‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చడమే లక్ష్యం!

ABN , First Publish Date - 2023-05-23T02:25:14+05:30 IST

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘దశలవారీ మద్యనిషేధం’ అమలు చేస్తామని ఊదరగొట్టి మహిళల ఓట్లు కొల్లగొట్టి...

‘మద్యాంధ్రప్రదేశ్’గా మార్చడమే లక్ష్యం!

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘దశలవారీ మద్యనిషేధం’ అమలు చేస్తామని ఊదరగొట్టి మహిళల ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చారు. మద్యం వల్ల రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, పేద ప్రజలు ఆరోగ్యం దెబ్బతిని, వైద్యం చేయించుకోలేని దుస్థితిలో తనువు చాలిస్తున్నారని, రాష్ట్రంలో ప్రతి అవ్వ–తల్లి–అక్క–చెల్లెలు చల్లగా ఉండాలంటే అన్ని కుటుంబాలు మద్యం మహమ్మారి నుంచి బయటపడి వారి కుటుంబాల నికర ఆదాయం పెరగాలని అంటూ తన నవరత్నాల్లో ఒకటిగా దీనిని ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున దశలవారీ మద్య నియంత్రణపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు. అనంతరం 2019 అక్టోబర్‌లో వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డిని మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌గా రాజకీయ పునరావాస నియామకం జరపడం మినహా, ఇప్పటివరకు ఈ అంశంలో ఏ పురోగతీ లేదు. వైసీపీ విధానం ‘దశలవారీ మద్యం నిషేధం’ అని చెప్పి అధికారంలోకి వచ్చి, అనంతరం యూ టర్న్ తీసుకొని ప్రభుత్వ ఆదాయం కోసం మద్యం వినియోగం పెంచే పనిలో నిమగ్నమయ్యారు. నమ్మి ఓటు వేసిన మహిళలను వంచనకు గురి చేశారు.

గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో మద్యం అంశంలో పాలన వ్యాపార కోణంలో సాగింది. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సయిజ్ పాలసీ అంటూ ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుందని ప్రకటించడం ద్వారా మద్య నియంత్రణ ఆశయానికి తూట్లు పొడిచారు. 2020–21లో కరోనా సమయంలో మద్యం దుకాణాలు తెరచి ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద విధి నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2021–22 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని మద్యం షాపులను మద్యం నియంత్రణలో భాగంగా భారీగా తగ్గిస్తామన్న స్ఫూర్తికి తూట్లు పొడిచింది. 2022–23లో ఆర్థిక నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం వినియోగం నుంచి వచ్చే వ్యాట్ ఆదాయాన్ని బేవరేజ్ కార్పొరేషన్‌కి తరలించి 20 సంవత్సరాలలో తిరిగి చెల్లించే విధంగా 25,000 కోట్ల రూపాయిల రుణాలను సేకరించే ప్రణాళిక రచించారు. దీంతో జగన్‌ ప్రభుత్వ కాలంలో సంపూర్ణ మద్యనిషేధం హామీ హుళక్కి అయ్యింది. మద్య నిషేధం హామీ స్థానంలో దశలవారీగా మద్యం అమ్మకాలు, ప్రభుత్వ ఆదాయం పెరిగింది.

నేడు దేశంలో ఎక్కడా లేని నాసిరకపు మద్యం ఉత్పత్తి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత జగన్‌కే దక్కుతుంది. మద్యం మహమ్మారి ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తుందని తెలిసిన పాలకులకు, నాసిరకపు మద్యం ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియదా? రాష్ట్రంలో మద్యం తయారుచేసే కంపెనీలు పాలకుల కుటుంబసభ్యులు చేతుల్లో, వారి అనుయాయులు, సహచరులు చేతుల్లో ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఈ అస్మదీయులు తయారు చేసిన నాసిరకపు మద్యం బ్రాండ్లనే రాష్ట్రప్రభుత్వం నిర్వహించే దుకాణాలలో దేశంలోనే అతి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. దశలవారీ మద్య నిషేధం అని జగన్ అన్నప్పుడు, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్య వినియోగ నియంత్రణ కోసం ‘డీ అడిక్షన్ సెంటర్లు’ ప్రారంభిస్తారని ప్రజలు అనుకున్నారు. కానీ ఇప్పుడు బడి, గుడి అనే భేదం లేకుండా నిస్సిగ్గుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్నది. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున జాతీయ, ఆర్ అండ్ బి రహదారులకు ఆనుకొని మద్యం దుకాణాలు ఉండకూడదనే నిబంధనలున్నా, దీనిపై సుప్రీంకోర్టు తీర్పులున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనలు బేఖాతరు చేస్తూ మద్యం అమ్మకాలు, దాని ద్వారా ఆదాయం పెంచుకొనే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమయింది.

