వీరనారికి వందనాలు! Kudos to Viranari

ABN , First Publish Date - 2023-03-19T01:10:25+05:30 IST

మల్లు స్వరాజ్యం పుట్టింది భూస్వామ్య కుటుంబంలో. పెరిగింది అడవుల్లో, గిరిజన గుడిసెల్లో. పోరాడింది వెట్టి బ్రతుకుల వెతలు తీర్చడం కొరకు. 14 ఏండ్ల చిరుప్రాయంలోనే తెలంగాణ సంస్థానంలో...

వీరనారికి వందనాలు! Kudos to Viranari

మల్లు స్వరాజ్యం ఒక ధైర్యం, ఒక పోరాటం,

ఒక చైతన్యం, ఒక విప్లవం, ఒక ఉద్యమం.

మల్లు స్వరాజ్యం పుట్టింది భూస్వామ్య కుటుంబంలో. పెరిగింది అడవుల్లో, గిరిజన గుడిసెల్లో. పోరాడింది వెట్టి బ్రతుకుల వెతలు తీర్చడం కొరకు. 14 ఏండ్ల చిరుప్రాయంలోనే తెలంగాణ సంస్థానంలో దొరల, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్న భీమిరెడ్డి నర్సింహారెడ్డి వెంట పోరాట రంగంలోకి దిగిన ధీర మల్లు స్వరాజ్యం. మాక్సిమ్ గోర్కి రాసిన ‘అమ్మ’ నవల, రష్యా విప్లవ చరిత్ర ఆమెను అప్పటికే బాగా ప్రభావితం చేశాయి.

హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభ జరుగుతుంటే అన్న వెంట ఎడ్ల బండిపై వెళ్ళింది స్వరాజ్యం. అక్కడ జరిగిన చర్చలు, ఉపన్యాసాలు, దేశ స్వాతంత్ర్యం, చదువు, మహిళలకు ప్రత్యేక హాస్పిటల్, వెట్టి చాకిరి, భూస్వామ్య దోపిడీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమం స్వరాజ్యం గారిని ఉత్సాహపరిచింది. చివరికి గ్రామీణ ప్రాంతాల్లోని కూలీ దోపిడీకి వ్యతిరేకంగా పేదలను ఉద్యమానికి ఉసిగొల్పింది. కూలీ పెంచేదాకా పొరాడింది. ఒక దశలో మహిళలు భూస్వాములకు భయపడి కూలికీ వెళ్లుతుంటే దారికి అడ్డంగా పడుకొని నన్ను తొక్కుకోని వెళ్ళండి అని స్వరాజ్యం స్పష్టం చేసింది. ఆమె నాయకత్వంలో కూలీలు దొరల పొలాల్లో పనికి పోలే. చివరకి భూస్వాములు దిగి వచ్చి కూలీ పెంచారు. అయితే దొరలకు కోపం వచ్చింది. కూలీలను కొట్టడానికి పోయారు. ముందు నన్ను కొట్టి వాళ్ళను కొట్టండని స్వరాజ్యం ఎదురు తిరిగింది. భూస్వాములు ఏమీ చేయలేక వెనుదిరిగి వెళ్లిపోయారు.

