Share News

ఉద్యమించనిదే ఉద్దానం గతి మారదు!

ABN , First Publish Date - 2023-11-02T01:49:07+05:30 IST

ఉద్దానం ప్రాంతం అనగానే అక్కడ జరిగిన ఉద్యమాలు, అమరుల త్యాగాలు గుర్తొచ్చేవి. కానీ నేడు ఉద్దానం కిడ్నీ వ్యాధికి పర్యాయపదంగా మారింది. ఇక్కడ కిడ్నీ మహమ్మారి...

ఉద్యమించనిదే ఉద్దానం గతి మారదు!

ఉద్దానం ప్రాంతం అనగానే అక్కడ జరిగిన ఉద్యమాలు, అమరుల త్యాగాలు గుర్తొచ్చేవి. కానీ నేడు ఉద్దానం కిడ్నీ వ్యాధికి పర్యాయపదంగా మారింది. ఇక్కడ కిడ్నీ మహమ్మారి వేలాదిమంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి వల్ల ఆడపిల్లలను చేసుకోవటానికి కానీ, మగవారికి సైతం పిల్లనివ్వటానికి కాని ఎవరు ముందుకు రారు. ఈ భయంతోనే కిడ్నీ వ్యాధి బారినపడ్డ వారు దాన్ని గోప్యంగా ఉంచుకోవడం వల్ల రోగ తీవ్రత పెరిగి చనిపోతున్నారు. ప్రాణాంతకమైన అవసరం వచ్చినా అప్పులు పుట్టని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు హామీల వర్షం కురిపించటం మినహా శాశ్వత నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వాలు అనేక పర్యాయాలు నమూనాలు సేకరించి పరిశోధనలు జరిపినా వ్యాధికి సరైన కారణాలు కనిపెట్టలేకపోతున్నారు. నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. అనేక గ్రామాల్లో పేదరికంతో కనీసం డయాలసిస్ కూడా చేసుకోలేని దుస్థితిలో వ్యాధితో బాధపడుతూ మరణశయ్యపై వయసుతో సంబంధం లేకుండా నరకయాతన పడుతున్నారు. కళ్ళ ముందే ఎంతోమంది బంధుమిత్రులు మూత్రపిండాల వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోతున్నా నిస్సహాయులుగా చూస్తూ ఊరుకుండిపోతున్నారు. బొడ్డపాడు పక్కన గొల్లమాకనపల్లిలో యువత చాలా బలిష్టంగా ఉండేవారు. మాకనపల్లి నుంచి లోతుగా ఉన్న నూతిలోని నీరు తోడుకొని కావిళ్ళతో గొల్లమాకనపల్లికి తీసుకొని వెళ్లేవారు. వ్యవసాయం ఎంతో శ్రమించి చేసేవారు. కబడ్డీ ఆటలో ఆరితేరిన అలాంటి బలశాలురుసైతం ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది మిత్రులు 40ఏళ్లు నిండకుండానే తనువు చాలించారు. ఈ మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. బొడ్డపాడులో తామాడ పోలమ్మ 50 కేజీల బరువున్న కూరగాయలను అవలీలగా కాశీబుగ్గ మార్కెట్టుకు తీసుకుపోయేది. అవి అమ్మితిరిగి వచ్చి పొలం పనులు చేసేది. ఆమె సైతం వ్యాధి సోకి చనిపోయింది. నేడు ఈ ప్రాంతంలో ప్రతి వాడ, ఇల్లు కిడ్నీ వ్యాధితో సతమతమవుతున్నాయి. పాలకులు మారినా కనీసం తాగునీరు, అందుబాటులో డయాలసిస్ కేంద్రాలు, వ్యాధి బారిన పడిన వారికి మందులు, ఉచిత రవాణా, పెన్షన్లు ఏవీ లేవు. ఉన్న పొలాలను అయిన కాడికి అమ్ముకొని వైద్యం చేయిస్తూ, కుటుంబ పెద్దలను కోల్పోయి జీవచ్ఛవాలుగా బ్రతుకు వెళ్లదీస్తున్నారు.

గతం కన్నా ఇప్పుడు చదువు సంధ్యలు పెరిగాయి. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. కానీ సామాజిక స్పృహ మాత్రం పెరగటం లేదు. గతంలో గ్రామాలలో యువజన సంఘాలు, మహిళా సంఘాలు, బాలల సంఘాలు ఈ వ్యాధి పట్ల కొంత పరిజ్ఞానం అందించి సమాజం పట్ల బాధ్యత కలిగి వ్యవహరించేవి. కార్పొరేటీకరణ, వ్యాపార సంస్కృతి పెరిగిన క్రమంలో మానవ సంబంధాలు కృత్రిమంగా తయారయ్యాయి. మెజారిటీ ప్రజల గురించి ఆలోచించటం, వారి కనీస అవసరాలు తీర్చమని ఉద్యమించటం తక్కువైపోయింది. మన పూర్వీకుల త్యాగాల చరిత్రను మసక బార్చామంటే భవిష్యత్తు మనల్ని నిందిస్తుంది. దేశ అభివృద్ధికి ప్రధాన శక్తి యువతరం. వారిలో సామాజిక చైతన్యం, అధ్యయనం పెరగాలి. ప్రభుత్వ వైఖరులను గమనించాలి. ప్రభుత్వాలు రోగులకు పౌష్టికాహారం అందించడంలో కానీ, కనీసం డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయటంలో కానీ, ప్యూరిఫైడ్ వాటర్ అందించడంలో కానీ పూర్తిగా విఫలం చెందాయి. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరుమార్చి వైయస్సార్ పేరు పెట్టడం వంటి అనవసర చర్యలపై ఉన్న ఆసక్తి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. ప్రజలారా ఇప్పటికైనా మేల్కోండి. ఆందోళన బాట పట్టండి.

డి. హరినాథ్

Updated Date - 2023-11-02T01:49:07+05:30 IST