Share News

చట్ట సభల్లో ప్రజల గళం

ABN , First Publish Date - 2023-10-31T03:05:53+05:30 IST

భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) వ్యవస్థాపక నేత, మాజీ శాసనసభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ అమరులై...

చట్ట సభల్లో ప్రజల గళం

భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) వ్యవస్థాపక నేత, మాజీ శాసనసభ్యులు, వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, అమరజీవి కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ అమరులై ఈ ఏడాది అక్టోబరు 17వ తేదికి పదిహేనేళ్ళు అవుతున్నది. కామ్రేడ్‌ ఓంకార్‌ నాటి నల్లగొండ నేటి సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం ఏపూరు గ్రామంలో జన్మించారు. పద్నాల్గవ ఏటనే గ్రామాల్లో భూస్వాములు – నాటి నైజాం పరిపాలనలో ఖాసీం రజ్వీ సేవలు కొనసాగిస్తున్న దోపిడి, వెట్టిచాకిరి, బానిసత్వానికి, మహిళలపై సాగిస్తున్న దారుణ కృత్యాలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో చేరి గెరిల్లా శిక్షణ పొంది, ఆ తర్వాత దళ సభ్యుడిగా, దళ నాయకుడిగా, ఏరియా నాయకునిగా నైజాం రజాకారు, భూస్వామ్యశక్తుల ఆగడాలపై మడమతిప్పని పోరాటం కొనసాగించారు. ఆ పోరాటంలో భూస్వాముల భూములను పేద ప్రజలకు పంచటంలో ప్రముఖపాత్ర పోషించారు. కామ్రేడ్‌ ఓంకార్‌ ఉద్యమపోరాట కాలంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి ప్రాంత పోరాటాలలో, ఆదివాసీలతో మమేకం అయ్యి, నిర్వహించిన పాత్ర గణనీయమైనది.

పోరాట విరమణ తరువాత పార్టీ నిర్ణయం మేరకు వరంగల్‌ జిల్లాలో నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ, 1964లో మార్క్సిస్ట్ పార్టీ నిర్మాణంలోను, 1984 నుంచి పార్టీ వ్యవస్థాపక నేతగాను అమరత్వం పొందేవరకు భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారు. 1972లో నర్సంపేట శాసనసభ స్థానం నుంచి 1994 వరకు ఐదుసార్లు గెలుపొంది, 22 సంవత్సరాలు శాసనసభ్యునిగా బడుగు, బలహీన, పీడిత ప్రజల గొంతుకగా నిలబడ్డారు. అందుకే ప్రజలు ఆయన్ని ‘అసెంబ్లీ టైగర్‌’ అని పిలుచుకున్నారు. ఇది సహించలేని భూస్వామ్య గూండాలు నాటి కాంగ్రెస్‌, పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఐదుసార్లు ఆయనపై హత్యాయత్నం చేశారు. అయినప్పటికీ కామ్రేడ్‌ ఓంకార్‌ మృత్యుంజయుడిగా ప్రజల మధ్య నిల్చారు.

భారతదేశ వ్యవస్థను, కమ్యూనిస్టు ఉద్యమ స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసిన కామ్రేడ్‌ ఓంకార్‌ దేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని, ఏ బూర్జువా పార్టీ ప్రజలకు ప్రత్యామ్నాయం కాదని, కమ్యూనిస్టు–సామాజిక శక్తుల ఐక్యతే సరైన ప్రత్యామ్నాయ మార్గమని, నూటికి 98శాతం ఉన్న బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలని అన్నారు. మార్క్సిజం ద్వారా వర్గ నిర్మూలన ఛేదించాలని, అంబేడ్కర్ ఆలోచన విధానంతో అసమానతను రూపుమాపాలని 1984 నుంచి అనేక ప్రయత్నాలు కొనసాగించారు. వర్గ వ్యవస్థలో భాగంగానే కుల వ్యవస్థ ఉందని, కుల వ్యత్యాసాలతో పాటు మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు నిర్వహిస్తూ ఉన్నంత కాలం పోరాడినారు.

కేంద్రంలోని బీజేపీ ఫాసిస్టు, మనువాద విధానాలను రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ కూడా తన రాజకీయ లబ్ధి కోసం బలపరుస్తూ వస్తున్నది. వీటికి వ్యతిరేకంగా పౌరహక్కులను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకు భావ సారూప్యం కలిగిన మేధావులు, వ్యక్తులు, శక్తులు, వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు ఏకం కావలసిన అవసరం ఎంతైన ఉంది. ఈ దిశగా అమరజీవి కామ్రేడ్‌ మద్దికాయల ఓంకార్‌ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని సందర్భంగా చేసుకొని భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 17 నుంచి 31 వరకు ‘మనువాదం–రాజ్యాంగం’ అంశంపై కార్యక్రమాలను జరుపుతున్నది. నేడు ఓంకార్‌ భవన్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో ముగింపు సభ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలకు భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఐక్య) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.

వనం సుధాకర్‌,

ఎంసిపిఐ (యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

Updated Date - 2023-10-31T03:05:53+05:30 IST