ప్రగతి కాంతులూ శ్రేయో వెలుగులూ

ABN , First Publish Date - 2023-02-03T01:26:23+05:30 IST

సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు...

ప్రగతి కాంతులూ శ్రేయో వెలుగులూ

సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది. రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, దివ్యాంగులు, ఆర్థికంగా బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధిని ఈ బడ్జెట్ సుసాధ్యమూ, సులభతరమూ చేస్తోంది. అణగారిన వర్గాలకు ప్రాధాన్యాన్ని అందిస్తూనే, అభివృద్ధిపై నిరంతర దృష్టి సారించిన ఈ సరికొత్త కేంద్ర బడ్జెట్ అమృత కాలంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్.

భారతదేశ ఆర్థిక వ్యవస్థను ‘ప్రకాశవంతమైన నక్షత్రం’గా నేడు ప్రపంచం గుర్తించింది. ఎందుకంటే 7 శాతం వార్షిక వృద్ధిరేటుతో శీఘ్రగతిన పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ మనది. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందడం నిస్సందేహంగా మోదీ సర్కార్ ఘనతే. కొవిడ్ విలయం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇంకా అనేకానేక సమస్యలు, సవాళ్లు ప్రపంచాన్ని వెంటాడుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యవంతంగా సరైన మార్గంలో పురోగమిస్తోంది. దీన్ని మరింత ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు, రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో ఆర్థిక అభివృద్ధికి అవసరమైన పునాది వేసే బ్లూ ప్రింట్‌గా 2023– 24 కేంద్ర బడ్జెట్ ఉంది. స్వయం సమృద్ధ ఆర్థిక వ్యవస్థకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది.

వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ బడ్జెట్‌లో పెద్ద ఎత్తున ప్రాధాన్యమిచ్చారు. వ్యవసాయంతో పాటు మత్స్య, పాడి పరిశ్రమ రంగాల పురోగతికి కూడా ఎనలేని ప్రాముఖ్యత లభించింది. వ్యవసాయానికి రూ.20 లక్షల కోట్ల రుణాలు అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. మత్స్య సంపద యోజన పథకానికి అదనంగా రూ.6 వేల కోట్లు జమ చేశారు. గ్రామ పంచాయతీ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు పెద్ద సంఖ్యలో గిడ్డంగులను నిర్మించనున్నారు. రాబోయే రోజుల్లో 10 వేల బయో ఇన్‌పుట్ రీసెర్చ్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. దేశంలోని 63 వేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు ఈ ఏడాది రూ.7,150కోట్లు ప్రతిపాదించారు. ప్రకృతి సేద్యానికి రూ.459 కోట్లు, కృషి ఉన్నతి యోజన కింద రూ.7,066 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో ఆర్థిక సేవలకు సంబంధించి 13 పథకాలకు ఈ ఏడాది రూ.1,15,531 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ విద్య, పరిశోధనలకు ఈ ఏడాది రూ.9,504 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తూ రూ.3,287 కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో పండ్లు, కూరగాయలు పండించే రైతులకు సంపూర్ణ సహకారం అందించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యానవన పంటల కోసం నాణ్యమైన, ఆరోగ్యకరమైన మొక్కలను అందించేందుకు అనువుగా హార్టికల్చర్ రంగాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా రూ.2,200 కోట్లతో ఆత్మ నిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఐక్యరాజ్యసమితి 2023ని ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. ఆహార అలవాట్లలో తృణధాన్యాలకు మరింత ప్రాధాన్యమివ్వడంపై అవగాహన పెంపొందించాలని కేంద్రం సంకల్పించింది. చిరుధాన్యాల సాగుదారులకు సహకారంగా, భారతదేశాన్ని తృణధాన్యాల హబ్‌గా అభివృద్ధిపరచి ప్రజలకు సంపూర్ణ పోషకాహారం అందేలా కేంద్రం ఒక పథకాన్ని ప్రారంభించింది. దేశంలో తృణధాన్యాల పంటల (మిల్లెట్స్) సాగు, వాటి ఆహారోత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారనున్నది. రాజేంద్రనగర్‌లోని ‘భారత తృణధాన్యాల పంటల పరిశోధన సంస్థ’ (ఐఐఎంఆర్)ను ఈ పంటల సాగు, ఆహారోత్పత్తుల వినియోగం పెంచే కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా కేంద్రం ఎంపిక చేసింది. దీని వల్ల రైతులకు మంచి ధరలు వచ్చి వారి ఆదాయం పెరుగుతుంది.

కొత్త ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి మొత్తం రూ.1,12,898.97 కోట్ల నిధులను కేంద్రం కేటాయించింది. ఇందులో రూ.44,094.62 కోట్లు ఉన్నత విద్యకు, పాఠశాల విద్యకు రూ.68,804.85 కోట్లు వినియోగించనున్నారు. ఈ ఏడాది ఉన్నత విద్యకు రూ.40,828.35 కోట్లు, పాఠశాల విద్యకు రూ.9,752.07 కోట్లు అధికంగా కేటాయింపులు జరిపారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూళ్లలో 38,800 మంది టీచర్లను భర్తీ చేయనున్నారు.. రాబోయే మూడు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్లో 8,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించనున్నారు. పిల్లలు, యువత కోసం డిజిటల్ లైబ్రరీలు, నేషనల్ డిజిటల్ లైబ్రరీ పంచాయతీ, పుస్తకాలు స్థానిక, ఆంగ్ల భాషలలో అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో యువత నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ కేంద్రాలను వివిధ రాష్ట్రాలలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 ద్వారా స్థాపించనున్నారు.

