ఈ నిషేధం దేనికి సంకేతం?

ABN , First Publish Date - 2023-01-25T00:40:41+05:30 IST

ఆధునిక మీడియా, రాజకీయాలకు మధ్య సంబంధాలను కొన్ని పరిణామాలు వెల్లడిస్తాయని బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తన...

ఈ నిషేధం దేనికి సంకేతం?

ఆధునిక మీడియా, రాజకీయాలకు మధ్య సంబంధాలను కొన్ని పరిణామాలు వెల్లడిస్తాయని బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తన ఆత్మకథ ‘ఎ జర్నీ’లో పేర్కొన్నారు. ఇరాక్ వద్ద జీవ, రసాయన ఆయుధాలు ఉన్నాయన్న విషయంలో బ్లెయిర్, ఆయన సిబ్బంది ఒక తప్పుడు నివేదిక సృష్టించారని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ 2003 మే 29న ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. ఆ సంచలనాత్మక వార్తాకథనం బ్లెయిర్, నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను యుద్ధ నేరస్థులుగా మార్చింది. ‘45 నిమిషాల్లో ఇరాక్ రసాయన, జీవ ఆయుధాలను ప్రయోగించగలదన్న’ వాక్యాన్ని ఆ నివేదికలో చేర్చిన విషయాన్ని బిబిసి ప్రతినిధి గిల్లిగన్ వెల్లడించారు. ఇరాక్ వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయన్న విషయంలో అమెరికా, బ్రిటన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న విషయం తర్వాతి కాలంలో ప్రపంచానికి తెలిసింది. రసాయన ఆయుధాలపై తప్పుడు కథనం గురించి బిబిసికి సమాచారం ఇచ్చిన బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారి డేవిడ్ కెల్లీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కథనాన్ని ప్రసారం చేసినందుకు క్షమాపణ చెప్పాల్సిందిగా బిబిసిపై బ్లెయిర్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. ఒక సర్వేలో దాదాపు 66 శాతం మంది ప్రజలు బిబిసికి మద్దతు నిచ్చారు. చివరకు బిబిసి డైరెక్టర్ జనరల్ గ్రెగ్ డైక్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ప్రభుత్వమే కారణమని, బిబిసి స్వతంత్రతను దెబ్బతీసేందుకు టోనీ బ్లెయిర్ ప్రయత్నించారని పత్రికాస్వేచ్ఛను సమర్థించే అనేకమంది విమర్శించారు.

‘బిబిసి బాగా పనిచేస్తుందని చాలా మంది రాజకీయ నాయకులు అంటారు. అయితే అధికారంలోకి రాగానే బిబిసిని విమర్శిస్తారు. రాజకీయ నాయకుల్లో ఆదరణ మీకెప్పుడూ లభించదు. నిజానికి అది మన పని కాదు. కనుక అందుకోసం మనం కనీసం ప్రయత్నించవద్దు. అన్ని పార్టీల రాజకీయ నాయకులను అర్థం చేసుకుని ప్రశ్నించడమే మన పని. ప్రధానంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అది మన పని కనుక వారెప్పుడూ మనను ప్రేమించబోరు’ అని గ్రెగ్ డెక్ తన తర్వాత బిబిసి డైరెక్టర్ జనరల్ పదవిని ఆశించిన వారికి చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా బిబిసికి ఎందుకు గుర్తింపు వచ్చిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఒకప్పుడు వార్తాపత్రికల్లో, ప్రభుత్వ సమాచార సాధనాల్లో వచ్చే సమాచారం కన్నా బిబిసిలో వచ్చిన సమాచారం సరైనదని జనం భావించేవారు. బిబిసి రేడియో పెట్టుకుని చెవులు రిక్కించిన రోజులు లేకపోలేదు. టెక్నాలజీ, సోషల్ మీడియా, టీవీ జర్నలిజం బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో నిమిషాల్లో వార్తలను ప్రసారం చేయగలగడంలో విశేషమేమీ లేదు కాని ఎమర్జెన్సీ దారుణాలు, యూనియన్ కార్బైడ్ దుర్ఘటన, శ్రీలంక, కశ్మీర్‌లలో దారుణాలు, ఆపరేషన్ బ్లూస్టార్ , ఇందిరాగాంధీ హత్య తదితర ఘటనల్లో బిబిసి రిపోర్టింగ్ గురించి అప్పటి విషయాలు గుర్తున్న వారందరికీ తెలుసు. 1972లో రెండు డాక్యుమెంటరీల్లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం జరిగిందన్న పేరుతో బిబిసిని మొదటిసారి నిషేధించారు. ఆ తర్వాత కూడా ఎమర్జెన్సీ సమయంలో బిబిసిని రెండోసారి నిషేధించారు. బిబిసి ఎలాంటి తప్పులు చేయలేదని చెప్పడానికి కూడా వీల్లేదు. తప్పుడు కథనాలను ప్రసారం చేసి బిబిసి క్షమాపణలు చెప్పుకున్న ఉదంతాలు కూడా లేకపోలేదు. అయితే తన విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకు బిబిసి ప్రయత్నించింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల గురించి బిబిసి దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేయడానికి కారణం ఏమిటి? అందులో వెల్లడించిన విషయాలేవీ కొత్తవేం కావు. బిబిసి కథనంలో వచ్చిన అంశాలన్నీ అనేక నిజనిర్ధారణ కమిటీ నివేదికల్లోనూ, మీడియాలోను బయటపడ్డాయి. భారత దేశంలో ఎందరో రచయితలు, కవులు గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన దారుణాల గురించి రచనలు, కవితలు రాశారు. గుజరాత్ అల్లర్లు జరిగిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో నరేంద్రమోదీ బ్రిటన్‌కు వెళ్లారు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన పర్యటనపై విధించిన నిషేధాలను అమెరికాతోసహా అనేక దేశాలు ఎత్తి వేశాయి. మరి ఇప్పుడు ఎందుకు ఈ డాక్యుమెంటరీ విడుదల చేయాల్సివచ్చింది?

