Share News

గురి తప్పిన కులాల బ్రహ్మాస్త్రం!

ABN , First Publish Date - 2023-10-31T03:26:39+05:30 IST

చాలా కాలానికి కాంగ్రెస్‌కు ఒక బ్రహ్మాస్త్రం దొరికిందనే ప్రచారం ఇటీవల బాగా ఊపందుకుంది. 1960ల నుంచి తమకు దూరమవుతున్న బీసీలు మళ్లీ దగ్గరకు రావటానికి ఈ అస్త్రం తోడ్పడుతుందని...

గురి తప్పిన కులాల బ్రహ్మాస్త్రం!

చాలా కాలానికి కాంగ్రెస్‌కు ఒక బ్రహ్మాస్త్రం దొరికిందనే ప్రచారం ఇటీవల బాగా ఊపందుకుంది. 1960ల నుంచి తమకు దూరమవుతున్న బీసీలు మళ్లీ దగ్గరకు రావటానికి ఈ అస్త్రం తోడ్పడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. కులాల స్థితిగతులను బట్టి సామాజిక న్యాయం కావాలనుకునే ఆలోచనాపరులూ దీన్నే నమ్ముతున్నారు. ఇంతకీ ఇది కొత్త అస్త్రం కాదు. గతంలోనూ దీన్ని ప్రయోగించారు. గమ్యాన్ని మాత్రం చేరుకోలేదు. కారణాల్లోకి వెళితే చాలా సంగతులూ తెలుస్తాయి. అసంబద్ధతలూ వెలుగులోకి వస్తాయి. అందుకు ముందుగా కొన్ని పరిణామాలను స్థూలంగా స్పృశించాలి. కుల గణనను డిమాండు చేస్తూ ఈ నెల 9న సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆమోదించింది. హిందూత్వ హోరులో సామాజిక న్యాయాన్ని డిమాండు చేసే పార్టీలకు క్రమేపీ చోటు తగ్గిపోతోందన్న భావన ఎప్పటి నుంచో ఉంది. దీన్ని కట్టడి చేయాలంటే ప్రధానంగా కుల అసమానతల చుట్టూ రాజకీయాలు బలంగా తిరిగేలా వ్యూహాన్ని రూపొందించాలి. బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ ఆ దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగా కులాలవారీ జనాభా సేకరణను చేపట్టారు. సీడబ్ల్యూసీ దాన్ని ఘనంగా స్వాగతించింది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కుల గణనను చేపడతామని స్పష్టం చేసింది. బిహార్‌ లెక్కల గురించి సీడబ్ల్యూసీ మరో విషయాన్ని కూడా ప్రస్తావించింది. కులాల సంఖ్యకు అనుగుణంగా పదవులు, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేదని బిహార్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది. ఇప్పటివరకూ నితీశ్‌ సర్కార్‌ కులాలవారీ జనాభాను మాత్రమే ప్రకటించింది. ఉద్యోగాలు, పదవుల్లో ఆయా కులాలకు ప్రాతినిధ్యం తక్కువని గానీ ఎక్కువని గానీ స్పష్టంగా చెప్పలేదు. కనీసం కులాలపరంగా రాజకీయ పదవుల లెక్కలను కూడా ప్రకటించలేదు. కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని మాత్రమే చెప్పింది. బహుశా సీడబ్ల్యూసీకి లెక్కల సమాచారం ప్రత్యేకంగా లభించి ఉండాలి!

కులాల లెక్కలను తేల్చాలనే డిమాండు కాంగ్రెస్‌కు కొత్తకావచ్చు. కానీ దేశానికి కాదు. గతంలో ఆ డిమాండును కాంగ్రెస్‌ పెద్దగా పట్టించుకోలేదు. నెహ్రూ ప్రభుత్వం కులాలవారీ లెక్కల పట్ల విముఖతను ప్రకటించింది. ఆధునిక సమాజ నిర్మాణంలో భాగంగా కులం అంతరించి పోవాలని నెహ్రూ కోరుకున్నారు. అందుకే 1951 నాటి జనాభా సేకరణలో ఎస్సీ, ఎస్టీలు మినహా ఇతర కులాల లెక్కలేవి సేకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. 1881 నుంచి పదేళ్లకు ఒకసారి బ్రిటిష్‌ పాలకులు మొదలు పెట్టిన కులాలవారీ లెక్కల చరిత్ర అలా ఆగిపోయింది. 1941లో కులాలవారీ లెక్కల సేకరణ మొదలు పెట్టినా రెండో ప్రపంచ యుద్ధం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది. అందుకనే ఇప్పటికీ 1931 నాటి కులాల లెక్కలపైనే అందరూ ఆధారపడుతున్నారు. కానీ అవి సమగ్రమని చెప్పలేం. బ్రిటిషు అధికారులు అనుసరించిన కులాల వర్గీకరణ విధానంపై అప్పుడూ ఇప్పుడూ ఏకాభిప్రాయం లేదు. జనాభా లెక్కల ఆధారంగా కులాలు సంఘటితమై, సంఘాలు పెట్టుకుని, మహాసభలు నిర్వహించి చాలా హడావుడి చేశాయి. ఈ లెక్కల స్ఫూర్తితోనే కుల చరిత్రలను రాసుకున్నారు. కులాల పేర్లు మార్చుకున్నారు. తమ కులాలకు బ్రిటిషు అధికారులు ఇచ్చిన హోదాపై పేచీలు పడ్డారు. ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం డిమాండ్లు ఈ లెక్కల ఆధారంగానే తలెత్తాయి. కులాల్లో కొన్ని చెడు ఆచారాలను తొలగించటానికి కుల సంఘాలు కొంత ప్రయత్నం చేశాయి. విద్యా వ్యాప్తికీ కొంత తోడ్పడ్డాయి. చారిత్రక దృష్టితో చూస్తే కుల చైతన్యం మంచితో పాటు చెడునూ చేసింది.

