నేటి కర్ణాటకంలో రేపటి సార్వత్రకం!

ABN , First Publish Date - 2023-03-31T01:11:52+05:30 IST

కన్నడ గంధం ఎవరికి? కర్ణాటక శాసనసభకు మే 10న ఎన్నికలు. కావేరీ జన్మభూమిని రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరు పాలించాలో నిర్ణయించే ఎన్నికలవి. నిజానికి, అంతకంటే విస్తృత...

నేటి కర్ణాటకంలో రేపటి సార్వత్రకం!

కన్నడ గంధం ఎవరికి? కర్ణాటక శాసనసభకు మే 10న ఎన్నికలు. కావేరీ జన్మభూమిని రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరు పాలించాలో నిర్ణయించే ఎన్నికలవి. నిజానికి, అంతకంటే విస్తృత ప్రాధాన్యమున్న ప్రజాస్వామ్య పోరు కన్నడ నాట జరగనున్నది. వివిధ సంకుచితత్వాల మధ్య నలిగిపోతున్న మన ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని సమున్నతంగా కాపాడుకునేందుకు విధిగా చేయక తప్పని పోరాట స్వభావాన్ని, సరళిని నిర్దేశించనున్న ఎన్నికల సమరమది. అయితే ఒక దక్షిణాది రాష్ట్రం వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించలేదన్నది స్పష్టం. గత సార్వత్రక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని ఆధిపత్యం సాధించిన ఉత్తర భారతావని, పశ్చిమ భారత ఓటర్ల వర్తమాన మనస్థితిని ఆ దక్షిణాది రాష్ట్ర ప్రజల తీర్పు ప్రతిబింబించలేదు. ఈ సంవత్సరాంతంలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలే నిస్సందేహంగా 2024 సార్వత్రక సమరంలో జయాపజయాలను కర్ణాటక కంటే ఎక్కువగా ప్రభావితం చేయనున్నాయి. అయినప్పటికీ కర్ణాటక ఒక కీలక ఎన్నికల పోరాటం. దేశ రాజకీయాల గమనాన్ని నిర్ణయించి, ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను ఒక మహా సమరానికి సంసిద్ధం చేయనున్నది.

కర్ణాటక పోరు ఏమిటో మరింత నిర్దిష్టంగా చూద్దాం. ఆ రాష్ట్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుని, ఇతర దక్షిణాది రాష్ట్రాలలో తన ప్రాబల్యాన్ని నెలకొల్పుకొనేందుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం కల్పిస్తున్న పోరాటమది. లోక్‌సభలో బీజేపీ సంఖ్యా బలం విషయంలో కర్ణాటకకు ప్రత్యక్ష ప్రాధాన్యమున్నది. ఆ సంఖ్యా బలం ఒక సరితూకంలో ఉండవలసిన అవసరముంది. 2024 సార్వత్రక ఎన్నికలలో వివిధ రాష్ట్రాలలో వాటిల్లే నష్టాలను భర్తీ చేసుకునే విషయంలో బీజేపీకి తక్కువ ఆస్కారమున్నది. 2019లో కర్ణాటకలో గెలుచుకున్న 26 లోక్‌సభ సీట్లలో సగం స్థానాలను కోల్పోయినా వాటిని మరెక్కడా (కొంత మేరకు తెలంగాణలో మినహా) భర్తీ చేసుకునేందుకు అవకాశం లేని పరిస్థితి బీజేపీది. కనుక కర్ణాటకపై తన పట్టును నిలబెట్టుకోవల్సిన అవసరం ఆ పార్టీకి ఎంతైనా ఉంది.

మరో ముఖ్యమైన విషయమేమిటంటే బీజేపీ ప్రాబల్యం దాని సంఖ్యా బలానికి అతీతమైనది. 2014 సార్వత్రక ఎన్నికలలో విజయం నాటి నుంచీ అదొక అజేయశక్తిగా వెలుగొందుతోంది. ఈ ప్రతిష్ఠకు భంగం కలుగకూడదు. కర్ణాటక వంటి ఒక ప్రధాన రాష్ట్రాన్ని, అందునా అధికారంలో ఉండి కూడా ఎన్నికలలో ఓడిపోవడం పార్టీకి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అయితే ముఖ్యమంత్రి బొమ్మై నాయకత్వంలోని ప్రభుత్వం అసమర్థ పాలనకు, అవినీతికి మాత్రమే పేరు పొందింది. పైగా నిస్సిగ్గుగా మతోన్మాద వైఖరిని అనుసరిస్తున్న సర్కార్‌గా ప్రజల్లో అప్రదిష్ట పాలయింది. ‘40 శాతం సర్కార’ ఉద్యమం విజయవంతమవడమే అందుకొక తార్కాణం (ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు సంబంధించి అయినా సరే 40 శాతం అక్రమ చెల్లింపులు తప్పనిసరి అని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం చేసిన ఆరోపణ ప్రాతిపదికగా నడిచిన ఉద్యమమది). దీన్ని బట్టి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఎంతగా అపఖ్యాతిపాలయిందో అర్థం చేసుకోవచ్చు.

