Share News

మానవతను మంటగలుపుతున్న యుద్ధాలు

ABN , First Publish Date - 2023-10-28T04:40:19+05:30 IST

జీవకోటిలో మానవుడు సర్వోన్నత సమున్నతుడు. నిప్పు ఉపయోగించడం తెలుసుకున్నప్పటి నుంచీ మానవ మేధ పరుగులు తీసింది. అణువును శోధించింది...

మానవతను మంటగలుపుతున్న యుద్ధాలు

జీవకోటిలో మానవుడు సర్వోన్నత సమున్నతుడు. నిప్పు ఉపయోగించడం తెలుసుకున్నప్పటి నుంచీ మానవ మేధ పరుగులు తీసింది. అణువును శోధించింది. బ్రహ్మాండాన్ని అన్వేషించింది. ఇప్పుడు మనిషి గ్రహాంతర వలసలకు సిద్ధమవుతున్నాడు. అయినా వేల వేల సంవత్సరాల క్రితం నాటి నియాండర్థల్ మానవుల కంటే మనం భిన్నంగా ప్రవర్తిస్తున్నామా? ఆ మన పురాతన పూర్వీకుల పోరాటాలు నియమరహితంగా ఉండేవి. మనం ఎటువంటి నిబంధనలను పాటించకుండా, పైగా అనవసర, న్యాయవిరుద్ధ యుద్ధాలు చేస్తున్నాం.

మానవ చరిత్రలో ఏనాడైనా యుద్ధ కార్యకలాపాలకు నిర్దిష్ట నియమాలు ఉన్నాయా? ఉన్నాయి. క్రీ.శ. 200లో నెట్టి మయ్యార్ తన పద్యాలలో, తమిళ భూపాలురు తమ మధ్య యుద్ధాలలో పాటించే నైతిక ప్రమాణాలను పేర్కొన్నాడు. సమరాంగణ చక్రవర్తి ఒకడు యుద్ధానికి సంసిద్ధమవుతూ తన ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేశాడో చూడండి: ‘గోవులు, గౌరవనీయ పూజారులు, మహిళలు, అనారోగ్య పీడితులు, అంత్యక్రియలు నిర్వహించేందుకు పిల్లలు లేనివారు సత్వరమే తమ సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి.’ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సైనికులు యుద్ధ క్షేత్రంలో చెలరేగిపోయేవారు. ఆ తరువాత తమ గుడారాలకు వెళ్లి విశ్రాంతి తీసుకునేవారు మరుసటి ఉదయం మళ్లీ సమర భూమికి వచ్చేవారు. రావణుడిపై యుద్ధంలో రాముడు ఎంత మానవీయంగా ప్రవర్తించాడో తమిళ కవి శేఖరుడు కంబన్ ఇలా పేర్కొన్నాడు: ‘‘లంకాధీశుడు అలసిపోయాడు. పోరాడలేక పోతున్నాడు. అతడిని చూసి రాముడు జాలిపడ్డాడు. ‘ఈ రోజుకు ఇక చాలు. మీ సౌధానికి వెళ్లి పోండి. రేపు ఉదయం మళ్లీ యుద్ధానికి రండి’ ’’.

యుద్ధాలు నాగరీక చర్యలే అయితే పురాతన కాలంలో సమరాలు నిజంగా నాగరీక కార్యకలాపాలే. న్యాయ నియమాల ప్రకారమే ఆ పోరాటాలు జరిగేవి. మరి ఆధునిక యుగంలో..? మానవతను మరచిన ఘర్షణలు. ఇక ప్రస్తుత కాలంలో మన కళ్ల ముందు జరుగుతున్న యుద్ధాల గురించి చెప్పేదేముంది? రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య, ఇజ్రాయిల్, హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధాలను ఏమనాలి? అవి పాశవికమైనవి, క్రూరమైనవి, దుర్మార్గమైనవి. విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. అటు ఉక్రెయిన్‌లోను, ఇటు గాజాలోను నగరాలకు నగరాలు, పట్టణాలకు పట్టణాలు బూడిద కుప్పలు అవుతున్నాయి. ఆస్పత్రులు, విద్యాలయాలు ధ్వంసమవుతున్నాయి. బాలలు, మహిళలు, వృద్ధులు, రోగగ్రస్తులతో సహా వేలాది అమాయకులు చనిపోతున్నారు. చనిపోనివారు సొంత దేశంలోనే నిర్వాసితులు అవుతున్నారు. ఎటువంటి ప్రాథమిక సదుపాయాలు లేని సహాయ శిబిరాలలో ఎంతో మంది తలదాచుకోవలసివస్తోంది. నిరాశ్రయులయినవారు ఇరుగు పొరుగు దేశాలకు కాందిశీకులుగా వలసపోతున్నారు. అరకొరగా తాగునీటి సరఫరా. విద్యుత్ వెలుగులు అసలే కానరావు ఆహార పంపిణీకి అనేక అవాంతరాలు. మందులు, మాకుల గురించి మాట్లాడకపోవడమే మంచిది. సహాయ సామగ్రిని రవాణా చేస్తున్న ట్రక్కులు మైలు మైలుకు గంటలపాటు నిలిచిపోతుంటాయి.

