ఉపాధిహామీపై సర్కారును తూర్పారబట్టిన స్టాండింగ్ కమిటీ!

ABN , First Publish Date - 2023-08-16T02:52:20+05:30 IST

గ్రామీణాభివృద్ధి శాఖ ‘పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ’ జూలై 27న తన 33వ నివేదిక పార్లమెంటుకు సమర్పించింది. ఈ నివేదికలో కమిటీ 21 అంశాల గురించి ప్రస్తావించింది. అందులో ఐదు అంశాల్లో...

ఉపాధిహామీపై సర్కారును తూర్పారబట్టిన స్టాండింగ్ కమిటీ!

గ్రామీణాభివృద్ధి శాఖ ‘పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ’ జూలై 27న తన 33వ నివేదిక పార్లమెంటుకు సమర్పించింది. ఈ నివేదికలో కమిటీ 21 అంశాల గురించి ప్రస్తావించింది. అందులో ఐదు అంశాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పని తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఐదింటిలో నాలుగు ‘నరెగా చట్టం’ అమలుకు సంబంధించినవి. మిగిలిన ఒక్క అంశం గ్రామీణ రోడ్ల నిర్వహణకు సంబంధించింది.

కమిటీ ఆక్షేపించిన అంశాల్లో మొదటిది: నరెగా చట్టం అమలులో బడ్జెట్ కోతలు. నరెగా అమలుకు 2022–23కి సవరించిన అంచనాలతో పోల్చినప్పుడు 2023–24కి రూ.29,400 కోట్లు తక్కువ కేటాయించడాన్ని కమిటీ ప్రశ్నించింది. ఐతే 2023–24 కేటాయింపుల్ని నిధుల కోతగా చూడకూడదని, అదనపు నిధులు అవసరమైనప్పుడు వాటి కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ సమాధానం ఇచ్చింది. అలానే చట్టం మార్గదర్శకాల ప్రకారం నరెగా సరైన అమలు కోసం వేతనం, మెటీరియల్ చెల్లింపుల కోసం రాష్ట్రాలకు నిధులను విడుదల చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అన్నది. అయితే ఈ వాదనల్ని కమిటీ తోసిపుచ్చింది. ఈ సంవత్సరపు ప్రతిపాదిత డిమాండ్ రూ.98,000 కోట్లు కాగా రూ.60,000 కోట్లు మాత్రమే ఎందుకు కేటాయించారని కమిటీ ప్రశ్నించింది. అసలు ప్రతిపాదిత డిమాండును రూ.98వేల కోట్లుగా ఎలా నిర్ణయించారని నిలదీసింది. అలానే గ్రామీణాభివృద్ధి శాఖ సమాధానం మూసపద్ధతిలో–ఖచ్చితమైన సమాచారం లేకుండా ఉందని ‘కమిటీ’ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ నుంచి నిధుల కేటాయింపు పెంచడం కోసం గ్రామీణాభివృద్ధి శాఖ ఎలాంటి ప్రణాళికనూ చూపలేకపోయిందని విమర్శించింది. నిధులు కొరతతో కొత్త ప్రాజెక్ట్‌లు చేపట్టడంలో ఆటంకానికి, వేతన చెల్లింపులలో జాప్యానికి దారి తీస్తుందని కమిటీ అభిప్రాయపడింది.

రెండో అంశంగా వేతన బకాయిలు, మెటీరియల్ బకాయిల చెల్లింపులలో జాప్యం గురించి కమిటీ ప్రస్తావించింది. వివిధ రాష్ట్రాలలో నరెగా పథకం కింద వేతనాలు, మెటీరియల్ ఖర్చుల కోసం కేంద్ర వాటా నిధుల పంపిణీలో నిరంతర పెండింగుపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దానికి గ్రామీణాభివృద్ధి శాఖ సమాధానం చెబుతూ నరెగా కార్యక్రమం డిమాండ్– ఆధారిత వేతన ఉపాధి కార్యక్రమమని, అందులో రాష్ట్రాలకు నిధుల విడుదల నిరంతర ప్రక్రియ అని అన్నది. అలానే ఆమోదించబడిన లేబర్ బడ్జెట్‌లు, ప్రారంభ బ్యాలెన్స్, మునుపటి సంవత్సరం పెండింగ్‌ పేమెంట్లు తదితర అంశాల ఆధారంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు విడుదల చేస్తుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఆధారంగా మెటీరియల్, పరిపాలనా నిధులు విడుదల జరుగుతుందని కమిటీకి తెలియజేసింది. ఈ సమాధానంతో కమిటీ సంతృప్తి చెందలేదు. గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన సమాధానం తన బాధ్యత నుంచి తప్పించుకునే, రాష్ట్రాలను నిందించే విధంగా ఉందని కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రాలతో సమన్వయం మెరుగుపర్చడం ద్వారా సకాలంలో నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖకు కమిటీ సూచించింది.