యథావిధిగా కొత్త బడ్జెట్‌లో మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహిళలను స్వావలంబన దిశగా ప్రోత్సహించడానికి ‘ప్రధానమంత్రి విశ్వకర్మ స్కిల్ హానర్ స్కీమ్’ బడ్జెట్‌లో ప్రకటించడం జరిగింది. సంప్రదాయ వృత్తులు, చేతి వృత్తుల వారికి సహాయపడటానికి ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. చేతి వృత్తుల కార్మికులు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగు పరచుకోవడానికి, మరింత విస్తరించడానికి, జన బాహుళ్యానికి తమ ఉత్పత్తులను మరింత చేరువ చేయడానికి ఈ పథకం దోహదపడుతుంది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రంగానికి అనుసంధానంగా ఈ పథకాన్ని ముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.

కరోనా మహమ్మారితో ప్రపంచం ఎంతగా విలవిలలాడిపోయిందో మరి చెప్పనవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి ఫలితంగా మన దేశంలో ఆ మహమ్మారిని సత్వర నియంత్రణ, నివారణ సుసాధ్యమయింది. అదే స్ఫూర్తి, దార్శనికతతో 2023–24 బడ్జెట్‌లోనూ ఆరోగ్య రంగానికి రూ.89,155 కోట్లు కేటాయించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మహిళలను ఇబ్బందిపెడుతున్న సికిల్​ సెల్​ ఎనీమియా (రక్తహీనత)ను 2047లోగా నిర్మూలించేందుకు ప్రత్యేక హెల్త్​ మిషన్​ను స్థాపించనున్నారు. దేశంలో రక్తహీనత ప్రభావం ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో 40 ఏళ్ల లోపు వయస్సులో ఉన్న 7 కోట్ల మందికి స్క్రీనింగ్​ టెస్టులు నిర్వహించనున్నారు. ఆరోగ్య భద్రతా రంగంలో పరిశోధనలు– ఆవిష్కరణలకు రూ.2,980 కోట్లు వెచ్చించనున్నారు. కొత్తగా 22 ‘ఎయిమ్స్’ల ఏర్పాటు కోసం 6,835 కోట్లు కేటాయించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 29 వేల కోట్లు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు రూ. 7,200 కోట్లు కొత్త బడ్జెట్‌లో కేటాయించారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌కు రూ. 341 కోట్లు. నేషనల్ టెలి మెంటల్ హెల్త్ కేర్ కార్యక్రమం కోసం రూ. 113 కోట్లు కేటాయించారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో ఎన్నో ఘనవిజయాలు సాధించింది. ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికై అమృత కాలంలో అత్యధిక ప్రాధాన్యమిచ్చేందుకు కేంద్రం 7 అంశాలను ఎంచుకుంది. వీటిని వచ్చే పాతికేళ్లలో అంటే భారత స్వాతంత్ర్య శతాబ్ది మహోజ్వల భారత్ నిర్మానానికై ప్రభుత్వానికి పథనిర్దేశం చేసే ‘సప్తఋషులు’గా పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అవి: సమ్మిళిత అభివృద్ధి, మారుమూల ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు; మౌలిక వసతులు–పెట్టుబడులు, నిక్షిప్త సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువశక్తికి ప్రోత్సాహం, ఆర్థిక రంగం బలోపేతం.

తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో సుమారు రూ. 38 వేల కోట్లు కేటాయించారు. ఇందులో బీబీ నగర్ ఎయిమ్స్‌కు రూ.300 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి రూ.18 కోట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు రూ.10,500 కోట్లు, సింగరేణికి రూ.1,650 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు రూ.300 కోట్లు, మణుగూరు ప్రాజెక్ట్‌కు రూ.750 కోట్లు, హెవీ వాటర్ ఫ్యాక్టరీకి రూ.450 కోట్లు. కేంద్ర పన్నుల వాటాగా రూ.21,470 కోట్లు ఇవ్వనున్నారు. ఎన్నికల రాజకీయాలతో పని లేకుండా దేశ హితమే ధ్యేయంగా దీర్ఘకాల లక్ష్యాలతో అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యమిచ్చే బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాము లాంటిది. ప్రజలపై భారం మోపకుండా అభివృద్ధి సాధనకు ఆటంకం కాని బడ్జెట్‌ను రూపొందించడం సాహసోపేతం కాదూ? మరి ఇటువంటి సమర్థ పాలన అందిస్తున్నందుకే మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారనడంలో సందేహం లేదు.

డా. కె. లక్ష్మణ్

రాజ్యసభ సభ్యులు

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు

Updated Date - 2023-02-03T01:26:26+05:30 IST