కర్ణాటకలో బీజేపీ పలుసార్లు అధికారంలోకి వచ్చింది. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఏ ఒక్కసారీ మెజారిటీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రాలేదు. ‘ఆపరేషన్ కమల’ వంటి అక్రమ పద్ధతులలో మాత్రమే అధికారాన్ని స్వాయత్తం చేసుకోగలిగింది. దక్షిణ భారతదేశంలో అధికార సాధనకు కర్ణాటకను ఒక ప్రవేశద్వారంగా బీజేపీ పరిగణిస్తోంది. ఉత్తరాది పార్టీ అనే ముద్రను రూపుమాపుకోవడానికి సైతం కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాల్సిన అగత్యం బీజేపీకి ఉన్నది. లాల్ కృష్ణ ఆడ్వాణీ అయోధ్య రథయాత్ర సందర్భంలో దక్షిణాది ప్రజల దృష్టిలో ప్రాధాన్యం పొందిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో స్పష్టమైన మెజారిటీని సాధించుకోవడం ద్వారా ఇతర దక్షిణాది రాష్ట్రాలలో కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు ఆరాటపడుతోంది. తన పాలనకు శాసన బద్ధత సమకూర్చుకునేందుకు మత విభేధాలను రెచ్చగొడుతోంది. హిజాబ్, అజాన్ సంబంధిత వివాదాలు ఇందులో భాగమే.

కర్ణాటకలో భారత జాతీయ కాంగ్రెస్ ఎదుర్కొంటోన్న సమస్యలూ సవాళ్లూ మరింత తీవ్రమైనవి. కాంగ్రెస్ ఇప్పటికీ సురక్షితంగా ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు గణనీయమైన ప్రజాదరణ ఉన్నది. పల్లె పల్లెలో పార్టీకి కార్యకర్తల బలం ఉన్నది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా రాష్ట్ర నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఉండడంతో ప్రస్తుత ఎన్నికల పోరాటం అదనపు ప్రాధాన్యాన్ని, ప్రతిష్ఠను సంతరించుకుంది.

ఏది ఏమైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తీరాల్సిన అగత్యం కాంగ్రెస్‌కు ఎంతైనా ఉన్నది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కోల్పోయిన తరువాత ఆర్థిక వనరుల కొరత కాంగ్రెస్‌ను వెంటాడుతోంది. కనీసం కర్ణాటక వంటి ఒక్క సంపన్న రాష్ట్రంలోనైనా అధికారంలో ఉండడం కాంగ్రెస్‌కు చాలా ముఖ్యం. కాంగ్రెస్ పునరుజ్జీవానికి ప్రస్తుత సంభావ్యతగా కర్ణాటకను చెప్పవచ్చు. భారత్ జోడో యాత్ర ఎంతగా ప్రజాదరణ పొందినప్పటికీ అది కొన్ని ప్రశ్నలను మిగిల్చింది : ప్రజల మద్దతును ఓట్లలోకి మార్చుకునే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉన్నదా? ఆ ప్రజాదరణను నిలబెట్టుకోగలదా? జోడో యాత్రలో పాల్గొన్నంత ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ గాంధీ పాల్గొంటారా? ఈశాన్య భారత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఎవరూ ఒక గీటురాయిగా పరిగణించలేదు. అయితే కర్ణాటకను ఒక మినహాయింపుగా భావించలేము. ‘మోదానీ’పై రాహుల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన తరువాత, రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన అనంతరం ప్రప్రథమంగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించలేకపోవడమనేది కాంగ్రెస్‌కు నగుబాటు అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పునరుజ్జీవం ఎలా సాధ్యమవుతుంది? ఈ దృష్ట్యా బీజేపీతో అమీతుమీ తేల్చుకోవల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉంది. కాంగ్రెస్ పోరాట శక్తికి కర్ణాటక శాసనసభా ఎన్నికలు ఒక పరీక్ష కానున్నాయి. ఇక్కడ గెలిస్తే కాంగ్రెస్ పునరుజ్జీవం సుసాధ్యమని ప్రజలు విశ్వసించగలుగుతారు.

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో గెలిచి తీరాలి. బీజేపీని ఓడించినంత మాత్రాన సరిపోదు. జనతాదళ్ (సెక్యులర్) గత చరిత్రను గుర్తుచేసుకోండి. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పక్షంలో మరో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాగలదు. లేదా, బీజేపీ నియంత్రణలో ఉండే జనతాదళ్ (ఎస్) నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. కనుక కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ అత్యంత అవసరం. మొత్తం 224మంది శాసనసభ్యులు ఉండే అసెంబ్లీలో కనీసం 125 స్థానాలను అయినా కాంగ్రెస్ గెలుచుకోవలసి ఉంది బీజేపీ– జనతాదళ్ (ఎస్) కూటమి అధికారంలోకి రావడాన్ని లేదా మరో ఆపరేషన్ కమలను నివారించాలంటే కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ తప్పనిసరి. ఓట్ల శాతం తక్కువ అయినప్పటికీ అధిక సీట్లు స్వాయత్తం చేసుకోవడం బీజేపీకి పరిపాటి అయింది (గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కంటే బీజేపీకి లభించిన ఓట్లు 2 శాతం తక్కువ అయినప్పటికీ, కాంగ్రెస్ కంటే 24 స్థానాలను అధికంగా బీజేపీ సాధించుకున్నది). ఏది ఏమైనా బీజేపీపై ఆధిక్యత సాధించాలంటే ఆ పార్టీకంటే కాంగ్రెస్‌కు కనీసం 6 శాతం ఓట్లు అధికంగా రావాల్సి ఉన్నది. తన గెలుపు అనివార్యమని కాంగ్రెస్ భావిస్తే చివరకు నష్టపోయేది ఆ పార్టీయే ననడంలో సందేహం లేదు.