‘భారతి భారతి ఉయ్యాలో /మా తల్లి భారతి ఉయ్యాలా/జనగామ తాలూకా ఉయ్యాలో /విసునూరు దొరోడు ఉయ్యాలా... అంటూ ఉయ్యాల పాటలతో జనాన్ని ఆమె చైతన్యపరిచింది. పోరాటంలో భాగంగా కూలీ వాడల్లోనే ఆమె నివసించింది. ‘నా ఉపన్యాసాలకు విషయాలూ అందించింది పేదల వాడలే... పాటలకు బాణీలు అందించింది పల్లె తండాలే... నా జీవితానికి చరిత్ర నిచ్చింది పేదలే’ అని ఎంతో నమ్రతతో స్వరాజ్యం తన ఆత్మ కథలో చెప్పింది. ‘ఊర్లకు వెళ్ళండి, జనంలో తిరగండి. సమస్యలు తెలుసుకోండి జనాన్ని కదిలించండి, పోరాటాలు చేయండని’ పార్టీ సమావేశాల్లో ఆమె తరచూ చెప్పేది. పోరాటకాలంలో ఫీల్డ్ వర్క్ ఎంచుకుంది. సభలు ఉంటే మూడు రోజులు ముందే ఆడుతూ పాడుతూ జనాన్ని పోగు చేసేది. అవసరం అనుకుంటే వేదికలపై ఉపన్యాసాలు చెప్పి ఉర్రూతలూగించేది. దేవురుప్పల, కడివెండి, మొండ్రాయి గిరిజన తండాలు, పాలకుర్తి ఎక్కడా సభలు జరిగినా ముందే స్వరాజ్యం వెళ్ళేవారు. 1951 అక్టోబర్‌లో తెలంగాణ సాయుధ పోరాట విరమణ ఆమెను ఎంతో బాధించింది. ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి. పార్టీ అందర్నీ ఇమిడ్చుకునే పరిస్థితి లేకపోయిందని ఆందోళన చెందింది. తల్లి ఇచ్చిన ఆస్తిని అమ్ముకొని రాయినిగూడెం దగ్గర భూమి కొనుగోలు చేసి వ్యవసాయం మొదలు పెట్టింది. చిన్నపిల్లలు, గుడిసె కూడా సరిగ్గా లేని పరిస్థితి. వియన్ గారు పార్టీ బాధ్యతలకు అంకితమవడంతో కుటుంబ బాధ్యతలు పూర్తిగా స్వరాజ్యమే మోయవలసి వచ్చింది.

1978లో తుంగతుర్తి నియోజకవర్గం ప్రతినిధిగా శాసనసభలో ప్రవేశించారు. అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఒక చప్రాసీ అడ్డుకున్నాడట. కారణం ఆమె సాధారణ వేషధారణ. ఆమె ప్రజా జీవితం ఆసాంతం కూడా సాదాసీదాగానే గడిపింది. ఎవ్వరికీ కష్టం వచ్చినా కాలి నడకన వెళ్ళింది. పోరాటకాలంలో పంచిన భూముల రికార్డుల కొరకు ఊర్లు తిరిగింది. పేదల నుంచి గుంజుకున్న భూములు పేదలకు ఇప్పించింది. ఎమ్మెల్యేగా ఉండి కాలి నడక, బస్సుల ప్రయాణం, మోటార్ సైకిల్‌పై, నియోజకవర్గం అంత తిరిగేది. సమస్యను బట్టి నేరుగా అధికారులను కలిసేది. ప్రజలను వెంటబెట్టుకొని పని చేయించుకొని తిరిగి వచ్చేది. కాంగ్రెస్ దాడుల్లో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడం, అండగా ఉండటం, ఓదార్పు ఇవ్వడం, రక్షణ కల్పించడంలో స్వరాజ్యం ముందుండేవారు. మల్లు స్వరాజ్యం ఒక ధైర్యం, ఒక పోరాటం, ఒక చైతన్యం, ఒక విప్లవం, ఒక ఉద్యమం. ఆరు దశాబ్దాల ప్రజా జీవితంలో చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కొరకు నిలబడిన నిబద్ధురాలు. ఆమె పోరాటాల చరిత్ర భావితరాలకు స్ఫూర్తి. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో మల్లు స్వరాజ్యం ఒక ప్రత్యేక అధ్యాయం.

నెమ్మాది వేంకటేశ్వర్లు

(నేడు మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి. సూర్యాపేట జిల్లా రాయనిగూడెంలో సంస్మరణ సభ)

Updated Date - 2023-03-19T01:10:25+05:30 IST