1989 నాటి లోక్‌సభ ఎన్నికలతో దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ ఏకచ్ఛత్రాధిపత్యం ముగిసింది. రాజీవ్‌ గాంధీ మరణంతో పెల్లుబికిన సానుభూతితో 1991లో ఎక్కువ సీట్లు వచ్చినా స్వంతంగా మెజారిటీని సాధించలేక పోయింది. ఇతర పార్టీలపై ఆధారపడి అయిదేళ్లు బండిని నెట్టుకొచ్చింది. ఆ తర్వాత 2004, 2009ల్లో యూపీఏ పేరుతో వివిధ పార్టీలతో జట్టుకట్టి మాత్రమే అధికారంలోకి రాగలిగింది. యూపీఏ మలివిడత పాలనలో బీసీల లెక్కలు తేల్చాలనే డిమాండు బాగా ఊపందుకుంది. 2011లో చేపట్టే జనాభా సేకరణ సందర్భంగా ఒత్తిడి ఎక్కువైంది. వివిధ పార్టీల్లోని బీసీ ఎంపీలు గట్టిగా పట్టుబట్టటంతో కులాలవారీ జనాభా లెక్కల సేకరణకు అంగీకరించిక తప్పలేదు. కులాలతో పాటు ఆయా కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమాచారాన్ని సేకరించటానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటింటి సర్వే నిర్వహించి ఆ ప్రక్రియను ముగించింది. కానీ ఆ సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ) వివరాలను మాత్రం బయట పెట్టలేదు. మోదీ ప్రభుత్వం 2015లో ఆ పని చేసింది. తొలుతగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన తాత్కాలిక వివరాలను వెల్లడించింది. 2018 జూలైలో పట్టణ ప్రాంతాల సమాచారాన్ని కూడా కలిపి తుది వివరాలను ప్రకటించింది. అప్పటి నుంచి ఈ వివరాలు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కులాల వారీ లెక్కలు మినహాయించి మిగతా సామాజిక, ఆర్థిక స్థితిగతుల సమాచారం రాష్ట్రాలకు కూడా పంపించారు. ఈ సమాచారం ఆధారంగానే ఎన్నో పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని కేంద్రం ఘనంగా చెబుతోంది.

