తెలుగు విశ్వవిద్యాలయం: ఎన్‌టిఆర్‌ మానస పుత్రిక

ABN , First Publish Date - 2023-05-24T00:57:00+05:30 IST

నందమూరి తారక రామారావు 1983లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే అప్పటికే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, సంగీత నాటక అకాడమి, లలిత కళా అకాడమి, నృత్య అకాడమిల పనితీరుపై...

తెలుగు విశ్వవిద్యాలయం: ఎన్‌టిఆర్‌ మానస పుత్రిక

నందమూరి తారక రామారావు 1983లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే అప్పటికే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి, సంగీత నాటక అకాడమి, లలిత కళా అకాడమి, నృత్య అకాడమిల పనితీరుపై నార్ల వెంకటేశ్వరరావుతో ‘ఏక సభ్య సంఘాన్ని’ ఏర్పాటు చేశారు. నార్ల కమిటీ అకాడమిలపై విచారణ జరిపి వాటి రద్దుకు సిఫారసు చేసింది. దానితో ఎన్‌.టి. రామారావు ఆనాటి అకాడమిలను రద్దు చేశారు. దీనితో అకాడమిలను ఆశ్రయించి ఉన్న కళాకారులు, రచయితలు మండిపడ్డారు. ఒక కళాకారుడు అయి ఉండి సాటి కళాకారుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొవలసి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎన్‌.టి. రామారావు ఇతర పెద్దలతో, మేధావులతో, అధికారులతో సమాలోచనలు జరిపి ఇందుకు ప్రత్యామ్నాయంగా ‘కళాపీఠం’ పేరుతో ఒక పీఠాన్ని స్థాపించి, గతంలోని అకాడమిల కార్యక్రమాలన్నింటినీ ఒక గొడుగు కిందకు తెచ్చి, ఈ పీఠం ద్వారా జరిపించాలని భావించారు. ఈ కళాపీఠానికి ‘తెలుగు విజ్ఞాన పీఠం’ పేరుతో 1984 ఏప్రిల్‌ 2వ తేదీన ఉగాది పండుగ నాడు శంకుస్థాపన జరిపించారు. నెక్లెస్‌ రోడ్‌లో సచివాలయం పక్కన, హుస్సేన్‌సాగర్‌కి ఎదురుగా, ప్రస్తుతం ఎన్‌.టి.ఆర్‌. సమాధికి సమీపంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలకం నేటికీ అక్కడ దుమ్ముకొట్టుకొని పోయి ఉంది.

దీనికి ముందే ప్రభుత్వ ఆదేశం మేరకు ఆచార్య తూమాటి దొణప్ప తంజావూరులోని ‘తమిళ విశ్వవిద్యాలయాన్ని’ సందర్శించి, అక్కడి కార్యకలాపాలను పరిశీలించి, ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. ప్రభుత్వం ఆనాటి అకాడమిలతో పాటు, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితిలను కూడా ఈ తెలుగు విజ్ఞాన పీఠంలో విలీనం చేసింది. దానితో సచివాలయం దగ్గర శంకుస్థాపన చేసిన స్థలంలో బహుళ అంతస్థుల భవన నిర్మాణం జరిగే దాకా ‘తెలుగు విజ్ఞాన పీఠం’ కార్యకలాపాలను రవీంద్రభారతి ప్రాంగణంలోని అకాడమిల ‘కళాభవన్‌’, ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని ‘అంతర్జాతీయ తెలుగు సంస్థ’, ‘తెలుగు భాషా సమితి’ లకు చెందిన ‘తెలుగు భవనం’ కార్యాలయంగా మారాయి.

