మళ్లీ విపక్షాల సమైక్యతా సీజన్!
ABN , First Publish Date - 2023-07-18T02:24:33+05:30 IST
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా పడగొట్టడానికి ప్రతిపక్షాలన్నీ చేతులు కలుపుతున్నాయి. ఇందులో భాగంగాగానే అవి బెంగళూరులో సమావేశమవుతున్నాయి. 2019 ముందు కూడా...
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా పడగొట్టడానికి ప్రతిపక్షాలన్నీ చేతులు కలుపుతున్నాయి. ఇందులో భాగంగాగానే అవి బెంగళూరులో సమావేశమవుతున్నాయి. 2019 ముందు కూడా అవి ఇదే విధంగా సమాలోచనలు జరిపి మోదీ ప్రభంజనాన్ని తట్టుకోవడం తమ వల్ల కాదని అస్త్ర సన్యాసం చేశాయి. ప్రధానమంత్రి పదవికోసం కనీసం ఐదారుగురు నేతలు పోటీపడడంతో వారి మధ్య ఐక్యత సాధ్యపడలేదు. అప్పుడు ఢిల్లీలోనూ, పార్లమెంట్ అనెక్సీలోనూ పోగయిన నేతల్లో అనేక మంది ఇప్పుడు అస్త్రసన్యాసం చేశారు. ఆనాటి ప్రతిపక్ష సమావేశాల్లో పాల్గొన్న జనతాదళ్ (ఎస్) నేత దేవేగౌడ ఇప్పుడు బెంగళూరులో విపక్ష సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇదొక ఫోటోల కోసం జరిగిన సమావేశం అని బీజేపీ అప్పుడు అభివర్ణించింది. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు సమావేశమయ్యేది కేవలం ఫోటోలకోసమే కాని వారు సాధించేది ఏమీ ఉండదు. బీజేపీతో జాతీయ స్థాయిలో రెండుసార్లు హోరాహోరీ తలపడ్డా లోక్‌సభ సీట్లలో కనీసం పది శాతం కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కోరలు తీసిన పాములా ప్రాంతీయ పార్టీల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది. నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌ను శాసిస్తున్నారు. నిన్నటి వరకూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని నోటికొచ్చినట్లు దూషించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఆ పార్టీకి దాసోహమైనట్లు స్పష్టమవుతోంది. తమ మనుగడ కోసం ప్రాంతీయ పార్టీలు ఏమి చెప్పినా అందుకు అంగీకరించి ఆ పార్టీలు తనకు మిగిల్చిన సీట్లలో పోటీ చేయాల్సిన దుస్థితిలో కాంగ్రెస్ పడింది.
దేశంలో ఇప్పుడు రెండు కూటములు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో అత్యంత బలోపేతంగా ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ).ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీయే మెజారిటీ పార్టీ. బీజేపీకి దేశ ప్రజల్లో ఉన్న జనాదరణ, వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరణ చూసి ఆయా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నాయి. శివసేన, ఎన్‌సీపీ లాంటి పార్టీల్లో కూడా శాసనసభ్యులు తమ నాయకత్వాలను ధిక్కరించి మరీ బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారు. తన విధానాలను అనుసరించేందుకు సిద్ధపడ్డ పార్టీలనే భారతీయ జనతా పార్టీ తనతో పాటు కలుపుకుంటుంది. ఏ పార్టీ బీజేపీని శాసించడానికి, తమ ప్రయోజనాలకోసం బీజేపీని ఉపయోగించుకోవడానికి అంగీకరించే ప్రసక్తే ఉండదు. మరోవైపు అత్యంత బలహీనంగా కనిపిస్తున్న ప్రతిపక్షాల శిబిరంలో అన్నీ స్వార్థ ప్రయోజనాలకోసం ఏకమవుతున్న పార్టీలే కనిపిస్తున్నాయి. అవినీతిలో చిక్కుకుపోయి, కుంభకోణాల్లో ఇరుక్కుని, అస్తిత్వ పరీక్షను ఎదుర్కొంటున్న పార్టీలన్నీ కాంగ్రెస్‌ను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని నడిపించాలనుకుంటున్నాయి. తనకు నాయకత్వం కావాలని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలకు ధైర్యంగా చెప్పుకునే స్థితిలో లేదు.