జంగారెడ్డిగూడెంలో నాటు సారా వల్ల 25 మంది మరణించారు. ఆ విషాదం వెనుక ఉన్నవారి హస్తం ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు? వీటిని సహజ మరణాలుగా చిత్రించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేయలేదా? రాష్ట్రవ్యాప్తంగా నాటు సారా నియంత్రణలో దారుణంగా ప్రభుత్వం విఫలమైంది. మరోవంక ప్రభుత్వమే మద్యం వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణాలు నాసిరకపు మద్యాన్ని అమ్ముతున్నందున, వైసీపీ నాయకుల అండదండలతో కొందరు ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని సరిహద్దు రాష్ట్రాల నుంచి తెచ్చి ఆంధ్రప్రదేశ్‌లో తెరచాటు వ్యాపారం చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మద్యం పాలసీ లోపభూయిష్టంగా ఉన్నందున మద్యం చుట్టూ రాష్ట్రంలో అనేక అకృత్యాలు జరుగుతున్నాయి.

వైసీపీ తన మ్యానిఫెస్టోలో దశలవారీ మద్యం నిషేధం అన్నందున, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక వాస్తవంగా రాష్ట్రంలో మద్యం ద్వారా వచ్చే ఎక్సయిజ్, వ్యాట్ ఆదాయం ప్రతి సంవత్సరం క్రమంగా తగ్గాలి. కానీ దానికి విరుద్ధంగా మద్యంపై ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతూ అంబరాన్ని తాకే వేగంతో దూసుకెడుతోంది. గడచిన నాలుగు సంవత్సరాల మద్యం ఆదాయం గణాంకాలు విశ్లేషిస్తే, ప్రస్తుత వ్యాట్, ఎక్సయిజ్ డ్యూటీ, ప్రత్యేక జీఓ ద్వారా అధిక రుణాలకోసం మద్యం పైన వ్యాట్ శాతం తగ్గించి బేవరేజ్ కార్పొరేషన్‌కు తరలించిన మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై పన్నుల రూపంలో ఆర్జించిన ఆదాయం రమారమి ఇలా ఉంది. 2019–20లో 17,300 కోట్లు, 2020–21లో 21,500 కోట్లు, 2021–22లో 26,700 కోట్లు, 2022–23లో 30,600 కోట్లుగా ఉంది. అంటే మద్య నిషేధం హామీ నుంచి తప్పుకొని, క్రమంగా ఆ ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడిపే దుస్థితికి జగన్ రాష్ట్రాన్ని తెచ్చారు.

దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ వ్యవహారాలకు సంబంధించిన రోజువారీ నగదు చెల్లింపులు డిజిటల్ మాధ్యమంలో చెయ్యాలని సంకల్పించి కరోన సమయంలో బాగా ప్రోత్సహించారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక చెల్లింపులు కూడా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకే నిధులు బదిలీ చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు ప్రపంచంలోనే అత్యధిక మొత్తంలో డిజిటల్ లావాదేవీలు నెరుపుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్ కూడా డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించే దిశగా ప్రచారం చేయాలని ప్రకటించారు. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వమే నిర్వహిస్తున్న మద్యం దుకాణాలలో లావాదావీలు నగదుకే పరిమితం చేసి డిజిటల్‌ చెల్లింపులను తుంగలో తొక్కారు. దీనికి కారణం, మద్యం తయారు చేస్తున్న కంపెనీలు అధికారంలో ఉన్నవారివి కావడం, ఆ మద్యమే ప్రభుత్వం నిర్వహించే దుకాణాలలోకి సరఫరా చేయడం, తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వ్యాట్, ఎక్సయిజ్, ప్రత్యేక జీఓతో బేవరేజ్ కార్పొరేషన్‌కి వెళ్లాల్సిన ఆదాయం లెక్కల్లో చూపకుండా దారి మళ్లించడం జరుగుతోంది. ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి చేరుతున్నదో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తేగాని తేలదు.

మద్య నిషేధం హామీ తుంగలోకి తొక్కినందున జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలే తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. కేవలం మద్యం ఆదాయంతోనే రాష్ట్ర ప్రభుత్వం నడిచే దుస్థితి మన రాష్ట్రానికి తప్ప, దేశంలోని మరే రాష్ట్రానికీ లేదు. ఎప్పుడైతే బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా 20 సంవత్సరాలకు రుణాలు తీసుకున్నారో, అప్పుడే రాబోయే 20 సంవత్సరాల్లో మద్య నిషేధం లేదని జగన్ తేల్చేశారు. ఢిల్లీ రాష్ట్ర సర్కారు అవినీతితో మద్యం వ్యాపార లావాదేవీలు జరపడంతో బహిర్గతమైన స్కామ్ కన్నా, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అవినీతి తీవ్రత ఎక్కువ అనే వాదన ఉన్నందున, రాబోయే కాలంలో జాతీయ విచారణ సంస్థల ద్వారా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది.

లంకా దినకర్

Updated Date - 2023-05-23T02:25:14+05:30 IST