తెలంగాణ చదువుపై నివేదిక చెప్తున్న నిజాలు!
ABN , First Publish Date - 2023-05-11T01:31:50+05:30 IST
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) నివేదికలు తెలంగాణలో ఉన్నత విద్య స్థితిగతులు ఎలా ఉన్నవో స్పష్టంగా...
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) నివేదికలు తెలంగాణలో ఉన్నత విద్య స్థితిగతులు ఎలా ఉన్నవో స్పష్టంగా తెలియచెబుతున్నాయి. 2014–15 విద్యా సంవత్సరంలో, అంటే రాష్ట్రం ఏర్పడిన ఏడాదిలో 18–23 సంవత్సరాల వయస్సు గల వారి మొత్తం స్థూల నమోదు నిష్పత్తి (GER) పురుషులు 39.2లకు, మహిళలకు 33.0గా ఉంది. రాష్ట్రం మొత్తం మీద 36.1గా ఉంది. 2019–20 విద్యాసంత్సరానికి పురుషులు 34.8కి తగ్గగా మహిళలకు స్వల్ప పెరుగుదలతో 36.4 నిష్పత్తిలో ఉన్నది. రాష్ట్రం మొత్తంగా చూసినప్పుడు ఇది 35.6కి దిగజారింది.
విద్యార్థులు పక్క రాష్ట్రాలకు పోతున్నందువల్లనే ప్రైవేటు యూనివర్సిటీలను రాష్ట్రంలోనే స్థాపించాలని నిర్ణయించినట్టు పాలకులు గతంలో సమర్థించుకున్నారు. వారు చెప్పినట్టుగా పరిస్థితి ఉండివుంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాతి సంవత్సరాల్లో జీఈఆర్ నిష్పత్తులు నిశ్చయంగా పెరిగివుండాలి. అవి తగ్గుముఖం పడుతున్నప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు ఎందుకు? రాష్ట్రవిద్యార్థుల్లో ఎంతమంది ఇతర రాష్ట్రాలలోని ప్రైవేటు యూనివర్సిటీలలో ఉన్నత విద్య కోసం తరలి వెళ్తున్నారో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?
2014–15కు, 2019–20 విద్యా సంవత్సరానికి మధ్య ఎస్సీ విద్యార్థులలో 18–23 ఏళ్ల వయస్సు గల వారికి GER 36.1 నుంచి 32.5కి తగ్గింది. ఎస్టీ విద్యార్థుల GER 33.5 నుంచి 30.2కి తగ్గింది. ఎస్సీ సమూహాల నుంచి మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య మొత్తం 8788 నుంచి 9355కి పెరిగినప్పటికీ, ఎస్సీ పురుష ఉపాధ్యాయుల సంఖ్య 5620 (2014–15) నుంచి 5502 (2019–20)కి తగ్గింది. ఎస్టీ వర్గాల నుంచి పురుషుల ఉపాధ్యాయుల సంఖ్య 2524 నుంచి 2336కు, స్త్రీ ఉపాధ్యాయుల సంఖ్య 887 నుంచి 658కి తగ్గింది. మొత్తం ఎస్టీ ఉపాధ్యాయుల సంఖ్య 3,411 నుంచి 2,994కి తగ్గింది. ఇంకా, 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రం మొత్తం అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఖ్యలు వరుసగా 68,043; 10,261; 7,581. ఆ సంఖ్య 2019–20 విద్యా సంవత్సరానికి వరుసగా 62,123; 7,444; 7,190లుగా తగ్గాయి. కేవలం ఐదు విద్యా సంవత్సరాల వ్యవధిలో అధ్యాపకుల సంఖ్య ఇలా తగ్గించడం అంటే విద్య నాణ్యత దెబ్బతిన్నట్టే. ఉన్నత విద్యపై రాష్ట్ర పాలకులకు ఏ మాత్రం నిబద్ధత ఉన్నదో ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్రానికి ఆ అవార్డు వచ్చింది, ఈ అవార్డు వచ్చింది అంటూ ట్విటర్ కీర్తనలు ఆపి దారితప్పిన ఉన్నత విద్యను చక్కదిద్దటం అవసరం.
అశోక్ ధనావత్
సీనియర్ రీసెర్చర్, ఏరాస్మష్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్