దాదాపు 5000 కోట్లు ఖర్చుపెట్టి చేసిన సర్వేలో ప్రతి కుటుంబ కులాన్ని నమోదు చేశారు. కానీ సేకరించిన కులాలను వర్గీకరించటం తమవల్ల కాదని చేతులెత్తేశారు. కులాల జనాభా సేకరణకు ఘనంగా ఆమోదముద్ర వేసినప్పటికీ నమోదుకు శాస్త్రీయంగా అనుసరించాల్సిన పద్ధతిని స్పష్టంగా నిర్ణయించలేకపోయారు. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ పెద్దను కలిసి కుల వివరాలను అడిగారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. కొందరు కులం పేరు చెప్పారు. కొందరు ఉపకులం పేరు చెప్పారు. కొందరు గోత్రం చెప్పి ఊరుకున్నారు. కొందరు తాము అనుసరించే మత విభాగం పేరు చెప్పారు. కొందరు తాము ఏ ప్రాంతం నుంచి వచ్చారో దాన్ని మాత్రమే చెప్పారు. మరికొందరు కుల బిరుదులను చెప్పి ఊరుకున్నారు. ఇంకొందరు శాఖలను మాత్రమే చెప్పారు. ఇట్లా తలా ఒక విధంగా చెప్పిన కులాల పేర్లతో జాబితా చాంతాడంత అయింది. వంద మందికి మించని కులాలు అసంఖ్యాకంగా నమోదయ్యాయి. ఈ నమోదు ఎంత గందరగోళంగా తయారైందో తెలుసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం 2021లో సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను చూడాలి. ఎస్‌ఈసీసీలో తేలిన కుల లెక్కలను వెల్లడించాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రం కౌంటర్‌ అఫిడవిట్‌ను సమర్పించింది. మహారాష్ట్రను ఉదాహరణగా తీసుకుని కులాల సర్వే ఎంత అసంబద్ధంగా తయారైందో వివరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 10.3 కోట్లు. అందులో తమది ఫలానా కులం అంటూ చెప్పని వారి సంఖ్య 1.17 కోట్లు. ఇదే చాలా ఆశ్చర్యం అనుకుంటే దానికి మించినది మరొకటి ఉంది. అక్కడి ప్రజలు చెప్పిన కులాలన్నిటినీ గణిస్తే ఆ సంఖ్య 4,28,677గా తేలింది. అప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కింద గుర్తించిన కులాల సంఖ్య 494 మాత్రమే. ఓసీ కులాలను కూడా కలిపితే అది కాస్తోకూస్తో పెరుగుతుంది. ఇక నమోదైన 4,28,677 కులాల్లో 99 శాతం కులాల మొత్తం జనాభా ఎంతో తెలుసా? కేవలం 54 లక్షలు! వందమంది కంటే లోపు ఉన్న కులాల సంఖ్య 4,26,237గా తేలింది. వెయ్యి, అంతకు మించి జనాభా సంఖ్య ఉన్న కులాలు 2440 ఉన్నాయి. 8.82 కోట్ల మంది ఈ 2440 కులాల్లోనే ఉన్నారు. రాష్ట్రాల వారీగా గుర్తింపు పొందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాల జాబితాలను దగ్గర పెట్టుకుని ఏ కులం వారు ఆ జాబితాల్లో ఎక్కడ ఇముడుతారో పోల్చుకుని ప్రతి కుటుంబాన్ని సంబంధిత జాబితాలో వేస్తే కొంతైనా స్పష్టత ఉండేది. రిజర్వేషన్లు పొందే వర్గాలు పోనూ మిగతా వారందరినీ అగ్రకులాలుగా భావించినా కొంత పద్ధతిగా ఉండేది. అసంఖ్యాకంగా నమోదైన కులాలను స్థానిక పరిస్థితుల ఆధారంగా కుదించి ఆమోదయోగ్యంగా వర్గీకరించటానికి జాబితాలను రాష్ట్రాలకు పంపించినా స్పందన రాలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక కులాల సంఖ్యపై కేంద్ర, రాష్ట్రాల దగ్గరున్న సమాచారంలో చాలా తేడాలున్నాయని చెబుతూ కొన్ని విషయాలను ప్రస్తావించింది. ఆంత్రోపాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రచురించిన సమాచారం ప్రకారం దేశంలో 79,280 కమ్యూనిటీలు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ఓబీసీ జాబితాలో 2,479 కులాలు ఉంటే రాష్ట్రాల జాబితాల్లో 3,150 కులాలు నమోదయ్యాయని తెలిపింది. 1931 నాటి జనాభా లెక్కల ప్రకారం తేలిన కులాలు 4147 మాత్రమే! ఎస్‌ఈసీసీ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో కులాలను లెక్కిస్తే ఆ సంఖ్య 47 లక్షలకు చేరింది. ఏ కోణం నుంచి చూసినా ఎస్‌ఈసీసీ పేర్కొన్న కులాల సంఖ్య తప్పులతడకని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ సమాచారం నిరుపయోగమని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆ వాదనను ఆమోదించింది. హిందూత్వ భావజాలం కులగణనను అంగీకరించదు. అందులో భాగంగా కేంద్రం గణాంకాలను తారుమారు చేసిందని అనుకున్నా ఏదో ఒకరోజు నిజం బయట పడుతుంది. తమ హయాంనాటి కులాల లెక్కల్లో అసంబద్ధతను మోదీ ప్రభుత్వం తూర్పారపట్టినా కాంగ్రెస్‌ ఇంతవరకూ ప్రశ్నించలేదు. కులగణన కోసం అప్పుడూ ఇప్పుడూ గట్టిగా వాదించే మేధావులూ మౌనంగానే ఉన్నారు. కులాల లెక్కలను తేల్చటం కష్టమే. అసాధ్యం మాత్రంకాదు. కులాల్లోని ఆర్థిక వ్యత్యాసాలను బయటపెట్టటం రాజకీయంగా కష్టం. పైకి ఎన్ని ఆదర్శాలు వల్లించినా ఒక స్థాయిని దాటి ఆర్థిక అసమానతల గురించి మాట్లాడటానికి పార్టీలు సుముఖంగా లేవు. కులాల పరిధులు దాటి సమస్యల లోతుల్లోకి వెళ్లటానికి సాహసించటం లేదు. కొన్ని తేడాలతో వర్గ విభజనలు అన్ని కులాల్లోకి వచ్చేసాయి. కుటుంబాల వారీగా ఆర్థిక స్థాయిలు తేలితే ఏ కులంలో ఎవరు ఎక్కడ ఉన్నారో ప్రస్ఫుటం అవుతుంది. ఉద్యోగాలు, పదవుల్లో రిజర్వేషన్ల రూపంలో ఆపన్న హస్తం ఎవరికి అందివ్వాలో స్పష్టమవుతుంది. కోటాల్లో కోతలూ వర్గీకరణలూ తేలుతాయి.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - 2023-10-31T03:26:39+05:30 IST