ఎందుకు జరుగుతున్నాయి ఈ యుద్ధాలు? రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి కారణం ఆధిపత్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చరిత్రలోకి వెళదాం. ఉక్రెయిన్ 1922 నుంచి 1991 వరకు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది. రష్యన్ జాతీయులు ఎంతో మంది ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఆ ప్రదేశాలలో వారిదే పూర్తి పెత్తనం. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. నాటి నుంచి నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి దేశాలకు, రష్యాకు మధ్య నడి కాపు (బఫర్) దేశంగా ఉక్రెయిన్ కొనసాగుతుండేది. ఉక్రెయిన్ కనుక నాటో కూటమిలో చేరితే ఆ కూటమి సైనిక దళాలు తన సరిహద్దుల వద్దకు చేరుతాయని రష్యా భయపడింది. ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితులలోనూ తటస్థ దేశంగా ఉండిపోవాలని రష్యా కోరుకుంది. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో రష్యన్ జాతీయులు స్థిరపడిన ప్రాంతాలను తమ దేశంలో కలుపుకోవాలని మాస్కో పాలకులు అభిలషించారు. అయితే పరిస్థితులు అందుకు విరుద్ధంగా పరిణమించాయి.

పశ్చిమాసియాను అతలా కుతలం చేస్తున్న ఇజ్రాయిల్–హమాస్ యుద్ధంలో కూడా భూభాగాల ఆక్రమణ ప్రధాన సమస్య. పాలస్తీనియన్లు అందరూ –వీరిలో కొందరికి హమాస్ ప్రాతినిధ్యం వహిస్తోంది– యూదులు తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని విశ్వసిస్తున్నారు. ఆ వివాదాస్పద భూమే పాలస్తీనా. ఒకప్పుడు అక్కడ అరబ్‌లు, యూదులు, క్రైస్తవులు కలసిమెలసి జీవించేవారు. అయితే ఐక్యరాజ్యసమితి నిర్ణయం మేరకు 1948లో ఇజ్రాయిల్ ఉనికిలోకి వచ్చింది. తదాది ప్రపంచంలోని ఎక్కడెక్కడి యూదులు అక్కడకు వచ్చి స్థిరపడుతున్నారు. ఆధునిక ఇజ్రాయిల్ ఒక శక్తిమంతమైన దేశం. పరమ శత్రవులయిన ఇరుగు పొరుగు దేశాలన్నిటినీ సమర్థంగా ఎదుర్కొని నిలబడిన దేశమది. పశ్చిమాసియాలో ఏకైక అణ్వస్త్ర రాజ్యమది. చరిత్ర పాలస్తీనీయన్ల పక్షాన ఉండవచ్చును కానీ యథార్థమేమిటంటే ఈ ధరిత్రి నుంచి ఇజ్రాయిల్ రాజ్యాన్ని ఎవరూ పూర్తిగా తుడిచిపెట్టలేరు.

