీకరించాలంటే సామాన్యులను పీడిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి దృష్టి మరల్చడమే. కొన్ని వర్గాలు ప్రత్యేకించి, ముస్లింల సంప్రదాయక జీవన విధానంలో జోక్యం చేసుకోవడం ద్వారా దాన్ని ఒక మతపరమైన సమస్యగా మార్చి రాజకీయ పబ్బం గడుపుకోవడమే అన్న విషయాన్ని గమనించాలి. కనీస ప్రతిపాదిత ముసాయిదా ప్రతి సైతం లేని అంశంపై ముస్లింలు సైతం ఉలిక్కిపడి నిరసన బాటను ఎంచుకోవడం బీజేపీకి మరింత సులభతరమైంది. ఎన్నికల వేళ అంతకు మించి కావల్సింది ఏముంది? మనకు కావల్సింది ఉపాధి, ఇల్లు, విద్య కానీ ఊరిలో ఎక్కడో ఒక మూలలో మస్జీదు వీధిలో ఉండే ఒక ముస్లిం తన నాలుగు గోడల మధ్య ఏ రకంగా బ్రతుకుతున్నాడనేది కాదు.

ఇస్లాం అధికారిక మతంగా ఉన్న దుబాయిలో ముస్లిమేతరులకు వారి ఆచార వ్యవహారాల మేరకు వివాహాలు, విడాకులు, వారసత్వం సంబంధిత వివాదాలు పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తూ పురోగమించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వసుధైక కుటుంబకం భావనను శిరసావహిస్తున్న భారత్‌ను అందుకు భిన్నంగా తిరోగమన దిశలో తీసుకువెళ్లే ప్రయత్నం బాధాకరం.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2023-07-12T00:47:14+05:30 IST