కాంగ్రెస్ ఇప్పటికే నాలుగు హామీలతో ఒక శుభారంభం చేసింది. అవి: గృహ జ్యోతి (ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్); గృహ లక్ష్మి (కుటుంబ పెద్ద అయిన మహిళకు నెల నెలా రూ.2000 పంపిణీ); అన్న భాగ్య (దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారికి నెల నెలా 10 కిలోల ఉచిత బియ్యం); యువ నిధి (పట్టభద్రులైన నిరుద్యోగ యువకులకు రూ.3000 పంపిణీ). కనీస మద్దతు ధర విషయమై రైతులకు హామీ ఇచ్చి ఉంటే బావుండేది. అలాగే ఎన్నికల ప్రయోజనాల కోసం అగ్రకులాలు అయిన వొక్కళిగలు, లింగాయతులకు 2 శాతం చొప్పున రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తూ బొమ్మై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ సరైన విధంగా ప్రతిస్పందించాలి. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలను కాంగ్రెస్ వెనుక సమీకరించాలి.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పక్షాలకే కాదు, పౌరసమాజానికి కూడా ఒక పరీక్ష కానున్నాయి. బీజేపీ ఓటమే లక్ష్యంగా రైతుల, దళితుల, మైనారిటీల సంఘాలు, ప్రజాస్వామిక, మానవ హక్కుల సంఘాలు ప్రప్రథమంగా ఎడ్డేలు కర్ణాటక (జాగృత కర్ణాటక) పతాకం కింద ఏకమయ్యాయి (నేను సభ్యుడుగా ఉన్న భారత్ జోడో అభియాన్, స్వరాజ్ ఇండియాలు కూడా ‘జాగృత కర్ణాటక’లో భాగస్వాములుగా ఉన్నాయి). బీజేపీకి వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేయడం, అక్కడా ఇక్కడ బహిరంగ సభలు నిర్వహించడానికే పరిమితమవకుండా ఆ పార్టీని ఓడించేందుకు ఆ సంఘాలు అన్నీ క్రియాశీలంగా వ్యవహరించనున్నాయి. ఎంపిక చేసుకున్న నియోజక వర్గాలలో ఓటర్లను కలుసుకుని సంఘ్ పరివార్ అబద్ధాలు, కపట నాటకాలను బహిర్గతం చేసేందుకు అవి పూనుకున్నాయి. లక్ష్య నిబద్ధత గల కార్యకర్తలతో ఈ ప్రచార పోరాటాన్ని నిర్వహించేందుకు అవి ఇప్పటికే సమాయత్తమయ్యాయి. బీజేపీని వ్యతిరేకించడం మాత్రమే కాదు, ఆ పార్టీని ఓడించగల అభ్యర్థికి మద్దతునివ్వాలని కూడా అవి నిర్ణయించుకున్నాయి.

మే 13న కేవలం ఎన్నికల ఫలితాలను మాత్రమే మనం తెలుసుకోబోవడం లేదు. ప్రస్తుత పాలనలో ఏ ఎన్నికలు కూడా కేవలం ఎన్నికలు మాత్రమేకాదు; అవి అబద్ధాల, విద్వేష రాజకీయాలకు ప్రజల ఆమోదాన్ని పొందుతున్న మార్గాలు. కర్ణాటక ఓటర్లు మత మౌఢ్య రాజకీయాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే 2024లో వాస్తవిక రాజకీయాలకు దారి సుగమమవుతుంది. కర్ణాటకలో నిర్ణయాత్మక ఓటమి దక్షిణ భారతావని రాజకీయాల నుంచి బీజేపీ నిష్క్రమణకు ప్రారంభం కాగలదు. అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ ఓటమి ప్రజాస్వామిక అవకాశాలను పునరుద్ధరించుకునేందుకై, ఆరంభమైన వీథుల్లో రాజకీయ పోరాటాలను ముమ్మరం చేయగలదు. రాహుల్‌పై అనర్హత వేటు పడిన తరువాత అవి మొదలయ్యాయి. 2024లో బీజేపీని ఓడించే లక్ష్య సాధనకు దోహదం చేసే వ్యూహాన్ని కర్ణాటక ఓటర్ల తీర్పు నిర్ణయిస్తుంది.

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2023-03-31T01:11:52+05:30 IST