ఐక్యరాజ్యసమితి ఒక కీలక అంతర్జాతీయ సంస్థ అయితే అది ఒక దుర్బల సంస్థ. తన లక్ష్యాలను సంపూర్ణంగా ఆచరణలో పెట్టలేని బలహీన సంస్థ. ‘ప్రపంచ దేశాల సమైక్య ప్రజలమైన మేము భావి తరాలను యుద్ధాల నుంచి కాపాడేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. మన జీవిత కాలంలోనే యుద్ధం రెండుసార్లు సమస్త ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఇక ముందు సాయుధ బలగాలను వినియోగించ నవసరంలేని పరిస్థితులను సృష్టించడమే మా లక్ష్యం’ అని ఐక్యరాజ్యసమితి అధికార పత్రం గంభీరంగా ఉద్ఘాటించింది. యుద్ధాలను నివారించి ప్రపంచ శాంతిని కాపాడడంలో ఐక్యరాజ్యమితి ఘోరంగా విఫలమయింది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే అసలు యుద్ధ స్వభావమే పూర్తిగా మారిపోయింది. ఒక మనిషితో మరొక మనిషి బాహాబాహీగా పోరాడడమనేది ఒకనాటి యుద్ధ తంత్రం. ఇప్పుడు యంత్రాలు యంత్రాలతో పోరాడుతున్నాయి. క్షిపణులపై డ్రోన్‌లు పోరాడుతున్నాయి. క్షిపణులు క్షిపణి నిరోధకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.

దేశాల మధ్య భూ సంబంధ వివాదాలను పరిష్కరించే మార్గాలను ప్రపంచ దేశాలు కనుగొనలేకపోతే యుద్ధాలు అనివార్యమవుతాయి. భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం భూ సంబంధమైనది. కరడుగట్టిన మితవాదులు ఈ వివాదాన్ని హిందూ ఇండియా, ఇస్లామిక్ పాకిస్థాన్ మధ్య ఘర్షణగా చిత్రిస్తున్నారు. ఇదొక హానికరమైన సిద్ధాంతం. దేశ విభజనను, స్వాతంత్ర్య చట్టాలను రెండు దేశాలు అంగీకరించాయి. పాకిస్థాన్ దురాశ కారణంగానే భూ వివాదం నెలకొని ఎడతెగని ఘర్షణలకు కారణమవుతోంది. అలాగే భారత్– చైనాల మధ్య వివాదం కూడా భూ సంబంధమైనదే. వలసపాలన కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దులను సరిగ్గా నిర్ణయించకపోవడమే ఈ వివాదానికి దారి తీసింది. సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాలపై తమకే హక్కు ఉన్నదని భారత్, చైనాలు ఘర్షించుకుంటున్నాయి. పరిష్కారమేమిటి? చర్చలే గాని యుద్ధం కానేకాదు. ప్రధాని మోదీ అన్నట్టు ‘ఇది యుద్ధాల యుగం కాదు’.

శాంతి సామరస్యాలను నెలకొల్పుకోవాలని రష్యా, ఉక్రెయిన్‌లకు, ఇజ్రాయిల్ హమాస్‌లకు పోప్ ఫ్రాన్సిస్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఆయన విజ్ఞప్తులు బధిరుల ముందు శంఖారావంగా మిగిలిపోయాయి. ఫ్రాన్సిస్‌కు ముందు పోప్‌గా ఉన్న ఒకరు కూడా ‘ఇంతటితో యుద్ధాన్ని ముగిద్దాం, మళ్లీ ఏ విధంగానూ యుద్ధం వద్దు’ అని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఆ గౌరవనీయుడి మాటనూ ఎవరూ పట్టించుకోలేదు. యుద్ధాలు ధరిత్రికి చెరుపు చేస్తూనే ఉన్నాయి. మానవాళి శ్రేయస్సును నాశనం చేస్తున్నాయి. మహాసముద్రాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒడంబడిక (యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీ)ను 1982లో 150 దేశాలు ఆమోదించాయి ఆ ఒడంబడిక ప్రకారం ఏర్పాటైన అంతర్జాతీయ ట్రిబ్యునల్ వివిధ దేశాల మధ్య ఉన్న సముద్ర సంబంధిత వివాదాలను పరిష్కరించింది. దేశాల మధ్య భూ వివాదాలను పరిష్కరించేందుకు కూడా అటువంటి అంతర్జాతీయ ట్రిబ్యునల్ అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేనిపక్షంలో యుద్ధాలు, వాటి పర్యవసానాలు అయిన మారణకాండ, విధ్వంస హేల అనివార్యమవుతాయి.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2023-10-28T04:40:19+05:30 IST