అంతర్జాతీయ సంబంధాలు, ముఖ్యంగా అగ్రదేశాలు భారత్‌తో ఏర్పర్చుకునే సంబంధాలు వారి దృక్కోణం రీత్యా, వారి ప్రయోజనాల రీత్యానే ఉంటాయి కాని అందులో భారత్ గొప్పతనం పాలు అంతగా ఉండదని కొన్ని దౌత్య వర్గాల అంచనా. ట్రంప్ కౌగలించుకున్నా, బిడెన్ కరచాలనం చేసినా, సునక్ చిరునవ్వు నవ్వినా వాటి వెనుక అర్థాలు వేరు. కాని మోదీతో వారందరికీ వ్యక్తిగత స్నేహం ఉన్నట్లు ఎంత మాత్రమూ కాదు. బిబిసి స్వతంత్రత గురించి ఎంత ప్రచారం ఉన్నా దౌత్య సంబంధాలకు అతీతంగా వాటి కథనాలు ఉండవనేది కూడా ఒక అభిప్రాయం. గుజరాత్ అల్లర్లపై బిబిసి కథనం వెనుక భారత్ పట్ల మారుతున్న అగ్రరాజ్యాల దృక్పథాన్ని తెలియజేస్తున్నదా? చైనాకు వ్యతిరేకంగా అగ్రరాజ్యాలు ఏర్పర్చిన క్వాడ్‌లో భారతదేశం చేరినప్పటికీ రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణ విషయంలో భారత్ స్వతంత్ర వైఖరిని అవలంబించడం ఈ పరిణామానికి దారితీసిందా? లష్కర్ ఏ తోయిబా నేత అబ్దుల్ రహమాన్ మక్కిని అంతర్జాతీయ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించేందుకు చైనా మద్దతు ఇవ్వడానికి కారణమేమిటి? భారత్ పట్ల చైనా తన వైఖరి మార్చుకునే క్రమంలో భాగంగా తెరవెనుక భారత్‌తో జరిపిన చర్చల గురించి అగ్రదేశాలకు అనుమానాలు కలుగుతున్నాయా? లేక ఈసారి మన ప్రతిపక్షాలు అగ్రదేశాల, ముఖ్యంగా అమెరికా మద్దతు కోరాయా?

