Share News

మేనిఫెస్టోల గారడీ మాని, రైతు అవసరాల్ని చూడండి!

ABN , First Publish Date - 2023-11-01T01:04:28+05:30 IST

నవంబర్ 30న జరగనున్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ అలవికాని హామీలతో ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తెస్తున్నాయి. ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోలకు...

మేనిఫెస్టోల గారడీ మాని, రైతు అవసరాల్ని చూడండి!

నవంబర్ 30న జరగనున్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలూ అలవికాని హామీలతో ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల ముందుకు తెస్తున్నాయి. ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేకపోవడమే పార్టీల ధైర్యంగా కనిపిస్తున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలనే నైతికతను మెజారిటీ రాజకీయ పార్టీలు ఎప్పుడో పక్కన పెట్టేశాయి. అయినా ఎన్నికలలో పోటీ పడుతున్న పార్టీల ముందు ప్రజల ఎజెండాను ఉంచడం మన బాధ్యత కనుక– రాష్ట్రంలో గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి ఆ కుటుంబాలు సమగ్ర అభివృద్ధి సాధించాలంటే సహజ వనరుల సంరక్షణ, వాటిపై స్థానిక ప్రజలకు చట్టబద్ధ హక్కులు అత్యవసరమని గతంలో రాశాను. రాష్ట్ర అవసరాలకు, వాతావరణ పరిస్థితులకు, నేలల స్వభావానికి అనుగుణంగా పంటల ప్రణాళిక అవసరమని, సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం కీలకమని కూడా ప్రస్తావించాను.

వ్యవసాయాన్ని జీవనోపాధిగా మార్చుకున్న గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల రైతుల, కూలీల, ఇతర గ్రామీణ కుటుంబాల ఆహార, ఆదాయ, ఆరోగ్య భద్రతకు గ్యారంటీ ఇవ్వడమే సహజ వనరుల సంరక్షణ, పంటల ప్రణాళిక నిజమైన లక్ష్యం కావాలి. అధికారంలోకి వచ్చే పార్టీ వ్యవసాయ రంగంపై ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ ఆయా రాజకీయ పార్టీల, నేతల స్వంత బొక్కసాల నుంచి ఖర్చు చేయడం లేదు. ఈ నిధులన్నీ ప్రజలు చెల్లించిన పన్నుల నుంచి ఖర్చు చేసేవే కాబట్టి ప్రతి రూపాయినీ నిజమైన అర్హులకు అందేలా మాత్రమే ఖర్చు పెట్టాలి. ఇది జరగాలంటే రాష్ట్రంలో వ్యవసాయ గణాంకాల సేకరణ అత్యంత పారదర్శకంగా ఉండాలి.

సర్వే నంబర్ వారీగా వాస్తవ సాగు భూములు, నేల స్వభావం, మాగాణి/ మెట్ట, విస్తీర్ణం, సాగు నీరు ఎలా అందుతుంది, సాగు చేసిన పంట, అసలు భూమి యజమాని పేరు, ఆ సంవత్సరం సాగు చేస్తున్న కౌలు రైతు పేరు... తదితర వివరాలు ఈ గణాంకాల సేకరణలో ఉండాలి. ఈ వివరాలను గ్రామ పంచాయితీలలో అందుబాటులో ఉంచాలి, రాష్ట్ర వ్యవసాయ శాఖ వెబ్‍సైట్‌లో కూడా ప్రజల పరిశీలన కోసం ఉంచాలి.

