స్వేచ్ఛకు సంకెళ్లు!

ABN , First Publish Date - 2023-01-26T00:40:00+05:30 IST

‘నకిలీవార్త అని నిర్థారించే అధికారం ప్రభుత్వం తనచేతిలోనే ఉంచుకుంటే, అది అంతిమంగా మీడియా సెన్సార్‌షిప్‌కు...

స్వేచ్ఛకు సంకెళ్లు!

‘నకిలీవార్త అని నిర్థారించే అధికారం ప్రభుత్వం తనచేతిలోనే ఉంచుకుంటే, అది అంతిమంగా మీడియా సెన్సార్‌షిప్‌కు దారితీస్తుంది’. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారబాధ్యతలు ప్రధానంగా నిర్వహించే ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పిఐబి)కి వార్తల్లో సత్యాసత్యాలను నిగ్గుతేల్చే బాధ్యత అప్పగించబోతున్న కేంద్రప్రభుత్వానికి ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా చేసిన హెచ్చరిక ఇది. ఒక వార్తను ‘ఫేక్‌న్యూస్‌’గా నిర్ధారించి, దానిని తొలగించాల్సిందిగా ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా సంస్థలను ఆదేశించగలిగే అధికారాన్ని పీఐబీకి కట్టబెడుతూ కేంద్రప్రభుత్వం ఐటీ నిబంధనల చట్టం–2021సవరణకు పూనుకున్నది. దీని ముసాయిదాపై పలు డిజిటల్‌ సంస్థలు, పాత్రికేయ సంఘాలు ప్రభుత్వానికి తమ అభ్యంతరాలు తెలియచేస్తూ, రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాయి.

ఈ చర్య ఉపరితలంలో ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా నియంత్రణగా కనిపిస్తున్నప్పటికీ, అంతిమంగా ప్రభుత్వానికి నచ్చని, గిట్టని యావత్‌ సమాచారవ్యాప్తిని నిరోధించడానికే ఉద్దేశించిందని అత్యధికుల నమ్మకం. ప్రభుత్వ అధీనంలోని ఒక సంస్థకు ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ణయించే అధికారం ఉన్నప్పుడు ఆ వడబోత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. పిఐబి దేనిని నకిలీ అని నిర్థారిస్తుందో, దానిని సామాజిక మాధ్యమాలతో పాటు, ఆన్‌లైన్‌ వేదికలన్నీ తొలగించాల్సి ఉంటుంది. పిఐబి మాత్రమే కాక, ప్రభుత్వం ఇతర ఏజెన్సీలకు కూడా నిజనిర్థారణాధికారాలు దఖలుపరచేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తున్నాయి. ఒకపక్క, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఒకవార్తలో సత్యాసత్యాల పాక్షికత ఎంతో సరిగ్గా నిర్ణయించేందుకు ఉపకరించే నియమనిబంధనలేమీ లేకుండా, మీడియా సంస్థలకు వార్తలను అందించేందుకు మాత్రమే ఉద్దేశించిన పిఐబికి ఇలా న్యాయమూర్తి హోదా కట్టబెట్టడం సరికాదు. ఎటువంటి న్యాయపరీక్షలకు తావులేకుండా, ప్రభుత్వం తలుచుకుంటే ఒక వార్తను నిరోధించడానికి, తొలగించడానికి, మార్చడానికి అవకాశమిచ్చే సవరణలు ఇవి.

ప్రధానంగా నిజనిర్థారణ కంటే, ఆ పేరిట ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని అధికం చేయడం దీని లక్ష్యంగా కనిపిస్తున్నది. ప్రభుత్వానుకూల ఏజెన్సీలు ప్రభుత్వ కార్యక్రమాలమీద, నిర్ణయాలమీద వచ్చే విమర్శలను సరైనవిగా, సమంజసమైనవిగా స్వీకరిస్తాయని అనుకోలేం. విమర్శనే కాదు, హేతుబద్ధమైన వ్యాఖ్యలను, ప్రశ్నలను కూడా అవి ప్రజల చెంతకు చేరనిచ్చే అవకాశం లేదు. ‘కేంద్రప్రభుత్వానికి సంబంధించి ఏ అంశమైనా’ అంటూ ముసాయిదాలో ఉన్న మరికొన్ని ప్రత్యేక ప్రస్తావనలు గమనించినప్పుడు, పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచాలన్న మీడియా లక్ష్యాలు నెరవేరే అవకాశం లేదని అర్థమవుతుంది. ఈ కారణంగానే ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే ఈ సవరణలను మీడియా సంఘాలు చట్టవ్యతిరేకమైనవిగా, రాజ్యాంగస్ఫూర్తికి భంగం కలిగించేవిగా అభివర్ణిస్తూ, వాటి ఉపసంహరణకు డిమాండ్‌ చేస్తున్నాయి.

తమ పాలనకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి సవ్యంగా, సానుకూలంగా వెళ్ళడం లేదనీ, తాము అద్భుతాలు చేస్తున్నా, మీడియా తన వక్రీకరణలతో ప్రజల్లో వ్యతిరేకత పెంచుతున్నదని పాలకులు భావించడం కొత్తేమీ కాదు. సామాజిక మాధ్యమాల విస్తృతివల్ల అవాస్తవాలు అధికంగా ప్రచారం కావడమూ నిజం. ఇది కేవలం భారతదేశం మాత్రమే ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి కాదు. బూటకపు వార్తలకు కళ్ళెం వేయాల్సిన మాట నిజం. కానీ, సత్యాసత్యాలు నిగ్గుతేల్చే అధికారం ప్రభుత్వం చేతిలోనే పూర్తిగా ఉంటే అది అధికారికంగా చెప్పేది తప్ప, మిగతా వార్తలూ వ్యాఖ్యలన్నీ ‘ఫేక్‌’గానే ముద్రపడతాయి. పైగా ఇప్పుడు కేంద్రంలోని అధికారపక్షం తమ రాజకీయ ప్రయోజనాలకోసం ప్రత్యేక విభాగాలు నడుపుతూ అసత్యప్రచారం చేస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. దేశంలో అత్యధికశాతం ‘ఫేక్‌న్యూస్‌’ ఏ లక్ష్యంతో పనిచేస్తోందో తెలిసిందే. ప్రభుత్వ అనుకూలవార్తలన్నీ సత్యాలు కానట్టే, కొన్ని వార్తలు వ్యతిరేకమైనంత మాత్రాన అసత్యం కావు. మోదీకి వ్యతిరేకంగా ఓ మాట అన్నందుకు, సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యాఖ్యను షేర్‌ చేసినందుకు కొలీజియం సిఫార్సుచేసిన ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులుగా చోటుదక్కని వాతావరణం దేశంలో ఇప్పుడుంది. ఈ పరిస్థితుల్లో కొత్త ఐటీ సవరణల ద్వారా ప్రభుత్వం తన చేతుల్లోకి సత్యాసత్యాలను నిగ్గుతేల్చే అధికారాలను కూడా తెచ్చుకోవడం మీడియా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి హానికరం.

Updated Date - 2023-01-26T00:40:00+05:30 IST