ఈ పార్టీలన్నిటికీ ఇప్పుడు ఒకే ధ్యేయం. అది 2024 ఎన్నికల్లో ఏ విధంగానైనామోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే. 2019కి ముందు ప్రతిపక్షాల పరిస్థితికీ, ఇప్పుడు వాటి పరిస్థితికీ మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. పైగా అవి మరింత బలహీనపడ్డాయి. మోదీని ఢీ కొనడానికి వారి వద్ద ఎజెండా ఏమీ లేదు. 2014కు ముందు దేశంలో జరిగిన అభివృద్ధితో ఈ 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో ఏ మాత్రం పోల్చలేమని వారికి తెలుసు. 2014కు ముందు దేశంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి, అరాచకాలు, హింసాకాండ గురించి వారికి, ప్రజలకు తెలియనిది కాదు. ఆ సమయంలో ఈశాన్య రాష్ట్రాలన్నీ హింసాకాండలో ఏ విధంగా రగిలిపోయాయో, కశ్మీర్, పంజాబ్, ఢిల్లీ తదితర ప్రాంతాలు ఏ విధంగా అల్లకల్లోలంగా మారాయో చరిత్రపుటల్లో నమోదైంది. వారు చేసిన తప్పుల వల్ల ప్రధానమంత్రి స్థాయి గల నేతలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక మోదీ హయాంలో నెలకొన్న అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన, జవాబుదారీ విధానం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుకోవడం గురించి విమర్శించడం వారి తరం కాదు. ఇవాళ భారతీయుడు ఆత్మగౌరవంతో తలెత్తుకు తిరగడం, భారతీయ సంస్కృతికీ, జాతీయ వాదానికి ప్రపంచమంతా ఎనలేని గౌరవం పెరగడం గురించి కూడా వారికి తెలియనిది కాదు. మరి మోదీ గురించి విమర్శించడానికి వారి వద్ద ఏమున్నది? కేవలం తమ అవినీతి కార్యకలాపాలను కొనసాగించడానికి, కేసులనుంచి కాపాడుకోవడానికి వారు ఏకమవుతున్నారు. ఈ గుంపుకు అధికారమిస్తే దేశం మరోసారి కుక్కలు చింపిన విస్తరి అవుతుందనడంలో సందేహం లేదు.
మోదీ పర్యటనలు భారతదేశ వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తికి నిదర్శనం అని వేరే చెప్పనక్కర్లేదు. ఇవాళ అమెరికా మాత్రమే కాదు, రష్యాతో కూడా భారత్‌కు సత్సంబంధాలున్నాయి. అమెరికా నుంచి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్రాన్స్‌ను సందర్శించడం ఆ వెనువెంటనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లడం భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని సూచిస్తున్నాయి. అమెరికాతో కుదుర్చుకున్న మాదిరే భారత్ ఫ్రాన్స్‌తో కూడా రక్షణ ఒప్పందాలను కుదుర్చుకున్నది. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్, మన డీఆర్‌డీఓ కలిసి అధునాతన మధ్యతరహా యుద్ధ విమానాలకు జెట్ ఇంజన్లు అభివృద్ధిపరుస్తాయి. అదే విధంగా హెలికాప్టర్లు, సబ్‌మెరైన్ల నిర్మాణానికి ఫ్రాన్స్ సహకారం అందిస్తోంది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ యుద్ధ విమానాలు సరఫరా అవుతున్నాయి. అమెరికా మాత్రమే కాదు, ఫ్రాన్స్ కూడా సూపర్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన టెక్నాలజీని భారత్‌కు అందించేందుకు అంగీకరించడం ఒక వినూత్న పరిణామం. దీనివల్ల మోదీ ఆశించిన ఆత్మనిర్భర భారత్ లక్ష్యం నెరవేరుతుంది. భారత్‌ను రక్షణ పరంగా పటిష్ఠం చేయడం మాత్రమే కాదు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ సహకారం తీసుకోవడం కూడా ఫ్రాన్స్‌కు అవసరం. అంతే కాదు, ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు భారత్ కూడా ఎదుర్కొంటున్న విషయాన్ని మనం విస్మరించరాదు. ఇటీవల ఆ దేశంలో జరిగిన అల్లర్ల నుంచి భారతదేశం గ్రహించాల్సింది ఎంతో ఉన్నది.
మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ పర్యటన కూడా అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం గలదిగా విదేశాంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఉన్న రీత్యా మోదీ తాజా పర్యటన ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసింది. మోదీ గౌరవార్థం బుర్జ్ ఆకాశ హర్మ్యంపై ‘వెల్‌కమ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్రమోదీ’ అంటూ ఆయన చిత్రంతో పాటు సందేశాన్ని ప్రదర్శించడం చెప్పుకోదగ్గ విషయం. ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకునేలా చేస్తూ ఖండాంతరాల్లో మన ఆత్మగౌరవాన్ని ఇనుమడింప జేస్తున్న మోదీ కృషికి సర్వత్రా గుర్తింపు లభిస్తుంటే మన దేశంలో చిన్నా చితక పార్టీలు సమావేశమై ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుండడం చూసి జాలి వేయక తప్పదు.
వై. సత్యకుమార్
(బీజేపీ జాతీయ కార్యదర్శి)