1984 డిసెంబర్‌లో ప్రభుత్వం ఆచార్య తూమాటి దొణప్పను ‘తెలుగు విజ్ఞాన పీఠాని’కి ప్రత్యేకాధికారిగా నియమించింది. ఆయన 1985 మార్చి 13వ తేదీన ప్రత్యేకాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే తెలుగు భాష సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, కళలు, విజ్ఞానం, జానపద రంగం వంటి బహుముఖీనమైన రంగాలలో సమగ్ర వికాసం కోసం, నిరంతరం బోధన, పరిశోధన, ప్రదర్శన, ప్రచురణ కొనసాగాలని ఎన్‌.టి.ఆర్‌. భావించారు. ఆనాటి లోకాయుక్త జస్టిస్‌ ఆవుల సాంబశివరావు, కొంతమంది వైస్‌ ఛాన్స్‌లర్లను సంప్రదించి, వారి సూచన మేరకు ‘తెలుగు విజ్ఞాన పీఠాన్ని’ ఒక ఉన్నత విద్యాసంస్థగా తీర్చిదిద్దాలనుకొన్నారు. అయితే పైన తెలిపిన పెద్దల అభిప్రాయాల మేరకు, తంజావూరులోని ‘తమిళ విశ్వవిద్యాలయం’ ఒరవడిలో తెలుగు విజ్ఞాన పీఠాన్ని ‘తెలుగు విశ్వవిద్యాలయం’గా మార్చారు. అనంతర కాలంలో హంపీలో ‘కన్నడ విశ్వవిద్యాలయం’ ఏర్పడింది. ఈ రకంగా దక్షిణ భారతంలో భాషా విశ్వవిద్యాలయాలు నెలకొన్నాయి.

1985 సెప్టెంబర్‌లో ‘తెలుగు విశ్వవిద్యాలయం’ చట్టం రూపొందించబడి, ఆనాటి శాసనసభలో ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉత్తర్వు నెం.494, విద్య (ఉన్నత విద్య) తేదీ నవంబర్‌ 27, 1985 ద్వారా ‘తెలుగు విశ్వవిద్యాలయం’ చట్టపరంగా ప్రకటించబడి, 1985 డిసెంబర్‌ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. తెలుగు విజ్ఞాన పీఠానికి ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్న ఆచార్య తూమాటి దొణప్పను ప్రభుత్వం ‘తెలుగు విశ్వవిద్యాలయాని’కి మొదటి వైస్‌–ఛాన్స్‌లర్‌గా నియమించింది.

తెలుగు జాతికి చెందిన ‘తెలుగు విశ్వవిద్యాలయం’ నాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ నగరంలోనే కాక కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో కూడా విశ్వవిద్యాలయం ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ఎన్‌టిఆర్‌ భావించారు. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు నెం.11 విద్య (ఉన్నత విద్య) జనవరి 7, 1986 ద్వారా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని బొమ్మూరులో, రాయలసీమ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం సమీపంలో తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఏర్పాటయ్యాయి. బొమ్మూరులోని ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ప్రాంగణం సాహిత్య పీఠం పేరుతో, శ్రీశైలంలోని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణం చరిత్ర–పురావస్తు–శాస్త్ర పీఠం పేరుతో ఏర్పడ్డాయి. 1986 ఏప్రిల్‌ 10వ తేదీ ఉగాది పర్వదినం నాడు శ్రీశైల ప్రాంగణానికి, 1986 ఏప్రిల్‌ 18 శ్రీరామనవమి పండుగ నాడు బొమ్మూరులోని ప్రాంగణానికి ఎన్‌టి రామారావే స్వయంగా శంకుస్థాపన చేశారు. తరువాతి కాలంలో వరంగల్‌లో ‘జానపద గిరిజన విజ్ఞాన పీఠం’ ఏర్పడింది.

ఇక హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం కార్యకలాపాలకు ‘కళాభవన్‌’, ‘తెలుగు భవన్‌’ భవనాలు చాలవని ప్రభుత్వం భావించింది. అందువల్ల ‘తెలుగు భవనం’, ‘తెలుగు భాషాసమితి’ భవనాలు ఉన్న స్థలంలోనే విశాలమైన ఖాళీ ప్రదేశంలో ఒకటి ప్లస్‌ ఆరు అంతస్థుల భవనం నిర్మించాలని భావించి, 1986 అక్టోబర్‌ 15వ తేదీన ఎన్‌.టి.ఆర్‌. శంకుస్థాపన చేశారు. అయితే అక్కడ సంజీవరెడ్డి శంకుస్థాపన చేసిన చోట, ఇక్కడ ఎన్‌.టి.ఆర్‌ శంకుస్థాపన చేసిన చోట భవనాల నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు విశ్వవిద్యాలయ భవనం స్థలం వాస్తవానికి ‘తరతరాల తెలుగు జాతి’ పేరుతో నిర్మించాలనుకొన్న బృహత్తర సంగ్రహాలయానికి (మ్యూజియం) చెందినది. ఆనాడు 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం మేరకు ఆనాటి ప్రభుత్వం అక్కడ మ్యూజియం కట్టాలి అనుకొన్నది. ఈ స్థలాన్ని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని ‘సరూబాగ్‌’ అని పిలిచేవారు.