బిబిసి కథనంపై వ్యాఖ్యానించేటప్పుడు అమెరికా ఎక్కడా మోదీని వ్యక్తిగతంగా సమర్థించలేదు! ‘మీరు చెబుతున్న డాక్యుమెంటరీ గురించి మాకు తెలియదు. రెండు అద్భుత ప్రజాస్వామిక దేశాలైన అమెరికా, భారత్‌లు కలిసికట్టుగా పంచుకునే విలువల గురించి మాకు తెలుసు. భారత్‌లో జరిగిన సంఘటనల విషయంపై మాకు ఆందోళనలు ఉన్నప్పుడు సందర్భానుసారం వాటి గురించి మేము తెలియజేశాం’ అని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. జమాయిల్ ఖషోగ్గి అనే జర్నలిస్టును హత్య చేసిన సౌదీ రాకుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను దౌత్యపరమైన ఆంక్షలనుంచి ఎందుకు విముక్తి చేశారనే ప్రశ్న తలెత్తినందుకు ‘గతంలో మేము జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే, హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్, కాంగో అధ్యక్షుడు కబిలా, భారత దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా అనుమతించాము కదా’ అని ఒక అమెరికన్ కోర్టులో రెండు నెలల క్రితం బైడెన్ ప్రభుత్వం వాదించింది. మోదీని అమెరికా ఎవరెవరితో పోల్చిందో గమనించారా? ‘దేశాధినేతలను, విదేశాంగమంత్రులను వారిపై నేరారోపణలతో నిమిత్తం లేకుండా అనుమతించడం మన సంప్రదాయం’ అని ఆ దేశం చెప్పుకోవడం గమనార్హం. బ్రిటిష్ పార్లమెంట్‌లో మోదీపై బిబిసి కథనాన్ని ప్రస్తావించినప్పుడు ప్రధాని సునక్ కూడా మోదీ పేరు ప్రస్తావించకుండానే ఆయన వ్యక్తిత్వాన్ని చిత్రించిన తీరుతో అంగీకరించబోనని చెప్పారు. అయితే ఊచకోతలు ఎక్కడ జరిగినా తాము సహించబోమని ఆయన కూడా స్పష్టం చేశారు. మోదీని అగ్రరాజ్యాలు తమ పట్టులో బిగించే ప్రయత్నాల్లో భాగంగా బిబిసి కథనాన్ని చూడాల్సి ఉంటుందనే అనుమానాలను కొట్టివేయడానికి వీల్లేదు.

న్యాయస్థానాలు క్లీన్చిట్‌లు ఇచ్చినా, ప్రజలు మాటిమాటికీ ఎన్నుకున్నా, అంతర్జాతీయ సమాజం ఆలింగనం చేసుకున్నా కొన్ని నెత్తుటి మరకలను అంత సులభంగా తుడిచివేయలేము. ఢిల్లీలో 1984లో జరిగిన వేలాది సిక్కుల ఊచకోత తర్వాత కాంగ్రెస్ ఎన్నిసార్లు ఎన్నికైనా ఆ దారుణాల నెత్తుటి తడి కాంగ్రెస్ నేతల చేతులపై ఆరిపోలేదు. గుజరాత్ మారణకాండ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ ప్రధానిగా రెండుసార్లు ఎన్నికైన తర్వాత కూడా ఆ మచ్చ ఆయనపై నుంచి తొలగిపోలేదు. మోదీ రాజధర్మాన్ని పాటించలేదని వాజపేయి చేసిన విమర్శలు ఇప్పటికీ ప్రస్తావనకు వస్తూనే ఉంటాయి. మెజారిటీ ప్రజల మద్దతుతో గెలిచిన మోదీ ఇప్పుడు మైనారిటీలను కూడా కలుపుకుపోవాలని గత ఏడాది నుంచీ తమ పార్టీ నేతలకు పిలుపునిస్తున్నారు. తద్వారా అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన నేతగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటప్పుడు బిబిసి డాక్యుమెంటరీపై నిషేధం దేనికి? ఏ సమాచారాన్ని అయినా అడ్డుకునే ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకుని ఈ నిషేధం విధించడం దేనికి సంకేతం? ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నట్లు బిబిసి డాక్యుమెంటరీలో తప్పులుంటే వాస్తవాలతో సహా ఎందుకు ఖండించకూడదు? నిషేధం విధించడం ద్వారా అంతర్జాతీయంగా మరోసారి గుజరాత్ అల్లర్లపై చర్చ రేకెత్తించినట్లు కాదా? నిజానికి రెండుసార్లు అఖండ మెజారిటీతో గెలిచిన మోదీ నోరు విప్పి ఆయన ‘మన్ కీ బాత్’ను పంచుకుని ఉంటే మబ్బులు ఏనాడో తొలగిపోయేవి. నిషేధాల వల్ల మబ్బులు మరింత దట్టమవుతాయనడంలో సందేహం లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-01-25T00:40:43+05:30 IST