చరిత్ర విస్మరించిన తొలి సత్యాగ్రహం

ABN , First Publish Date - 2023-03-19T01:12:49+05:30 IST

భారతదేశ చరిత్రలో రెండు సత్యాగ్రహాలు జరిగాయి, దురదృష్టవశాత్తు వాటిలో ఒక సత్యాగ్రహం మాత్రమే ప్రసిద్ధి పొందింది. అది మాత్రమే పుస్తకాల్లోకి పాఠంగా చేరింది. అదే గాంధీజీ ముందుండి...

చరిత్ర విస్మరించిన తొలి సత్యాగ్రహం

‘మనం చావ్‌దార్‌ చెరువుకు వెళ్తున్నది కేవలం మంచినీళ్లు తాగడానికి మాత్రమే కాదు, మనం కూడా అందరిలాగే మనుషులం అని ప్రకటించడానికి కూడా’.

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌

భారతదేశ చరిత్రలో రెండు సత్యాగ్రహాలు జరిగాయి, దురదృష్టవశాత్తు వాటిలో ఒక సత్యాగ్రహం మాత్రమే ప్రసిద్ధి పొందింది. అది మాత్రమే పుస్తకాల్లోకి పాఠంగా చేరింది. అదే గాంధీజీ ముందుండి నడిపించిన ఉప్పుసత్యాగ్రహం. ‘సహజ వనరైన ఉప్పు ఉత్పత్తిపై పన్నువేయడం అమానుషం’ అని ఆనాడు ఆ తిరుగుబాటుకు గాంధీ శ్రీకారం చుట్టారు. అచ్చంగా అలాంటి మానవ హక్కులపైనే, మూడేళ్లు ముందుగానే, జీవనాధారమైన నీటిని కొన్ని సమూహాలకు, (అంటరాని సమూహాలుగా ముద్రవేసి) దూరంచేసిన దురాగతంపై ఆ కులాలు చేసిన సత్యాగ్రహాన్ని మాత్రం భారతీయ చరిత్రకారులు విస్మరించారు. అదే మహద్ చెరువు నీటిని తాగే హక్కుకోసం దళితజాతులకు బాసటగా, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ ముందుండి నడిపించిన మహద్ సత్యాగ్రహం.

1927 మార్చి 20న, మూడువేల మంది అంటరాని వాళ్ళను వెంట బెట్టుకొట్టుకొని రాయగఢ్ జిల్లాలో ఉన్న మహద్ అనే ఊరిలోగల చావ్‌దార్‌ చెరువుకు అంబేడ్కర్‌ వెళ్లారు. ఆ రోజుల్లో దళితులను అంటరానివాళ్లుగా చూసేవారు. వారి ఉనికి సైతం పరిసరాలను మైలపరుస్తుందని మూతికి ముంత, మొలకు చీపురు కట్టించి అవమానపరిచిన సమాజం అప్పటిది. కనీసం ప్రాణం నిలిపే మంచినీటిపై కూడా వారికి హక్కులివ్వని వివక్షాపూరిత సమాజం ఆనాటిది. అలాంటి రోజుల్లో బాబాసాహెబ్ ఈ ఉద్యమానికి రూపకల్పన చేశారు. ఊరేగింపుగా చావ్‌దార్‌ చెరువుకు వెళ్లి, అందులో దిగి, ఆ నీటిని తాగడం ద్వారా, ఆ నీటిపై తమకూ హక్కుందని తెలియజేసారు. ఆ వెంటనే ఆయన వెంటవున్న అనేకులు చెరువులో దిగి నీటిని తాగి, పాత్రల్లో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. పెద్ద అలజడి రేగింది. ఆధిపత్య కులస్తులు దాడులకు దిగారు. తరువాత, గో మూత్రం, ఆవుపాలు, పెరుగు, ఆవునెయ్యి, ఆవుపేడ రంగరించి, ఆ మిశ్రమాన్ని 108 కుండలలో సేకరించి చెరువులో వేదమంత్రాల నడుమ గుమ్మరించి అది శుద్ధి అయినట్టు ప్రకటించారు.

అంబేడ్కర్, స్వీయ కథగా పరిగణించదగ్గ ‘వెయిటింగ్ ఫర్ ద వీసా’ అనే పుస్తకంలో నీరు పుట్టక పస్తులున్న తన చిన్ననాటి ఉదంతం నొకదాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. చిన్నప్పుడు వేరే ఊరిలో పనిచేస్తున్న తండ్రిని కలవడానికి తన సోదరులతో ఆయన బయలుదేరారు. వీళ్ళు అంటరానివారని తెలుసుకున్న గుర్రపు బగ్గీ సొంతదారు వారిని బండి దించేశాడు. అతడ్ని బతిమాలి, తామే బండితోలేలా ఎక్కువ డబ్బులిచ్చి ఒప్పించి, రోజంతా ఎండలో బండితోలి, ఆకలయ్యి తిందామని కూర్చున్నప్పుడు, గ్రామస్తులు వీళ్లకు నీళ్లు ఇవ్వలేదు! తినడానికి భోజనం ఉండీ పస్తులు పడుకోవాల్సొచ్చిన రోజులు తనను చాలా ఆలోచనలోకి నెట్టాయనీ, అంటరానితనం ఎంత అమానుషమైనదో తనకు అప్పుడు అర్థమైందనీ అంబేడ్కర్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