ఉత్తర భారతంలో ‘మదరాసీ’లుగా గుర్తించబడే తెలుగువారిని తెలుగువారిగా పరిచయం చేసి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నందమూరి తారక రామావుకు తెలుగు భాషా సాహిత్యాలు, చరిత్ర, సంస్కృతులంటే విపరీతమైన అభిమానం. అందుకే ఆయన తన పార్టీకి ‘తెలుగుదేశం’ అనే పేరు పెట్టారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ‘తెలుగునాడు’ అని పేరు పెట్టాలన్న తన మనోగతాన్ని అనేక సందర్భాల్లో ప్రకటించారు కూడా. ‘తెలుగుగంగ’ వంటి అనేక ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు తెలుగు పేరు పెట్టేవారు.

ఆనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే తెలుగు విశ్వవిద్యాలయం బిల్లు ఇంగ్లీషులో ఉందని తెలిసి రాత్రికి రాత్రి దానిని తెలుగులోకి మార్పించి, మరునాడు 8 గంటలకు అసెంబ్లీలో ప్రవేశ పెట్టించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి రామారావు ఛాన్సలర్‌గా కొనసాగారు. ఛాన్సలర్‌ హోదాలో ముఖ్యమంత్రిగా ఉండగానే 1989లో తెలుగు విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం జరిపించారు. ఈ స్నాతకోత్సవంలో ధరించే గౌన్లు, టోపీలను బ్రిటిష్‌ కాలం నాటి తరహాలో కాకుండా తెలుగుదనం ఉట్టిపడేలా, తెలుపు ఖద్దరు గుడ్డతో జరీ అంచు పెట్టి గౌన్లు కుట్టించారు. తలపాగాలు, ముట్నూరి కృష్ణారావు తలపాగాను పోలినట్లు, ఎన్‌టిఆరే స్వయంగా కాగితంపై పెన్సిల్‌తో స్కెచ్‌ గీసి తయారు చేయించారు. మొత్తం స్నాతకోత్సవాన్ని తెలుగులోనే నడిపించారు. ఇప్పటికీ గౌన్లు, తలపాగాలు అవే ఉన్నప్పటికీ స్నాతకోత్సవం మాత్రం తెలుగులో సాగడం లేదు. ఇంగ్లీషులో నడుస్తోంది. అది రామారావుతోనే పోయింది. రామారావు విశ్వవిద్యాలయానికి ఛాన్స్‌లర్‌గా ఉండడం ఇతర విశ్వవిద్యాలయాల తీరుకి భిన్నంగా ఉండడం వివాదానికి దారితీసింది. తరువాత కాలంలో గవర్నర్లు ఛాన్సలర్‌ కావడం వల్ల స్నాతకోత్సవం ఇంగ్లీషులోకి మారి ఉండవచ్చు.

1989లో రవీంద్రభారతిలో జరిగిన మొదటి స్నాతకోత్సవానికి ఆనాటి భారత రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌ దయాళ్‌ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆచార్య సి. నారాయణరెడ్డి వైస్‌ ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ఎన్‌.టి.ఆర్‌. ఛాన్స్‌లర్‌ని కులాధిపతి అనీ, వైస్‌–ఛాన్స్‌లర్‌ని కులపతి అనీ, రిజిస్ట్రార్‌ని కుల సచివులు అనీ పిలిచేవారు. ఇవన్నీ ఆయనతోనే పోయాయి. ‘తెలుగు విశ్వవిద్యాలయం’ ఎన్‌.టి. రామారావు మానస పుత్రిక.

డాక్టర్‌ టి. గౌరీశంకర్‌

Updated Date - 2023-05-24T00:57:00+05:30 IST