కమిటీ మూడో అంశంగా ఉపాధి హామీలో హాజరు యాప్ వాడకంలో తలెత్తుతున్న సమస్యల గురించి ప్రశ్నించింది. పని ప్రదేశంలో పని చేస్తున్న సమయంలో రోజుకు ఈ యాప్‌లో రెండు ఫోటోలు అప్‌లోడ్ చెయ్యాలి. దానికి గ్రామీణాభివృద్ధి శాఖ జవాబు ఇస్తూ– ఇంటర్నెట్ లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్న చోట్ల జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌లు యాప్ వాడకానికి మినహాయింపు ఇవ్వొచ్చునని తెలిపింది. సాంకేతిక సమస్యలు ఏవైనా తమ దృష్టికి వస్తే మంత్రిత్వ శాఖ వెంటనే వాటిని పరిష్కరిస్తుందని వెల్లడించింది. ఐతే కమిటీ ఈ సమాధానం పట్ల తన అసంతృప్తి వ్యక్తపరుస్తూ, యాప్‌ను ఉపయోగించడంలో కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించింది. నిజమైన లబ్ధిదారులెవరూ ఇబ్బందులు పడకుండా చూసేందుకు సమగ్ర సమీక్ష, మినహాయింపు నిబంధనను ఖచ్చితంగా పాటించడం అవసరమని కమిటీ పునరుద్ఘాటించింది. నిజానికి హాజరు నమోదులో యాప్ పద్ధతిని రద్దు చేయమని కార్మికులు కోరుతున్నారు. దురదృష్టవశాత్తు కమిటీ ఆ విషయాన్ని విస్మరించింది.

కమిటీ ప్రస్తావించిన నాలుగో అంశం వేతనాలు తక్కువగా ఉండడం, వేతనాల పెంపు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ సమాధానమిస్తూ– కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ల ద్వారా నరెగా పని వేతన రేటును నిర్దేశిస్తుందని, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి వ్యవసాయరంగ కార్మికుల వినియోగదారుల సూచీ ఆధారంగా ఏటా వేతన రేటును సవరిస్తుందని, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ సొంత వనరులను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రేటు కంటే ఎక్కువ వేతనాలను అందించవచ్చునని పేర్కొంది. అయితే ఈ ప్రతిస్పందనలో హేతుబద్ధత లోపించిందని, వేతన వ్యత్యాసాలు, ద్రవ్యోల్బణాన్ని బట్టి వేతనాల సవరణ లేకపోవడం కార్మికులను నరెగా పనులలో పాల్గొనకుండా నిరుత్సాహపరుస్తుందని కమిటీ వ్యాఖ్యానించింది. అసలు, నరెగా చట్టంలో కనీస వేతనాల చట్టం కంటే తక్కువ వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వాలు ఉపయోగించుకుంటున్న సెక్షన్ 6(1)ని రద్దు చేయాలని ఎంతోకాలంగా ఉన్న డిమాండును కమిటీ పరిగణనలోనికి తీసుకోకపోవడం దురదృష్టకరం.

స్టాండింగ్ కమిటీ సిఫార్సులు అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కేంద్రం గుర్తించాలి. కమిటీ సిఫార్సులను అమలు చేయడం ద్వారా తాము నరెగా అమలులో నిరంతర మెరుగుదలకు, జవాబుదారీతనానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం సందేశం ఇచ్చినట్లు అవుతుంది.

చక్రధర్ బుద్ధ

పరిశోధకులు, లిబ్టెక్‌ ఇండియా

Updated Date - 2023-08-16T02:52:20+05:30 IST