మహద్ సత్యాగ్రహాన్ని నిర్వహిస్తూ ఆ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న అంటరాని స్త్రీలనుద్దేశించి అంబేడ్కర్‌ ఇలా చెప్పారు: ‘కులాన్ని ప్రతిబింబించే ఏ విధమైన ఆభరణాలూ ఇకపై మీరు ధరించవద్దు. వాటిని బహిష్కరించండి. (అప్పట్లో కొన్ని లోహాలతో చేసిన కడియాలు, గాజులు లాంటి ఆభరణాలు కేవలం అంటరాని స్త్రీలకు పరిమితంగా ఉండేవి.) ఇతర కులాల స్త్రీల మాదిరిగానే మీరు దుస్తులు ధరించడం నేర్చుకోండి. పస్తులున్నాసరే, చక్కగా ఉతికిన దుస్తులు ధరించి, శుభ్రంగా కనపడండి. పేదరికం మనతో ఎప్పుడూ ఉన్నది, దానికి లొంగిపోకండి’.

అంబేడ్కర్‌ను అనుసరించిన వారిలో ఆధిపత్యకులాల స్త్రీలూ ఉన్నారు. నిజానికి అప్పుడు సామాజిక చైతన్యం వారికే ఎక్కువగా ఉండింది. వారిలో లక్ష్మీబాయి టిప్నిస్, ఇందిరాబాయి చిత్రే అనే యువతులు ముందుకొచ్చి, దళిత స్త్రీలకు తమలాగా చీరకట్టుకోవడం నేర్పారు. అప్పటిదాకా వారిని ఇతర కులాల స్త్రీల మాదిరిగా కాళ్ళు కనపడకుండా వస్త్రధారణ చేసుకోనివ్వలేదు ఈ కులసమాజం.

బాబాసాహెబ్ కోరిన సమాజం వివక్ష జాడలు లేని సమానత్వ సమాజం. భారతీయులందరూ సమాన హక్కులతో, హాయిగా బ్రతకాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో చట్టాలున్నాయి, ఆ చట్టాలు నిజానికి అందరికీ సమాన హక్కులు ప్రవచించాయి. 1923 ఆగస్టులో బాంబే లేజిస్లేటివ్ కౌన్సిల్ ‘దళితులందరూ అన్ని ప్రభుత్వ స్థలాలనూ, చెరువులనూ ఇతరులతో సమానంగా వాడుకోవచ్చని’ ఒక తీర్మానం చేసింది. అలాగే 1924 జనవరిలో ఇలాంటి తీర్మానమే మహద్ మున్సిపల్ కౌన్సిల్‌ సైతం చేసింది. కానీ సవర్ణ హిందువులు నిరసనలకు దిగడంతో అది కార్యరూపం దాల్చలేదు. మహద్‌లో ఈ సత్యాగ్రహం చేయడానికి కొందరు ఆధిపత్య కులాల వ్యక్తులు కూడా సహకరించారు. మహద్ మున్సిపల్ ప్రెసిడెంట్ సురేంద్ర టిప్నిస్ వారిలో ముఖ్యులు. ఆయనే అంబేడ్కర్‌ను ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా ఆహ్వానించారు. ఆ విధంగా ఒక చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. సహజ వనరైన నీటిపై కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి, సాటి మనుషులను బానిసలుగా చూసిన సమాజపు తీరును సవాలు చేస్తూ బాబాసాహెబ్ చూపిన తెగువ, చొరవ అద్వితీయం.

దళితుల, స్త్రీల హక్కులూ మానవ హక్కులే అని అంబేడ్కర్ అనేక మంది అభ్యుదయవాదుల కంటే ముందే నినదించారు. ఆ హక్కులను చట్టాలుగా, రాజ్యాంగబద్ధంగా బాధితులకు అందించడంలో ఆయన కృషి, నిబద్ధత యావత్ ప్రపంచానికే అనుసరణీయం. కులాల పేరిట సాటి మనుషుల్ని హీనంగా చూడడం అనాగరికమని, దళితేతర సమాజం గ్రహించి దళితులను అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని మహద్ సత్యాగ్రహం స్పష్టం చేసింది.

అరుణ గోగులమండ

గుమ్మడి ప్రభాకర్

Updated Date - 2023-03-19T01:12:49+05:30 IST