మన రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు పథకం లక్ష్యం మంచిదే అయినా అది తప్పుదారి పట్టడానికీ, వేల కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం వృథా కావడానికీ కారణం, నిజమైన అర్హులకు అది చేరకపోవడమే. 2014తో పోల్చినప్పుడు తెలంగాణలో వ్యవసాయ రంగంపై పెట్టే బడ్జెట్ ఖర్చు గణనీయంగా పెరిగినా, రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు కొనసాగడానికీ, వ్యవసాయ కుటుంబాలు అప్పుల ఊబి నుంచి బయట పడలేకపోవడానికీ కారణం ప్రభుత్వం రూపొందించుకున్న తప్పుడు మార్గదర్శకాలలోనే ఉంది. ఇప్పుడు ఎన్నికలలో పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఈ తప్పును సవరించకుండా, పాత పద్ధతిలోనే రైతుబంధు పథకాన్ని (బహుశా పేరు మాత్రం మార్చి) అమలు చేస్తే, మరిన్ని విలువైన నిధులు వృథా కావడం తప్ప ప్రయోజనం ఉండదు. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ముందుగా చేయాల్సిన పని ప్రతి సంవత్సరం సర్వే నంబర్ వారీగా ఎవరు వాస్తవంగా పంటలు సాగు చేస్తున్నారు అన్నది గుర్తించి, వాస్తవ సాగుదారులను ఈ–క్రాప్ బుకింగ్‌లో నమోదు చేయాలి. ఈ జాబితాలో ఉన్నవారికి మాత్రమే పెట్టుబడి సహాయం అందించేలా మార్గదర్శకాలను సవరించాలి. క్షేత్ర స్థాయి పరిస్థితులకు భిన్నంగా భూమి యాజమానుల ఒత్తిడికి తలొగ్గి తప్పుడు సమాచారం అందించిన వ్యవసాయ విస్తరణ అధికారులపై కఠిన శిక్షలు అమలు చేయాలి. ప్రతి సీజన్‍లో వ్యవసాయ విస్తరణ శాఖ అధికారులు సేకరించి, పంపిన సమాచారం సరైందో కాదో నిర్ధారించడానికి సీజన్ మధ్యలో సోషల్ ఆడిట్ నిర్వహించడానికి చట్టబద్ధ ఏర్పాటు ఉండాలి.

పంటల సాగు చేయాలంటే, పెట్టుబడి సహాయం ఎంత అవసరమో, ఆ పెట్టుబడి ప్రధానంగా వడ్డీ లేని రుణంగా సంస్థాగత బ్యాంకుల నుంచి రైతుకు అందడం అంతే ముఖ్యం. కానీ ప్రస్తుతం బ్యాంకులు పంట రుణాలను కూడా భూమిపై పట్టా హక్కులు కలిగిన యజమానులకు అందిస్తున్నాయి. వాస్తవ సాగుదారులను గుర్తించకుండా పంట రుణాలు ఇవ్వడం వల్ల, నగరాలలో కూర్చున్న వ్యవసాయం చేయని భూయజమానులు కూడా వాటిని తీసుకుంటూ, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఆయా భూముల్లో సాగు చేస్తున్న కౌలు రైతులకు మాత్రం బ్యాంకులు ఒక్క రూపాయి కూడా పంట రుణం ఇవ్వడం లేదు. ఈ స్థితిలో కౌలు రైతులు అత్యధిక వడ్డీలకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచీ, ఇన్‍పుట్ డీలర్స్ నుంచీ ఋణాలు తెచ్చుకుంటున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితి మారేందుకు వాస్తవ సాగుదారులను గుర్తించి, వారికి మాత్రమే పంట రుణాలు ఇవ్వాలి.

ఇప్పటి వరకూ కేవలం లక్ష రూపాయల పెట్టుబడి మేరకే, వడ్డీ లేని రుణం ఇస్తున్నారు. లక్ష నుండీ 3 లక్షల వరకూ పావలా వడ్డీ చార్జ్ చేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెరిగిన దశలో సన్న చిన్నకారు రైతులకు (ఐదెకరాల లోపు) రుణం మొత్తాన్ని వడ్డీ లేని పంట ఋణంగా ఇవ్వాలి. అవసరమైతే, భూమి యాజమానులకు పంట రుణం కాకుండా వారి భూములను తాకట్టు పెట్టుకుని, పెట్టుబడి రుణాలు ఇవ్వవచ్చు.

రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇస్తున్న పద్ధతిలో రుణమాఫీ హామీలు బ్లాంకెట్‌గా ఇవ్వడం తప్పు. రాష్ట్రంలో మొత్తం వాస్తవ సాగుదారులను ముందుగా సంస్థాగత రుణ వ్యవస్థలోకి తీసుకురావాలి. వారికి వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలి. సాధారణంగా చీడపీడల వల్ల గానీ, ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ, కరువు వల్ల గానీ, ధరలు పూర్తిగా పడిపోయినప్పుడు గానీ, రైతులు నష్టపోతారు. అలాంటి సమయంలో పారదర్శకంగా చేసే బహిరంగ విచారణతో, ఖచ్చితమైన మార్గదర్శకాలతో, రాజకీయ ఒత్తిళ్లకు గురి కాకుండా, ఆయా ప్రాంతాల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా, ఆ నష్టపోయిన రైతుల వరకూ ఋణ మాఫీ చేస్తే నిధులు సద్వినియోగం అవుతాయి. అలా కాకుండా, వ్యవసాయం చేయకపోయినా మొత్తం భూమి యాజమానుల పంట రుణాలను మాఫీ చేయడం నిధుల దుర్వినియోగమే.

రాష్ట్రంలో ఇప్పుడున్న మోనో క్రాపింగ్ నుంచి రైతులను బయటకు తేవాలంటే, వివిధ పంటల విత్తనాలను రైతులకు గ్రామ స్థాయిలో అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. స్థానిక రైతు సహకార సంఘాల ద్వారా తక్కువ ధరలకు విత్తనాలను అందించాలి. గ్రామ స్థాయి విత్తన బ్యాంకులు ఈ సమస్యను పరిష్కరిస్తాయి. విత్తన ధరల పెరుగుదల నుంచి, కల్తీ విత్తనాల నుంచి రైతులను రక్షిస్తాయి.

ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న దశలో, రాష్ట్రంలో పంటల బీమా పథకాలు తప్పకుండా ఉండాలి. వాటి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. కంపెనీలకు లాభం చేసే విధంగా కాకుండా, రైతులకు మేలు చేసే విధంగా ఈ పథకాల మార్గదర్శకాలు ఉండాలి. 2005 ప్రకృతి వైపరిత్యాల యాజమాన్య చట్టం అమలు చేసే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీలను ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా స్వతంత్రంగా పని చేయనివ్వాలి. ఎప్పటికప్పుడు నష్టాలను అంచనా వేసి ఈ కమిటీలు ఇచ్చే నివేదికల ప్రకారం ఎకరానికి రూ.10వేల పరిహారం రైతులకు చెల్లించడానికి రాష్ట్ర బడ్జెట్‍లో కనీసం 2వేల కోట్లు నిధులు పెట్టుకోవాలి. కేంద్రం ఇచ్చే నిధులు ఎలాగూ అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ అవసరమే కానీ, ఈ యాంత్రీకరణ పంజాబ్ తరహాలో రైతులు అప్పులలో కూరుకుపోయేలా ఉండకూడదు. అదే సమయంలో కూలీల పని పోగొట్టే విధంగా ఉండకూడదు. అందుకే కేరళ తరహాలో, వ్యవసాయ కూలీలను, సన్నకారు రైతులను గ్రీన్ ఆర్మీగా రూపొందించి, ఆ బృందాలకు యంత్రాలను అందించాలి. ఫలితంగా రైతులకు సేవలూ అందుతాయి, కూలీ కుటుంబాలకు ఉపాధీ దొరుకుతుంది.

ఆహార భద్రతా చట్టం కింద కేంద్రం వరి ధాన్యాన్ని కొంటున్నది. పత్తిని కూడా సీసీఐ ఒక మేరకు కొంటున్నది. అప్పుడప్పుడు మాత్రమే కేంద్ర సంస్థ ‘నాఫెడ్’ పప్పు ధాన్యాలను కొంటున్నది. కొనుగోలు సహకారం ఉంది కనుకనే రైతులు వరి, పత్తి వైపు వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాన్ని ఆపాలంటే ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నిధులతోనూ, కేంద్ర సహకారంతోనూ పప్పు ధాన్యాలను, నూనె గింజలను, చిరు ధాన్యాలను బోనస్ ధర చెల్లించి కొనుగోలు చేయాలి. అవసరమయితే వీటిని స్థానికంగానే సహకార సంఘాల ద్వారా ప్రాసెసింగ్ చేయించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, పట్టణాలలో రైతు బజార్ల ద్వారా, ప్రజలకు తక్కువ ధరలకు అందించాలి. ఈ పద్ధతివల్ల ఆయా పంటల విస్తీర్ణం పెరగడమే కాక, రైతులూ, వినియోగదారులూ కూడా లాభపడతారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతులను గ్రామ పంచాయితీ స్థాయిలో నిర్మించి సహకార సంఘాలకు వాటి నిర్వహణ బాధ్యత అప్పగించాలి.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2023-11-01T01:04:28+05:30 IST